
మితవాద ఉద్యమాలు ప్రపంచ రాజకీయాలపై తమ ఆధిపత్యాన్ని స్థిరీకరించుకుంటున్న తరుణంలో కళలు, ఫాసిజం గురించిన చర్చ ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతుంది. కళ అంటే సాధారణంగా ఒక వ్యక్తిలోని సృజనాత్మకతను వెలికి తీసే సాధనం. చుట్టూ జరుగుతున్న పరిణామాలను పరిశీలించి, ఆ పరిణామాలు ముందుకు తెచ్చే సమస్యలను వీక్షకుల దృష్టికి, పాఠకుల దృష్టికి తెచ్చే సాధనాలు. అటువంటి సృజనాత్మక సాధనానికి సమజాన్ని మార్చే రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉంటుంది? ఈ సమయంలో ఈ చర్చ ఎందుకు? తాజాగా వంగ్య వ్యాఖ్యాత కునాల్ కామ్రపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఈ ప్రశ్నను ముందుకు తెస్తుంది. ఆలోచన, సృజనాత్మత, అందులోనూ పాలక పక్షాన్ని, పాలకవర్గాన్ని సవాలుచేసే ఆలోచన, సృజనాత్మకతలు అంటే గిట్టని రాజకీయ వ్యవస్థ ఒక్కటే ఉంది. అది ఫాసిజం లేదా నయా ఫాసిజం.
ప్రతిఘటనా రూపంగా కళ
కళలకు, రాజకీయాలకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం. 2016లో అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని అన్ని మ్యూజియంలు, కళా కేంద్రాలు, ప్రదర్శన వేదికలను ప్రమాణ స్వీకారం రోజున మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని ఆ దేశంలో ప్రముఖ కళాకారులు రిచర్డ్ సెర్రా, సిండి షెమన్, లూయీస్ లౌలర్, జాన్ జోన్స్, జూలీ మెహ్రెతులు నిర్ణయించుకున్నారు. ‘తమ ఈ నిర్ణయం కళల పట్ల వ్యతిరేకత కాదనీ, మారుతున్న పరిస్థితుల్లో చూడటం, వినటం, మాట్లాడుకోవటం, సంభాషించటం, ఆలోచించటం, స్పందించటం వంటి సృజనాత్మక చర్యలను కొత్త రూపంలో ప్రదర్శించేందుకు, సృష్టించేందుకు అవకావాలున్నాయా లేవా అనే దిశగా ఆలోచించేలా సృజనకారులను పురిగొల్పటానికి మాత్రమే’ అని తెలిపారు.
సాంస్కృతిక కులీనత్వం
అయితే, చూసేవారికి ఇదేదో ఉన్నత స్థాయి కళాకారులు ఒళ్లు నలగకుండా మాటవరుసకు నిరసన తెలిపే చర్యగానే కనిపిస్తుంది. పైపైన చూస్తే ఇటువంటి నిర్ణయాల ద్వారా ట్రంప్ లాంటి వారి రాజకీయ దృక్కోణాన్ని మార్చలేమనీ, రోజువారీ అమెరికన్ల సగటు జీవితానికి సృజనాత్మకతకూ సంబంధం లేదని, సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందిన కొద్దిమందికి మాత్రమే ఈ సృజనాత్మక కళలు వినోద సాధనాలైనందున ఆ కేంద్రాల్లో జరిగే నిరసనలు, వ్యక్తమయ్యే అసమ్మతులు కులీన వర్గాల స్పందనకు మాత్రమే పరిమితం అనే వాదన ఉంది.
భారతదేశంలో సైతం 2014 తర్వాత మోడీ
అధికారానికి వచ్చినప్పుడు పలువురు సృజనాత్మక రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా తమ అవార్డులు వెనక్కు ఇచ్చేశారు. మరికొందరు క్రీడాకారులు తాము అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ గెల్చుకున్న పతకాలను వెనక్కు ఇచ్చేశారు. మరికొందరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తిరస్కరించారు. ఇవన్నీ నిరసన చర్యలే.
ప్రాచుర్యంలోకి స్టాండప్ కామెడీ
గత ఐదేళ్లల్లో కళా రంగంలో ఈ నిరసన రూపాలు స్టాండప్ కామెడీ రూపం తీసుకున్నాయి. కళారంగం సున్నితత్వాన్ని, సమకాలీన ప్రాపంచిక వ్యక్తీకరణలను ప్రజలముందుంచటంలో 1980లకు ముందున్న రీతిలో వ్యక్తీకరించలేకపోతోందన్న విమర్శ కూడా ఉంది. తెలుగులో హాస్యం అంటే సినిమాల్లో పడించే హాస్యమే కనిపిస్తుంది తప్ప ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉన్నట్లుగా హాస్యం, వ్యంగ్యం, ప్రత్యేకించి వర్తమాన రాజకీయాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై వ్యంగ వ్యాఖ్యానం ఓ కళా ప్రదర్శన స్థాయికి ఎదగలేదు. కాబట్టే తెలుగు పాఠకులకు కునాల్ కామ్ర, వరుణ్ గ్రోవర్ వంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యం వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు అర్థం చేసుకోవటం కాస్తంత కష్టంగానే ఉంటుంది.
కళకు సమాజాన్ని ప్రభావితం చేసే సామర్ధ్యం లేకపోతే రాజ్యం నిర్దిష్ట చారిత్రక పరిస్థితుల్లో కళలను, కళాకారులను, రచయితలను, సృజనకారులను నిర్భంధించాల్సిన అవసరం ఉండదు. 1980 దశకంలో వీధినాటకాన్ని సామాజిక సమస్యల వ్యక్తీకరణ సాధనంగా మలిచిన సఫ్దర్ హష్మి ఢల్లీ సరిహద్దుల్లోని కార్మికులను చైతన్యపర్చడానికి ఉపయోగించుకున్నారు. అందుకే ఎక్కడ ఏదో ఒక సమస్యపై ఆందోళన జరుగుతున్నప్పుడు అక్కడ ఆందోళనకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, చుట్టూ ఉన్న జనంలో అవగాహన కల్పించేందుకు కళారూపాలు ప్రదర్శించటం అనాదిగా జరుగుతున్న విషయం. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లోనూ, ఢల్లీని చుట్టుముట్టిన రైతు ఉద్యమంలోనూ, నాసిక్ అటవీ ప్రాంతం ముంబయి వరకూ కాలినడకన రైతులు చేపట్టిన నిరసనోద్యమంలోనూ ఆందోళన, పోరాటంతో పాటు నిరసనకారులు వివిధ కళారూపాలు కూడా ప్రదర్శించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.
దేశంలో నయా ఉదారవాద విధానాల అమలుకు ముందు కళా ప్రదర్శనలకు ఉన్నన్ని అవకాశాలు ప్రస్తుతం లేవు. కళా ప్రదర్శన కూడా శాంతి భద్రతల సమస్యగా మారింది. ఏ కళా బృందం బహిరంగ ప్రదేశాల్లో తమ కళారూపాన్ని ప్రదర్శించాలన్నా పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవటం ఓ చట్టంగా మారింది. గతంలో ఉన్నంతగా ఉమ్మడి బహిరంగ ప్రదర్శనా స్థలాలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. అయినా ఎక్కడో ఓ హాలు బుక్ చేసుకుని కళాకారులు తమతమ సృజనాత్మక రూపాలు ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇవన్నీ పరిశీలించినప్పుడు పాలకవర్గానికి, కళలకూ, కళాకారులకూ మధ్య ఓ విలక్షణమైన సంబంధం ఉందన్న వాస్తవాన్ని మనం గ్రహించవచ్చు.
ఉదారవాద ప్రస్వామ్యం – ప్రతిఘటన కళలు
ఉదారవాద ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నప్పుడు కూడా పాలకవర్గం తమకు నష్టదాయకమైన సృజనాత్మకతనూ, కార్యాచరణకు పురిగొల్పే సృజనాత్మకతనూ అదుపులో పెట్టడడానికి అనేక చట్టాలను తెరమీదకు తెచ్చింది. కాకపోతే ప్రభుత్వమే వీధి మూకల మాదిరిగా వ్యవహరించటం కానీ, వీధి మూకల స్వైరవిహారాన్ని రాజ్యం అడ్డుకోవడానికి సిద్ధపడకపోవటం వంటి పరిణామాలు ఉదారవాద ప్రజాస్వామ్యంలో అరుదుగా జరిగేవి. కానీ మితవాద ప్రజాస్వామ్యం, నయా ఫాసిస్టు పోకడలున్న పార్టీలు, వ్యవస్థలు అధికారానికి వచ్చిన దేశాల్లో ఈ ధోరణి మరింత పెచ్చరిల్లింది. ఈ ధోరణి కొనసాగింపుగానే పుస్తక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, చిత్రలేఖనం ప్రదర్శనలపై దాడులు, రచయితలు, కళాకారులు పై భౌతికదాడులు ఈ కాలంలో పెరిగాయి. కునాల్ కామ్రపై జరుగుతున్న దాడి, ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భంధాన్ని ఈ కోణంలో అర్థం చేసుకోవాలి.
స్టాండప్ కామెడీ విలక్షణత
స్టాండప్ కామెడీ కూడా మిగిలిన కళారూపాల్లానే ప్రభుత్వ వ్యవహారశైలిని, ప్రజా జీవితంపై దాని ప్రభావాన్ని, మన చుట్టూ, మనదనుకున్న జీవితం చుట్టూ నిద్రాణంగా నిర్మితమవుతున్న హింసాత్మక వాతావరణాన్ని వీక్షకుల దృష్టికి తీసుకొస్తోంది. సినిమాలు, సీరియళ్లు, నాటికలు, నాటకాలు, జానపదాలు వంటి సాంప్రదాయక కళారూపాలకంటే భిన్నమైంది స్టాండప్ కామెడి. సాంప్రదాయక కళారూపాలు ప్రధానంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిర్మితమవుతాయి. దానికి భిన్నంగా స్టాండప్ కామెడీ రోజువారీ జీవితాన్ని సామాజిక అవగాహన, చైతన్యం, చలనశీలత ఉన్న వ్యక్తి కళ్ల నుండి ఆలోచనల నుండి వీక్షకుల ముందుంచుతుంది. తాజాగా ముంబయిలో ఏర్పాటు చేసిన అటువంటి స్టాండప్ కామెడీ షోపై జరిగిన దాడి ఈ కళారూపం గురించి ప్రభుత్వం ఎంతగా ఆందోళణ చెందుతుందో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.
రెండో ప్రపంచయుద్ధానికి ముందు జర్మనీ, ఇటలీల్లో వేలం వెర్రిగా విస్తరించిన ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కళారూపాలు, సృజనకారులు కీలకపాత్ర పోషించారు. జేమ్స్ జాయిస్, శామ్యూల్ బక్కెట్, ప్లాబో పికాసో వంటి వారు ఫాసిజానికి, ఫాసిస్టు పాలన సామాజిక జీవితంలో సృష్టిస్తున్న హింసకు వ్యతిరేకంగా కలమెత్తారు. గళమెత్తారు. ఎదురొడ్డి పోరాడారు. ప్లాబో పికాసో చిత్రం గెర్నికా ఫాసిస్టు పాలకుల హింసాత్మక చర్యలను ఎత్తి చూపటంలో నేటికీ శిఖరాయమానమైన ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రస్తుతం దేశంలో వేళ్లూనుకుంటున్న నయా ఫాసిజాన్ని సవాలు చేస్తున్న కళా రూపాల్లో స్టాండప్ కామెడీ ఒకటి. రాడికల్ కళారూపాలకు మాదిరిగానే స్టాండప్ కామెడీకి కూడా వేలసంఖ్యలో వీక్షకులు, ప్రేక్షకులు ఉండనవసరం లేదు. అందుకే స్టాండప్ కామెడీల్లో కనిపించే ప్రేక్షకులు వందల సంఖ్యల్లో మాత్రమే ఉంటారు. కానీ దాని ఒక్కో ఎపిసోడ్ ప్రభావం ఒక్కో తరగతి ప్రజానీకం మీద ఒక్కోరకంగా ఉంటుంది. కానీ వ్యాఖ్యానం ప్రధానంగా వర్తమాన సామాజిక రాజకీయ, ఆర్థిక జీవితం చుట్టూనే తిరుగుతుంది. వర్తమాన సామాజిక రాజకీయ ఆర్థిక జీవనం అంటే అనివార్యంగా సమకాలీన ప్రభుత్వ విధానాల గురించిన వ్యాఖ్యానం మాత్రమే. ఇందులో ఉండే ఉపమానాలు, పోలికలు, వివరణలు, ఉదాహరణలు మనందరికీ రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు, ఎదురయ్యే సందర్భాల నుండే ఎంచుకుంటారు. ఈ విధంగా మనం సాంప్రదాయకంగా వినే రాజకీయ ఉపన్యాస ధోరణికి భిన్నంగా ఇరుగుపొరుగు మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ప్రేక్షకులను భాగస్వాములను చేయటానికి ఈ కళా రూపంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా వ్యాఖ్యాత లేదా ప్రయోక్త అభిప్రాయాలతో, అవగాహనలతో ప్రేక్షకులు ఏకీభావం చెందేందుకు కావల్సిన పరిస్థితులను సృష్టిస్తుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు సినిమా లేదా సీరియళ్లు ప్రేక్షకులను పాసివ్‌గా ఎంగేజ్ చేసే ధోరణితో ఉంటే స్టాండప్ కామెడీ యాక్టివ్‌గా ఎంగేజ్ చేస్తుంది. తద్వారా వర్తమాన సామాజిక రాజకీయ ఆర్థిక జీవితం గురించిన ఓ ఉమ్మడి అవిగాహన కల్పించేందుకు సాధనంగా పనిచేస్తుంది.
స్టాండప్ కామెడీకి ఉన్న ఈ విలక్షణ సామర్ధ్యం వల్లనే దేశంలోని స్టాండప్ కమేడియన్ల ప్రదర్శనలకు ప్రభుత్వం, మూక దళాలు రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేయటమే కాక అవరోధాలు కూడా కల్పిస్తుంది. అటువంటి అవరోధాలే కునాల్ కామ్రకు కూడా ఎన్నో ఎదురయ్యాయి. ఇప్పుడు ఎదుర్కొంటున్న అవరోధం పూర్వపు అవరోధాలకంటే తీవ్రమైనదనటంలో సందేహం లేదు. గతంలో లాగానే కునాల్ కామ్ర ఈ అవరోధాన్ని అధిగమించి తాను ఎంచుకున్న కళారూపాన్ని మరింత ప్రజాదరణ పొందిన కళారూపంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం.
కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.