
1937లో స్పెయిన్ అంతర్యుద్ధం నడుమ ప్రారంభమైన పారిస్ చిత్రకళా ప్రదర్శనలో పలువురు చిత్రలేఖకులు ఫాసిజం దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. చిత్రకళలు నిర్దిష్ట రాజకీయ వ్యక్తీకరణలుగా మారిన నేపథ్యాన్ని ఫియోనా ఈ వ్యాసంలో చర్చించారు.
జర్మనీ, ఇటలీ ఫాసిస్టు దళాలు 1937 ఏప్రిల్ 26న స్పెయిన్‌లోని గెర్నికా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి. స్పెయిన్‌లో చారిత్రక నగరాల్లో ఒకటైన గెర్నికాను కేవలం మూడే మూడుగంటల్లో నాజీ సేనలు భస్మీపటలం చేశాయి. అప్పట్లో అంత తక్కువ సమయంలో ఓ నగరాన్ని నేలమట్టం చేయటమన్నది యుద్ధాల చరిత్రలో అరుదైన రికార్డు. ఈ యుద్ధాన్ని కళ్లారచూసి చలించిన పికాసో గీసిన చిత్రమే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెర్నికా. 1937లో పారిస్‌లో చిత్రలేఖన ప్రదర్శన ఏర్పాటు చేసిన కళాకారులను 2017లో జరిగిన ఓ కార్యక్రమంలో లండన్ మేయర్ ప్రత్యేకంగా సన్మానించారు.
స్పెయిన్‌పై బాంబుదాడులు మొదలైన నెలరోజుల్లోనే పారిస్ ప్రదర్శన ఏర్పాటైంది. పారిస్ ప్రదర్శనలో రెండు చిత్రాలు సమకాలీన చరిత్రలో వైరిశిబిరాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మొదటిది నాజీ జర్మనీ కళాకారులు రూపొందించిన చిత్రం. ఈ చిత్రంలో నాజీ అధికారిక చిహ్నమైన స్వస్తిక, దానిపై ఎగురుతున్న గద్ద. ఈ రెండు భారీ ఇనుప సామాగ్రి తాపడం చేసిన గ్రానైట్‌పై చిత్రించారు. రెండోది స్త్రీపురుషులైన కార్మికులు సుత్తి కొడవలిని పిడికిళ్లతో ఎత్తిపట్టిన చిత్రం. సైజులో చిన్నవైనా ఈ ప్రదర్శనలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచిన అనేక చిన్నచిన్న చిత్ర లేఖనాలు సైతం చూపరులను ఆకర్షించాయి. పారిస్ ప్రదర్శన 80 ఏళ్ల సందర్భంగా 80 ఏళ్ల క్రితం ప్రదర్శలో ప్రేక్షకుల సందర్శనార్ధం పెట్టిన అన్ని చిత్రపటాలనూ లండన్ ప్రదర్శనలో వీక్షకులకు అందుబాటులో ఉంచారు. నాటి పారిస్ ప్రదర్శన ఓ రాజకీయ సందేశాన్ని ప్రపంచం ముందు ఉంచింది. అది జనరల్ ఫ్రాంకో నిరంకుశత్వానికి సంబంధించిన జ్ఞాపకాలు.
సృజనాత్మక కళల్లో నాజీ జర్మనీ, సోవియట్ యూనియన్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరును పక్కన పెడితే అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం స్పెయిన్‌ను అగ్నికి ఆహుతి చేస్తున్న సందర్భం కావటంలో వీక్షకుల దృష్టి స్పెయిన్‌కు సంబంధించిన చిత్రాలపై కేంద్రీకృతమైంది. ఈ యుద్ధంలో భాగంగా స్పెయిన్ అటు నాజీ శ్రేణులు, ఇటు సోవియట్ దళాల మధ్య బాహాబాహీకి వేదికైంది. ఈ సంచలనాత్మక యుద్ధం ప్రపంచంలో మెరికల్లాంటి సృజనాత్మక కళాకారుల మెదళ్లకు పదును పెట్టింది. పాబ్లో పికాస్సో, జూలియో గొంజాలెజ్, జోవాన్ మిరో, అలెగ్జాండర్ క్లాడెర్, అల్బెర్టో శాంచెజ్, జోస్ గుటిరెజ్ సోలన్ వంటి కళాకారులు అద్భుతమైన కళాఖండాలు సృష్టించారు. వీటన్నింటినీ స్పెయిన్ పెవెలియన్‌లో ప్రదర్శనకు పెట్టారు.
ఈ పెవెలియన్ కోసం ఓ కుడ్య చిత్రాన్ని రూపొందించాల్సిందిగా నిర్వాహకులు పికాసోను కోరారు. దాంతో ఫ్రాంకో కట్టు కథల మోసాన్ని బహిర్గపర్చే రీతిలో జాతీయోన్మాద వ్యతిరేక కథనంతో కూడిన చిత్రాల తయారీకి పికాసో పూనుకున్నాడు. గెర్నికా నగరంపై దాడి గురించిన వార్తలు చదివిన తర్వాత ఫ్రాంకో ఫాసిస్టు శక్తులపై సాంస్కృతిక పోరాట చిహ్నంగా ఓ చిత్రాన్ని గీయటం ప్రారంభించారు. ”చరిత్రలో మొదటి సారి తమ యుద్ధ తంత్రం సాఫల్యతను నిరూపించుకోవడానికి ఏకంగా ఓ నగరాన్నే భూస్థాపితం చేసిన సందర్భమే గెర్నికాపై దాడి” అని కళా చరిత్రకారుడు మార్టిన్ వ్యాఖ్యానించారు. ఆ వార్తలు విన్న వెంటనే తన కుడ్య చిత్రం ఎలా రూపొందించాలో పికాసో నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
2017లో లండన్‌లో మేయర్ చొరవతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పికాసో చిత్రాన్ని వీక్షకులకు అందుబాటులో తేలేకపోయినా పికాసో స్నేహితురాలు దోరా మార్ పికాసో ఆ చిత్రరూపకల్పన సమయంలో తీసిన ఫోటోలను ప్రదర్శించారు. ఈ కుడ్య చిత్రాన్ని పూర్తి చేయటానికి పికాసో నెల రోజుల సమయం తీసుకున్నారు. ఈ చిత్ర రూపకల్పన సమయంలో పికాసో జాతీయోన్మాద ఫ్రాంకోను సమర్ధిస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ ‘‘నేను రూపొందిస్తున్న చిత్రాన్ని గెర్నికా అని పిలుస్తాను. ఈ చిత్రంలో ఫ్రాంకో సైన్యపు యుద్ధతంత్రం, కుటిలత్వం, మహానగరాన్ని నేలమట్టం చేసిన ధూర్తత్వాలను బేషరతుగా ఖండిస్తూ ఈ చిత్రం రూపొందిస్తున్నాను’’ స్పష్టం చేశారు.
రాజకీయ నేపథ్యం
ఈ కుడ్యచిత్రం రూపకల్పనలో పాల్గొన్న వారంతా స్పెయిన్‌పై నాజీ జర్మనీ ఇటలీల దాడిని నిరసిస్తూ తమతమ వ్యక్తిగత స్థాయిలో స్పందించాలని నిర్ణయించుకున్నారు తప్ప రాజకీయ ప్రోద్భలంతో కాదు. ఇది సృజనకారుల సహజ స్పందన అని లండన్ ఎగ్జిబిషన్ పర్యవేక్షకులు జువాన్ మాన్యుయెల్ బోనెట్ అన్నారు. 1936కి ముందు పికాసో కానీ, మీరో కానీ రాజకీయ ఆందోళనకారులేమీ కాదు. కానీ స్పెయిన్ పై నాజీల దండయాత్ర వీరిలో రాజకీయ చైతన్యాన్ని పురికొల్పింది. 1937 నాటి కళా ఖండాలే వారి తొలి రాజకీయ వ్యక్తీకరణలు. తర్వాతి కాలంలో పికాసో 1944లో ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీలో చేరిపని చేస్తే మీరో 1960 దశకం వరకూ ఫ్రాంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగే ఉద్యమాల్లో క్రియాశీల భాగస్వామిగా ఉన్నారు.

ఈ కుడ్యాన్ని రూపొందించటంలో భాగస్వామి అయిన కాల్డెర్ రూపొందించిన చిత్రాలు కూడా రాజకీయ భావావేశానికి ప్రతీకలే. తొలుత ఆయన స్పెయిన్ జాతీయుడు కాకపోవటంతో తొలుత కాల్డెర్కు ప్రవేశాన్ని నిరాకరించినా తర్వాత నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఒక ఫౌంటెయిన్ నుండి మెర్క్యురీని వెదజల్లేలా ఏర్పాటు చేసిన కుడ్యం కాల్డెర్ రూపొందించిందే. ఫ్రాంకో సైన్యాలు పెద్దఎత్తున మెర్క్యురీని ఉపయోగించినట్లు 1935 నాటికే ఆధారాలున్నాయి. మారణాయుధాలు తయారీలో మెర్క్యురీది కీలకపాత్ర. ఈ రకంగా చూసినప్పుడు 1937 నాటి పారిస్ ప్రదర్శనలో ప్రదర్శనకు పెట్టిన ఏ వస్తువూ రాజకీయ వ్యక్తీకరణకు, వర్తమాన సమస్యల చిత్రీకరణకు దూరంగా లేవు.
లండన్ ప్రదర్శన ఏర్పాటులో పాలుపంచుకున్న మరో చిత్రకారుడు మిరో మనుమడు పున్యంట్ మీరో. తన తాత రూపొందించిన కుడ్య చిత్రం శిథిలమైతే దానిని నమూనాను పునర్నిర్మించి లండన్‌లో ప్రదర్శించారు. ఓ రైతు తల వచ్చలైన చిత్రాన్ని మీరో చిత్రకారులు ప్రదర్శిస్తారు. స్పెయిన్‌లో జరిగిన దుర్ఘటనలపట్ల వ్యక్తమైన నిరసనరూపమే ఈ చిత్రం.
ప్రచారాందోళన రూపాలుగా గెర్నికా, రీపర్
తర్వాతి కాలంలో ఈ చిత్రాలు ఫాసిజానికి వ్యతిరేకంగా సోవియట్ రష్యా రూపొందించిన ప్రచార ఆందోళన సామాగ్రిలో అంతర్భాగమాయ్యయి. ఈ కుడ్య చిత్రాలన్నీ నికార్సయిన రాజకీయ ప్రచార సాధనాలుగా మారాయి. కవి జోస్ బెర్మాని అభిప్రాయంలో గెర్నికా కేవలం ఓ చిత్రం కాదు. అది ఒక గ్రాఫిటీ. మహాద్భుతమైన చిత్రకారుని కుంచె నుండి జాలువారిందని వ్యాఖ్యానించారు.

అప్పట్లో యుద్ధకాలంలో నాశిరకం గుడ్డ మీద గీసిన ఈ కుడ్య చిత్రం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. ఈ కళాకారులు కుడ్యచిత్రం రూపొందించేటపుడు పెవెలియన్ తీసేయగానే ఈ చిత్రం కూడా తీసేస్తారన్న అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి పెద్దగా భారీ వస్తువులు ఉపయోగించలేదు. గెర్నికా, రీపర్ చిత్రాలను తర్వాత లండన్ అక్కడ నుండి అమెరికా పంపాల్సి రావటంతో నేటికీ బతికి బట్టకట్టాయి. తర్వాత 1938 ప్రాంతంలో గెర్నికా చిత్రాన్ని యావత్ ఇంగ్లాండ్‌లో ప్రదర్శించారు. స్పెయిన్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడేంత వరకూ ఈ చిత్రాన్ని స్పెయిన్‌కు తీసుకురావద్దన్న పికాసో అభిప్రాయం నిర్దిష్టమైన రాజకీయ వ్యక్తీకరణే.

చీకటి కోణాలు
నాటి నుండీ గెర్నికా చిత్రాన్ని అధ్యయనం చేసిన పలువురు చిత్రకారులు పలురకాల వ్యాఖ్యానాలు చేశారు. స్పెయిన్ యుద్ధాన్ని, అందులో చనిపోయిన ప్రజలను, ఛిద్రమైన గెర్నికా నగరాన్ని, దేశ భవిష్యత్తును ఏకకాలంలో ప్రతిఫలించే చిత్రం ఇది. భవిష్యత్ యుద్ధాలపై కూడా ఇది చెప్పని వ్యాఖ్యగా మిగిలిపోయింది. ఈ చిత్రం ద్వారా పికాసో చిత్రం ప్రాచీన కాలం నుండీ జరుగుతున్న యుద్ధాలు, అందులో చితికిపోయిన నగరాలు, జీవితాలను ప్రతిబింబిస్తుందని ఫ్రాన్స్‌కు చెందిన కవి మైఖేల్ లీర్స్ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో క్రోధం, క్షోభే కాకుండా ఆశాకిరణాన్ని కూడా ప్రదర్శిస్తుందని మార్టిన్ అన్నారు. ఈ చిత్రంలోని దీపం పట్టుకున్న మహిళే చీకటినుండి సమాజానికి వెలుగురేఖలు ప్రసరించే మార్గం ఉందని కూడా పికాసో సందేశం ఇచ్చినట్లు ఈ చిత్రం మనకు చెప్తుందని అన్నారు.

చారిత్రకంగా చూసుకున్నపుడు గెర్నికా చిత్రానికి ఓ వారసత్వం కూడా ఉంది. ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ స్పెయిన్‌పై దాడి చేసినపుడు దానికి నిరసనగా గోయా అనే కళాకారుడు ఓ కళాఖండాన్ని రూపొందిస్తాడు. వర్తమాన పరిణామాల నేపథ్యంలో సృజనాత్మక కళాకారులు తమ రాజకీయ భావావేశాన్ని వ్యక్తం చేయటంలో గోయా ప్రభావం సంపూర్ణంగా మరుగున పడలేదు. పికాసో కూడా గోయా చిత్రలేఖనంతో స్పూర్తి పొందారు. స్పెయిన్ చరిత్రలో రాజకీయ, ధార్మిక చీకటి కోణాలపై గోయా అద్భుతమైన కాంతులు ప్రసరిస్తారని పికాసో అన్నారు. లండన్ లోని మేయర్ గ్యాలరీ నిర్వాహకుడు జోర్డి మేయరొల్ ‘‘పికాసో, కాల్డర్, గొంజాలెజ్, మీరో వంటి వారు స్పెయిన్ యుద్ధం వంటి విపత్తు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ నిర్దిష్ట రాజకీయ వైఖరిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని మనకు బోధిస్తున్నారు.’’ అని అభిప్రాయపడ్డారు. ఈ కళాకారులు రూపొందించిన కళా ఖండాలు నేటికీ స్పెయిన్ ప్రజల జ్ఞాపకాల్లో భద్రంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి, ఫాసిజానికి మధ్య జరిగిన పోరాటానికి ఈ కళా ఖండాలు ప్రతీకలు.’’ 1937లో గెర్నికా చిత్రం పూర్తి చేసిన తర్వాత తన మనోభావాన్ని వ్యక్తపరుస్తూ ‘‘ధార్మిక భావాలు కలిగిన కళాకారులు, సృజనకారులు కూడా సార్వత్రిక మానవ విలువలు సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో తమ అభిప్రాయాలను స్పష్టం చేయటంలో వెనకాడకూడదు’’ అన్నారు.
నోట్: కునాల్ కామ్రా చేసిన వీడియోలో ప్రభుత్వ విధానాల గురించి స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనపై పలురూపాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం ఓ పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు సృజనాత్మక రంగంలో ఉన్న వారు సైతం నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటూ పిలుపునిచ్చిన పికాసోకు నివాళి అర్పిస్తూ 2017లో బిబిసి ప్రచురించిన కథనాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
ఫియోనా మెక్‌డొనాల్డ్
అనువాదం : కొండూరి వీరయ్య
ది వైర్ తెలుగు సంపాదకులు.
(మూలం : బిబిసి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.