
న్యూ ఢిల్లీ: గత సంవత్సరం అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి సమావేశాన్ని(COP29) నిర్వహించింది. ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏటా $300(25,693.44 Indian Rupee)బిలియన్లను సమీకరించి, ఆ మొత్తాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పు కోసం ఆర్థిక సహాయం చేయాలని అంగీకరించాయి. అంగీకరించిన ఈ సొమ్ము ఇంతకుమునుపటి $100 బిలియన్ల లక్ష్యం కంటే మూడు రెట్లు ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పటి ఆర్థిక లోటును పూడ్చడానికి కావలసిన దానికంటే ఇది చాలా తక్కువ.
2015లో పారిస్ వాతావరణ ఒప్పందం అంగీకారంలోకి వచ్చినప్పటికంటే ప్రస్తుత పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ఈ ఒప్పదం అంగీకారంలోకి వచ్చినప్పుడు, వాగ్ధానం చేసిన $100 బిలియన్ల మొత్తం ఉరామరికగా అనుకున్నదేగానీ, వాస్తవంగా ఎంత పెట్టుబడి అవసరమవుతుందనే విశ్లేషణపై ఆధారపడి వేసిన లెక్కకాదు. ఇప్ప్పుడు అలా కాకుండా, COP29 కోసం వాస్తవ ఖర్చులను అంచనా వేసి, బయటనుండి ఎంత ఆర్థిక సహాయం అవసరమవుతుందో లెక్క కట్టాల్సి వచ్చింది.
2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు(చైనా మినహా)$2.4-3.3 ట్రిలియన్ల వాతావరణ పెట్టుబడులు అవసరంమని ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి వాతావరణ అర్థిక సహాయ నిపుణుల బృందం(IHLEG) అంచనా వేసింది. ఈ బృందంలో నేను కూడా ఒక సభ్యుడిని. ఇది ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ మొత్తంలో దాదాపు 60% దేశీయంగా మరింత పొదుపును పాటించడం ద్వారా, ప్రభుత్వ ఆర్థిక లోటును తగ్గించుకోవడం ద్వారా సమకూర్చుకోవచ్చు. ఇప్పటికే ఉన్న పెట్టుబడులను హరితీకరణ కోసం తిరిగి కేటాయించినట్లయితే 2030ల నాటికి ఇంకా $1 ట్రిలియన్ లోటు మిగిలి ఉంటుంది. అది 2035 కల్లా $1.3 ట్రిలియన్లకు పెరుగుతుంది. ఈ లోటును పూడ్చడానికి బయటనుండి ఆర్థిక సహాయం అవసరం.
COP29 సమావేశం ఈ ఆర్థిక లోటు పరిమాణాన్ని గుర్తించినప్పటికీ, దానిని ఎలా పూడ్చాలనే దానిపై ఒప్పందానికి రాలేకపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వ నిధుల కొరత ఉంటుంది. దీనివల్ల ఏర్పడనున్న ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి సంపన్న ఆర్థిక వ్యవస్థల సహకారంకోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఏటా కేవలం $300 బిలియన్లను మాత్రమే అందిస్తున్నాయి. ఈ మొత్తం కూడా ఒక షరతులతో. అభివృద్ధి చెందిన దేశాలు నిధులను సమీకరించడంలో “ముందుంటారు”. కానీ నేరుగా ఆ మొత్తాన్నిఅందించడానికి మాత్రం హామీ ఇవ్వరు.
2035 నాటికి ఏర్పడనున్న ఆర్థిక లోటులో $650 బిలియన్ల మొత్తాన్ని ప్రైవేట్ పెట్టుబడి ద్వారా, ఈక్విటీలు, రుణాలద్వారా పూడ్చుకోవచ్చునని IHLEG నివేదిక సూచించింది. కానీ ఈ నివేదిక ఒక లోతైన విభజనను బట్టబయలు చేసింది. ఆర్థిక వనరుల సమకూర్చుకోవడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు బడ్జెట్ ఒత్తిడిని తగ్గించే ప్రైవేట్ పెట్టుబడుల వైపు మొగ్గుచూపాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రైవేటు పెట్టుబడులకు ఉండే చంచల స్వభావాన్ని చర్చలోకి తెచ్చి, జవాబుదారీతనం, భవిష్యత్తు పై ఒక అంచనా ఉండాలంటే ప్రభుత్వ నిధులు అవసరమని పట్టుబట్టాయి.
ప్రైవేట్ ఆర్థిక సహాయం పట్ల సందేహం సమంజసమైందే. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఈ దేశాలు గ్రాంట్లు, దీర్ఘకాలిక రాయితీ రుణాలపై ఆధారపడుతున్నాయి. ఈ పరిమితమయిన వనరులను తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలు గల బీద దేశాలకు మళ్లించినప్పుడు, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు, పెట్టుబడులలో అనిశ్చితి ఉన్నప్పటికీ, తప్పనిసరిగా ప్రైవేట్ పెట్టుబడులపై మరింత ఆధారపడాల్సి ఉంటుంది.
2022లో $40 బిలియన్లుగా ఉన్న ప్రైవేట్ పెట్టుబడుల వాతావరణ ఆర్థిక సహాయం, 2035 నాటికి $650 బిలియన్లకు పెరుగుతుందని IHLEG అంచనా వేసింది. కానీ ఈ పెట్టుబడులలో అధిక మొత్తం కొన్ని మార్కెట్లలోనే కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల ప్రైవేటు పెట్టుబడులు లభ్యత అసమానంగానూ, అనిశ్చితంగానూ తయారయింది. పునరుత్పాదక ఇంధన ఖర్చులు తగ్గించుకున్నప్పుడు, శిలాజ ఇందనాలకు ప్రోత్సాహం తగ్గి గ్రీన్ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. కానీ ఈ మార్పు చాలా నెమ్మదిగానూ, అస్పష్టంగానూ ఉంది.
ప్రైవేట్ పెట్టుబడులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వ విధానాలు తరచూ పెట్టుబడిని నిరుత్సాహపరుస్తున్నాయి. చాలా ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం కావలసిన ఇందన ధరలను తగ్గిస్తున్నాయి. దీనివల్ల విద్యుత్‌ను అందించేవారు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు దీనిని నష్టదాయకంగా భావిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తారు. ప్రైవేట్ ఆర్థిక సహాయం గొప్ప పాత్రను పోషించాలంటే, ప్రభుత్వాలు ఇందన ధరలను సంస్కరించాలి. నియంత్రణలను బలోపేతం చేయాలి. పెట్టుబడిని ఆకర్షించడానికి బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజాన్ని తగ్గించుకోవాలి.
ప్రభుత్వ రంగ సహాయం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (MDBలు), ద్వైపాక్షిక సంస్థలు తమ ప్రమాద భాగస్వామ్య యంత్రాంగాల ద్వారా ప్రైవేట్ పెట్టుబడిదారులకు నష్టాలను తగ్గించగలవు. అయితే అదే సమయంలో ప్రభుత్వాలు స్థిరమైన, పెట్టుబడి అనుకూల స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి.
బలమైన ఆర్థిక సహాయ ఒప్పందాన్ని పొందడంలో COP29 విఫలమయింది. అంటే, ఇక తదుపరి గ్లోబల్ స్టాక్‌టేక్ 2028లోజరిగేంత వరకూ వరకు మళ్లీ చర్చలు జరగడం దాదాపు అసంభవం. అయినాకూడా, ఈ ఆర్థిక లోటును పూడ్చడం సాధ్యమే. MDB ద్వారా వచ్చే రుణాలను పెంచినప్పుడు అవి పెట్టుబడి అవసరాలను తీర్చగలుగుతాయి. ప్రస్తుతానికి ఇవి వాతావరణ అవసరాలకు తగినంతగా అందడంలేదు. ప్రభుత్వాలు కూడా దీర్ఘకాలిక పరిష్కార విధానాలతో పనిచేయాలి.
బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరిగే COP30 సమావేశంకన్నా ముందే ఈ విషయాలలో వాస్తవమైన పురోగతిని సాధించే అవకాశం ఉందని, COP29 తన చివరి ప్రకటనలో సూచించింది. కానీ విజయాన్ని నిర్ణయించే ముఖ్యమయిన అంశం ఏమిటంటే అభివృద్ధి చేందిన దేశాలు మరిన్ని ఆర్థిక వనరులను అందించడానికి సుముఖతను వ్యక్తం చేసి, నిబద్ధతను పాటించడం.
అయితే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి రావడంతో ఈ విధానాలు మరింత అనిశ్చితంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ ప్రయత్నాల పట్ల అతని పరిపాలన వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత, శిలాజ ఇంధన విస్తరణకు అతని ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం అంతర్జాతీయ వాతావరణ ఆర్థిక సహాయాలను బలహీనపరున్నాయి. అమెరికా ఇప్పటికే ఉన్న కట్టుబాట్లను సడలిస్తుంది. ఈ చర్యలు వాతావరణ చర్చలను మరింత ఆలస్యం చేస్తాయి.
ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, అసలు ఇంత పెద్ద వార్షిక COP సమావేశాలను నిర్వహించడం ఇప్పటికీ సరైన విధానమేనా అని ప్రశ్నించడం సరయినదిగానే అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సమావేశాల్లో లక్షల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, వ్యాపార అధినేతలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు, వాతావరణ సంక్షోభ తీవ్రత మరింత కేంద్రీకృత, ఫలితాల ఆధారిత నిర్ణయాలను కోరుతున్నది.
దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏమిటంటే, కీలకమయిన ఆర్థిక సహాయ చర్చలను చిన్న, ప్రత్యేక సమూహాలకు అప్పగించడం. దీనికి G20 ఒక ఉదాహరణ. దీనిలో ప్రపంచవ్యాప్త ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, ఇది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను, అంటే, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ స్థూల తలసరి ఆదాయంలోనూ, ఉద్గారాలలోనూ 80% భాగాన్ని కలిగి ఉంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి ఇది ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా, దాని సభ్యులు ప్రపంచంలోని అతిపెద్ద బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను నియంత్రిస్తున్నారు. దీనివల్ల వాతావరణ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఇది ఒక సహజ వేదికగా అవుతున్నది.
మరొక ఎంపికగా BRICSను చెప్పవచ్చు. ఇది పాశ్చాత్యదేశాల నేతృత్వంలోని ఆర్థిక సంస్థల ప్రాభల్యానికి బదులుగా సమతుల్యతను సాధించేందుకు తనను తాను వేదిక చేసుకుంది. చైనా, భారతదేశం, బ్రెజిల్, ఇంకా తదితర కీలక అభివృద్ధి చెందుతున్నదేశాలు దీనిలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. BRICS వాతావరణ మార్పుల కోసం అవసరమయిన ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయ వనరులను సమీకరించగలదు. పాశ్చాత్యదేశాల ఆర్థిక సహాయంపై ఆధారపడటాన్ని తగ్గించి, కర్బన మార్కెట్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉండేలా చేయగలదు.
G20 గానీ లేదా BRICS గానీ వాతావరణ ఆర్థిక సహాయంలో ముందుండేట్లైయితే, MDB రుణ సామర్థ్యాన్ని విస్తరించి, ప్రైవేట్ పెట్టుబడుల పరపతులను పెంచడం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా వాతావరణ అనుకూలత, ఉపశమనాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించాల్సి ఉంటుంది.
తగిన ఆర్థిక నిర్వహణా చట్రాన్ని రూపొందించడంలో COP29 విఫలమయింది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిష్కారాల కన్నా సవాళ్ళే ఎక్కువగా మిగిలిపోయాయి. వాటి ఆర్థిక లోటు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మెరుగుదల హామీలు ఇకపై సరిపోవు. ఈ పరిస్థితులలో, చర్చల ప్రక్రియకు COP ఇంకా ఉత్తమ స్థలంగా కొనసాగగలదా అనే వాస్తవమయిన ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తాము ఇచ్చిన వాస్తవమయిన వాగ్దానాలను ఆలస్యం చేస్తూ ఉంటే, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికావ్రంట్ దేశాలకు వాతావరణ ఆర్థికసహాయ చర్చల వేదికగా G20ని గానీ లేదా BRICSను గానీ ఎంచుకోవడం తప్ప మరో దారి ఉండకపోవచ్చు.
COP29 ఏ విషయాలలో విఫలమయిందో అక్కడే COP30 సఫలం కావాలంటే, అస్పష్టమైన హామీలకు బదులుగా, స్పష్టమైన, అమలు చేయదగిన ఆర్థిక వాగ్ధానాలను పొందాలి. లేకపోతే, ప్రపంచం మరోసారి సమావేశమై, చర్చలు జరిపి, ఏ మాత్రమూ పురోగతి లేకుండా అక్కడే ఉండిపోతుంది – వాతావరణ సంక్షోభం మాత్రం అంతకంతకూ పెచ్చరిల్లుతూనే ఉంటుంది.
మాంటెక్ సింగ్ అహ్లువాలియా, భారతదేశ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పని చేశాడు. సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్‌లో గౌరవ ఫెలోషిప్ పొందాడు..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.