ఢిల్లీ శాసనసభ ఎన్నికలు నేడు పోలింగ్. విద్వేషమే విశ్వగురువుగా భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఓ మతానికి వ్యతిరేకంగా విషం వెదజల్లటాన్ని మతోన్మాద ప్రచారంగా భావించటం లేదు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మూడు ప్రశ్నలు ముందుకొచ్చాయి. మరోసారి కేజ్రీవాల్ చీపురు ఝాడిస్తారా లేక కలువ కంటి నీడలో కనుమరుగవుతాడా అన్నది మొదటి ప్రశ్న. కేజ్రీవాల్ ప్రజాదరణను, అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్యను తగ్గించే విధంగా బిజెపి ముందడుగు వేస్తుందా అన్నది రెండో ప్రశ్న. కాంగ్రెస్ తన ఉనికినీ, అస్తిత్వాన్నీ నిలుపుకుంటుందా అన్నది మూడో ప్రశ్న.
కానీ ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్ దశకు వచ్చేసరికి ఈ ప్రశ్నలు మారిపోయాయి. ఈ ప్రాధాన్యతలు మారిపోయాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి హర్యానాలో కూడా అంతో ఇంతో ప్రభావం, ప్రాభవం ఉన్నాయి. బిజెపిని ఓడించే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉంది. కానీ హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించటానికి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవడానికి కేజ్రీవాల్ సిద్ధంకాకపోవటాన్ని రాజకీయ పరిశీలకులు హర్యానా ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు మద్యం ముడుపుల కేసులో సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటంతో ముడి వేస్తున్నారు. కనీసం ఢిల్లీ ఎన్నికల్లోనైనా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదురుతుందని ప్రజాతంత్ర శక్తులు ఆశించాయి. కానీ అదీ సాధ్యం కాలేదు. అంతేకాదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న అన్ని లోక్‌సభ నియోజకవర్గాలూ బిజెపి పరం కావటం కూడా లౌకిక రాజకీయాల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నిబ్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ లోని ఏడు లోక్స నియోజకవర్గాల్లో బిజెపి విజయ ఢంకా మోగించటాన్ని రాజకీయ పరిశీలకులు అర్థం చేసుకోగలరు. కానీ పదేళ్ల పాటు ఢిల్లీలో అధికారాన్ని చలాయిస్తూ కూడా బిజెపి ప్రాభవాన్ని, ప్రభావాన్నీ నిలువరించటంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలం కావటం, తర్వాత జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా ఆమ్ ఆద్మీ గెలవలేకపోవటం అనేక ప్రశ్నలకు అవకాశమిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రజాదరణ, మోడీ ప్రజాదరణ మధ్య పోటీగా చూడటంలో సందేహించాల్సిందేమీ లేదు. గత మూడు ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల ప్రచారం కాస్తంత మంద్రంగానే సాగుతోందని చెప్పవచ్చు. మీడియాలో కూడా పెద్దగా దేశవ్యాప్త చర్చ ఏమీ జరగలేదు. ప్రచారం, వాద ప్రతివాదాలు అన్నీ ఢిల్లీ మీడియాకే పరిమితం అయ్యాయి.గతంలో ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల విషయంలో మీడియా వ్యవహార శైలి ఇలా ఉంటుంది. కానీ ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లాంటి కీలకమైన సందర్భం విషయంలో కూడా ప్రాంతీయ మీడియా పెద్దగా లోతైన కథనాలు పాఠకులకు అందించిందేమీ లేదు.
బిజెపి ఆధిపత్యానికి పేదల వ్యతిరేకతే పునాది
గత పదిహేను సంవత్సరాల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పేదల పార్టీగా గుర్తింపు పొందింది. 70, 80 దశకాల్లో దేశంలో వామపక్ష పార్టీలు ప్రజలకు దగ్గరైనంతగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పేదలకు దగ్గరైంది. దానికి కారణం వ్యూహాత్మక ప్రచారం, ప్రచారానికి ఎన్నుకున్న విషయాలూ. ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకత్వం చేసిన కొన్ని ప్రకటనలు పరిశీలిస్తే ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందో అర్థమవుతుంది.
‘పేదలు మరీ ఆశపోతులు. అన్నీ ఉచితంగా కావాలంటారు’, ‘పూరిగుడిసెల ఓట్లే కేజ్రీవాల్‌కు ముఖ్యం’ వంటి ఉపన్యాసాలు ఈ ఎన్నికల్లో వినిపించటం మొదటిసారి. 2010 దశాబ్దంలో దేశంలో పేదరికం గణాంకాలు గురించి పార్లమెంట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చకు నేపథ్యం టెండూల్కర్ కమిటీ నివేదిక. దేశంలో పేదరికం అంచనలపై టెండూల్కర్ కమిటీ చేసిన నిర్ధారణలు గురించి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఈ విమర్శల నేపథ్యంలో యుపిఎ 2 ప్రభుత్వం రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ అధ్యక్షతన మరో కమిటీ నియమించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అప్పటి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి అగ్రనేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీ ‘కాంగ్రెస్ దేశంలో పేదరికాన్ని పెంచి పోషించి, వారి ద్వారానే అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తోంద’ని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ గురించి బిజెపి నాయకత్వం అటువంటి ప్రచారానికి పాల్పడటం బిజెపి స్వభావాన్ని రూఢీ చేస్తోంది. ఈ వాదనలు పశ్చిమ విహార్ మొదలు రోహిణి, పశ్చిమ పట్‌పట్‌గంజ్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో వినిపిస్తున్న వాదనలు ఇవి.
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిగా తమను తాము భావిస్తున్న వాళ్లు ఈ వైఖరి తీసుకోవటం దేశ రాజకీయాల్లో తలెత్తనున్న విలక్షణతకు ముందస్తు హెచ్చరికగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి ఇచ్చిన హామీలు, వాటి అమలు విషయంలోనూ, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఇటువంటి ప్రచారం సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ అవే వాగ్దానాలు అంతకన్నా ఎక్కువ తాయిలాలు తెలుగుదేశం, జనసేన కూటమి ప్రకటిస్తే ఈ వాట్సాప్ విశ్వవిద్యాలయ మేధావులు నోటికి తాళం వేసుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న ప్రచారాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. సమాజంలో పేదల పట్ల నిఘూడంగా పేరుకుపోతున్న వ్యతిరేకత ముందు ముందు ఎటువంటి పర్యవసానాలకు దారితీయనుందో చూడాలి.
ఎగువ మధ్యతరగతి నివశించే ఆరు నియోజకవర్లాల్లో 2020లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఐదువేల లోపు ఓట్ల తేడాతో బిజెపి పరాయజం పాలైంది. ఈ నియోజకవర్గాల్లో ఓటమిని గెలుపుగా మార్చుకునే ప్రయత్నంలో పేదలను, పేదలకు అమలవుతున్న పథకాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయటం గమనించాల్సిన విషయం. ఢిల్లీలోని గేటెడ్ నివాస ప్రాంతాల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వాటి కార్యవర్గాలు, వాట్సప్ బృందాల్లో విస్తృతంగా సాగుతున్న ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ ఎలా అడ్డుకుంటుదన్నది ఫలితాలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు. ప్రధాని మోడీతో సహా బిజెపి అగ్రనేతలు సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనల నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఓ సందర్భంగా ఉంటుంది.
డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఎటూ ఉండనే ఉంది. రాజస్థాన్ మొదలు ఒరిస్సా వరకూ ఈ నినాదంతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దె దించిన సంగతి తెలిసిందే.
సంక్షేమ చర్యలు వర్సెస్ సంఘటిత నిర్మాణం
ఢిల్లీ ఓటర్లలో దాదాపు 85 శాతం మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో నివశించేవారే. ఖరీదైన ఢిల్లీలో నివశించే జనాభా 15 శాతానికి మించి లేదు. పైన చెప్పిన సంఘటిత ప్రచారమంతా ఈ 15 శాతం నివశించే ప్రాంతాల్లోనే జరుగుతోంది. మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో తన పలుకుబడిని కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఈ పలుకుబడిని నిలుపుకుంటుందా లేదా అన్నదానిపై పార్టీ విజయం ఆధారపడి ఉంటుంది. ఉపాధి అవకాశాలు లేకపోగా ధరాఘాతానికి కుంగిపోతున్న పేదలకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆమ్ ఆద్మీ అందించే సంక్షేమ పథకాలు ఆక్సిజన్‌లా పని చేస్తున్నాయి. ప్రధానంగా నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా ఢల్లీి మురికివాడల్లో ప్రధాన సమస్యలుగా ఉండేవి. ప్రస్తుతం ఈ సేవలు కొంత మెరుగుపడటంతో ఆమ్ ఆద్మీ ప్రజాదరణకు నోచుకొంటోంది.
సామాజిక కోణంలో చూసుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలు, బలహీనవర్గాలు, ఎస్సీలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కవ సీట్లు సంపాదించింది. జాట్లు, గుజ్జర్లు, ఇతర స్థానిక అగ్రకులాలకు చెందినవారు మెజారిటీగా ఉండే నియోజకవర్గాల్లో బిజెపిదే పైచేయి అని సిఎస్‌డిఎస్ లోక్‌నీతి సర్వేల్లో వెల్లడవుతోంది.
ఆమ్ ఆద్మీ ఓటుబ్యాంకులోకి చొచ్చుకొస్తున్న బిజెపి
ఢిల్లీ ఓటర్లలో గణనీయమైన సంఖ్య ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ నుండి వలసవచ్చిన శ్రామిక కుటుంబాలే. గత మూడు ఎన్నికల్లో ఈ కుటుంబాలు ఆమ్ ఆద్మీ పార్టీకి దన్నుగా నిలిచాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో బీహార్‌కు చెందిన సినీ నటుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టడం వంటి చర్యలతో ఈ ఓటుబ్యాంకులోకి అంతోఇంతో కాలుపెట్టేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నించింది.
2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈశాన్య ఢిల్లీలో ఉన్నంత మతపరమైన చీలిక ఓటర్లలో ఇప్పుడు లేదు. 2020 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈశాన్య ఢిల్లీలో జరిగిన మతకలహాలు, వాటి వెనక బిజెపి నేతల ప్రత్యక్ష పాత్ర కొంతమేర పార్టీకి నష్టం చేసిందనే చెప్పాలి.
ఈసారి సిక్కు ఓటర్లపై బిజెపి దృష్టి పెట్టిందన్న విషయాన్ని కొన్ని వివరాలు, మరికొన్ని వాస్తవాలు తెలియచేస్తున్నాయి. కీలకమైన సిక్కు రాజకీయనాయకులను కాంగ్రెస్‌నుండి తమ పార్టీలో చేర్చుకోవడం, గతంలో పార్టీ వీడి రాజకీయంగా క్రియాశీలకంగాలేని వారిని బుజ్జగించి అభ్యర్ధులుగా నిలబెట్టడం ఇందులో భాగమే. అయితే ఆయా నియోజకవర్గాల్లో నాయకుల వ్యక్తిగత ప్రాధాన్యతల కోసం సిక్కు ఓటర్లు బిజెపికి వ్యతిరేకంగా మారారా, లేక మరేకారణాలతోనైనా వ్యతిరేకంగా మారారా అన్నది ఈ ఎన్నికల ఫలితాలను చూసి నిర్ధారించాల్సి ఉంటుంది.
పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఉద్యమం జరిగిన ప్రాంతాల్లో పోయిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన సంపూర్ణ ఆధిపత్యం ఈ సారి దక్కే సూచనలు కనిపిచంటం లేదు. నాలుగైదు సీట్లలో పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఎంఐఎం రాజకీయరంగ ప్రవేశం దీనికి కారణంగా భావిస్తున్నారు.
నేడు ఢిల్లీలో పోలింగ్. ఎన్నికల నిబంధనావళి ప్రకారం సోమవారం నాటికే ప్రచారం ముగుస్తుంది. కానీ మంగళవారం నాడు రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యావాదాల తీర్మానంపై సమాధానం పేరుతో పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పైనా విరుచుకుపడ్డారు. ఆ ఉపన్యాస శైలి, దూషణభూషణలు గమనిస్తే ఈ ఎన్నికల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బిజెపికి ఆశించినంత స్థాయిలో పట్టుచిక్కడం లేదేమో అన్న సందేహం కలుగుతోంది.