ఇజ్రాయిల్, గాజా యుద్ధ విరమణ ప్రకటించారు. ఉత్తర గాజాకు తిరిగి వచ్చిన ఒక తల్లి అక్కడ ధ్వంసమైన ఇళ్ల మధ్య శిధిలాల్లో తన బిడ్డ శవాన్ని వెతుక్కొంటూ ‘ఇక్కడే ఉండాలి నా బిడ్డ’ అని రోదించే వీడియో హృదయాన్ని కలిచివేసింది. బహుశా ఏ యూదు జాత్యాహంకార యుద్ధ విమానాలో ఆమె ఇంటి మీద వేసిన బాంబుకు ఆ బాబు చనిపోయి వుండచ్చు. ప్రపంచానికంతటికీ యుద్ధ సామాగ్రిని, యుద్ధ విధ్వంసాన్ని, యుద్ధ మరణాలను, యుద్ధ అశాంతిని, యుద్ధ శ్మశాన శాంతిని పంచి ఇచ్చే ఇజ్రాయిల్ -తాను స్వయంగా పాలస్తీనా మీద చేసిన అమానవీయ యుద్ధంలో మరణించిన బాలుడి కోసం ఆ తల్లి విలపించటం మొత్తం యుద్ధ కాన్వాస్ లో ఒకానొక దృశ్యం మాత్రమే. ఈ 15 నెలల మారణకాండ రోజుకొక దుఃఖాన్ని ప్రపంచానికి సరఫరా చేసింది. బిడ్డ శవాన్ని కూడా తీసుకొనే వ్యవధి లేక ఆమె అక్కడ నుండి పారిపోవాల్సి రావటం అందులో ఒక సంగతి మాత్రమే. యుద్ధంతో ఆకలికీ, ప్రాణ భయానికీ, జబ్బులకూ లొంగి పోవాల్సిన జీవితం ఎంత క్రూరంగా వుంటుందో కడుపులో చల్ల కదలకుండా వుండేవారికి తెలియక పోవచ్చు.
యుద్ధ విరమణ ప్రకటించిన తరువాత పాలస్తీనీయులు తమ తమ ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. రెండూ, మూడూ జీవితకాలాల శిక్షలు పడి, ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గిన ఖైదీలు కూడా విరమణ ఒడంబడిక ప్రకారం విడుదలయ్యి అనేక జబ్బులతో తమ కుటుంబాలను కలుసుకొంటున్నారు.
యుద్ధం చెల్లించిన మూల్యం ఎంత?
పాలస్తీనా అధికారిక లెక్కల ప్రకారం 12 నెలల (గత అక్టోబర్ వరకు) మానవ హననంలో 17400 మంది పిల్లలు చనిపోయారు. అంటే ప్రతి 30 నిమిషాలకు ఒక పసిబిడ్డ మరణించింది. వేలాదిమంది పసిపాపలు ధ్వంస శిధిలాలలో కనబడకుండా పోయారు. కుప్పలు పడిన శిధిలాల నుండి నిన్నా మొన్నా 354 పసిపాపల శవాలను తవ్వి తీశారు. శీతాకాలం ప్రారంభం కాగానే శరణార్థ శిభిరాల్లో చలిని ఆపే వసతులు లేక 5గురు పాపలు గడ్డకట్టుకొని పోయి మరణించారు. జునా, ఆలీ అనే కవల పిల్లల మరణం అలాగే జరిగింది. గడ్డ కట్టే చలితో పాటు, వెల్లువెత్తిన వరదలు -పాలస్తీనీయులు ప్రస్తుతం నివశిస్తున్న వస్త్రాలతో నిర్మించిన శిభిరాలను అతలాకుతలం చేశాయి. ఈ శిభిరాల పరిస్థితులను వర్ణించటానికి ఎలాంటి పోలికలు సరిపోవు.
అందుబాటులోకి వచ్చిన లెక్కల ప్రకారం చనిపోయిన పిల్లలలో 710 మంది ఏడాది లోపు వాళ్లు. 1793మంది అప్పుడే నడక నేర్చుకొన్న పిల్లలు. 1205 మంది బడిలోకి అడుగు పెట్టిన పిల్లలు. 4205 మంది ప్రాధమిక పాఠశాల విద్యార్థులు. 3442మంది ఉన్నత పాఠశాలలో చదివే పిల్లలు. 17000 మంది పిల్లలు ఒకళ్లో, ఇద్దరో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. మిడిల్ ఈస్ట్ లో పని చేసే ఆల్ జజీరా వార్తా మాధ్యమం, చనిపోయిన పిల్లల పేర్లను అక్షరక్రమం ప్రకారం రికార్డ్ చేసింది. అత్యధికంగా మహమ్మద్ (మహమ్మద్ ప్రవక్త) పేరు గలిగిన పిల్లలు 935 మంది మరణించారు. పెద్ద ఎత్తున జరిగిన పసిపాపల చావులు అంకెల్లోకి, లెక్కల్లోకి మారి ఆర్ద్రతనూ కోల్పోయి యాంత్రికతను సంతరించుకోవటం ఈ శతాబ్దపు అత్యంత విషాదం. అయితే ఈ లెక్కలే చరిత్రలో రికార్డు అయి భవిష్యత్ ప్రపంచానికి వాస్తవాలు చెబుతాయి. ఈ లెక్కలను ఇంకా కొనసాగిస్తూ చెప్పాలంటే ఈ యుద్ధంలో మొత్తంగా 46788 పాలస్తీనీయులు మరణించారు. 1,10,000 మంది పైగా గాయపడ్డారు. యుద్ధ విరమణ ప్రకటించాక కూడా 103మంది మరణించారు. అందులో 31మంది స్త్రీలు, 27మంది పిల్లలున్నారు. ఈ వ్యాసం రాసే సమయానికి వెస్ట్ బాంక్ లోని జెనిన్ శరణార్థ శిభిరంపైన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేస్తోంది. పదుల్లో మరణాలు, అందులో పిల్లల మరణ వార్తలు కూడా వస్తున్నాయి.
శరణార్థ శిభిరాల నుండి వస్త్ర శిభిరాల వరకు
1948లో మొదటి సారి పాలస్తీనియన్ల గెంటివేత (నక్బా) జరిగింది. పాలస్తీనియులను వెళ్లగొట్టటానికి బావుల్లో, చెరువుల్లో విషం కూడా కలిపారు. వారి గ్రామాల మీద సాయుధ దాడులు చేయమని మూకలను పురిగొల్పారు. వక్క, ఖర్జూరపు పళ్ల తోటలతో, సెలయేర్లతో నిండిన తమ అందమైన గ్రామాలను వీడి పాలస్తీనీయులు పారిపోవాల్సి వచ్చింది. మారణహోమాలను, యుద్ధాలను ఆపలేని ఐక్యరాజ్యసమితి శరణార్థ శిభిరాలను మాత్రం వారికి ఏర్పాటు చేసింది. అలా నిరాశ్రయులయిన పాలస్తీనియన్లు తమ సొంత దేశంలోనే శరణార్థులు అయ్యారు. పాలస్తీనియన్ల కోసం ప్రత్యేకంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) ఏర్పాటు అయింది. దాని ఆధ్వర్యంలో అనేక మెగా శరణార్థ కాలనీలు ఏర్పడ్డాయి. విశాలమైన తమ ఇళ్లను ఇజ్రాయీలకు వదిలేసి ఇరుకు రేకుల ఇళ్లలో తలదాల్చుకొన్నారు పాలస్తీనీయులు.
ఇటీవల ఇజ్రాయిలీ బాంబు దాడిలో చనిపోయిన హమాస్ నాయకుడు యహ్వ సిన్వర్ తన ఆత్మకథ ‘ముల్లు-పువ్వు’ (Thorn and Carnation)లో ఈ శరణార్థ శిభిరాల జీవితం గురించి వివరంగా రాశారు. ‘ఖాన్ యూనిస్’ అనే శరణార్థ కాలనీలో 1962లో పుట్టి పెరిగిన సిన్వర్ తన తాత ఐక్యరాజ్య సమితి ఇచ్చిన శరణార్థ గృహంలోకి రావటానికి నిరాకరించి బయటే కూర్చనేవాడనీ, సొంత గ్రామమైన గాజాలోని ఫలూజాకు తిరిగి వెళ్లాలని తపన పడేవాడనీ రాశారు. తన చిన్నాన్న తిరుగుబాటుదారుడిగా మారి ఎలా చనిపోయాడో రాశారు. సర్వ స్వతంత్రులుగా, రైతులుగా బతికిన పాలస్తీనీయులు ఐక్యరాజ్యసమితి పంచే రేషన్ తో బతకాల్సి రావటం ఎంత దైన్యమో అనిపిస్తుంది ఆ పుస్తకం చదువుతుంటే. అలాంటి శరణార్థ కాలనీలలో పుట్టి పెరిగిన యువత తరువాత కాలంలో వివిధ ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూపుల్లో చేరటానికి కారణాలు ఆ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి.
శరణార్థ కాలనీలలో ఎక్కువభాగం గాజా ప్రాంతంలో ఉన్నాయి. రాఫా, జబలియా, ఖాన్ యూనస్, అల్ శాటి, బురైజ్, డైర్ అల్ బాల వాటిలో ముఖ్యమైనవి. ఆ శరణార్థ శిభిరాలలో బాల్యం కఠినమైనది. అక్కడి బాల్యం ప్రతిఘటనా రూపం తీసుకోవటం ఒక అనివార్య పరిణామాత్మక చర్య. అరుంధతి రాయ్ అన్నట్లు పాలస్తీనా ప్రజల తరఫున తీర్పులు ఇవ్వటానికి బయట వాళ్లకి ఎవరికి అర్హత ఉండదు. ఆ బాల్యం ఇంతిఫాదాల వంటి పదాలకు నిర్వచనం అయింది. ఏటా యుద్ధాలను చవి చూసింది. ఆ బాల్యం మరణాలకు వెరువలేదు. అందుకే ఆ బాల్యాన్ని పురిటిలో రూపు మాపే ప్రయత్నాలు 2023 అక్టోబర్ 17 నుండి మొదలైంది. పసిపాపలు వాళ్ల లక్ష్యం అయ్యారు. గురి పెట్టి నివాసిత గృహాల మీద బాంబులు వేసి, సామాన్య ప్రజలను చంపివేసి వికృతానందం పొందుతున్న ఇజ్రాయిలీ సైనికుల వీడియోలు ఇటీవల కాలంలో విడుదల అయ్యాయి. గాజావాసుల ఇళ్లల్లోకి వెళ్లి అక్కడ మహిళలు వదిలేసి వెళ్లిన లోదుస్తులను ప్రదరిస్తున్న ఇజ్రాయిలీ సైనికుల పాశవిక మానసిక స్థితి యుద్ధం నుండి వచ్చిందా? ఆధిపత్యం నుండి వచ్చిందా? జరుగుతున్న బీభత్సాన్ని నిర్వికారంగా చూస్తున్న ప్రపంచపు నిరాసక్త వాళ్లకా ఆమోదాన్ని ఇచ్చిందా?
22 లక్షల గాజా ప్రజలు ఉత్తర గాజా నుండి పారిపోవటం గత మే 7 నుండి ప్రారంభం అయింది. అక్కడ నుండి గాజా పట్టణానికి, తరువాత చనిపోగా మిగిలిన వాళ్లు డైర్ ఆల్ బాలా శరణార్థ శిభిరానికి చేరి, అక్కడ కూడా బాంబుల దాడి జరగగానే ఖాన్ యూనస్ శరణార్థ కాలనీకి చేరారు. ఖాన్ యూనస్ శరణార్థ కాలనీ మీద వెనువెంటనే ఇజ్రాయిలు డిఫెన్స్ ఫోర్స్ వైమానిక దళాలు బాంబులు వేసి సర్వ నాశనం చేశాయి. అక్కడ మరణించకుండా బతికిన ప్రజలు 14 లక్షల మంది ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రాఫాకు పారిపోయారు. రాఫా వైశాల్యం 64 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అక్కడ నుండి పారిపోవటానికి వాళ్లకు భూమీ లేదు. సమయమూ లేదు. రాఫాను కూడా టాంకర్లతో చుట్టుముట్టి, బాంబులు వేసి ఈజిప్టు సరిహద్దుల వరకూ తరిమి కొట్టారు.
అతి కష్టం మీద ఈజిప్టు చేరిన లక్షమంది గాజావాసులకు చేదు అనుభవాలు మిగిలాయి. పని చేయటానికి కానీ, ఆరోగ్య సదుపాయాలను వినియోగించుకోవటానికి కానీ వారికి అక్కడ అనుమతి ఇవ్వలేదు. 35 రోజుల టూరిస్టు వీసా మాత్రమే ఇచ్చారు. ఈజిప్టు రావాలనుకొనే వాళ్లు లక్ష అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శరణార్థులను నిరుత్సాహ పరచటానికే అంత రేటు పెట్టింది ఈజిప్టు ప్రభుత్వం. పాలస్తీనియన్లు UNHCR (యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్) కిందకు రారు. ఈ సంస్థ అంతర్జాతీయంగా ఎక్కడి శరణార్థుల కోసమైనా పని చేస్తుంది. పాలస్తీనియన్లు UNRWA (యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ) కిందకు వస్తారు. పాలస్తీనాకు మాత్రమే పరిమితం అయిన సంస్థ ఇది. దానికి ఈజిప్ట్ లో గుర్తింపు లేదు.
మొత్తం 20 లక్షలమంది గాజావాసులు చెల్లాచెదురు అయిపోయారు. 27 గాజా ఆసుపత్రుల మీద, 12 ఇతర వైద్యశాలల మీద 136 దాడులు జరిగాయి. 165 మంది డాక్టర్లు, 986మంది ఆరోగ్య కార్యకర్తలు హత్యకు గురి అయ్యారు. విదేశీ వైద్య సహాయ టీమ్స్ ప్రయాణిస్తున్న వాహనాలను కూడా ఇజ్రాయిలీ మిలటరీ పేల్చివేసింది. ప్రజలు టెంటుల్లో జీవించటం మొదలు పెట్టారు. UNRWA వాళ్లు ఇచ్చే టెంటులు చాలా ఖరీదు. ఉన్న బట్టలతో టెంట్లు వేసుకొని జీవనం మొదలు పెట్టారు. ఒకటా, రెండా -15 నెలలు, ఎండకీ, వానకీ, చలికీ, వరదలకీ కాచుకొన్నారు. తాగటానికి, స్నానానికి నీళ్లు లేక చర్మవ్యాధులు, ఇతర వ్యాధుల పాలిట పడ్డారు. మురికి టెంట్ల మధ్య ఆకలికి తాళలేని పిల్లలు గిన్నెలు పట్టుకొని దాతలు ఇచ్చే ఆహారం కోసం ఎగబడే దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఫోన్ టార్చ్ లైట్లతో డాక్టర్లు శస్త్ర చికిత్సలు చేశారు. తాగేనీళ్లు లేక డాక్టర్లు ఆసుపత్రి మందులను తాగారు కాని అక్కడ నుండి కదలలేదు.
ఈ యుద్ధ విజేతలు ఎవరు?
15 నెలలుగా హోరాహోరీన జరిగిన గాజా-ఇజ్రాయిల్ యుద్ధం విరమణకు అడ్డంగా ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి నెత్యాంహు చివరి వరకూ నిల్చున్నాడు. అతనితో చర్చలు జరిపే మధ్యవర్తులకే విసుగు వచ్చేటట్లుగా అతని ప్రవర్తన ఉండింది. అతని మొండితనం వలన ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ రెండు నెలల క్రితం రాజీనామా చేశాడు. అతనే ఈ యుద్ద ప్రణాళికా రచయిత. ఇజ్రాయిల్ మిలటరీ శ్రేణులు ఓడిపోతున్నాయని అతను గ్రహించి ఆయనా పని చేశాడు.
ఉత్తర గాజాను ఖాళీ చేయించి అక్కడి ఇజ్రాయిలీ సెటిలర్స్ ను తెచ్చి పెట్టాలనే ఒకే ఒక లక్ష్యం నెత్యాంహుకు వుండింది. ఆ ప్రాంతాన్ని వదలకుండా అంటిపెట్టుకొని వున్న ప్రతి వ్యక్తిని ఉగ్రవాదని ముద్ర వేశాడు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించేటట్లుగా ఉన్న అతని పద్ధతులను అందరూ ఖండించారు. ఇలా చేయటం యుద్ద నేరమనీ, జాతి హననమని ఇజ్రాయిల్ మాజీ రక్షణమంత్రి మోషే యాలోన్ స్వయంగా అన్నాడు. అయినా నెత్యాంహు మొండితనంతో నిలబడటానికి కారణం -అతని మహిష్కంలో నెట్జరిమ్ కారిడార్ నిర్మాణం ఉంది. గాజా భూతునకను చీల్చి గాజా పట్టణం మధ్య నుండి సముద్రం దాకా ఒక కారిడార్ ను నిర్మించాలని నెత్యాంహు ప్రణాళిక. ఈ కారిడార్ వలన అసలే కుంచించుకొని పోయిన గాజాలో మూడో వంతు భూభాగం తగ్గిపోతుంది. గాజా ఉత్తర దక్షిణ భాగాల మధ్య రాకపోకలు జరిగాలంటే ఈ కారిడార్ ద్వారానే అవ్వాల్సి ఉంటుంది.
అయితే అతని మీద అంతర్జాతీయ వత్తిడి పెరిగింది. ఇజ్రాయిల్ కి గట్టి మద్దతుదారుడైన జో బిడెన్ గట్టి చిక్కుల్లో పడ్డాడు. గాజాలో జరుగుతున్న మానవ సంక్షోభం గురించి అతని ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. యుద్ధ విరమణ జరగక పోవటానికి హమాస్ నే కారణం అనే అబద్ధాన్ని ఇజ్రాయిలీ జర్నలిస్టులే ఒప్పుకోవటం లేదు.
అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్ యుద్ధ ముగింపును శాసించాడు. కౌంటర్ కరెంట్స్ ఎడిటర్ బినూ మాథ్యూస్ చెప్పినదాని ప్రకారం -ట్రంప్ వాషింగ్టన్ కు బయటవాడు. ఇజ్రాయిలీ మిలిటరీ కాంప్లెక్స్ తోగాని, కొత్త ఛాదస్తులతో (neocons- స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారులు) గానీ అతను అంట కాగలేదు. తన సొంత నిర్ణయాలు అతను తీసుకోగలడు. ట్రంప్ కు తన వ్యాపారం కోసం మిడిల్ ఈస్ట్ (పశ్చిమ ఆసియా) కావాలి. అరబ్ దేశాలు ఇప్పటికే చైనా వైపు అడుగులు వేస్తున్నాయి. భారీ లక్ష్యాలతో పదవి చేపట్టనున్న ట్రంప్ అందుకు అనుమతించడు. ఖతార్, ఈజిప్ట్ ప్రభుత్వాలు కూడా యుద్ధ విరమణ కోసం గట్టిగా పని చేశాయి.
యుద్ధ విరమణ ఒప్పందం జరిగాక తేలిన విషయం ఏమిటంటే -నెత్యాంహు యుద్ధ ఉద్దేశ్యం నెరవేరలేదనీ, హమాస్ ను నాశనం చేయాలని తలపెట్టిన ఇజ్రాయిల్ మిలటరీ కూడా ఓటమికి గురి అయిందనీ. నిజానికి ఎంతోమంది ఇజ్రాయిలీ సైనికులు, అధికారులు యుద్ధంలో కూలిపోయారు. హమాస్ కు పట్టు ఉన్న ఉత్తర గాజాలోని బైట్ హనౌన్ పట్టణం తీవ్ర యుద్ధ క్షేత్రమయింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఎంత పోరకాడినా -శిధిలాల నుండి మొలిచి వచ్చినట్లు హమాస్ సైనికులు పుట్టుకొచ్చారు. ఇజ్రాయిల్ సైన్యం హామస్ ను చంపుతున్న వేగం కంటే ఎక్కువ వేగంలో హమాస్ తన సైన్యాన్ని పునర్నిర్మించుకొన్నదన్నది కాదనలేని సత్యం. ఎప్పటికీ గెలవలేని యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యం చిక్కుకొని పోయింది. విముక్తి యుద్ధాల్లో మిలటరీ విజయాల కంటే చివరికంటా పోరాడుతూనే ఉండటమే ప్రధానమైనది మరోసారి రుజువు అయింది.
ఇజ్రాయిల్ ఆధిపత్యం కూలిపోవటం -ఆ ప్రాంతంలోనూ, అంతర్జాతీయంగా కూడా ఆ దేశం మీద ప్రభావం చూపించింది. అత్యధిక జనాభా కలిగిన గాజా భూభాగం, ప్రపంచం నుండి విడివడి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. ఎంత సైన్యాన్ని తెచ్చిపెట్టినా గాజా వాసులు లొంగలేదు. కష్టాలనూ, కన్నీళ్లనూ భరించారు. తమ మాతృభూమిని రక్షించుకోవటానికి మొక్కవోని పట్టుదలతో పోరాడారు.
గాజా యుద్ధం అంతర్జాతీయంగా ప్రజాభిప్రాయాన్ని మార్చేసింది. ముఖ్యంగా యువతలో చాలా మార్పు వచ్చింది. 30 సంవత్సరాల లోపు వయసున్న అమెరికా ప్రజలు ఇజ్రాయిల్ చర్యలను విమర్శించారు. అమెరికా యూదు యువత పాలస్తీనీయుల పట్ల, ఇంకా చెప్పాలంటే హమాస్ పట్ల కూడా తమ సానుభూతిని వెల్లడి చేశారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ వివాదంలో ప్రపంచాన్ని ఇజ్రాయిల్ కు అనుకూలంగా తిప్పుకొన్నామని భావించిన అమెరికాలో ఈ మార్పు గురించి తప్పక చెప్పుకోవాలి. ఈ యుద్ధం అంతర్జాతీయ సహానుభూతిని పాలస్తీనాకు సంపాదించి పెట్టింది. ఇజ్రాయిల్ చర్యలను ఖండిస్తూ ఎల్లెడలా ఉద్యమాలు జరిగాయి. ఇజ్రాయిలీ వస్తువులనూ, దాని విద్యా సంస్థలనూ నిషేధించాలనే డిమాండులు ఊపందుకొన్నాయి. ఇజ్రాయిల్ ఇప్పుడు బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇజ్రాయిలీ అధికారుల మీద అనేక యుద్ధనేరాలు మోపబడ్డాయి. బయట దేశాలలో నేరారోపణకు, శిక్షకు గురి కాకుండా గాజా యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయిల్ సైనికుల ముఖాలను దాచేస్తున్నారు.
ఈ యుద్ధ విరమణ గాజా వివాదానికి ముగింపు ఎంత మాత్రం కాదు. ఇజ్రాయిల్ సైన్యం తిరోగమించినప్పటికీ -లెబనాన్, సిరియా, వెస్ట్ బాంక్ కేంద్రంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పై స్థాయిలో ఉన్నాయి. ట్రంప్ ఉత్తర గాజావాసులకు ఈజిప్ట్, జోర్డాన్ ఆశ్రయం ఇవ్వాలనీ, గాజావాసులు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనీ కొత్తపాట మొదలు పెట్టాడు.
ఇజ్రాయిల్ స్థితి బలహీనమైయ్యింది. కానీ దాని పగ తీరలేదు. దాని ఫలితనే వెస్ట్ బాంక్ లోని జెనిన్ శరణార్థ కాలనీ మీద ఇప్పుడు జరుగుతున్న దాడులు. పాలస్తీనీయులు సైన్యంతో లొంగరనే సందేశాన్ని గాజా ఇవ్వగలిగింది. ఇజ్రాయిల్ భారీ మిలటరీ -వివాదాలను పరిష్కరించలేదనీ, సమాన ప్రాతిపాదికన పాలస్తీనియన్లతో చర్చలు మాత్రమే ఆ ప్రాంతంలో శాంతిని ఇవ్వగలవనీ -ఈ యుద్ధం రుజువు చేసింది. ఇజ్రాయిల్ కి ప్రాంతీయ పరపతి తగ్గటమే కాదు, పాలస్తీనా హక్కుల కోసం అంతర్జాతీయ ఉద్యమాలు పని చేయటం మొదలయ్యింది. గాజా ఈ యుద్ధంలో ఓడిపోయి ఉండచ్చు. కానీ ప్రజల సంకల్పం ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదిరిస్తుందని చాటింది.
ఈ సంక్షోభం ఇంతటితో అయిపోయిందని చెప్పటం తొందరపాటే అవుతుంది. కానీ గాజా నుండి పాఠాలు నేర్చుకొని ఇజ్రాయిల్ తన విధానాలను మార్చుకొంటుందని మాత్రం ఆశించవచ్చు. ఈ పాఠాలే ఈ ప్రాంతపు భవిష్యత్ ను నిర్ణయించటంలో కీలక పాత్ర వహిస్తాయి.
గాజా శరణార్థ కాలనీలలో ఇరుకైన వీధుల్లో ఇళ్లు కట్టుకొని, డజన్ల కొద్ది యుద్ధాలను తట్టుకొని, కుటుంబాలను ఏర్పర్చుకొని, కుటుంబ సభ్యులను పోగొట్టుకొని -గాజన్లు తమ తమ ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. శిధిలాలైన ఇంటి గోడలు, పునాదుల శకలాల మధ్య ముక్కలైన జీవితాలను వెతుక్కొని పునర్నిర్మించుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
రమాసుందరి
మాతృక మాస పత్రిక సౌన్యంతో