1947లో భారతదేశానికి వచ్చింది రాజకీయ స్వాతంత్య్రమేనని, అయోధ్య రామమందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించాడు.
‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశద్రోహ నేరం కిందకి వస్తాయి. అదే ఏ ఇతర దేశంలో అయినా ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తే వాళ్ల మీద చట్టపరంగా విచారణ సాగిస్తారు.’’ అని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఘాటుగా స్పందించాడు.
దేశ స్వాతంత్రోద్యమం గురించి ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు వాళ్ల మద్దతుదారులు తరచూ చేసే తప్పుడు వ్యాఖ్యానాల మీద మన ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటి వరకూ చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బహుశా మన స్వాతంత్య్రోదమ వీరులు ఇలాంటి పరిణామాలను ఊహించి కూడా ఉండరు. అయోధ్య రామ మందిరంలో విగ్రహావిష్కరణ జరిగిన రోజునే దేశానికి అసలైన స్వాతంత్య్ర వచ్చిందన్న మోహన్ భాగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అనడం సరి కాదు, రామ మందిర నిర్మాణం ద్వారా దేశం అసలైన స్వాంత్రంత్య్రం సాధించుకున్నది అన్నారు. మన రాజ్యాంగం దేశ స్వాతంత్య్రానికి గుర్తుకాదు అని కూడా వ్యాఖ్యానించాడు. స్వాతంత్రోద్యమం గురించి జాతిని ఉద్దేశించి ప్రతి రెండు, మూడు రోజులకు ఒక సారి ఈ రకంగా మాట్లాడడానికి మోహన్ భాగవత్‌కు ఎంత ధైర్యం ఉండాలి ఆయన ఉద్దేశ్యంలో మన రాజ్యాంగం ఎందుకూ కొరగాదు. బ్రిటిష్ వారికి వ్యతిరరేకంగా సాగిన మహోద్యమానికి ఎలాంటి విలువలేదు. ఈ మాటలు పబ్లిక్‌గా మాట్లాడడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. అదే వేరే దేశంలో ఇలా మాట్లాడిన వారిని ఈ పాటికి అరెస్టు చేసి విచారణకు కోర్టు బోను ఎక్కించేవారు, ఇది నిజం. 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదని అనడం ఈ దేశంలోని ప్రతి పౌరుణ్ణీ అవమానించినట్లే. ఇలాంటి చెత్త వినడం మానేయాల్సిన సమయం ఆసన్నమైంది’’.
కొన్ని రోజుల క్రితం మోహన్ భాగవత్ మన దేశానికి 1947లో వచ్చింది రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే, అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహపతిష్ఠాపన జరిగిన రోజు దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావించాలి అన్నాడు. అంతేకాదు భారతదేశ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తియ్యడానికి దేవాలయాలను ధ్వంసం చేశారని, రామ మందిరంలో విగ్రహప్రతిష్ఠతో కోల్పోయిన ఆ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాలి అని ప్రకటించాడు.
ప్రభుభక్తి పరాయణులైన పోకిరీలు కొందరు 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాతనే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందని అంటుంటారు. ఇదంతా పరమ చెత్త అని విమర్శకులు తీసి పారేస్తుంటారు. తాజాగా సినీ నటి కంగనా రనౌత్ ఈ పల్లవి అందుకున్నది. ఆమే మేధోదివాళాకోరుతనం ఎలాంటిదో బహిరంగ రహస్యమే. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ రకంగా దేశ స్వాతంత్య్రాన్ని మతానికి ముడిపెట్టి మాట్లాడడం మాత్రం కొత్త ట్విస్టు ఇలాంటి సంవాదాలు ఎవరికీ పనికి వచ్చేవి కావు.
ఏ దేశం కూడా తన స్వంత స్వాతంత్య్ర ఉద్యమాన్ని, భవిష్య తరాల కోసం తమ ప్రాణాలనే పణంగా అర్పించిన జాతి నిర్మాతలను ఈ రకంగా కించపరచుకోవదు. అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందనే బోగస్ వాదన అశాస్త్రీయ మత భావోద్వేగాలను రెచ్చగొట్టడం నుండి పుట్టుకు వచ్చింది.
ఆర్ఎస్ఎస్- బీజేపీలు కూడా ఇస్లాం ఛాందసవాదులు, ఫాసిస్టు శక్తుల మాదిరే ఒంటెద్దువాదం, మత ఛాందస భావజాలానికి మించి ఎదగలేకపోయాయి. దేశభక్తి, జాతీయతల గురించి చర్చించేటప్పుడు కూడా వాళ్ల వాదనలలో రాజ్యాంగ సూత్రాలయిన సమానత్వ, సహోదరత్వ భావాల పట్ల విశ్వాసలేమితో నిండి ఉంటాయి. దేశభక్తి, జాతీయతలు ఎన్నటికీ మత సంబంధిత విలువలు కాదు అన్న వాస్తవాన్ని ఆర్ఎస్ఎస్ ఎన్నటికీ అర్ధం చేసుకోజాలదు.
ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే భారత జాతీయత అనేది అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యే వరకు అసలైన నిర్వచనం సంతరించుకోవడానికి ఎదురు చూస్తా ఉన్నదని భావించడం. రాముడు జన్మించాడని భావించే చోట గుడికడితే తప్ప భారతజాతి రాజ్య భావనకు రూపు కట్టలేం అని భావించడం అంటే ఆ పార్టీకి, సంస్థకి దేశభక్తి- రాజకీయాలతో పాటు మతం గురించి కూడా అవగాహన శూన్యం అని భావించాల్సి వస్తుంది.
కాసేపు 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదనే అనుకుందాం. రాముడికి గుడి కట్టించేస్తే దేశానికి సార్వభౌమాధికారం లభించినట్లు సంబరం చేసుకోవచ్చా? ఆర్ఎస్ఎస్ దృష్టిలో వలస పాలన అంతం కావడమా లేక గుడి నిర్మాణమా ఏది అసలైన స్వాతంత్య్ర విధానానికి తార్కాణం. ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఆర్ఎస్ఎస్, బీజేపీలు భారత స్వాతంత్య్రోద్యమాన్ని, దేశ భవిష్య నిర్మాణం కోసం తమ అసువులు తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్య్రోద్యమ వీరులని ఎంతలా అవమానిస్తున్నాయో తేటతెల్లం అవుతుంది.
జాతీయతను, దేశభక్తిని మతంతో ముడిపెట్టిన భాష ‘ఐసీస్’, ‘బోకో హరమ్’ వంటి సంస్థలు మాట్లాడతాయి. మత ప్రాతిపదికన ఈ దేశాన్ని రెండుగా విభజించాలని కోరిన జిన్నా మతత్వ ధోరణులను ఆర్ఎస్ఎస్ చీఫ్ సమర్ధిస్తున్నాడా? అలాగే సిక్కు ఛాందసవాదులు ఖలిస్థాన్ ఏర్పాటు కోసం చేసున్న డిమాండ్లు న్యాయమైనవని మోహన్ భాగవత్ సమర్థిస్తున్నాడా? మతమే అన్నిటికీ ప్రాతిపదిక అయితే నాస్తికులకు దేశమే లేకుండా పోతుందా? హిందూ మతం నుండి బౌద్ధమతంలోకి మారినంత మాత్రాన బీఆర్ అంబేద్కర్ భారతీయుడు కాకుండా పోతారా? రామమందిరం నిర్మించిన మోడీ కన్నా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ఏళ్ల తరబడి కారాగారవాస శిక్ష అనుభవించిన నెహ్రు ఆత్మనిర్భరత ఏ రకంగా తక్కువ అవుతుంది? హిందూ మతం పట్ల విశ్వాసం లేని వాళ్లు, రాముడిని కొలవని వాళ్లు నిండారా భారతీయ చైతన్యం లేని వాళ్లని మోహన్ భాగవత్ భావిస్తున్నారా? అలా చెప్పబడడం అంటే ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు తదితర హైందవేతరులకు ఈ గడ్డ మీద స్థానం లేదన్న సావర్కర్ సిద్ధాంతాన్నే మరో విధంగా చెప్పడం కాదా?
జాతీయతాభావం అంటే రాజ్యాంగ స్ఫూర్తితో నిండి ఉండడం అని కాకుండా మోహన్ భాగవత్ చెప్పినట్టు బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతోనే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందని అభివర్ణించడమే అయితే అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణమైన జాతీయతను ఈ దేశం మీద రుద్దడానికి చేస్తున్న దుర్మార్గమైన ప్రణాళిక అనేదానికి తిరుగులేని సాక్ష్యం కాదా?
2024 జనవరి 22న ఇంకా నిర్మాణం పూర్తికాని భవ్య మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తలపెట్టడం వెనుక రాజకీయ, మతపరమైన దురుద్దేశాలు ఉన్నాయని, రానున్న పార్లమెంటు ఎన్నికలలో లబ్ధిపొందాలనే దృష్టితోనే హడావుడిగా మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమం తలకెత్తుకుందన్న విమర్శలకు తోడు రాజ్యాంగాన్ని మార్చాలనే ఆర్ఎస్ఎస్ రహస్య అజెండా అమలులో భాగంగా ఈ అంశాన్ని తేలికగా తీసిపారేసే పరిస్థితి లేదు కదా?
తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని 240 సీట్లకే పరిమితం చేసి పార్లమెంటులో మెజార్టీ కోల్పోయేలా విజయం సాధించిన ప్రతిపక్షాలు ఇనుమడించిన బలంతో ఈ అంశం మీద రగడ సృష్టించడంతో బీజేపీ రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటించేలా ఒత్తిడి తీసుకురాగలిగాయి. అయితే భాగవత్ తాజా వాఖ్యలతో రాజ్యాంగపరమైన మన ప్రజాస్వామిక సమాజాన్ని ఆర్ఎస్ఎస్ మతరాజ్యంగా మార్చాలని చూస్తున్నదా అన్న ప్రశ్న తలెత్తింది. స్వాతంత్య్ర దినోత్సవ పవిత్రతను ఉపేక్షించడం అంటే దేశద్రోహ నేరానికి పాల్పడడమే అన్న రాహుల్ గాంధీ అన్న మాటలలో అక్షరం కూడా పొరబాటు లేదు. అదే వేరే దేశంలో ఇలా జరిగి ఉంటే ఈ పాటికి భాగవత్ విచారణ ఎదుర్కొంటూ ఉండేవాడు.
దేశంలోని ప్రతి భారతీయుడు స్వాతంత్రోద్యమ ఘన వారసత్వానికి వారసుడే. భగత్‌సింగ్ నుండి మహాత్మాగాంధీ వరకు మన స్వాతంత్య్ర ఉద్యమ పోరాట యోధులను ప్రతి పౌరుడూ గర్వకారణంగా భావించాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో ఉన్న ఈ చైతన్యం మూలంగానే రాములోరికి గుడి లేకపోవడాన్ని లోటుగా ఏనాడూ భావించలేదు. నిజానికి దేశంలో వేలు, లక్షల సంఖ్యలో రామాలయాలు ఉన్నాయి. ఆ ఆరుదశాబ్దాల కాలంలో ప్రజల హక్కులు, సాధికారత, సమానత్వం, సమన్యాయం ఈ విలువలే స్వేచ్ఛా దేశానికి ప్రతీకగా నిలిచాయి. తప్ప మతాధిపత్యానికి, మత వివక్షకు ఏనాడు తావియ్యలేదు. పేదరికాన్ని నిర్మూలించాలి అనేది ప్రభుత్వాల ఉదాత్త లక్ష్యంగా నిలిచింది. తప్ప మందిరాన్ని నిర్మించాలి అన్నది ఏనాడూ లక్ష్యంగా లేదు. రాముడు జన్మించాడని భావించిన చోట గుడి కట్టకపోవడం మూలంగా భారత జాతీయతలో లోటుగా మిగిలి పోయిందనే మితవాద సిద్ధాంతకర్తలు ఏనాడన్నా జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తిన ఒక్క ఉదాహరణనైనా మోహన్ భాగవత్ చూపించగలరా? కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా అసలు సిసలు భారతీయుడిని రూపుదిద్దుకోవడమే సమున్నత లక్ష్యంగా మనముందున్నది ఇప్పుడు కూడా మోడీ ముందు భారతీయుడిని అనాల్సి వచ్చిందే తప్ప ముందు హిందువని అనలేదు. కాబట్టి భారతీయ అస్థిత్వాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించిన మోహన్ భాగవత్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించడం తప్పేంకాదు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్న వ్యాఖ్యలపై బీజేపీ తన వైఖరి ఏమిటో స్పష్టం చెయ్యకుండా ఈరోజు ప్రతిపక్షపార్టీలు చేస్తున్న పోరాటం ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదు రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అన్న వ్యాఖ్యలను పట్టుకుని యాగీ చెయ్యాలని చూస్తున్నాయి. రాహుల్ గాంధీ ఈ మాట కొత్తగా ఇవాళ అనడం కాదు. 2019 నుండి ఇదే మాట చెబుతూ వస్తున్నాడు. మోడీ ప్రభుత్వం రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రజాస్వామిక సంస్థలను కబళించేసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడం అంటే, అసమానపోరాటమే అని ఏనాడో స్పష్టం చేశారు. ఏకపక్షంగా మారిన పోలీసు యంత్రాంగం, ఈడీ, సీబీఐ, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియాలతో ప్రతిపక్ష పార్టీలు వీరాజవలసి వస్తుందని రాహుల్ గాంధీ లెక్కలేనన్ని సార్లు ప్రకటించాడు. భారతదేశానికి, భారత రాజ్యానికి మధ్య ఉన్న భేదాన్ని బీజేపీ కావాలనే విస్మరించి కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ అని చిత్రీకరించడానికి హాస్యాస్పదమైన ప్రయత్నాలు చేస్తున్నది.
ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో బీజేపీ చేసిన పోరాటంగా భావిస్తుందా? రాజ్యాధికారానికి వ్యతిరేకంగా మారడడం ప్రజల ప్రాథమిక హక్కు దానికీ, దేశానికి సంబంధం లేదు. కానీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని, దేశ స్వాతంత్య్రాన్ని తులనాడడం మాత్రం ఖచ్చితంగా దేశద్రోహమే.
సంజయ్ కె.ఝా
అనువాదం: కే సత్యరంజన్