ఈ మధ్య కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో చేసే బడ్జెట్ ప్రసంగంలో వరుసగా రెండో ఏడు ఉపాధి హామీ చట్టం గురించి మాటవరుసకైనా ప్రస్తావించలేదు. కోవిడ్ సమయంలో ఉపాధి హమీ చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అనీ, లాక్డౌన్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ చట్టం ద్వారా పనులు కల్పించేందుకు ఎన్ని నిధులు కావాలన్నా కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి హామీ ఇచ్చిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఉపాధి హామీ చట్టం పట్ల బిజెపి వ్యతిరేకత కొత్తేమీ కాదు. మరీముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి చంపేందుకు సిద్ధమంటూ సాక్షాత్తూ లోక్సభ సాక్షిగా చేసిన ప్రసంగాలు పార్లమెంట్ రికార్డుల్లో ఉండనే ఉన్నాయి.
2024లో మూడోసారి అధికారినికి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి కేవలం 86000 కోట్లు మాత్రమే కేటాయించారు. అదే మొత్తాన్ని సవరించిన అంచనాల్లో కూడా చూపించారు. 2025`26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ మొత్తానికి అదనంగా ఒక్క పైసా విదిలించటానికి కూడా బిజెపి ప్రభుత్వానికి మనసొప్పలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరుద్యోగం తీవ్రత పెచ్చరిల్లుతున్న తరుణంలో, ప్రకృతి వైపరీత్యాలతో సేద్యంలో పనులు తగ్గిపోతున్నతరుణంలో ఉపాధి హామీ చట్టం ఇచ్చిన హామీతోనైనా అంతో ఇంతో పొట్టపోసుకుంటున్న కోట్లాదిమంది గ్రామీణ పేదలు, వ్యవసాయకార్మికులకు ఈ అత్తెసరు కేటాయింపులు ఉపశమనం కలిగించలేవు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కదలిక తీసుకురాలేవు.
ఇప్పటికే డిజిటల్ లింకేజి సమస్యలు, ఆధార్, ఉపాధి హామీ కార్డు, ఫోన్ నంబర్ లింకేజిల్లో తలెత్తే సాఫ్ట్వేర్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేకపోవటంతో ఉపాధి హామీ చట్టం కింద పని చేసిన కోట్లాదిమంది వ్యవసాయకూలీలకు సకాలంలో వేతనాలు రావటం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దగా చేసిన ప్రయత్నం ఏమీ లేదు.
మరోవైపు 2023`24 సంవత్సరానికి గాను లోక్సభలో పార్లమెంటరీ స్థాయీ సంఘం గ్రామీణ ఉపాధికి సంబంధించి ప్రవేశపెట్టిన నివేదికలో నానాటికీ ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు తగ్గిపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను లోతుగా పరిశీలించాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదిక తర్వాత ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లల్లో మాటమాత్రమైన ప్రస్తావించకపోవటం విచిత్రం మాత్రమే కాదు. ఈ పథకం పట్ల ప్రభుత్వ అవగాహన, వైఖరి, గ్రామీణ పేదల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని వెల్లడిస్తోంది.