మధ్య తరగతి ప్రజానికాన్ని సంప్రదాయంగా ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా భావిస్తారు. అయితే ఈరోజు అదే మధ్య తరగతి వర్గం ఒక మోస్తరు వినియోగాన్ని నిలబెట్టుకోవడానికే పెనుగులాడుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ఏమో స్థూలజాతీయోత్పత్తి శాతాలు, భారతీయ శతకోటీశ్వరుల పెరుగుతున్న బ్యాంకులను ఘన విజయాలుగా సంబరంగా ప్రకటించుకుంటుంది. మరో పక్కన భారతదేశ మధ్య తరగతి ప్రజానికానికి అవకాశాల్లో ఎదుగుదల లేక అసమానతల భారం కింద నలిగిపోతూ పేలవమైన స్థితిలో ఉన్నారు. మోడీ సర్కారు ఆర్థిక పనితీరు పట్ల ఇది తీవ్ర అభిశంసనగా పరిగణించవచ్చు.
ప్రజానికంలో తీవ్రమైన అంతరాలు..
భారతదేశ మధ్య తరగతి ప్రజానికంలో కూడా అనేక తీవ్రమైన అంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ వీరు రెక్కాడితేగానీ డొక్క నిండని జనాభా అయితే కాదు. అంతో ఇంతో పొదుపుగా ఖర్చు చేసే సామాజిక తరగతికి చెందినవారే వీరంతా. జీవితం సజావుగా గడపడానికి అయ్యే ఖర్చుల లెక్క చూస్తే ఏ కోశానా వీళ్లు ధనవంతులు అనుకోవడానికి వీలు ఉండదు.
గణాంకాలను పరిశీలన..
ఆర్థిక వాస్తవాలు ఆందోళనకర పరిస్థితులను దృశ్యమానం చేస్తున్నాయి. ఆదాయపన్ను విభాగం గణాంకాలను పరిశీలిస్తే 2011- 2 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన వారిలో ఏడాదికి 10లక్షల నుండి 1 కోటి రూపాయల ఆదాయం ఉన్నవారు 3.7 శాతంగా ఉన్నారు. 2022-23 నాటికి ఈ సంఖ్య నాలుగింతలు పెరిగి 16.2 శాతానికి చేరుకుంది. మొత్తం ఆదాయ పన్ను రాబడిలో వీళ్లు మూడోవంతు మొత్తం పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ లెక్కలు చూస్తే మధ్య తరగతి జనాభా గొప్ప సంపాదనపతులు అయినట్లు అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే వాళ్లు మధ్య తరగతి హోదాను నిలబెట్టుకోవడానికి అవసరమైన జీవనశైలి వ్యయం విపరీతంగా పెరిగిపోయి వీళ్ల ఆర్థిక స్థిరత్వం కదలబారి పోతున్నది.
2023-24 సంవత్సరానికి గాను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నిర్వహించిన గృహ వినియోగ వ్యయ సర్వే నివేదిక వివరాలు పరిశీలిస్తే ఈ తరగతి కుటుంబాల వ్యయంలో 65 శాతం నిత్య జీవితాలవసరాలు అయిన ఆహారం, ఇంటి అద్దె, విద్య, వైద్యాలకే ఖర్చయిపోతున్నట్లు స్పష్టం అవతున్నది. వీళ్ల దగ్గర పొదుపు చెయ్యడానికి, పెట్టుబడులు పెట్టబడానికి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో వాళ్ల రిజర్వు నిధులు క్రమంగా తరిగిపోతున్నాయి. అలాగే మార్చి 2024 నాటికీ భారతదేశంలో కుటుంబ రుణాలు నామ మాత్రపు స్థూల జాతీయోత్పత్తిలో 17.4 శాతానికి చేరుకున్నాయి. అంతకు క్రితం ఏడాదిలో ఇది 14.8 శాతంగా మాత్రమే ఉన్నది. ఇది ఆందోళనకరమైన పరిణామం.
ఆర్థికవ్యవస్థ స్థిరత్వానికి ప్రమాదకరం..
కుటుంబ రుణాలు పెరిగిపోవడం, నిజ వేతనాలు స్థంబించిపోవడం, జీవన వ్యయం పెరిగి పోవడం ఇవన్నీ ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రమాణాన్నే కాదు మొత్తం దేశ ఆర్థికవ్యవస్థ స్థిరత్వానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
దీనికి తోడు రిటైల్ రంగ ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి నిత్యావసరాల ధరల పెరుగుదల మధ్య తరగతి కుటుంబాల మీద మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నది. 2024 అక్టోబరు నెలలో ఆహార, పానియాల ధరల్లో అత్యధికంగా 9.7 శాతం ద్రవ్యోల్బణం నెలకొన్నది.
కూరగాయల ధరలు గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా 42 శాతం పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీసింది. తృణధాన్యాలు, పప్పుల ధరలు కొన్ని నెలలపాటు స్థిరంగా 9-10 శాతం పెరిగి కూర్చున్నాయి. ఆఖరుకి పాల ధరలు కూడా 4.6 నుంచి 6.3 శాతం పెరిగాయి.
తరిగిపోతున్న జనం సొమ్ము..
గుడ్డిలో మెల్ల ఏంటంటే గృహవసతి ద్రవ్యోల్బణం ఒక మోస్తరుగా 2.7 నుంచి 3.6 శాతానికి, వైద్యఖర్చులు 4 నుండి 5.5 శాతం పెరుగుదలకే పరిమితం అయ్యాయి. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం మూలంగా జనం చేతిలో సొమ్ము క్రమేపీ తరిగిపోతున్నది. నిజవేతనాలు పెరగకుండా ఈ ఒత్తిడులు అన్నీ తట్టుకుని మధ్య తరగతి జీవనం సాగించడం సవాలుగా మారింది.
క్రింద పొందుపరిచిన గ్రాఫ్ ఆందోళనకర ధోరణులను ప్రతిఫలిస్తున్నాయి. దేశంలోని పట్టణ ప్రాంతాలలో నిజవేతనాలు తగ్గిపోతున్నాయి. తొలిసారిగా గత సంవత్సరంలో కోవిడ్ కాలం నాటి నిజవేతనాల స్థాయి కన్నా కిందికి పడిపోయాయి. ఒక పక్కన ద్రవ్యోల్బణం పెరుగుదల, మరో పక్కన దిగజారిపోతున్న నిజవేతనాలు వినియోగదారుల విశ్వాసాన్ని గణనీయంగా దెబ్బతీశాయి.
కుటుంబ బడ్జెట్లో నిత్యావసర సరుకులు సేవలకు సింహభాగం ఖర్చయి పోవడంతో ప్రజల దగ్గర మిగులు సొమ్ము నానాటికీ కృశించి పోతున్నది. అవసరం అయినవి కొనడానికి ఆలోచించాల్సి వస్తున్నది. ఇక పొదుపు సంగతి సరేసరి వేతనాల మీద పడుతున్న తిరోన్ముఖ ఒత్తిడి మూలంగాను, ఆహారం, వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణం మూలంగా పెరిగిపోవడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నారు మధ్యతరగతి ప్రజానీకం. సంప్రదాయకంగా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ఉంటున్న మధ్యతరగతి జనాభా ఒక మోస్తరు వినియోగం నిలబెట్టుకోవడానికి పెనుగులాడుతున్న నేపథ్యంలో వేతన స్థంభన సమస్యను తక్షణమే పరిష్కరించే విధానాలను ఎంచుకుని వారిలో ఆర్థిక విశ్వాసం కల్పించాలి.
అయితే భారతీయ మధ్యతరగతి జనాభా మతాభినివేశం, కుహనాదేశభక్తి, తాత్కాలిక ఆర్థిక ప్రోత్సాహకాల జడిలో మునిగిపోయి ఆర్థిక సవాళ్లను పట్టించుకునే సోయిలో లేకుండా ఉన్నారు. దీర్ఘకాలిక స్థిరత్వానికి బదులుగా ఈ తాత్కాలిక ప్రయోజనాల పట్ల ఏర్పడ్డ అనురక్తియే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాయి.
గమనిక : వార్షిక ఆదాయం 12 లక్షలకు లోపు ఉన్న వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ఉపన్యాసం లో చెప్పారు. ఈ వ్యాసం ఆర్థిక మంత్రి ప్రకటన రాక ముందు రాసిన వ్యాసం
– దీపాంశు మోహన్, అంకుర్ సింగ్
అనువాదం: కే సత్యరంజన్