హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సాహిత్య కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా రెండో రోజు కావ్యధార వేదికగా శ్రీనివాస రాయప్రోలు కవిత్వ పురస్కార ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రాయప్రోలు లిటరరీ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ సారి రాయప్రోలు కవిత్వ పురస్కారం భారతీయ ఆంగ్ల కవి, రచయిత అజయ్ కుమార్‌ను వరించింది. కావ్యధార వేదిక మీద విజేత అజయ్ కుమార్‌ను కార్యనిర్వాహకులు సత్కరించారు. ట్రస్ట్ మెంబర్ ప్రొఫెసర్ అపర్ణ రాయప్రోలు, వారి సోదరి మనోరమ చేతుల మీదుగా అజయ్‌కుమార్ పురస్కారం అందుకున్నారు.
శ్రీనివాస రాయప్రోలు పోయెట్రీ ప్రైజ్‌కు మొత్తం 66 ఎంట్రీలు వచ్చాయి. అందులో నుంచి అజయ్ కుమార్‌ను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. జ్యూరీ మెంబర్ మేన్కాతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, మరో ఇద్దరు జ్యూరీ సభ్యులు కలిసి అజయ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ పురస్కారానికి షార్ట్‌లిస్ట్ అయిన నీతూ కృష్ణన్, నిఖితా పరీక్, అపర్ణ చీవుకులను జ్యూరీ సభ్యులు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
‘‘లోతైన భావవ్యక్తీకరణ, శక్తివంతమైన చిత్రాలతో బహుళ-పొరలతో కూడిన నైపుణ్యం, కవిత్వం కోసం అజయ్‌ని విజేతగా నిలిపింది’’ అని జ్యూరీ సభ్యులు అన్నారు. పురస్కార ప్రధానం తర్వాత విజేతతో పాటు జ్యూరీ సభ్యులు తమ కవితలను చదివారు.
పురస్కార గ్రహిత అజయ్ నేపథ్యం..
అజయ్ కుమార్ తమిళనాడులోని చెన్నైకి చెందిన కవి. ఈ-చాప్బుక్, , 2023లో యవనికా ప్రెస్ అవార్డు పొందిన ‘బ్యాలెన్సింగ్ యాక్ట్స్’, ది బాంబే లిటరరీ మ్యాగజైన్, రాటిల్, ది బాంబే రివ్యూ, ఉసావా, ASAP ఆర్ట్, గుల్మోహర్, ది అలీపూర్ పోస్ట్, నెదర్, ది బెంగుళూరు రివ్యూ, మ్యూజ్ ఇండియా, ది చక్కర్, ది ఇయర్‌బుక్ ఆఫ్ ఇండియన్ పొయెట్రీ లాంటి పత్రికల్లో అతని కవితలు ప్రచురితమయ్యాయి. ప్రతి ఏడాదిబెంగళూరు వేదికగా ఇచ్చే ప్రతిష్టాత్మక Toto Funds the Art Creative writing Awardకు 2023లో అజయ్ లాంగ్ లిస్ట్ అయ్యారు. ప్రస్తుతం అజయ్‌కుమార్ తన తోలి కవితా సంపుటిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
శ్రీనివాస్ రాయప్రోల్ కవితా పురస్కారం..
భారతదేశంలోని సృజనాత్మక రచనలను, ముఖ్యంగా శ్రేష్టమైన కవిత్వాన్ని గుర్తించి శ్రీనివాస్ రాయప్రోలు కవితా పురస్కారాన్ని ఇస్తుంటారు. దేశంలో ఈ పురస్కారం ఎంతో ప్రతిష్టాత్మక అవార్డుగా గుర్తింపు పొందింది. ఈ అవార్డును 20-40 సంవత్సరాల వయస్సు గల కవులకు ఇస్తుంటారు. కవులు తమ ఆంగ్ల కవిత్వంలో చూపించిన నైపుణ్యాన్ని గుర్తించడానికి ఈ పురస్కారాన్ని ఏర్పాటుచేశారు. దీనిని హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రాయప్రోలు లిటరరీ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంటుంది. ప్రశంసాపత్రంతో పాటు నగదు రూ.15,000ను పురస్కారం కింద విజేతకి అందిస్తారు. ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది హైదరాబాద్ లిటరేరి ఫెస్టివల్లో ప్రధానం చేస్తారు.
ఇప్పటి వరకు పురస్కార గ్రహితలు..
ప్రతిభ కల కవులను గుర్తించి ఇస్తున్నటువంటి శ్రీనివాస్ రాయప్రోలు కవితా పురస్కారం 2009 నుంచి ప్రారంభమైంది. మొదటి బహుమతి 2009లో అదితి మచాడోకు అందించారు. ఆ తర్వాత హేమంత్ మోహపాత్ర (2010), అదితి రావ్ (2011), తుషార్ జైన్ (2012), మిహిర్ వత్స (2013), రంజనీ మురళి (2014), ఐశ్వర్య ఐయర్ (2015), గోయిరిక్ బ్రహ్మచారి (2016), దేబర్షి మిత్ర (2017), పూర్ణ స్వామి (2018), ప్రశాంత్ పర్వతనేని (2019), సత్య దాష్ (2020), పెర్విన్ సాకేత్ (2021), శ్యామ్ సుధాకర్ (2022), నికితా దేశ్‌పాండే (2023) ఇలా పలువురు పురస్కార గ్రహితలుగా నిలిచారు.
ప్రముఖ కవులు జీత్ తాయిల్, సుదీప్ సేన్, కేకి దారువాలా, అరుంధతీ సుబ్రమణియన్, మనోహర్ శెట్టి, అరవింద్ కృష్ణ మెహ్రోత్రా, రంజిత్ హోస్కోటే, ఇవీ రామకఅష్ణన్, గివ్ పటేల్, మమంగ్ దై, వినయ్ ధార్వాడ్కర్, మణి రావు, శ్రీదల స్వామి గతంలో పురస్కారానికి సంబంధించిన జ్యూరీ సభ్యులుగా ఉన్నారు.