![images (1)](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/images-1-1.jpeg)
మెక్సికో, కెనడాల నుండి అమెరికాకు వచ్చే దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయా దేశాల నుండి అక్రమ వలసల మొదలు ఆయా దేశాలతో అమెరికాకు ఉన్న అనేక వివాదాలు సమస్యల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో అమెరికా, మెక్సికో, కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో తమకు అనుకూలమైన సవరణల కోసం అమెరికా పట్టుబడుతోంది. దీంట్లో భాగంగా భాగస్వామ్య దేశాలపైన సుంకాలు విధించనుంది.
అదనపు దిగుమతి సుంకాల వెనక ఉన్న రాజకీయ కోణాలు అవసరాలు ఎలా ఉన్నా వీటివలన వినియోగదారులపై ధరాభారం పెరుగుతుందన్నది వాస్తవం.
ధరలలో మార్పులు..
ఉదాహరణకి కెనడా నుండి దిగుమతి అయ్యే ముడిచమురు ధర ప్రస్తుతం బారెల్ కు 62 డాలర్లుగా ఉంటే ట్రంప్ విధానాల వలన అది 77 డాలర్లకి పెరిగే ప్రమాదం ఉన్నది. ఆమేరకు ప్రస్తుతం అమెరికా ప్రజలు పాతిక శాతం
అదనంగా చమురు, గ్యాస్ ధరలు చెల్లించాల్సి వస్తుంది. వేర్వేరు రాష్ట్రాల్లో ఈ భారం వేర్వేరుగా ఉంటుంది.
అమెరికా దిగుమతి చేసుకుంటున్న చమురు నిల్వల్లో 52 శాతం ఉంది. అందులో మెక్సికో నుండి 11 శాతం ముడిచమురు దిగుమతి అవుతుంది. అటువంటపుడు ఈ దిగుమతులపై అదనపు సుంకాలు విధిస్తే ఆర్థిక రంగంలోని అన్ని విభాగాలపైనా ప్రతికూల ప్రభావం ఉండనున్నది. ఇప్పటికే ఆర్థికాభివృద్ధిలో మందగమనం ఎదుర్కొంటున్న అమెరికా ఈ చర్యలతో మరింత కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ట్రంప్ విధానాల ప్రతికూల ప్రభావం..
మరోవైపున కెనడా మెక్సికోల నుండి దిగుమతి అయ్యే వినిమయ సరుకుల మీద అమెరికా వాసులు ఏటా 900 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారుల మీద కూడా ట్రంప్ విధానాలు ప్రతికూల ప్రభావం చూపనున్నాయి.
దీర్ఘ కాలంగా కెనడా నుండి దిగుమతి అయ్యే ముడిచమురును శుద్ది చేసి పెట్రోలియం ఉత్పత్తుల్లోకి మార్చడానికి వీలుగా అమెరికా పెట్రోలియం పరిశ్రమ మారింది. అమెరికాలో ఉత్పత్తి అయ్యే షేల్ చమురు తేలికపాటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కెనడాలో ఉత్పత్తి అయ్యే ముడిచమురు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఈ చమురు శుద్ధి చేయటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పటికిప్పుడు చమురు శుద్ధి పరిజ్ఞానాన్ని షేల్ గ్యాస్ కి అనుగుణంగా మార్చుకోవాలన్నా సమయంతో పాటు పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, పెట్టుబడులు అవసరం అవుతాయి.
అదనంగా వెనిజులా నుండి దిగుమతి అయ్యే చమురు కూడా తిరస్కరించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు నిల్వలతో చెలగాటం ఆర్థిక వ్యవస్థకు అంత క్షేమదాయకం కాదన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతుంది.