రెండు తెలుగు రాష్ట్రాలలో అందరూ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇచ్చిన హామీలతో రానున్న పెట్టుబడుల లెక్కల్లో మునిగితేలుతుండగా, హఠాత్తుగా వైఎస్ ఆర్ సిపి కి విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నట్టుగా ఎక్స్ లో చేసిన పోస్టుతో ఒక్కసారిగా యావత్ మీడియా ఉలిక్కిపడింది. ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయం గురించి ఎలెక్ట్రానిక్ మీడియాలో గంటలకు గంటలు చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు ఇది ఈ మధ్యకాలంలో జరిగిన కీలక పరిణామం అనటం లో సందేహం లేదు.
2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాలయ్యాక వైఎస్ ఆర్ సిపి కి కష్టాలు మొదలయ్యాయి. జగన్ పాలనలో ఆయన అనుయాయులు టిడిపి, జనసేన నాయకులపై విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అసభ్య పదజాలం ప్రయోగించటంతో ఎన్డీయే ప్రభుత్వం అనేకమందిపైన పోలీస్ కేసులు నమోదు చేసింది. వారిలో అనేకమంది కటకటాల పాలయ్యారు. దానితో వైఎస్ ఆర్ పార్టీ శ్రేణులు కకావికలయ్యాయి. సోషల్ మీడియా లో జరిగే చర్చలను నియంత్రించానుకొండంలో జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య తేడా లేదని ఈ కేసులు రుజువు చేస్తున్నాయి.
ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఎదురయ్యాక వైఎస్ ఆర్ సిపి కార్యకర్తలకే కాకుండా నాయకులకు కూడా తమ పార్టీ భవితపైన సందేహాలు నెలకొన్నాయి. దీనితో అనేకమంది నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు వంటి నేతలు వైఎస్ ఆర్ సీపీకి రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు వంటి రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వంతోపాటు వైసీపీకి రాజీనామా చేశారు.
రాజశేఖర రెడ్డి పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై నమోదైన అనేక కేసుల్లో జగన్ ఏ-1 అయితే విజయసాయి ఏ-2. వేలకువేల కోట్ల అవినీతి కేసుల్లో ఇద్దరూ ఒకరికొకరుగా ఉన్నారు. 2014-2019మధ్య కాలంలో బీజెపీ కూటమి నుంచి టిడిపి బయటకు వచ్చేలా చేయటం మొదలు, జగన్ ని మో – షాలకు దగ్గరయ్యేలా చూడటంలోను, ఆ తరువాత 2019లో వైఎస్ ఆర్ సిపి ఊహాతీత స్థాయిలో గెలవటంలోను విజయసాయి రెడ్డి పాత్ర గురించిన చర్చోపర్చలు ఉండనే ఉన్నాయి.
అందువల్లనే విజయసాయి రెడ్డి రాజీనామా పై రాజీనామాలన్నింటికంటే ప్రత్యేకమైంది. వాటితో పోల్చదగినది కాదు. ఈ మధ్యకాలం వరకూ జగన్, విజయసాయి అవిభక్త కవలలవంటి వారని అందరూ భావించారు. అయితే విజయసాయి రాజకీయ నుదిటిపై జగన్ రాసిన రాతతో పరిస్థితి తారుమారైంది. 2024 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగావున్న విజయసాయి రెడ్డిని ఆ పదవి నుంచి జగన్ తప్పించాడు. ఆ తరువాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఆయన నెల్లూరు నుంచి ఎంపిగా పోటీచేసి ఓడిపోయాడు. తన ఎన్నికల ప్రచారానికి జగన్ ఆర్థిక సహకారం అందించలేదనే వార్త ప్రచారంలోవుంది.
పార్లమెంట్ లో వైఎస్ ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగావున్న విజయసాయిని పీకిపడేసి ఆ స్థానంలో జగన్ తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని నియమించాడు.
విజయసాయిని రాజ్యసభ నాయకత్వానికి మాత్రమే పరిమితం చేశాడు జగన్.
తాను నంబర్ 2గా వున్న పార్టీలో విలువ తగ్గి, అధినాయకుడి ఆదరణ కరువైన స్థితిలో విజయసాయి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడ్డాడు. తగిన సమయం కోసం వేచిచూచి, జగన్ లండన్ పర్యటనలో ఉండగా శుక్రవారంనాడు తన రాజీనామా కు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ లో పోస్టు చేశాడు. తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, పార్టీతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు ఆ పోస్టులో ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలతో విజయసాయి వ్యవహారం గురించి చర్చలు జరుగుతున్నాయి. విజయసాయి అల్లుడి అన్న సారధ్యంలోని అరవింద ఫార్మా కంపెనీ కాకినాడ పోర్టును కబళించిన తీరు మాఫియా గ్యాంగులను తలపించిందన్న ప్రచారం ఉంది. అధికారం పోవటంతో మరోమార్గంలేక కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర సిఐడి విచారణలను ఎదుర్కోవలసి రావటంతో తాము కొట్టేసిన వాటాలను తిరిగి బదిలీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ కేసులో విజయసాయి, తన అల్లుడి అన్న నేత్రుత్వంలోని అరబిందో, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రమ్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా ఉండగా, జగన్ సూత్రధారిగా ఉన్నాడు.
మరోవైపు విజయసాయికి, బీజేపీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం జగమెరిగిన సత్యం. తాను ఒకప్పుడు ఆర్ ఎస్ ఎస్ లో ఉన్నానని కూడా చెప్పుకుంటుంటాడు. విజయసాయి రాజకీయాల నుంచి విరమించుకోవటం వెనక బీజేపీ పాత్ర ఎంత అన్నదానిపై రాష్ట్ర రాజకీయాల్లో సమీప భవిష్యత్తు లో మార్పులు ఆధారపడి ఉంటాయి. జగన్ పాలనలో టిడిపి ని బలహీనపరిచి, దాని స్థానాన్ని ఆక్రమించటానికి విఫల యత్నం చేసిన బీజేపీ వర్తమానంలో జగన్ పార్టీ స్థానాన్ని ఆక్రమించటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేస్తున్నట్టుగావుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ ప్రయత్నంలో భాగం అయ్యాడు. హిందుత్వ భావజాలాన్ని బీజేపీ కంటే ఎక్కువగా తానే మోస్తున్నాడు. అంతేకాకుండా పవన్ సోదరుడైన చిరంజీవి సేవలను కూడా ఈ ప్రయత్నంలో ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది.
అంతిమంగా చెప్పాలంటే వైఎస్ ఆర్ సిపి నుంచి విజయసాయి రెడ్డి నిష్క్రమణ ఆ పార్టీ క్షీణతను వేగవంతం చేస్తుంది. పార్టీలోని అంతర్గత సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది బీజేపీ పరోక్ష డైరెక్షన్ లో సాగుతున్ననాటకం అన్న వాదనలూ వినవస్తున్నాయి. ఈ నాటకానికి ముగింపు బహుశా బీజేపీ చేతుల్లో కూడా ఉంటుందా లేదా అన్నది కాలం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.