టీటీడీ చైర్మన్ ను క్షమాపణలు కోరడం ద్వారా తిరుపతి తొక్కిసలాట ఆరోపణను పవన్ కల్యాణ్ టీడీపీ పైకి విజయవంతంగా నెట్టేశారు.
న్యూఢిల్లీ : తిరుపతిలో జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పాలక ఎన్ డీ ఏ కూటమిలో ఉన్న తెలుగు దేశం, జనసేనల మధ్య విభేదాలకు దారితీసింది.
తెలుగు దేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడుగా, ఈ తొక్కిసలాటకు అసలు మూలకారణం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టోకెన్ల విధానాన్ని ప్రవేశ పెట్టడమేనని ఆరోపించారు.
దీనికి విరుద్ధంగా డెప్యూటీ చీఫ్ మినిష్టర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పాత్రికేయ సమావేశం పెట్టి, ‘హిందువులందరికి’ ఆత్మరక్షణ భావనతో క్షమాపణ చెప్పారు.
అనేక మంది అధికారులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. బైరాగి పట్టెడ ప్రాంతంలో భక్తుల రద్దీని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్న డీఎస్ పీ రమణ కుమార్ ను, టీటీడీ గోసంరక్షణశాల డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డిను సస్పెండ్ చేశారు.
టోకెన్ల కౌంటర్ పెట్టే ప్రాంతాన్ని నిర్ణయించినందుకు హరనాథ్ రెడ్డిని బాధ్యుడిగా భావించారు. తిరుపతి పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడును, టీటీడీ లో విద్య, ఆరోగ్య శాఖ బాధ్యతల్లో ఉన్న జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.గౌతమ్ ను, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్. శ్రీధర్ ను బదిలీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు పాతిక లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా, కాంట్రాక్ట్ పద్దతిలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ, ఈ తొక్కిసలాటపై జుడిషియరి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
తిరుమల లడ్డు వివాదానికి-తొక్కిసలాటకు ముడివేసిన చంద్రబాబు
పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడే స్వచ్ఛమైన నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని 2024 సెప్టెంబర్ లో చెలరేగిన వివాదానికి గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపైన తెలుగు దేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి.
ఆరోపణలకు తగిన ఆధారాలు లేకపోవడంతో, సినిమా నటుడు కూడా అయిన పవన్ కల్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించి, పదకొండు రోజుల దీక్ష చేపట్టారు. ‘కుహనా లౌకికవాది’ అయిన జగన్ మోహన్ రెడ్డి సనాతన ధర్మాన్నిదెబ్బతీయడానికి ఈ కుట్ర చేశారంటూ ఈసందర్భంగా ఆయన విమర్శించారు.
ఈ తొక్కిసలాటను లడ్డూ వివాదంతో ముడిపెట్టిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, క్రైస్తవ మతాన్ని అనుసరించే జగన్ మోహన్ రెడ్డి తిరుపతిని, హిందుత్వాన్ని దెబ్బతీసే పెద్ద కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
బాధితులను పరామర్శించడానికి తిరుమలను సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలనా వైపల్యం వల్లనే ఈ విషాదం జరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు అదే సమయంలో తన సొంత నియోజకర్గం కుప్పంలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల , కీలకమైన సమయంలో భద్రతా బలగాలన్నీ అక్కడికి తరలి వెళ్ళాయని ఆరోపించారు.
‘‘ప్రతి ఏడాదీ వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్త జనాన్ని తొక్కిసలాట జరగకుండా అదుపు చేస్తున్నారు. టోకెన్ల కౌంటర్ల వద్ద తగినంత ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? తగినంత మంది పోలీసులను ఎందుకు ఏర్పాటు చేయలేదు? పోలీసులు పరిపాలనా వ్యవస్థ సరైన పద్ధతిలో వ్యవహరించినట్టయితే ఇలాంటి సంఘటనలను జరగకుండా చేయవచ్చు. తమ బాధ్యతలను నిర్వర్తించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా పాలనా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ విఫలమయ్యాయి. సరైన ప్రణాలిక లేకపోవడం, సమన్వయం లేకపోవడం వల్ల భక్తులను అదుపు చేయలేక ఈ విషాదం జరిగింది’’ అని జగన్ మో
హన్ రెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ పేర్కొన్నారు.
జనసేన-టీడీపీ మద్దతుదారుల మధ్య యుద్ధం
పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాట్లాడుతూ ఈదుర్ఘటనకు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పవన్ కల్యాణ్ కోరినట్టు దేవాదాయ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మరే మంత్రి కానీ టీటీడీ చైర్మన్ ను క్షమాపణ కోరలేదు.
పవన్ కల్యాణ్ క్షమాపణ కోరడం గురించి ప్రశ్నించగా, టీటీడీ చైర్మన్ సమాధానం చెపుతూ ‘‘క్షమాపణలు చెపితే పోయిన ప్రాణాలు తిరిగి రావు. దీనికి బాధ్యులైన వారిని గుర్తించి, వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. కొందరు వ్యక్తులు క్షమాపణలు కోరుతున్నారు కానీ, నేను క్షమాపణలు చెప్పను’’ అన్నారు.
బి.ఆర్. నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితులే కాకుండా ఆయన సొంత జిల్లాకు చెందిన వ్యక్తి కూడా. పైగా టీవీ5 ఛానెల్ చైర్మన్ కూడా అయిన ఆయన తొలి నుంచి టీడీపీకి బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా చేసిన వై.వి. సుబ్బారెడ్డి నియామకం లాగానే, బి.ఆర్. నాయుడు నియామకం కూడా పూర్తిగా రాజకీయమైందే. క్షమాపణలు చెప్పడానికి తిరస్కరించడం జనసేన మద్దతు దారులకు- విస్తరించిన బీజేపీ జనసేన నెట్ వర్క్ కు-తెలుగు దేశం మద్దతుదారులకు మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా యుద్దం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ, రెండు రోజుల తరువాత బి.ఆర్. నాయుడు క్షమాపణలు చెప్పారు. అంతకు ముందు క్షమాపణలు చెప్పడానికి తిరస్కరించిన తన ఆలోచనకు ఇది భిన్నమైంది. ఇలా చేయడానికి బహుశా టీడీపీలో తనకు రాజకీయంగా పై వాళ్ళు సూచించడం వల్లనో, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలో అయి ఉండవచ్చు.
తప్పు జరిగిందని క్షమాపణలు చెప్పే ఆత్మన్యూనతలోకి టీటీడీ చైర్మన్ ను నెట్టిన పరిస్థితిని తెచ్చిన పవన్ కల్యాణ్ ఈ విషాద సంఘటనలో రాజకీయంగా విజయాన్ని సాధించడమే కాకుండా, ఈ నిందను టీడీపీ పైకి విజయవంతంగా నెట్టగలిగారు.
‘విజయవంతమైన తల నాకు, విఫలమైన తోక నీకు’ పవన్ ఎత్తుగడ
ఇలాంటి ఎత్తుగడను వేయడం పవన్ కల్యాణ్ కు ఇది కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరిగే నేరాలకు డీజీపీ, హోం మంత్రి ఇచ్చే అలుసే నని గతంలో పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. హోం మంత్రి వి. అనిత పైన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆమె తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించకపోతే ‘‘బలవంతంగా హోం మంత్రి పదవిని స్వీకరించాల్సి వస్తుంది’’ అని ఒక భిన్న మైన ధోరణిలో వ్యాఖ్యానించారు.
‘ద వైర్’ పరిశీలన ప్రకారం పవన్ కల్యాణ్ ‘విజయవంతమైన తల నాకు, విఫలమైన తోక నీకు’ అన్న ఎత్తుగడను అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అభివృద్ది వల్ల వచ్చే గొప్పతనం తాను స్వీకరిస్తూ, లోపాలను పరిపాలనా వ్యవస్థ పైన కానీ, టీడీపీ పైన కానీ నెడతారు. ప్రజలకు సంబంధించిన విషయాల్లో తాను టీడీపీ కంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే చాలా చురుగ్గా పనిచేస్తున్నానని తనను చూపించుకోవడానికే ఈ ఎత్తుగడ.
దీనికి తోడు పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడే వాడినంటూ దూకుడు ప్రదర్శించడం, సంఘపరివార్ తో కలిసి బలపడడానికి, ఆంధ్రప్రదేశ్ లో తాను, బీజేపీ బలం పెంచుకోవడం కోసమే. తత్ఫలితంగా, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పి) జాతీయ స్థాయి ప్రచారం ఈ ఏడాది మొదట్లో విజయవాడలో ప్రారంభమైంది.
పవన్ కల్యాణ్, బీజేపి ఎదుగుదల
పెరుగుతున్న బీజేపి, పవన్ కల్యాణ్ ప్రభావం టీడీపీ మద్దతుదారుల్లో ఒక హెచ్చరిక లాంటిది. టీడీపీకి సన్నిహితులు, కమ్మవర్గ ప్రయోజనాల ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధా కృష్ణ మారుతున్న ఈ రాజకీయ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది రెండవ వారంలో రాసిన కాలంలో వేమూరి రాధా కృష్ణ టీటీడీ చైర్మన్ నుంచి పవన్ కల్యాణ్ క్షమాపణలు కోరిన రాజకీయ వివాదాల గురించి రా
శారు. ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఓట్లను సొంతం చేసుకోవడానికి బీజేపీ, పవన్ కల్యాణ్ పలుకుబడి పెరుగుతోందని టీడీపీని ఆయన హెచ్చరించారు.
టీడీపీ-బీజేపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తు గురించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రదర్శించడం గురించి రాధాకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఈ రాజకీయ మలుపులో పవన్ కల్యాణ్ నారా లోకేష్ కు సవాలు విసురుతున్నారని ఆయన హెచ్చరించారు.
నారా లోకేష్ ను ప్రముఖ నాయకుడుగా భవిష్యత్తులో చూపించే కంటే ఇప్పుడే చూపించడం మంచిదని, రాహుల్ గాంధీని, తెలంగాణాలో కె.టి.రామారావును ఆలస్యంగా చూపించడం వల్ల నష్టం జరిగినట్టుగా, లోకేష్ విషయంలో కూడా ఆలస్యం చేస్తే నష్టం జరుగవచ్చని హెచ్చరించారు.
మరొక ఆసక్తి విషయం ఏమిటంటే, ‘డెప్యూటీ చీఫ్ మినిష్టర్ ’ పదవి రాజ్యాంగ బద్దమైనది కాదని, పవన్ కల్యాణ్ కూడా ఇతర క్యాబినెట్ మంత్రుల్లో ఒకరేనని రాజకీయంగా టీడీపీకి పూర్తి అనుకూలంగా రాశారు.
ఏలూరుకు చెందిన ఆర్ ఎస్ ఎస్ సీనియర్ సభ్యుడు, కాపు నాయకుడు ఒకరు రాధా కృష్ణ రాతలకు ప్రతిస్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీల విశాఖపట్నం సందర్శించిన సందర్భంగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని చెప్పడం ద్వారా బీజేపీ, పవన్ కల్యాణ్ చుట్టూ ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించారు.
‘‘రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవడంలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. ప్రధాన మంత్రి ప్రస్తుత పర్యటన వల్ల పవన్ కల్యాణ్, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రానికి ప్రత్యక్షంగా అనేక ప్రయోజనాలను తీసుకు రానున్నారు. ఇక్కడ మేం బలపడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.’’ అని ‘ద వైర్’ కు ఆయన చెప్పారు.
ఈ పరిణామాలను టీడీపీ, చంద్రబాబు నాయుడు ఎంత కాలం సహించగలుగుతారన్న ప్రశ్నకు సమాధానంగా ‘‘వేచి చూద్దాం. ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి చేసుకోలేదు. ఇప్పుడే దీని గురించి వ్యాఖ్యానించడం మరీ తొందరవుతుంది. ఒకే జాతి, ఒకే ఎన్నికల ప్రతిపాదన గురించి ఇప్పటికీ సంయుక్త పార్లమెంటరీ సమావేశం పరిశీలిస్తోంది. వచ్చే పార్లమెంటరీ సమావేశాల్లో ఇది పాస్ కావచ్చు. తరువాత భారీ రాజకీయ పరిణామాలు జరగవచ్చు. అప్పడు మీరు కౌంట్ డౌన్ ప్రారంభించవచ్చు.’’ అని చెప్పారు.
-పవన్ కోరాడ
అనువాదం : రాఘవ