Reading Time: 3 minutes
ఎలా?
ఎలా? ఇదెలా జరిగింది అన్న ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. దోషిగా తేలిన వ్యక్తి, లైంగిక నేరాలకు పాల్పడేవాడు, స్త్రీ ద్వేషి, ఎదుటి వ్యక్తులను తూలనాడే ఒక వ్యక్తి ఇన్ని అవలక్షణాలు ఉన్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇంతటి ఘన విజయం ‘ఎలా’ సాధించాడు? అటు సెనెట్‌లోనూ, బహుశా ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లోనూ రాజకీయ ప్రతిపక్షం అనేది లేకుండా తుడిచిపెట్టేసే అంత ఘన విజయం ట్రంప్ ‘ఎలా’ స్వంతం చేసుకున్నాడు?
ఈ ‘ఎలా’ అన్న ప్రశ్నకు జవాబులు వెతకడం వ్యాఖ్యాతలకు బహు కష్టంగా మారింది. ఈ ‘ఎలా’ అన్న ప్రశ్నకు సమాధానమే అమెరికా రాజ్యము, సమాజాల స్వభావాల్ని వెల్లడిస్తుంది. ఎన్నికలలో ట్రంప్ విజయానికి తోడ్పడడంలో మీడియా ప్రధాన చోదకశక్తిగా పనిచేసింది. ఈ విజయం అమెరికన్ మీడియా తీరుతెన్నుల గురించి మనకు వివరిస్తుంది. ట్రంప్ ఎన్నికల యంత్రాంగం సంప్రదాయ, సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున సమాచారం మీద నియంత్రణ సాధించింది. మెహదీహసన్ వంటి డెమోక్రటిక్ పార్టీ అనుకూల ప్రచారకర్తలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే.
జో బైడెన్, కమలాహారిస్‌ల పరిపాలనలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా పశ్చిమ దేశాలతో పోలిస్తే అత్యంత బలంగా ఉన్నది. నిరుద్యోగం గత యాభై ఏళ్ళ కాలంతో పోలిస్తే అత్యంత కనిష్టంగా 4 శాతమే ఉన్నది, ట్రంప్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన నాటితో పోలిస్తే ప్రస్తుతం నిజవేతనాలు పెరిగాయి అనేవి నూటికి నూరుపాళ్లూ వాస్తవాలే అయినప్పటికీ ప్రజలు ఈ వాస్తవాలను నమ్మలేదు. ప్రజలు ఈ వాస్తవాలను నమ్మడానికి తిరస్కరించారంటే దానికి కారణం పచారీ బిల్లుల మొత్తం అధికం కావడం, గత నాలుగేళ్ళలో గ్యాసోలిన్ ధర దాదాపు ఒక డాలర్ లోపు మాత్రమే తగ్గడం వారికి పదేపదే గుర్తుకు రావడమే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ‘గ్యాసోలిన్ ధరను రెండు డాలర్లకుపైగా తగ్గిస్తానని తక్కువకి తీసుకు వస్తానని తురుపు ముక్కలాంటి వాగ్ధానం చేసాడు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తీవ్ర నష్టం చేస్తే తప్ప ఈ వాగ్ధానం అమలు చెయ్యడం సాధ్యం కాదని నిజ నిర్ధారకులు అనేకమంది స్పష్టం చేసారు. కానీ జనం కార్లలో గ్యాసోలిన్ నింపుకున్న ప్రతిసారీ, బ్యాంక్ ఖాతాలో ఎంత సొమ్ము నిల్వ ఉన్నదో చూసుకున్న ప్రతిసారీ ట్రంప్ ఎన్నికల వాగ్ధానం సీదాగా వారి హృదయాలను తాకింది.
జనరేషన్ ‘జడ్’గా ముద్దు పేరుతో పిలుచుకునే కొత్త తరంలో అత్యధికులు అసలు వార్తాపత్రిక అనేదాన్ని చదవకుండా ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళంతా ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో చలామణిలో ఉన్న సమాచార పట్టికలు, మీమ్స్, ఇన్ఫ్లుయన్సర్ల వ్యాఖ్యానాల మీద ఆధారపడ్డారని ఒక అమెరికన్ వార్తాపత్రిక వెల్లడిరచింది. ఈ కొత్తతరం ఓటర్లు సంఖ్యాపరంగా 41 మిలియన్లు మందిగా ఉన్నారు. ఈసారి వీరిలో అత్యధిక శాతం ట్రంప్ వైపు మొగ్గడం ఆందోళనకరమే. ఈ కొత్త తరం ఓటర్ల మనోభావాలలోని నిజాయితీని విస్మరించిన కమలాహారిస్ పొగరుమోతు తనానికి గర్వభంగం కావించారు. ఈ ఓటర్లలో భాగంగా ఉన్న విద్యార్థులు వేలాదిమంది పాలస్తీనా మీద సాగిస్తున్న దుర్మార్గమైన యుద్ధాన్ని తీవ్రంగా నిరసించారు. వాళ్ళ నిరసనను, వాళ్ళ మనోభావాలలోని నిజాయితీని కమలాహారిస్ పరిగణనలోకి తీసుకోకపోగా, వాళ్ళని భూతాలుగా అభివర్ణించింది. కానీ వాళ్ళు మేం భూతాలం కాదు, వాస్తవాలం అని తెలిసివచ్చేలా చేసారు.
ట్రంప్ నోటిదురుసుతనం, వాచాలత్వం అందరూ ఎరిగినదే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అతను ఏ మాట తూలినా జనం దానిని తీవ్రంగా పరిగణించడానికి బదులు మీమ్స్ ద్వారా దానిని నవ్వులాట అంశంగా మార్చేసారు. ఓహియో రాష్ట్రంలోని స్ట్ప్రింగ్ ఫీల్డ్‌లో వలసదార్లను కుక్కల్ని, పిల్లుల్ని తినేవాళ్ళుగా తూలనాడినా దానిని హాస్యాస్పదంగా చలామణి చేసారు. ఇలాంటి సందర్భాలలోనే ఈ ఎన్నికలలో ఎలాన్ మస్క్ విశేషమైన పాత్ర పోషించాడు. తన చేతిలో ఉన్న 44 బిలియన్ డాలర్ల మీడియా సాధనమైన ట్విట్టర్‌ను ట్రంప్ సేవలో తరింపచేసాడు. అన్నిరకాల కుట్ర సిద్ధాంతాలతో ఎన్నికల ప్రచార సరళిని హోరెత్తించి పధకం ప్రకారం సగటు అమెరికన్ పౌరులలో ఆందోళన రేకెత్తించ గలిగాడు. వాస్తవానికి ఎలాన్ మస్క్ ట్రంప్ వీరాభిమాని కూడా కాదు. రెండేళ్ళ క్రితం ‘నాకు ఈ మనిషిపట్ల ద్వేషమేమీ లేదు. కానీ ట్రంప్ తన తలమీద టోపీ తీసేసి సూర్యాస్తమయంలోకి పయనించే సమయం ఆసన్నమైంది’ అని ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. అయితే ఇప్పుడు ట్రంప్‌తో కలసి ప్రయాణిస్తే ఒనగూడే లబ్ది ఏమిటో లెక్కలు వేసుకుని ట్రంప్‌తో చేరిపోయాడు.
ఈ ఆటలో మస్క్‌కి ఒనగూడే లాభం ఏమిటి? ఇంకేముంటుంది డబ్బే ` ట్రంప్ గనుక విజయం సాధిస్తే ఆ మరుక్షణమే మస్క్ నికర సంపద 20 బిలియన్ డాలర్లు పెరుగుతుంది. అయితే మస్క్ అంతిమ లక్ష్యం అధికారమే. జన్మతః దక్షిణాఫ్రికా వాసి కావడం మూలంగా ఎలాన్ మస్క్ దేశాధ్యక్ష పదవికి అర్హుడు కాదు. కాబట్టి ఉన్నంతలో తనకి ఉన్న మెరుగైన ప్రత్యామ్నాయం ఏమిటి? అధ్యక్షుడి అధికారాలతో అంటకాగి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యడం. అతని అతిమితవాద ఉదారవాద ప్రాపంచిక దృక్పథానికి అనుగుణంగా అసమ్మతికి తావులేని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నియంత్రించే వీలు ఉన్న అమెరికాను సృష్టించుకోవడం లక్ష్యం. డ్రైవర్ రహిత కార్లు, అంతరిక్ష వాహనాలు నడిపినట్లు అమెరికాను కూడా నడిపించాలని ఆశిస్తున్నాడు. 2015లో ఎలాన్ మస్క్ మీద రాసిన పుస్తకంలో మస్క్ పట్ల ఎనలేని ఆరాధనా భావాన్ని కుప్పించాడు ఎష్లీవాన్స్. ‘నూతన శకానికి చెందిన అద్భుత యంత్రాల తయారీపట్ల ఎలాన్‌మస్క్‌కు ఉన్న అనురక్తి ఇతర పారిశ్రామికాధిపతులకు కూడా మార్గదర్శకం కావాలి’ అంటాడు ఎష్లీవాన్స్. ప్రస్తుతానికి అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల సి.ఇ.ఓ. కావడానికి ఎన్నికల యంత్రాంగాన్ని రాకెట్ ప్రయోగ వేదికగా వాడుకోవచ్చని మస్క్ తెలివిగా అర్థంచేసుకున్నట్లే. వ్యక్తిగత సంపద పోగేసుకోవడానికి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమే అని ఈ ఒక్క ఎన్నిక ద్వారా మస్క్ నిరూపించాడు.
గతకాలపు వైభవ చిహ్నాలుగా మిగిలిన కార్పొరేట్ మీడియా దిగ్గజాలు కూడా ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాన్ని బెడదగా పరిణమించకపోవడం కలిసి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక ప్రజాస్వామ్యానికి తాను బలమైన గొంతుక అని ఎంతో ఉదారంగా ఫోజు పెడుతుంది. ‘చీకటి’లో మరణించిన ప్రజాస్వామ్యం’ అన్న శీర్షిక పెట్టిన ఇదే పత్రికను (పెంటగాన్ పత్రాలు గుర్తు చేసుకోండి) అపర కుబేరుడయిన పత్రికా యజమాని జెఫ్ బెజోస్యే స్వయంగా బస్ చక్రాల కిందకు నెట్టేసి, అమెజాన్ లాభాల గురించి ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందని కూడా నిరూపించాడు. ఫాక్స్ న్యూస్ పోయే వికారాలకు విరుగుడును ఇచ్చే శక్తి ఒక్క సి.యస్.యన్ కే ఉందని ఒకప్పుడు అందరూ భావించేవారు. ఇప్పుడు ఆ ఛానల్ కూడా వార్నర్ బ్రదర్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ చేతుల్లోకి పోయింది. చర్చాకార్యక్రమాలలో విధిగా మితవాద అభిప్రాయాలకూ చోటు కల్పించాలని సి.యస్.యన్ సంపాదకులకు ఆదేశాలు అందాయి. డెమోక్రటిక్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసినందుకు ఫాక్స్ న్యూస్ మీద ట్రంప్ విరుచుకుపడ్డాడు.
అమెరికాలో జర్నలిజానికి నూకలు చెల్లిపోయినట్లు కనిపిస్తుంది. గత అర్థశతాబ్దంగా మీడియా నిర్వహించే ఎన్నికల తుది సర్వేపట్ల అమెరికన్ ప్రజానీకంలో విశ్వాసం ఉండేది. 1970వ దశకంలో ఈ సర్వేల పట్ల 68 – 72 శాతం మందిలో విశ్వాసం ఉండేది. 2000 నాటికి అది 51- 55 శాతానికి దిగజారింది. గత సెప్టెంబరులో నిర్వహించిన ఒక సర్వేలో దాదాపు 36 శాతం మంది మాకు మీడియా పట్ల విశ్వాసం లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ వంటి సనాతన క్రైస్తవవాది, సనాతన సాంకేతిక నిపుణుడు, సనాతన మితవాది సామ్రాజ్యంలో విశ్వసనీయమైన, విశ్లేషణాత్మక, వివేకవంతమైన జర్నలిజాన్ని బతికించుకోవడానికి భారతదేశంలో వలె అనేక చిన్నచిన్న స్వతంత్ర వేదికలు బలమైన ప్రత్యామ్నాయ భావజాలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాలం విసిరిన సవాలును ఎదుర్కోవడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు.
ట్రంప్ ఘనవిజయం సాధించాక ‘ఇంటర్సెప్ట్’ పత్రిక ఇలా ప్రకటించింది ‘‘కార్పొరేట్ మీడియాకు, డెమోక్రటిక్ పార్టీకి, ఒక సామ్యం ఉన్నది. రెండూ ‘ట్రంప్’ను నిలువరించలేవు.
నానాటికి అతను చేసే చిత్రవిచిత్రమైన వాచాలత్వానికి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే కృత్రిమ ఆగ్రహావేశాలను సొమ్ముచేసుకోవడానికి సంతోషంగా సంసిద్ధంగా ఉంటాయనేది ఖాయం. కానీ అతని అజెండాను అడ్డగించి తీరాలనే నిజమైన సంకల్పం ఈ రెండిరటికీ ఉన్నదా? గాజాలో మరింత మారణహోమం జరిగే అవకాశం ఉన్నది. సరైన పత్రాలు లేని లక్షలాది మంది వలసదార్లను స్వస్థలాలకు తిప్పి పంపించే పథకం వారిని చుట్టుముట్ట నున్నది. అసమ్మతిని వ్యక్తం చేసిన వారిని విచారణకు గురిచేసి జైళ్ళ పాల్జేసే ప్రయత్నాలూ కొనసాగుతాయి.
ఈ అన్యాయాలను బట్టబయలు చేసే రాజకీయ నాయకులను గానీ, జర్నలిస్టులను గానీ ఎలాన్‌మస్క్, జెఫ్బెజోస్లు సత్కరించే అవకాశం లేదు. అందుకే గతంలో కన్నా ఇప్పుడు ‘ఇంటర్సెప్ట్’ అవసరం మరింతగా ఉన్నది. మా సంకల్పంలో మార్పులేదు ` అధికార బల సంపన్నులను నిర్భీతితో కూడిన మా పరిశోధనాత్మక జర్నలిజంతో సదానిలదీస్తూనే ఉంటాం.”
– పమేలా ఫిలిపోస్
అనువాదం : సత్యరంజన్