Reading Time: 7 minutes
ఉమర్ ఖలీద్ గురించి, అతని స్వేచ్ఛా స్ఫూర్తి గురించి ఒక అన్వేషణ
‘‘దేశభక్తికి అత్యున్నత రూపం అసమ్మతి’’ – హోవర్డ్ జిన్, అమెరికన్ చరిత్రకారుడు, నాటక రచయిత, కార్యకర్త, ‘‘అమెరికా ప్రజల చరిత్ర’’ పుస్తక రచయిత.
అసమ్మతి విలువను దానిని వినిపించిన వ్యక్తి స్వర తీవ్రతను బట్టి అంచనా వేయలేం. బలవంతపు నిశ్శబ్దంలో ఆ అసమ్మతి సజీవంగా వుండడమే దాని విలువ. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఒక స్వరం వినబడడానికి ముందు, ఒక నిశ్చల దృశ్యం మీ ముందు ప్రత్యక్షమౌతుంది. ‘‘మీరు ఈ సినిమా చూస్తున్న సమయంలో నేను నిర్బంధంలో వున్నాను.’’ ఈ పదాలు ఎవరినైనా బలంగా తాకుతాయి. కెమేరా ద్వారా సూటిగా మనల్ని ధైర్యంతో సవాల్ చేస్తాయి. ఇది ముందుగా రికార్డు చేయబడ్డ వీడియో. సినీ నిర్మాత లలిత్ వాచాని అల్లిన కథనానికి చట్రం. ఉమర్ ఖలీద్‌కు సంబంధించిన కథనం. ఖైదీ నెం. 626710 అంటే ఉమర్ ఖలీద్ అనే అర్థం. ఈ సినిమా పూర్తి అయ్యేనాటికి ఆ ఖైదీ 1324 రోజులపాటు లేదా 31776 గంటలపాటు జైలు నిర్బంధంలో వున్నాడు.

'ఖైదీ నెం. 626710 ఈజ్ ప్రెజెంట్' నుండి ఒక స్టిల్ ఉంది, దీనిలో శుద్ధబ్రత సేన్‌గుప్తా ఉమర్ ఖలీద్ ఫోటోను పట్టుకుని ఉన్నారు. లలిత్ వచాని సౌజన్యంతో
ఇది ఉమర్‌కు చట్టంతో రెండో సవాల్. అంతకుముందు 2016లో ఆయన, ఆయనతోపాటు జె.ఎన్.యు కి చెందిన కొందరు విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. అరెస్టుల పర్వంలో ఇది ఒక భాగం. ఈ నిరసనను అధికారులతోపాటు అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మీడియా కూడా ‘‘జాతి వ్యతిరేక’’ ముద్ర వేసి గగ్గోలు పెట్టింది. ఆ ముద్ర పర్యవసానం దుర్గంధంలాగా ఎన్నటికీ వెంటాడుతుంది. సరిగ్గా రెండు సంవత్సరాల తరవాత ఆయనను హత్య చేయడానికి ఒక అరాచక గుంపు ప్రయత్నం చేయడంతో పరిస్థితి నాటకీయంగా మారింది. అసమ్మతి కేవలం ప్రఖ్యాతిని మాత్రమేకాక ప్రమాదానికి కూడా ఎలా కారణమౌతుందో చూపడానికి ఇది ఒక ఉదాహరణ.
ఈ సినిమాలో నాలుగు అధ్యాయాలున్నాయి. కేవలం ఒక నెంబరుగల ఖైదీగా పిలవబడుతూ, పేరులేని అనామకుడుగా చిత్రించబడుతున్న వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. గుర్తింపు, ప్రతిఘటనలను వస్తువుగా చేసుకుని ఒక బలమైన కథనాన్ని వినిపిస్తుంది. ఉమర్ ఖలీద్ స్ఫూర్తి జైలులోని ప్రమాదకరమైన ఆవరణలో ఎలా ప్రయాణం చేసిందీ ఆంక్షల నడుమ కూడా ఆయన తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎలా త్రీవంగా ప్రయత్నించిందీ ఇందులో చిత్రితమైంది.

ఉమర్ ఖలీద్‌ను చూపుతూ ‘ఖైదీ నంబర్ 626710 ప్రస్తుతం ఉంది’ నుండి ఒక స్టిల్. లలిత్ వచాని సౌజన్యంతో.
జన్మరీత్యా ముస్లిం :
‘అక్రమ ఆరోపణలు’ (ఫ్రేమింగ్) అనే మొదటి చాప్టర్లో ఉమర్ ఖలీద్ కథనాన్ని వినిపించే క్రమంలో విసుగులేకుండా సత్వాన్వేషణ చేయడం ఎలా ఆయన స్వభావంలో భాగంగా మారిపోయిందో వివరించారు. ఆయనతో తన తొలి పరిచయాన్ని ఒక స్నేహితుడు ఇలా గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘‘రాజకీయ ఖైదీల హక్కులకు సంబంధించిన ఒక సమావేశం అది. అతను మధ్యలో లేచి నిలబడి వేదికమీద వున్న వక్తను సవాల్ చేశాడు.’’ ఉమర్‌లో మూర్తీభవించిన ప్రతిఘటనా స్ఫూర్తిని ఇది చిత్రీకరిస్తుంది. అంతేగాక ప్రశ్నించటం, విమర్శనాత్మకంగా ఆలోచించడం సారభూతంగా వుంటే విశ్వవిద్యాలయాలు, ఎలా దాడికి గురౌతున్నాయో ఆ చిత్రం మనకు సోదాహరణంగా వివరిస్తుంది. ‘‘టుక్డే టుక్డే గ్యాంగ్’’ అనే ఒక కల్పనాత్మక కథనం అతనిలాంటి గొంతుకలను అణచివేయడానికి ఎలా సాధనంగా ఉపయోగపడిరదీ, ఒక కాలంలో విశ్వవిద్యాలయాలు అసమ్మతి సంస్కృతి కేంద్రాలుగా వుంటే వాటిని అణచివేయడానికి జరిగిన ప్రయత్నాలనూ వివరించింది. ఒక సన్నివేశం నేపథ్యంలో మనకు ఘజాలా వాహబ్ రాసిన ‘జన్మతః ముస్లిమ్’ అనే పుస్తకం కనపడుతుంది. ఉమర్ ఖలీద్ ఎదుర్కొన్న జీవన సంక్లిష్టతలను ఇది మనకు నివేదిస్తుంది. నానాటికీ అస్తిత్వ సమీకరణాలు మారిపోతున్న సందర్భంలో భారతదేశంలో ముస్లింలు తమ మత అస్తిత్వాన్ని మోసుకుంటూ తిరుగాడుతున్న వైనాన్ని ఈ పుస్తకం లోదృష్టితో మనకు చూపుతుంది. వాచాని సినిమా కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది.
కల్పిత నేరం (ఫ్రేమ్డ్) :
36 నిముషాలు గడిచిన తరవాత, ఉమర్ తెరమీద కనపడతాడు. తన అరెస్టు వెనుక వున్న కుట్రను ప్రేక్షకుల ముందు నగ్నంగా చూపెడుతూ అతడు మన కళ్ళలోకి సూటిగా చూస్తాడు. ఆయన గొంతు నిలకడగా వుంటుంది. ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా తన గొంతును నొక్కివేయడానికి జరిగిన ప్రయత్నాలు రెండవ అధ్యాయానికి భూమికను తయారుచేసాయి. అందులో మోసం ఎలా జరిగిందీ సూక్ష్మంగా బహిర్గతం అవుతుంది. పౌరసత్వ చట్టం ముస్లింల పౌరసత్వాన్ని ప్రశ్నార్థకం చేసి, ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని దయతో ఇచ్చిన నేపథ్యాన్ని ఈ కథనం వివరిస్తుంది. అస్తిత్వం ఆధారంగా కొందరిని సమాజం నుండి మినహాయించడానికి యుక్తిగా కుటిలంగా శాసనం చేసిన వైనాన్ని అది బట్టబయలు చేస్తుంది. ఈ చట్టాన్ని, జాతీయ పౌరుల రిజిస్టర్‌ను కలిపి ముస్లిం శరణార్థులకు వ్యతిరేకంగా విచక్షణాపూర్వకంగా చేసినందుకు తీవ్ర నిరసనలను ఎదుర్కొంది.
మూడో అధ్యాయానికి ‘కల్పిత నేరం’ అని పేరు. ఇక్కడికొచ్చేసరికి ఉమర్‌పై ఆరోపణ టెర్రర్ కుట్రకు సంబంధించిన నేరంగా మారిపోతుంది. అతనిపట్ల అప్పటిదాకా అల్లిన కథనం పూర్తిగా మారి, అసమ్మతి ఎలా నేరపూరితంగా చిత్రీకరించబడుతుందో మనకు స్పష్టమౌతుంది. ఇక్కడ వాచాని ఈ మొత్తం దృశ్యాన్ని బరువైన మాటలతో చిత్రించడానికి ప్రయత్నించలేదు. నైతిక నిర్ధారణల వైపు నుండి ప్రేక్షకుడికి విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేయలేదు. అందుకు బదులు పూర్తిగా నిస్పక్షపాతమైన వైఖరితో సత్యాన్ని ప్రదర్శించాడు. వాచాని అనుసరించిన పద్ధతి, హిందూజాతీయవాదంపట్ల విమర్శ గురించి ఆనంద్ పట్వర్ధన్ ప్రదర్శించిన పద్ధతికి ప్రతిధ్వని. అది సున్నితంగానూ, నిగ్రహంగానూ వున్నది. ప్రత్యక్ష ఘర్షణకు పూనుకోలేదు. జీన్ రౌచ్, ఫ్రెడ్ వైజ్మాన్ ల లాగా వాచాని సామాజిక వ్యవస్థలు మనుషుల జీవితాలను ఎలా రూపుదిద్దుతాయో వెల్లడిచేయడానికి పరిశీలన, ఆచరణ అనే పద్ధతులను మేళవించాడు. ఆయన సినిమాలు కేవలం ఒకదాన్ని ఉన్నది ఉన్నట్లుగా దృశ్యమానం చేసే స్థాయిని అధిగమించి వుంటాయి. పైపైకి కనపడే అధికార సంబంధాల చలనాల అడుగున దాగివుండే వాస్తవాలను సునిశితంగా పరిశీలిస్తూ నిజాన్ని వెలికి తెస్తాయి. ఆయన కెమెరాను ఒక పరిశీలనా సాధనంగానూ, ప్రతిఘటనా ఆయుధంగానూ వాడుకుంటాడు.
స్క్రిప్టు రచయిత ఉమర్ :
ఉమర్ బృందంతో సంబంధంలో వున్న లలిత్ అనే వ్యక్తి ఉమర్ కార్యాచారణను విస్తృతంగా డాక్యుమెంట్ చేసాడు. అందుకు అతని ప్రసంగాలను, ప్రత్యామ్నాయ మీడియా కవరేజిని వాడుకున్నాడు. దీనికి పూర్తి భిన్నంగా హిందూ జాతీయవాద మీడియా ఉమర్‌ను లక్ష్యంగా చేసుకుని నిరంతరాయంగా ఆయనను దుర్మార్గుడుగా చూపెట్టే కథనాన్ని రూపొందించింది. లలిత్ ఈ రచయితతో ఇలా అన్నాడు: ‘‘ఉమర్ అద్భుతమైన అయస్కాంతంలాంటి ఆకర్షక శక్తివున్న వక్త. అరెస్టు కావడానికి ముందు ఆయన కెమెరా ముందు నిలబడి యిచ్చిన తుది ప్రసంగం చాలా ప్రాధాన్యత కలిగినది, తీవ్రమైనది. అతనికి గౌరవాన్ని తెచ్చిపెట్టేది. ఆ ప్రసంగంతో ఆ సినిమా ముగియాలని నాకు తెలుసు.’’ ఉమర్ ఈ సినిమాకు సహరచయిత. అతని మాటలు, చర్యలు ఈ కథనాన్ని శక్తివంతంగా అల్లాయి. ఈ ధిక్కారపు కథనానికి అవి ఒక రూపున్నిచ్చాయి. ఒక మానవ సమూహం యావత్తూ చేసిన పోరాటాలకు సాక్షీభూతంగా నిలిచాయి. ‘‘ఈ సినిమాకు స్క్రిప్టు రచయిత ఉమర్’’ అని లలిత్ అన్నాడు.
ఈ సినిమాను తీయాలని తాను మొదట్లో అనుకోలేదని లలిత్ అన్నాడు. ‘‘అయితే ఉమర్ దగ్గర స్నేహితురాలు / సహచరి అయిన బనజ్యోత్స్న తోనూ, ఉమర్ దగ్గరి స్నేహితుడు, కళాకారుడైన శుద్దబ్రత సేన్ గుప్తాలతో కొంత సమయం గడిపిన తరవాత ఈ కథనాలు వెంటనే ప్రపంచానికి తెలియాల్సిన అవసరాన్ని నాలో గుర్తింప చేశాయి.’’ ఉమర్ ఉపన్యాసాల రికార్డులను, హిందూ జాతీయవాద మీడియా అతన్ని విలన్‌గా చిత్రీకరిస్తూ చూపెట్టిన వార్తా స్రవంతిని లోతుగా శోధిస్తున్నకొద్దీ ఈ కథనాన్ని చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయగలిగింది కాదని లలిత్‌కు అనిపించింది. ‘‘నేను ఈ సినిమా తప్పనిసరిగా తీయాలని నాకు అర్థమయింది.’’
లలిత్ తన ప్రయాణాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు: ‘‘భారత సమాజం మీద హిందూ జాతీయవాదం ప్రభావాన్ని పరిశీలించే దృష్టితో చిన్న సినిమాల పరంపర మీద పనిచేయడం ప్రారంభించాను. 2019 డిసెంబర్, 2020 జనవరిలలో జామియా మిలియా ఇస్లామియా, షహీన్బాగ్లలో వున్న నిరసన స్థలాల వద్ద నేను చిత్రీకరణ ప్రారంభించాను.’’ ముందుగా సరైన ప్రణాళిక లేని కారణంగా ప్రారంభంలో అతను పొరలు పొరలుగా బయటకు వస్తున్న సంఘటనలను దృశ్యమానం చేయడం ప్రారంభించాడు. అదేవిధంగా సిఏఏ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా విద్యార్థి కార్యకర్తలు శాంతియుతంగా ప్రతిఘటన చేయమని వేదికమీద చేసిన ప్రసంగాలకు సాక్షీభూతంగా దాన్ని డాక్యుమెంట్ చేశాడు.’’
కొన్ని నెలల తరవాత లలిత్ జర్మనీలో వుండగా, శాంతియుతంగా నిరసన తెలియచేయడం గురించి భావోద్వేగంతో మాట్లాడిన ఆ విద్యార్థుల్ని నిర్బంధించారని, వాళ్ళమీద ఢిల్లీలో అల్లర్లను రెచ్చగొట్టన కేసులు పెట్టారని విన్నప్పుడు లలిత్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెన్నులో వణుకు పుట్టించేలా జరిగిన ఈ సంఘటనల కారణంగా లలిత్ 2019, 2020లనాటి ఆ నిరసనల గురించి తాను చేసిన చిత్రీకరణను పునఃపరిశీలించాలనుకున్నాడు. ఆ సమయంలో జరిగిన శాంతియుత ప్రదర్శనలతోపాటు ఆ తరవాత కొనసాగిన హింసను కూడా ఆ పరిధిలోకి తెచ్చాడు. 2023 మార్చి`ఏప్రిల్‌లో లలిత్ భారతదేశానికి తిరిగివచ్చాక తన పథకానికి తాను అంకితమయ్యాడు. ఈ మొత్తం సినిమా చిత్రీకరించడానికి ఆయనకు 15 నెలల కాలం పట్టింది. ప్రారంభంలో ఢిల్లీ అల్లర్లపైన మాత్రమే కేంద్రీకరించి ఈ సినిమా తీయాలని ఆయన ఉద్దేశించాడు. అయితే బనజ్యోత్స్న, శుద్దబ్రతలతో సంభాషణలు జరిపిన తరవాత మరింత లోతైన, తప్పనిసరి అయిన కథనం ఆయనకు గోచరించింది. 2016నాటి సంఘటనలు, జెఎన్‌యు విద్యార్థుల పైనా, ‘టుక్డే టుక్డే ముఠా’ అని పిలవబడ్డ వాళ్ళ నాయకుడుగా ఉమర్ ఖలీద్పైనా కేసులు పెట్టటానికి రాజ్యం, ప్రధాన స్రవంతి మీడియా సమన్వయ పూర్వకంగా చేసిన ప్రయత్నాలను వివరించాలని ఆయన అనుకున్నాడు.

బానోజ్యోత్స్న లాహిరిని చూపుతూ ‘ఖైదీ నంబర్ 626710 ఈజ్ ప్రెజెంట్’ నుండి ఒక స్టిల్. లలిత్ వచాని సౌజన్యంతో.
లలిత్ తన తలపోతలను ఇలా వివరించాడు : ‘‘ఉమర్ నిరంతరం శాంతి, అహింసల భాషను మాట్లాడటం నాలో చెరగని ముద్ర వేసింది. అయినా అతనిపై హింసను రెచ్చగొట్టాడనే ఆరోపణ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా తయారుచేసిన ఆ స్క్రిప్టు పూర్తిగా ఓర్వెలియన్ కల్పన . అల్లర్లకు పాల్పడుతున్న హిందూత్వ మూకలకు సంబంధించిన కొన్ని చిత్రీకరణలను మేం చూసినప్పుడు ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యం మాకు కనపడింది.’’
ఈ మనోభావాన్నే శుద్దబ్రత కూడా ప్రతిధ్వనించాడు. రాజకీయ విశ్లేషణకున్న బలహీనమైన స్వభావాన్ని ఆయన ఎత్తిపట్టాడు….. ‘‘రాజకీయంగా విభేదాలున్నప్పటికీ ప్రాథమిక మానవ స్వభావమైన సున్నితత్వం యథాతథంగా కొనసాగాలని ఉమర్ విశ్వసించాడు. దానికి అనుగుణంగా అతను జీవించాడు.’’
తన అరెస్టుకు ముందు ఉమర్ యువ ముస్లిం కార్యకర్తలు చదవాల్సిన పుస్తకాల జాబితాను తయారుచేయడంలో నిమగ్నమయాడు. బహిరంగ, ప్రజాస్వామిక, సోషలిస్టు దృష్టికోణం నుండి ఇస్లామ్ వారసత్వంతో ముస్లిం కార్యకర్తలకు తిరిగి పరిచయం కల్పించేలా చేయడమే ఆయన ఉద్దేశం. ఈ కొత్త ఆదర్శాలు, భావాలలో ఆయన పూర్తిగా మునిగిపోయాడు. స్వేచ్ఛ గురించిన కొత్త దృష్టి, మేధో స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ పరస్పరం కలిసిపోయి, కష్టసాధ్యమైన ప్రశ్నలను అడగడానికి సాహసించిన వ్యక్తులపై బలవంతంగా రుద్దబడిన కథనాలను సవాల్ చేయడానికి అవసరమైన ఈ కొత్త దృష్టిని కార్యకర్తలకు ఇవ్వడం కోసమే ఆయన ఈ జాబితాను రూపొందించారు.

‘ఖైదీ నెం. 626710 ఈజ్ ప్రెజెంట్’ నుండి ఒక స్టిల్, శుద్ధబ్రత సేన్‌గుప్తాను చూపిస్తూ, తాను మరియు ఉమర్ ఖలీద్‌ల ఫోటోను పట్టుకుని ఉంది. లలిత్ వచాని సౌజన్యంతో.
చెరగని జ్ఞాపకాలు :
అధికారయుతవాదపు ఉక్కుపాదంతో కూడిన అణచివేత భారాన్ని తట్టుకొని నిలబడగలిగిన మానవ స్థితిస్థాపక స్ఫూర్తికి ఒక గాఢమైన ఆవిష్కరణ ‘ఖైదీనెం. 626710 హాజర్ హై’ సినిమా. ఇందులో నాల్గవ అధ్యాయం పేరు ములాఖాత్. ఇందులో దర్శకుడు వ్యక్తిగతమైన కథనాలు నియంతృత్వానికి వ్యతిరేకంగా ధిక్కార చర్యలుగా మారిన వైనాన్ని చాలా నైపుణ్యంతో చిత్రీకరించాడు. జ్ఞప్తికి తెచ్చుకున్న ప్రతి జ్ఞాపకం ఒక నిశ్శబ్దపు తిరుగుబాటు. చెరగడానికి నిరాకరించిన జ్ఞాపకం. ఈ సినిమాలో తమ జ్ఞాపకాలను పంచుకున్న ఇద్దరు వ్యక్తులు` ఒకరు ఉమర్, రెండవవారు బనజ్యోత్స్న, శుద్దబ్రతలు మానవత్వపు సంక్లిష్టతలను ప్రతిబింబించే అద్దాలలాగా ఉపయోగపడ్డారు. ములాఖత్‌కు వచ్చిన ప్రతిసారీ తాము అనుభవించిన విధానపరమైన ఆతృతలను, నియమ నిబంధనలు కల్పించిన చిక్కులను జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా బనజ్యోత్స్న, శుద్దబ్రతలు ఉమర్ వ్యక్తిత్వాన్ని చిత్రీకరించారు.
వాళ్ళ మధ్య జరిగిన సంభాషణల ద్వారా, వారి జ్ఞాపకాల ద్వారా, ఆశల ద్వారా దర్శకుడు సమాజంలోని అతి చీకటి మూలలలో కూడా నైతిక ఛాయలు ఎలా ఉనికిలో వుంటాయో ఆవిష్కరించారు. ఈ క్రమంలో వాళ్ళు న్యాయం స్వభావం గురించి, అసమ్మతికి చెల్లించాల్సిన మూల్యం గురించి పాఠకులు ప్రశ్నించేలా చేశారు. ఈ రకంగా ఉమర్ కథ కేవలం రాజకీయ ఖైదీగా మారిన మేధావి కథ మాత్రమే కాదు. అది నిరసనకు, టెర్రరిజానికి మధ్య వర్తమాన భారతదేశంలో గీయబడిన సున్నితమైన సన్నని విభజన రేఖకు ప్రతీక. న్యాయం గొంతుకకు ఉచ్చులా బిగుస్తున్నకొద్దీ న్యాయస్వభావం గురించి, స్వేచ్ఛ అర్థం గురించి ప్రశ్నలు ఇంతకు ముందెన్నడు కంటే బిగ్గరగా ప్రతిధ్వనిస్తున్నాయి. వైమనశ్యపూర్వక విభజనలతో నిండిన సమాజంలో ఉమర్ దీర్ఘకాలంపాటు జైలు నిర్బంధంలో వుండటం ఒక అత్యవసరమైన ప్రశ్నను లేవనెత్తింది. సత్యాన్వేషణ ఏ దశలో తిరుగుబాటు చర్యగా పరిణమించింది?

‘ఖైదీ నంబర్ 626710' పోస్టర్.
ఇంతటి తీవ్రస్థాయిలో అన్యాయం ఎదురౌతున్న సమయంలో నిశ్శబ్దాన్ని ఎంతకాలం సహించగలం? ఈ సినిమాలో పుస్తకాలు శక్తివంతమైన ఆయుధాలుగా ఆవిర్భవిస్తాయి. ఉమర్‌కు వున్న అంతులేని జ్ఞానదాహాన్ని ఆ పుస్తకాలు ప్రతిఫలిస్తాయి. ఆయన నిర్బంధంలో వున్నప్పటికీ రెండువందలకు పైగా పుస్తకాలను జీర్ణం చేసుకున్నాడు. ఆయన జైలు గది ఒక ఆలోచనల అభయారణ్యంలా తయారైంది. ఆయన తిప్పిన ప్రతి పుట ఒక ధిక్కారపు చర్య. అణచివేతకు వ్యతరేకంగా ఒక నిశ్శబ్ద తిరుగుబాటు. జైలు ఊచల వెనకాల వున్నప్పటికీ సాహిత్యం తన శక్తి ద్వారా స్వేచ్ఛా మార్గాన్ని కాంతివంతం చేస్తుందని అది నిరూపించింది. ఉమర్ గురించి శుద్దబ్రత మాట్లాడుతున్న సమయంలో నేపథ్యంలో ప్రేక్షకులు మరొక పుస్తకాన్ని కూడా గుర్తించగలరు. అది కొబాడ్ గాంధీ రాసిన Fractured Freedom: A Prison Memoir అనే పుస్తకం. ఉమర్‌పై మోపిన కేసులూ, రోజురోజుకీ ప్రపంచం పరస్పర విరుద్ధ సమూహాలుగా వేగంగా సమీకృతం అవుతున్న కాలంలో నిరసనల సంక్లిష్టతలను మనకు టార్చ్‌లైట్ వేసి చూపిస్తున్నాయి.
ఉమర్ హాజరు :
2022 డిసెంబర్లో తన సోదరి వివాహానికి హాజరు కావడానికి ఆయనకు లభించిన ఏడురోజుల విముక్తిని లెక్కవేయకపోతే, పోయిన నెల అంటే సెప్టెంబర్ 13 నాటికి ఉమర్ కటకటాల వెనక వుండి నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం గడిచింది. ఆ ఏడు రోజుల ఉపశమనం ఈ మొత్తం బాధాకరమైన కథనంలో ఒక తీపిక్షణం. ఆయనమీద పెట్టిన ఆరోపణలు ఒక భయానక నవలలో వుండే అంశాలలాగా కనపడతాయి. హత్య, చట్టవ్యతిరేక సమావేశం, దౌర్జన్యపు తిరుగుబాటు ఇలాంటవన్నీ ఆయనమీద పెట్టిన ఆరోపణలలో వున్నాయి. వీటన్నింటికంటే నిజంగా అత్యంత తీవ్రమైన ఆరోపణ ఊపా చట్టం కింద పెట్టిన కుట్ర, టెర్రరిస్టు చర్యల కేసులు. కార్యకర్తలు అత్యంత నిరంకుశమైన చట్టంగా పిలిచే ఈ ఊపా చట్టం ప్రజాస్వామ్య వ్యతిరేకులు చీకటి గదుల్లో రూపొందించిన చట్టం.
ఈ ఆరోపణలన్నీ చాలవన్నట్టు ఢిల్లీ పోలీసులు ఆయనపై ఆయుధాల చట్టం, రాజద్రోహ చట్టం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు పెట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్లను రెచ్చగొట్టటంలో ఆయన పాత్రధారి అనే ఆరోపణకు అనుబంధంగా ఈ ఆరోపణలన్నీ తయారయ్యాయి. ఆ సంఘటనలో 53 మంది చనిపోగా వందలాదిమంది గాయపడ్డారు. వాళ్ళలో అత్యధికులు ముస్లింలు. ఈ ఆరోపణల హోరులో, గందరగోళంలో హింస కారణంగా బాధితులైన ప్రజల వాస్తవ సంఖ్య బయటికి రాదన్నది ఒక కఠినమైన నిజం. వెన్నులో వణుకు పుట్టించే నిశ్శబ్దం న్యాయస్థానాల కారిడార్లలో ప్రతిధ్వనిస్తుంటుంది.
సినిమా ప్రారంభమైన 56 నిమిషాలకు ఉమర్ తెరపైకి తిరిగివస్తాడు. ఆయన కళ్ళల్లో ధృఢ నిశ్చయం వ్యక్తమౌతుంది. ఆయన గొంతులో ఎలాంటి ఊగిసలాటా వుండదు. ‘‘వాళ్ళు భయపెట్టదలచుకున్నది కేవలం నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా. దూరంగా నిర్బంధించడం ద్వారా వాళ్ళు మన గొంతులు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అబద్దాలతో, తమ భయాలతో మిమ్మల్ని ఖైదు చేస్తున్నారు. మీరు వాళ్ళని విజయం సాధించనివ్వవద్దు.’’
‘‘భయపడకండి! అన్యాయానికి వ్యతిరేకంగా మీ గొంతుల్ని శక్తివంతం చేయండి. అక్రమంగా ఖైదు చేయబడ్డ వారందరి విడుదలను డిమాండ్ చేయండి. ధృఢంగా నిలబడండి. అన్ని రకాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడండి’’ అనే ఆయన మాటలు మనం తక్షణమే స్పందించాల్సిన ఒక అవసరాన్ని గుర్తుచేస్తాయి. అప్పుడే, మనం అప్రమత్తంగా లేకపోతే మనం వినే అవకాశంలేని మాటల్ని ఉమర్ పలుకుతాడు. ‘‘లాజిమ్ హై కే హమ్ భీ దేఖేంగే’’ (అనివార్యం అయితే మేం కూడా చూసుకుంటాం). ఈ క్షణంలో ఉమర్ ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్ఫూర్తిని తనలో నింపుకున్నట్లు కనబడతాడు. గతానికి, వర్తమానికి మధ్య ఒక లంకెను అల్లుతాడు. అణచివేతకు గురైనవాళ్ళు తిరుగుబాటు చేసి తమ గొంతులను తిరిగి రాబట్టుకుంటారనే ఒక ఆశాజనకమైన భవిష్యత్‌ను మనలో కలిగిస్తాడు. సినిమా పూర్తి అయిన చాలాకాలంపాటు ఈ చిట్టచివరి వాక్యాలు ప్రేక్షకులలో అణచివేతకు గురైన ప్రజల పక్షాన నిలబడాల్సిన తక్షణ అవసరాన్ని పదే పదే జ్ఞప్తికి తెస్తుంటాయి. మొత్తంగా చూస్తే ‘ఖైదీ నెం. 626710 హాజర్ హై’ కేవలం నిర్బంధపు కథనం మాత్రమే కాదు. అది స్వేచ్ఛ స్వభావం గురించిన, మొక్కవోని తిరుగుబాటు కాంక్షకు సంబంధించిన ఒక బలీయమైన సినిమా. న్యాయంకోసం పోరాటం కొనసాగుతూనే వుంటుందని, ప్రతి ప్రతిఘటనలోనూ స్వేచ్ఛాస్ఫూర్తి కొనసాగుతూ వుంటుందని ఈ సినిమా చాలా శక్తివంతంగా మనకు గుర్తుచేస్తూనే వుంటుంది.
అనువాదం : సి.యస్.ఆర్. ప్రసాద్
…..
- నరేంద్ర పచ్ఖెడె : విమర్శకుడు, వ్యాసకర్త, రచయిత. ఆయన తన సమయాన్ని టొరాంటో, లండన్ , జెనీవాల మధ్య ప్రయాణంలో గడుపుతాడు.
- ఘజాలా : ఘజాలా వాహబ్ రాసిన ‘‘జన్మతః ముస్లిం ` భారతదేశంలో ఇస్లామ్‌కు సంబంధించిన కొన్ని సత్యాలు అనే పుస్తకం టాటా లిటరేచర్ లైవ్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2021లో గెలుచుకుంది. ఇదే పుస్తకానికి బెంగుళూరు లిటరరీ ఫెస్టివల్ బుక్ ఫ్రైజ్‌ను కూడా అదే సంవత్సరం పొందారు. ఆమె సంపాదకత్వంలో ‘‘ఫోర్సు’’ అనే పత్రిక 2003 నడుస్తోంది.
- జీన్ రౌచ్ : ఫ్రెంచ్ సినీ నిర్మాత, ఆంథ్రపాలజిస్ట్
- ఫ్రెడ్ వైజ్మాన్ : అమెరికన్ సినీ నిర్మాత, డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు.
- ఓర్వెలియన్ కల్పన : ఎరిక్ ఆర్ధర్ బ్లెయిర్ అనే బ్రిటిష్ రచయిత ఓర్వెల్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. స్టాలిన్ పాలనలో రష్యాలో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరింగిందనీ, అభూత కల్పన చేస్తూ రాసిన నవల అది. (అను)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.