
Reading Time: 3 minutes
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఈ వారాంతంలో ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ తను కూడా భాగస్వామిగా ఉన్న అత్యంత వివాదాస్పద తీర్పుకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడిరచారు. ‘‘తరచూ మా ముందుకు వచ్చే కేసుల్లో కొన్నింటికి పరిష్కారం దొరికేది కాదు. అయోధ్య (బాబ్రీ మసీదు రామజన్మభూమి) వివాదం విషయంలోనూ అదే జరిగింది. ఈ కేసు మూడు నెలలుగా నా ముందు ఉన్నది. నేను ఆ దేవుడి ముందు కూర్చుని నువ్వే ఏదన్నా పరిష్కారం చూపించాలని అడిగాను’’ అంటూ వివరించారు.
భారతదేశ అత్యున్నత న్యాయమూర్తి ఇచ్చిన స్పష్టమైన ఈ వివరణ బట్టి ఆయన ప్రార్థించిన మీదట దైవం మెరుపులా సాక్షాత్కరించి పరిష్కారం చూపించాడని మనం ఊహించుకోవాలి. చంద్రచూడ్, అతని సహన్యాయమూర్తులు వెలువరించిన తీర్పును బట్టి చూస్తే ‘నాకు ఆ భూమిని ఇవ్వండి. అక్కడ నాకు ఇంకో గుడి కట్టిస్తారు’ అని దేవుడు అడిగినట్లు భావించాలి. సదరు న్యాయమూర్తులు ఏం చేసారూ? దేవుని వాక్యానికి చట్టబద్ధత కల్పించడానికి నల్లకోటు తొడుక్కుని దేవుని వాక్యాన్ని తమ నోట పలికించారు అనుకోవాలి.దేవుడికి గుడి దక్కింది. ధర్మాసనం లోని ఐదుగురు న్యాయమూర్తులు దైవం ఇచ్చిన తీర్పులో విశ్వాసం ఉంచినందుకు వారికి తగిన తీరిలో గౌరవం కల్పించాడు. ఆ తీర్పు ఇచ్చే నాటికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గొగోయ్‌ను ఆ భగవంతుడు రాజ్యసభకు పంపాడు. దిగువ మెట్లపై ఉన్న మరో ఇద్దరు న్యాయమూర్తులు వంతులవారీగా దేశ ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించారు. ఇక మిగిలిన మరో ఇద్దరు కనిష్ఠ న్యాయమూర్తులలో ఒకరికి పదవీ విరమణ తరువాత గవర్నర్ పదవి, రెండవ వారికి కంపెనీలా జాతీయ అప్టిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్ పదవి దక్కేలా దేవుడు అనుగ్రహించాడు.
సుప్రీంకోర్టు ఇప్పటి వరకు వెలువరించిన తీర్పులలో అయోధ్య వివాదం మీద ఇచ్చిన తీర్పు మీద మాత్రమే న్యాయమూర్తుల సంతకాలు లేకపోవడం వెనుక దాగి ఉన్న మర్మం ఆ తీర్పు రచించడంలో దేవుని పాత్ర ఉండడమే అని మనకు ఇప్పటికి స్పష్టత వచ్చినట్లేగా. ఏది ఏమైనా తీర్పులో దేవుడు జోక్యం చేసుకున్నాడని ఆ రోజున వెల్లడికాలేదు కానీ ఇప్పుడు మనం రూఢచేిసుకోవచ్చుగా. చమత్కారాలను పక్కన పెడితే చంద్రచూడ్ చేసిన ప్రకటన అందోళన కరమైనదని అర్థం చేసుకోవడానికి ఐదు కారణాలు ఉన్నాయి.
మొదటిది : అయోధ్య వివాదంలో సుప్రీం ధర్మాసనం ఒక పరిష్కారం కనుగొనలేక పోయింది అనేది నిర్వివిదాంశం కాబట్టి తాము వివాదాన్ని పరిష్కరించామని చెప్పబూనడం నిజాయితీ రాహిత్యమే. మసీదును అక్రమంగా ధ్వంసం చేసిన ఆరోపణలు ఉన్న శక్తివంతమైన పార్టీకి తీర్పు అనుకూలంగా ఉండేలా చూసారు. బాబ్రీ మసీదు విధ్వంసం అత్యంత హేయమైన నేరంగా పరిగణించిన న్యాయమూర్తులు ఆ విధ్వంసానికి పాల్పడినవారు, కారకులు అయిన వారికే ఆ భూమిని కేటాయించడం ఎంత మాత్రం తప్పుగా భావించలేదు. కర్ర ఉన్న వాడిదే బర్రె అని చెప్పడం న్యాయమైన పరిష్కారం ఎలా అవుతుంది. కొత్తగా మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యకు వెలుపల ఐదు ఎకరాల స్థలం కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ద్వారా దైవికమయిన న్యాయం అందించారని మనల్ని నమ్మించడానికి జస్టిస్ చంద్రచూడ్ ప్రయత్నించడం హాస్యాస్పదంగా లేదూ. సుప్రీం ధర్మాసనం ముందు ఉన్న సమస్య వివాదాస్పద స్థలంలో ముస్లింల ప్రార్థనాలయం ఉన్నదా లేదా, కొంతమంది దుండగులు హింసాత్మకంగా ఒక వ్యక్తిని గానీ, ఒక మతానికి చెందిన వారిని గానీ వారి హక్కుభుక్తంలో ఉన్న భూమిని కైవశం చేసుకోవడం అనుమతించదగినదా కాదా అని తేల్చవలసి రావడమే. అయోధ్య వివాదాన్ని విచారించిన ధర్మాసనం ఈ ప్రశ్నను పరిష్కరించినతీరు ‘‘భారతీయ న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు తెచ్చేలా ఉన్నది’’.
రెండవది : అయోధ్య వివాదంలో దివ్యమైన తీర్పు ఇచ్చామని భావిస్తున్న (ప్రస్తుత) ప్రధాన న్యాయమూర్తి గ్యాన్వ్యాపి వివాదాన్ని పునఃపరిశీలించేందుకు (తద్వారా మరిన్ని వివాదాలకు దారి తీసేందుకు) ఎందుకు అనుమతించారో వివరించగలరా? 1991, ప్రార్థనా స్థలాల చట్టాన్ని అనుసరించి 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని మార్చేందుకు వీలులేదని స్పష్టమైన నిషేధం ఉన్నా ‘గ్యాన్‌వాపీ’ వివాదంలో ప్రధాన న్యాయమూర్తి ఈ చట్ట నియంత్రణలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? న్యాయ స్థానాలు తమ ముందున్న వివాదాలకు దైవికమైన తీర్పులు ఇవ్వడం మొదలు పెడితే హిందూత్వ శక్తులు దేశంలోని ముస్లింల ప్రార్థనా స్థలాల మీద దావాల మీద దావాలు వెయ్యడానికి ఊతం ఇచ్చినట్లు కాదా. ప్రధాన న్యాయమూర్తిగా తాను ఎలాంటి వారసత్వం వదిలివెళుతున్నారనేది చరిత్ర నిర్ణయిస్తుంది అని గత నెలలో చంద్రచూడ్ తన ప్రగాఢమైన అభిప్రాయాన్ని వెల్లడిరచారు. ఆయనకు అట్టే కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హిందూత్వ సంస్థలు వేసిన వందలాది విధ్వంసకర వాజ్యాలకు కోర్టు తలుపులు తెరిచారు ఆయన. బహుశా ఈ వాజ్యాలలో తీర్పులు అన్నీ జస్టిస్ చంద్రచూడ్ కొత్తగా రూపొందించిన ‘న్యాయదేవత’ పాదాల ముందు గౌరవంగా ఉంచుతారేమో.
మూడవది : వివాదంలో ‘ప్రతికక్షి’ అయిన ‘దేవుడినే’ ఈ వివాదానికి పరిష్కారం చూపమని జస్టిస్ చంద్రచూడ్ అడగడం ఏ రకంగా సరైనది? ఇది ప్రయోజనాల ఘర్షణకు దారి తియ్యదా? ఇప్పుడు చంద్రచూడ్ ప్రకటనలతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న హిందూత్వ రాజకీయ నాయకులు ` ఇలాంటిదే హిందూ ముస్లింల మధ్య నెలకొన్న వివాదంలో ముస్లిం న్యాయమూర్తి ముస్లింలకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఇది ‘అల్లా’ సూచించిన పరిష్కారం అని ప్రకటిస్తే అప్పుడు ఇదే హిందూత్వ రాజకీయ నాయకులు ఇది మతపక్షపాతం అని ఆక్రోశించేవారు కాదా.
నాల్గవది : వాస్తవం ఏంటంటే అయోధ్య వివాదంలో ఇచ్చిన తీర్పు న్యాయబద్ధం కాదని తెలిసే అందుకు సమర్ధనగా దేవుణ్ణి ఈ వివాదంలోకి లాగారు. ఆ రకంగా ఈ వివాదాస్పద తీర్పుకు దేవుణ్ణి బాధ్యుడిని చెయ్యడం అన్యాయం కాదా. తప్పుడు తీర్పులకు బాధ్యత వహించడానికి సిద్ధంగా లేని మరుగుజ్జు మనుషులు మాత్రమే ఇలాంటి నయవంచనకు పాల్పడతారు. అందుకే జస్టిస్ చంద్రచూడ్ తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించడం ఎంతైనా ఉత్తమం.
ఐదవది : రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయ సూత్రాలకు, చట్టాలకు లోబడి ప్రజలకు న్యాయం అందిస్తామని న్యాయమూర్తులు ప్రమాణం చేస్తారు. వారు వారి వారి వ్యక్తిగత జీవితాలలో ఏ దేవుడినయినా కొలుచుకోవచ్చు. ఏ పవిత్ర మత గ్రంథాల సారాన్నయినా అనుసరించవచ్చు. కానీ న్యాయం అందించేటపుడు వారి వ్యక్తిగత మత విశ్వాసాలు, వాళ్ళు కొలిచే దేవుళ్ళు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మత విశ్వాసాలు, దేవుళ్ళు మన దేశ రాజ్యాంగం కన్నా ఏ మాత్రం మిన్నకాదు. క్లిష్టమైన పరిస్థితులలో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన ధైర్యం ఇవ్వడానికి ఎవరికైనా దేవుడి మీద ఉండే నమ్మకం తోడ్పడవచ్చు గాక, అందులో తప్పు పట్టాల్సిన పనిలేదు. బాబ్రీ మసీదును విధ్వంసం చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఆ స్థలం దక్కనీయకుండా చేసేలా తీర్పు ఇవ్వడానికి గుండెనిండా ధైర్యం ఉండాలని నేనూ అంగీకరిస్తాను. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎన్నికలలో ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవాలని తహతహలాడుతున్న నేపథ్యంలో అయోధ్య వివాదాన్ని విచారించిన సుప్రీం ధర్మాసనానికి ధైర్యంతో పనిలేదు.
ఈ దేశాన్ని పరిపాలించే ప్రధాని తాను దైవాంశ సంభూతుడిని అనీ, తాను దేవుడి సాక్షిగా ఆయన ఆజ్ఞలను పాటిస్తానని ప్రకటించేసాడు. ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి కూడా ప్రధాని మోడీ వలె దైవాంశ సంభూతుడు కావడం ఈ దేశానికి పట్టిన అదృష్టంగా భావించాలి కామోసు. ఏది ఏమైనా జస్టిస్ చంద్రచూడ్ న్యాయదేవత కళ్ళకు ఉన్న గంతలనే కాదు మనందరి కళ్ళకు ఉన్న గంతలు విప్పినందుకు ఆయనకు మనం బహుదా కృతజ్ఞులంగా ఉండాలి.
— సిద్ధార్థ వరదరాజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.