
పర్యావరణానికి తీవ్ర విఘాతంగా షరావతి పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ ప్రాజెక్టు
కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన జలవిద్యుత్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. పచ్చటి అభయారణ్యంలో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరతామంటూ పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు తెగేసి చెబుతున్నారు. షరావతి లోయలో 2,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు చేస్తున్నా, ఇప్పుడు కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఈ ప్రాజెక్టుకు షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దానితోపాటు ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు ఓకే అయ్యాయి. అయినా పర్యావరణవేత్తలు మాత్రం ప్రాజెక్టును చాలా సంవత్సరాలుగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఒక్కటొక్కటిగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు వస్తుండటం పర్యావరణవేత్తలకు తీవ్ర నిరాశ మిగులుస్తోంది. ఎనిమిది వేల కోట్ల అంచనాలతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.
అసలు ఈ ప్రాజెక్టు ఏంటి? ప్రయోజనం ఎంత?
ఈ ప్రాజెక్టు తలకలలే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, శరావతి నది మీదుగా నిర్మించిన లింగనమక్కి రిజర్వాయర్ దిగువన ఉన్న గెరుసొప్ప రిజర్వాయర్ మధ్య నిర్మిస్తున్నారు. పనుల ప్రారంభానికి కొన్ని యంత్రాలను అక్కడికి ఇప్పటికే తరలించారు కూడా. దిగువ జలాశయం అయిన గెరుసొప్ప నుండి ఎగువ జలాశయం అయిన తలకలలేకు నీటిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పంప్ చేయాలని , విద్యుత్ ఉత్పత్తికి నీటి పరిమాణాన్ని ఉపయోగించాలని ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంస్థ కెపిసిఎల్ ప్రతిపాదించింది. రాత్రిపూట, నాన్-పీక్ అవర్స్ సమయంలో నీటిని పంప్ చేయడానికి గ్రిడ్ నుండి విద్యుత్తును ఉపయోగించడం, విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నీటి పరిమాణాన్ని ఉపయోగించడం దీని ఉద్దేశ్యం. దీని ద్వారా 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు దీని ఉపయోగం ఎంతో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం తరహాలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. షరావతి ప్రాజెక్టు కొనసాగింపులో భాగంగా బెంగళూరు నగరానికి తాగునీరు సరఫరా చేయాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన అందుకే ఈ ప్రాజెక్టును భుజానికెత్తుకొని మరీ ముందుకెళుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 5 సొరంగాలు, ఎనిమిది పంపిగ్ స్టేషన్లను నిర్మించాల్సి ఉంది.పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును పర్యావరణవేత్తలతో పాటు శివమొగ్గ, ఉత్తర కన్నడలోని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
పర్యావరణవేత్తల అభ్యంతరాలేంటి..!
ప్రాజెక్టు తొలి ప్రణాళిక ప్రకారం ఇది 53 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని దెబ్బతీస్తుంది. 16 వేల సంఖ్యలో వృక్షాలను తొలిగించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో అరుదైన సింహం, తోక కోతుల సంతతి ఉంది. అంటే ఈ ప్రాజెక్టు అరుదైన వృక్ష సంపదతో పాటు వన్యప్రాణులకు నష్టం కలిగిస్తుంది. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుంది కాబట్టే ప్రాజెక్టుకు తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది..
7,000 చెట్లు నేలరాలుతాయని భావించినా ఇది చిన్న సంఖ్య కాదని పర్యావరణవేత్త అఖిలేష్ చిప్పలి అన్నారు. దానితోపాటు పశ్చిమ కనుమలపై దాని ప్రభావం గురించి కొంచెం అవగాహన ఉన్న ఎవరూ ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వరని తేల్చిచెప్పారు. ప్రాజెక్ట్ ప్రాంతం సింహం తోక గల మకాక్ అభయారణ్యంలో భాగం, స్థానిక ఆవాసాలను ప్రభావితం చేసే ఇలాంటి ఏ కార్యాచరణయైనా ప్రమాదకరమని తెలిపారు.
అయితే నరికివేయాల్సిన చెట్ల సంఖ్యను ఏడు నుంచి ఎనిమిది వేలకు తగ్గించడం ద్వారా వృక్షజాలానికి కలిగే నష్టాన్ని తగ్గించాలనే షరతులు విధించి రాష్ట్ర పర్యావరణ బోర్డు ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని చెబుతున్నా, అది సాధ్యమయ్యే పనికాదని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ కనుమల జీవవైవిధ్యంపై ఈ ప్రాజెక్టు చూపే ప్రభావంపై స్థానికులలో అవగాహన కల్పించడానికి పర్యావరణవేత్తలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వారు స్థానికులతో కలిసి నిరసనలు చేపడుతున్నారు. చట్టపరమైన సహాయం తీసుకుంటూ న్యాయ పోరాటం సాగించాలని వారు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి యంత్రాలు తీసుకెళ్లడం, అక్కడికి చేర్చిన సమయంలో వృక్ష సంపద ఎలా నాశనం అయిందో కూడా వివరిస్తూ పర్యావరణ ప్రేమికులు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సిద్దమయ్యారు.
కోర్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపట్టడంతో నష్టం వాటిల్లిన అడవికి వాస్తవ ఖర్చును ప్రభుత్వం అంచనా వేయలేదు. ప్రాజెక్ట్ స్థలం వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన ప్రాంతం కావడం గమనించాల్సిన విషయం. దాని జీవవైవిధ్యం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోలేదు. లక్షలాది సంవత్సరాలుగా రూపుదిద్దుకున్న దట్టమైన అడవిని ఎవరూ తిరిగి సృష్టించలేరు. ఇంత గొప్ప అడవిని దెబ్బతీసి ప్రాజెక్టును అమలు చేయాల్సిన అవసరం ఏంటిదన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఇటీవలి సంవత్సరాలలో అంతరించిన అటవీ ప్రాంతం కారణంగా ప్రభావితమైన జాతులపై ఒత్తిడిని పెంచుతుందని భావిస్తున్నారు. 125 ఎకరాల దట్టమైన అడవిలో దాదాపు 245 ఎకరాల అటవీయేతర ప్రాంతంలో దాదాపు 16,000 చెట్లను నాశనం చేయడంతో లయన్- టెయిల్డ్ మకాక్‌లకు కలిగే సమస్యను అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా ఎత్తి చూపారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
షరావతి హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్‌ను ఎనర్జీ అండ్ వెట్‌ల్యాండ్స్ రీసెర్చ్ గ్రూప్ సమన్వయకర్త ప్రొఫెసర్ టీవీ రామచంద్ర తప్పుపట్టారు. ‘పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతమైన షరావతిలోయలో జల విద్యుత్ ప్రాజెక్టును అమలు చేయవలసిన అవసరాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత పర్యావరణం ఇప్పటికే పెళుసుగా ఉందని ఎత్తి చూపుతూ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో మనం ఎక్కువ రిస్క్ తీసుకోలేము. కేరళలోని వయనాడ్, కొడగు, చిక్కమంగళూరు , ఉత్తర కన్నడ జిల్లాలోని శిరూర్లలో ఇప్పటికే జరిగిన ప్రకృతి విలయాలను మనం గుర్తించాలని అన్నారు. పర్యావరణనికి ముప్పు తెచ్చిన ప్రతిచోటా ఇప్పటికే వేళ్లు కాల్చుకున్నాము. మనం కూడా అదే తప్పులు ఎందుకు చేయాలి?’ అని ఆయన ప్రశ్నించారు. సహజ వనరులను దోచుకోవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అని తీవ్రంగా విమర్శించారు.
2000 – 2003 మధ్య IISc శాస్త్రవేత్తల బృందం షరావతి లోయలో ఒక సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఏదైనా భారీ ప్రాజెక్టు కడితే ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యతకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది.
అసలు ప్రాజెక్టు పైనా అనుమానాలు
అనుకూలంగా లేని ప్రాంతంలో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం అంత అవసరమా అన్న అనుమానాలు ఇంజినీరింగ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు, దాని ద్వారా వచ్చే ప్రయోజనం విషయంలో ప్రభుత్వం పారదర్శకతను పాటించడం లేదని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలతో ప్రాజెక్టు నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్ విధానంలో నిపుణుడు, దేశవిదేశాలలో పనిచేసిన అనుభవం వున్న శంకర్ శర్మ షరావతి పంపింగ్ ప్రాజెక్టు అనవసరమైన ప్రాజెక్టుగా కొట్టిపారేస్తున్నారు. సహజమైన ఉష్ణమండల వర్షారణ్యాలకు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే గెరుసొప్ప నుండి తలకలలేకు నీటిని పంప్ చేయడానికి అవసరమైన విద్యుత్ శక్తి, పంప్ చేసిన నీటిని ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్ పరిమాణం కంటే ఎక్కువగా ఉందని శర్మ ప్రాజెక్టులోని లోపాన్ని ఎత్తి చూపారు. అంటే కొత్తగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కన్నా దానికోసం ఖర్చు చేసే విద్యుత్ ఎక్కవయినప్పుడు ఉపయోగం ఏంటన్నది ప్రశ్న. ‘ప్రభుత్వం దీనిని విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుగా చెబుతున్నప్పటికీ వాస్తవానికి, ఇది గ్రిడ్‌పై భారాన్ని పెంచుతుంది. ప్రీ-ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయగల విద్యుత్ కంటే గ్రిడ్ నుండి 24% ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వం మాతో డీపీఆర్ లేకుండా ప్రజా సంప్రదింపుల సమయంలో మేము వారిని ఎలా ప్రశ్నించగలం?’ అని ఇంజనీరింగ్ నిపుణుడు శర్మ ప్రశ్నించారు.
పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌కు మెరుగైన ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. బెస్ వ్యవస్థ చౌకగా పనిచేస్తుందని, అటవీ ప్రాంతంలో దీనిని చేపట్టాల్సిన అవసరం లేదని ప్రతి సబ్ స్టేషన్లో ఒక బీఈఎస్ఎస్ ని ఏర్పాటు చేయవచ్చంటున్నారు. దానితో విద్యుత్ ప్రసారంలో జరిగే నష్టాన్ని నివారించవచ్చని వెల్లడించారు. 2,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అనేక అనువైన ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల మార్గాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం దీనిని మొండిగా అమలు చేస్తుండటం వెనుక నేతలకు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనం భారీగా వుందన్న అభిప్రాయం ప్రజలలోకి వెళుతోంది.
ప్రాజెక్టు టెండర్లలోనూ న్యాయవివాదం
శరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును 8వేల కోట్ల అంచెనాలతో కర్నాటక ప్రభుత్వం ఆమోదించింది. పర్యావరణ అభ్యంతరాల నడుమే టెండర్లనూ ఆహ్వానించింది. ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ మేఘా ఈ టెండర్లను దక్కించుకుంది. తెలంగాణలో ఇదే తరహా ప్రాజెక్టు కాళేశ్వరంను పూర్తిచేసిన మేఘా సంస్థ భారీ అవినీతికి పాల్పడిందని ఒకపక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే విచారణ జరుపుతుంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం శరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఆ సంస్థకే కట్టబెట్టడం వెనుక ఎవరి హస్తం వుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మేఘా ఆర్థిక అవకతవకలపై కోర్టులలో కేసుల విషయాలను విపక్ష నేతలు ప్రస్తావిస్తున్నారు. మేఘా సంస్థ లార్సెన్ అండ్ ట్రోడో (ఎల్&టీ) వంటి దగ్గజ సంస్థతో పోటీపడి బిడ్ దక్కించుకుంది. దాంతో టెండర్ల మార్గదర్శకాల విషయంలో తప్పులు దొర్లాయని, కావాలనే కొన్ని రూల్స్ మార్చారని ఎల్ అండ్ టీ కోర్టు కెక్కింది. హైకోర్టు ఎల్ అండ్ టీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కెపిసిఎల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా ఎల్ అండ్ టీ సంస్థ పై కోర్టులో న్యాయపోరాటం సాగిస్తోంది.
ఒకవైపు టెండర్ల విషయంలో న్యాయ పరమైన చిక్కులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజల అభ్యంతరాల నడుమే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPCL) ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని వెళుతోంది. ముఖ్యంగా వేల సంఖ్యలో వృక్షాలు నరికేయాల్సి వస్తుండటం, భారీ సొంరంగాల నిర్మాణంతో పశ్చిమ కనుమల వృక్షజాలం ,జంతుజాలం మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటం అందరినీ కలవరపెడుతోంది. భారతదేశంలో మాత్రమే కనిపించే అరుదైన సింహం తోక మకాక్లు ఈ ప్రాంతంలో ఉండటం, ఇవి అంతరించిపోతున్న జాతి కావడం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఏదిఏదైనా ఇప్పటికే కర్ణాటక ఇంధన సంస్థతో పాటు కేంద్ర ఇంధన వనరుల సంస్థ ఆమోదం ప్రాజెక్టుకు లభించింది. రాష్ట్ర పర్యావరణ శాఖ షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు దొరుకుతాయా? పర్యావరణ ప్రేమికుల ఉద్యమాన్ని దాటుకొని ఈ ప్రాజెక్టు ఎంత వరకు ముందుకెళుతుందో చూడాలి.
– బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.