
రెండోసారి ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత అమెరికా తీసుకుంటున్న చర్యలు, ఉత్తర అట్లాంటిక్ దేశాల కూటమిలో లుకలుకల గురించి అర్థవంతమైన విశ్లేషణ చేయలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం మార్క్సిజం గురించి మౌలిక అవగాహన లోపమే. మౌలిక సూత్రీకరణలు విస్మరించటమే.
కొంత మంది మాదిరి నేను కూడా జీవితమంతా మార్క్సిజం గురించి సంశయాత్మాకంగా ఉన్నప్పటీకీ, వర్తమాన భౌగోళిక రాజనీతికి సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడానికి మార్క్సిజం తప్ప మరో సిద్ధాంతమేదీ లేదని గుర్తించాను.
నిజం చెప్పాలంటే ఈ వ్యవస్థ గురించి కొంతమేరకు వివరించటానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు, అంతర్జాతీయ సంబంధాల్లో నయా వాస్తవికవాదాన్ని సమర్ధవంతంగా ప్రతిపాదించిన రచన 1979లో కెనెత్ వాల్జ్ రాసిన ‘థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’ గ్రంథం. ఇందులో కీలకమైన అంతర్దృష్టితో చక్కగా వివరించాడు. నయా వాస్తవికవాదం ప్రకారం ప్రతి రాజ్యం తన ప్రయోజనాల కోసం పని చేస్తుంది. ఇతర దేశాలు పోటీ పడినపుడు తన సాపేక్ష శక్తి సామర్ధ్యాలతో తృప్తి ఉంటుంది.
ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యన్ల దాడి ఐరోపా దేశాలలో భయంతో పాటు అమెరికా ఐరోపా రాజ్యాల మధ్య విబేధాలకూ కారణమైంది. ఉక్రెయిన్ లేదా ఐరోపా యూనియన్‌తో పెద్దగా సంప్రదించకుండానే యుద్ధాన్ని ముగిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొరటుగా తేటతెల్లం చేశాడు. ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని చూస్తే అంతా తర్కబద్ధంగా ఊహించదగినదిగానే కనిపిస్తుంది.
నయా వాస్తవిక వాదం ప్రకారం, ఒక నాటో సభ్యరాజ్యంగా చేరబోతున్న ఉక్రెయిన్ సంభావనీయ శత్రుదేశంగా, వ్యూహాత్మక ముప్పుగా రష్యాలాంటి దేశం భావిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఉక్రెయిన్ మార్గం ద్వారానే సోవియట్ మీద దురాక్రమణదాడికి పాల్పడ్డారని గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంది. కనుక ఒక చారిత్రాత్మక జ్ఞాపకం ఈ వ్యూహాత్మక ముప్పుకు కారణం అవుతుంది. ఆ విధంగా ఏ రకమైన నాటో విస్తరణ అయినా రష్యా ప్రభావిత ప్రాంతంలో జరిగితే, ప్రత్యేకించి ఉక్రెయిన్‌లో నాటో కార్యకలాపాలు పుంజుకుంటే దానికి రష్యా తీవ్రంగా స్పందిస్తుందనటంలో సందేహంలేదు. 2014లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్న తరువాత దుందుడుకు వాస్తవికవాదం – అఫెన్సివ్ రియలిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జాన్ మియర్షెయిమర్ ఈ వాదన ముందుకు తెచ్చాడు.
రష్యన్ల చర్యలు కూడా ఐరోపాలో భయాన్ని మరింత పెంచాయి. దానికి కూడా రష్యన్ల చేతుల్లో దురాక్రమణకు గురైన చేదుజ్ఞాపకాలు యూరోపియన్లకూ ఉన్నాయి. అంతేకాదు. అమెరికా మిత్రదేశాలకు రష్యా సవాలు విసిరిననా, దీనికి అదనంగా అమెరికా విషయానికి వస్తే నాటో మిత్రదేశాలకు రష్యా ముప్పు తెస్తుందని లేదా ఐరోపా యూరోపియన్ యూనియన్ను ఇక్కట్లపాలు చేసినా అది అమెరికాకు సవాలు విసరటంగానూ, అమెరికాను ఇరుకున పెట్టాలనుకున్నట్లుగానూ అమెరికా భావించింది. ఆ విధంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి రంగం సిద్దమైంది, 2022 ఫిబ్రవరిలో రష్యా దాడికి పాల్పడింది.
జాగ్రత్తగా చూస్తే అమెరికా, ఐరోపా ప్రయోజనాల మధ్య తేడా ఉంది. రష్యా పలుకుబడిని పరిమితం చేయటం, శిక్షించటం వరకూ చేస్తే చాలని అమెరికా ఆశించింది. కానీ యూరోపియన్లకు ప్రత్యేకించి ఉక్రెయిన్‌కు రష్యాను ఓడించటం ప్రధానం.
వాస్తవంలో రష్యన్లు, ఉక్రేనియన్లు మాత్రమే పోరులో ఉన్నారు, అమెరికా ప్రధాన పాత్రధారి అయితే యూరోపియన్లు ద్వితీయ పాత్రధారులు. నయా వాస్తవికవాదుల సిద్ధాంతం ప్రకారం తొలి ఏడాది పోరులోనే అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించింది. ఆ తరువాతనే ఆశలు విస్తరించాయి. ఈ యూద్ధానికి అమెరికా పెట్టుబడి పెట్టినంతగా లాభాలు రావటం లేదన్న వాస్తవాన్ని గుర్తించిన అమెరికా తన వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితికి నెట్టబడింది. కానీ అమెరికా తుది నిర్ణయం తీసుకోవటం ఉక్రెయిన్ పాలకులకు ఇష్టం లేని వ్యవహారం. ఉక్రెయిన్‌కు, ఐరోపా భాగస్వామములకు అమెరికా చర్యలు ఆశాభంగం కలిగిస్తాయి.
2001లో ఆఫ్ఘనిస్తాన్పై దురాక్రమణకు పాల్పడిన అమెరికా దక్షిణ ఆసియావాసులకు చక్కటి ఉదాహరణ. అమెరికాకు వ్యూహాత్మక ముప్పు ఆల్‌ఖైదా, తాలిబాన్ల నుండి ముప్పు లేదు. అమెరికా దృష్టిలో తాలిబాన్లంటే చికాకు పెట్టే సమస్య మాత్రమే. అది కూడా ఆల్‌ఖైదాకు ఆశ్రయం ఇచ్చినంతకాలమే.
తాలిబాన్లు నేరుగా అమెరికా భద్రతకు ముప్పు కాదు, కానీ వారు పాకిస్తాన్ ప్రయోజనాలకు విరోధులైన ఆఫ్గనిస్తాన్‌కు అమెరికా సహకరించటం పాకిస్తాన్‌కు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అమెరికా మద్దతు ఇచ్చింది. ఒకసారి ఆల్‌ఖైదాను అంతం చేసి, 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను చంపిన తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఏం చేయాలో తెలియని నిస్తేజంతో కొనసాగుతూనే ఉంది. కొనసాగటానికి ఎటువంటి వ్యూహాత్మక కారణం లేదు. కానీ ఏ క్షణంలోనైనా బయటకు వెళ్లేందుకు చూసింది. తొలిసారి అధికారానికి వచ్చిన ట్రంప్ 2020లో తాలిబాన్లతో ఒప్పందం చేసుకున్నట్లుగానే రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాతో అవగాహనకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగమే ఈ ప్రకటనలు. కనుక నయా వాస్తవికవాద సిద్ధాంతం ఉక్రెయిన్ కోసం తీసుకుంటున్న నిర్దిష్ట నిర్ణయాల గురించి స్పష్టమైన, సంక్షిప్త, శక్తివంతమైన వివరణ ముందుంచుతుంది. కానీ విస్తృత సమస్యలను వివరించటంలో అది ఇప్పటికీ విఫలమౌతున్నది. ఉదాహరణకు మ్యూనిచ్ భద్రతా సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఎందుకు తీవ్రమైన జగడాలమారి ఉపన్యాసం చేసినట్లు ?
ఉక్రెయిన్‌పై ఒప్పందం అర్ధం చేసుకోదగినదే, కానీ అట్లాంటిక్ కూటమిలో విభేదాలు అమెరికా నుంచి ప్రత్యేక రాజకీయ, వ్యూహాత్మక మార్గాన్ని అన్వేషించేందుకునేందుకు యూరోపియన్ దేశాలను ప్రేరేపిస్తుంది. అది అమెరికా అధికారం, ప్రయోజనాలకు ప్రత్యక్ష బెదిరింపు. ప్రత్యేకించి ఎదుగుతున్న చైనా నుంచి అమెరికా అధికారానికి పెద్ద ముప్పు ఉన్నటువంటి స్థితిలో వాన్స్, ట్రంప్ యంత్రాంగం చర్యలు చైనా ప్రభావం పెరిగేందుకు అవకాశం ఇచ్చే చర్యే ఇది.
నయా వాస్తవికవాద సిద్దాంతం విశ్లేషణ, సూత్రీకరణ కంటే ఇది భిన్నమైనది. అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషించటంలో నయా వాస్తవిక వాదానికి భిన్నమైనది మార్క్సిస్టు సిద్ధాంతం అంగీకరించటానికి వీలైన సమాధానాన్ని ఇస్తుంది. పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిర్భవించిన మార్క్సిజం అది మనకు స్పష్టంగా కనిపించింది. ఉద్పాదక పద్ధతిలో మార్పులు వచ్చినపుడు అంతకు ముందున్న సంబంధాల రూపాలన్నీ రెండు సాధారణ బృందాలుగా పెట్టుబడితో ఉన్నవారు, పెట్టుబడితో ఉన్నవారికోసం పనిచేసే వారుగా మారాయని మార్క్సిజం చెబుతుంది. పెట్టుబడితో ఉన్న వారు తమ సంపదలను విస్తరించుకొనేందుకు కార్మికులు చేసిన శ్రమకు ఎంత వీలైతే అంత తక్కువగా చెల్లించేందుకు చూస్తారని కమ్యూనిస్టు ప్రణాళిక విశ్లేషించింది. యజమానులు వస్తువులు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సరిపోయేదిగా మాత్రమే అది ఉండేది, తరువాత యజమానులు ఎంత వస్తే అంత ఎక్కువ ధరకు వాటిని అమ్మేవారు.
కమ్యూనిస్టు రాజ్యాలు, కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రణాళిక పెట్టుబడిదారీ వ్యవస్థకంటే భిన్నమైనదీ, ఉపయోగకరమైనదని ప్రపంచాన్ని నమ్మించటంలో విఫలమయ్యారు. వారు ప్రతిపాదించిన కార్మికవర్గ నియంతృత్వం సూత్రంలో నియంతృత్వం మోతాదు ఎక్కువైంది. మార్క్సిస్టు, సోషలిస్టు ఆలోచనా విధానం నుంచి తలెత్తిన ప్రతిఘటన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలతో నడుస్తున్న సమాజాల్లోని కులీనులు, దోపిడీదార్లు రాజీపడేట్లు చేసింది. కార్మిక సంఘాలు, నిరసనలు, అమెరికాలో జాన్ డివే వంటి వారు, బ్రిటన్‌లో ఫాబియన్ సోషలిస్టులు, అదే విధంగా ఐరోపాలోని సోషల్‌డెమోక్రటిక్ పార్టీలతో మౌలికమైన పురోగామి మార్పులకు దారి తీసింది. పెట్టుబడిదారీ విధానంలోని అత్యధిక దోపిడీ వ్యవస్థలకు పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాలను సృష్టించేందుకు దారి తీశాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవటం, దానితో పాటే ప్రచ్ఛన్న యుద్ధం ముగియటంతో పెట్టుబడి కేంద్రీకరణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో గత కొన్ని దశాబ్దాలుగా అసమానత పెరగటానికి దోహదం చేసింది. ప్రపంచమంతటా ధనికులకు పన్నుల తగ్గింపుతో పాటు సాంఘిక సంక్షేమ పథకాలను మెల్లగా ధ్వంసం చేసేందుకు దారితీసింది.
ట్రంప్ ప్రభుత్వాన్ని పెద్ద సంఖ్యలో బిలియనీర్లతో నింపారు. కులీనులపై పర్యవేక్షణకున్న అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. వర్గదృష్టితో చూస్తే అమెరికాలోని పాలకవర్గాలకు శత్రువు ఎవరంటే ఐరోపాలోని సంక్షేమ వ్యవస్థలు. సమాజంలోని ఎగువ ఒక శాతం మంది వద్ద సంపద కేంద్రీకరణ విషయంలో అమెరికా రష్యాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. అమెరికాలో ఒక శాతం జనాభా వద్ద 35.5 శాతం సంపద కేంద్రీకృతమై ఉంటే రష్యాలో 35 శాతం కేంద్రీకృతమై ఉంది. అత్యధిక ఐరోపా రాజ్యాలలో ఇది ఇరవైశాతానికి దగ్గరగా ఉంది. యూరోపియ్ దేశాల్లో 1 శాతం జనాభా చేతుల్లో సగటున 20 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. ఒక్క హంగరీలోనే అత్యధికంగా 1 శాతం జనం చేతుల్లో 33 శాతం సంపద పోగుపడింది. హంగరీ నేత ఒర్బాన్ దీర్ఘకాలంగా ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మద్దతుదారుగా ఉన్నాడు.
ఒక మార్క్సిస్టు కోణంలో చూస్తే ఉక్రెయిన్‌కు ఇచ్చే మద్దతుకు అమెరికా స్వస్తిపలుకుతుంది. ఇదే సమయంలో దోపిడీని, పెట్టుబడి కేంద్రీకరణను ప్రతిఘటించే ప్రతి రాజకీయ పార్టీని అణగదొక్కేందుకు చూస్తుంది. మ్యూనిచ్ భద్రతా సమావేశంలో చేసిన తొలి ప్రసంగం కంటే కొద్ది రోజులు ముందు జెడి వాన్స్ పారిస్‌లో జరిగిన కృత్రిమమేథ సమావేశంలో అమెరికా టెక్నాలజీ ప్రత్యేకించి కృత్రిమ మేథ కంపెనీల మీద అతి నియంత్రణలను విధిస్తున్నారంటూ సభ్య దేశాలపై గర్జించాడు. (కృత్రిమ మేథలో ఎంతో ఆసక్తి కలిగిన టెక్ బిలియనీర్ పీటర్ థియెల్ జెడి వాన్స్ ప్రముఖ సమర్ధకులలో ఒకడు). సామాజిక సంక్షేమ నిబంధనలైన కనీస వేతనం, నిర్దిష్ట పనిగంటలు, బాల కార్మికుల నిషేధం, అదే విధంగా రక్షణ చర్యల నిబంధనలు వంటివి తమ పోటీతత్వాన్ని నీరుగారుస్తున్నాయంటూ పారిశ్రామిక వేత్తలు వాదిస్తున్న తీరును జెడి వాన్స్ ప్రకటనలు గుర్తు చేస్తున్నాయి. సంపదలను గరిష్టంగా పొందటమే లక్ష్యంగా ఉన్నపుడు దానికి అడ్డం వచ్చే ఏ నియంత్రణలైనా గిట్టనివే. అందువలన పెట్టుబడి మరింతగా పోగుపడాలంటే స్వయంప్రతిపత్తితో కూడిన నిలకడైన విధానాలు అమలు చేసే యూరప్ పెద్ద ఆటంకంగా మారుతుంది.
నయా వాస్తవికవాద సిద్ధాంతం వర్తమాన అమెరికా చర్యల గురించి పాక్షిక సమాధానాలు మాత్రమే ముందుంచుతుంది. ఏం జరుగుతుంది, ఎందుకు అనే దానికి మార్క్సిజం మరింత సమగ్ర రూపాన్ని అందింస్తుంది. నిజానికి పెట్టుబడి పోగుచేసుకోవటమనే ధనికుల ఆసక్తి, ఇతరులకు వ్యతిరేకంగా మరింత అధికారాన్ని కలిగి ఉండటం రాజ్యాల ప్రాథమిక ప్రేరణని చెప్పే నయా వాస్తవికవాదుల వివరణ మన కాలంలో పెద్ద అంతర్జాతీయ సమస్యలలో ఒక సమస్యను మనముందు అపరిష్కృతంగా వదిలిపెడుతుంది. మన చావును మనమే కొని తెచ్చుకునేరీతిలో తెలిసికూడా పర్యావరణ సమస్యపై సంపన్న దేశాలు ఎందుకు తగిన రీతిలో జోక్యం చేసుకోవడానికి సిద్ధం కావటంలేదన్న ప్రశ్నకు నయా వాస్తవికవాదం సమాధానం చెప్పలేకపోతోంది.
నాగరికతల సంఘర్షణ లేదా చరిత్ర అంతం వంటి సిద్ధాంతాల కంటే వర్తమాన ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవడానికి నయా వాస్తవిక వాదం కానీ, మార్క్సిజంకానీ మెరుగైన మార్గాలను, విశ్లేషణ పద్ధతిని మనకందిస్తున్నాయి. మిగిలిన సిద్ధాంతాలు ప్రతిపాదించే విశ్లేషణ పేలవంగా ఉంటుంది. ఈ రెండు సిద్దాంతాలు ఎంతో మెరుగైన విశ్లేషణ చేస్తున్నాయి. మార్క్సిజం ముందుంచుతున్న పరిష్కారాల పట్ల నా సంశయాత్మకాన్ని అలాగే ఉంచుకుంటూనే నయా వాస్తవికవాదం ఏవిధమైన పరిష్కారాలు చూపటం లేదు. దీంతో నయా వాస్తవికత వాదం కంటే వర్తమాన పరిణామాలను అర్థం చేసుకోవడానికి మార్క్సిజమే మెరుగైన సాధనం. ఎందుంటే మన చుట్టూ ఏమి జరుగుతుంది అని చెప్పటంతో పాటు ఎందుకు జరుగుతుంది, రేపటి పర్యవసానాలు ఏమిటన్న విషయాలను కూడా మార్క్సిజం స్పష్టంగా వివరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న బహుముఖ సంక్షోభాలను అర్థం చేసుకోవడానికి మార్క్సిజం మేలిమి సాధనం. దానికి ఇంతవరకూ ప్రత్యామ్నాయం ముందుకు రాలేదు. కానీ మార్క్సిజాన్ని వదిలేసిన జనం ప్రపంచం తగలబడుతుంటే ఎందుకు తగలబడుతుందో, ఎలా ఆర్పాలో తెలీక నిశ్చేష్టులై చూస్తున్నారు. ప్రపంచాన్ని తగలబెడుతున్న వారిని మూర్ఖులని ఓ మాట అనేసుకుని పక్కకి తప్పుకుంటున్నారు.
– ఒమాయిర్ అహమ్మద్
(ఒమాయిర్ అహమ్మద్ ‘జిమ్మీ ద టెర్రరిస్ట్’ నవలను రాశారు. ఈ నవల మాన్ ఆసియన్ లిటరరీ ప్రైజ్ కోసం వడపోసిన వాటిలో ఒకటిగా ఉంది. అంతేకాకుండా క్రాస్‌వర్డ్ అవార్డును రచయిత ఒమాయిర్ అందుకున్నారు)
అనువాదం : ఎం కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.