
ఛత్తీస్గడ్ అడవులలో జరిగిన ఎన్కౌంటర్లలో మృతుల సంఖ్య గురించి మీడియా వార్తలు అందింస్తుంది. ఈ వార్తలను బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే కుంబింగ్ ఆపరేషన్లలో మావోయిస్టులు గాయపడరు, లొంగిపోరు లేదా పోలీసు- సైనిక బలగాలు అదుపులోకి తీసుకోరు. వారు నేరుగా మరణిస్తారంతే. వినడానికి విచిత్రంగా లేదు.
మీడియాలో వచ్చే ఈ వార్తలు ఎప్పుడూ ఒకే మూసలో ఉంటాయి. ”విశ్వసనీయ సమాచారం అందడంతో భద్రతా బలగాలు మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి చేరుకన్నాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ”ఈ కాల్పులలో ఒకరిద్దరు కానిస్టేబుళ్లో, జవానులో లేక ఒక ఎస్ఐ లేక మేజరో గాయపడ్డారనో వార్తతో పాటు ఈ సంఖ్య నలుగురి నుండి ఇరవై మంది వరకు ఉండొచ్చని మీడియా తెలుపుతుంది.
ఎన్కౌంటర్ జరిగిన తీరు, బలగాల కథనంలో వాస్తవాలు తెలుసుకోవడానికి అడవులలోని సంఘటనా స్థలానికే వెళ్లనక్కరలేదు. పడక్కుర్చీ వ్యూహకర్తలకు అయినా, మీడియా వ్యాఖ్యానాలకయినా నిజం ఏమిటో తెలుసు. బలగాలు చేపట్టిన ఆపరేషన్ మావోయిస్టులను కాల్చి చంపడానికి ఉద్దేశించినవే తప్ప వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడానికి ఉద్దేశించినవి కావు అనేది బహిరంగ సత్యమే.
బలగాలు జరిపిన కాల్పులలో మావోయిస్టులు మరణించడం ద్వారా అమరత్వం అందుకోవాలని తహతహలాడిపోవడానికి వాళ్లేం ‘ఫిదయీ‘లూ కాదు. శ్రీలంకలోని ‘తమిళ ఈలం టైగర్స‘ వంటి వారూ కాదు.
అలాంటి నాయకులు ఉన్న సందర్భాలలో మాత్రమే, ప్రభుత్వం మావోయిస్టు నాయకుల తలలకు రివార్డు ప్రకటిస్తుంది. వారికి రక్షణగా ఉన్న బృందం మాత్రమే చివరి మనిషి, చివరి తుపాకి గుండు వరకు పోరాడాలనే సూత్రాన్ని ఆచరిస్తారు. అలాంటి సీనియర్ నాయకులు వేర్వేరు కారణాలతో చట్టం ముందు లొంగిపోయిన సందర్భాలూ మనం చూశాము.
ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్లు అన్నింటా మావోయిస్టు దళ సభ్యులు మృతి చెందడమే తప్ప, పట్టి బంధించినట్టో, గాయపడినట్టో, వారంతట వారే లొంగిపోయినట్టో ఎక్కడా సమాచారం ఉండడం లేదు. గాయపడిన వారికి తగిన వైద్య సదుపాయాలు అందించడం కనీస మానవత్వం కదా. రాజ్యం ఎంత హింసకు పాల్పడుతున్నా జనాన్ని నమ్మించడం కోసమైనా ఇలాంటి ఒకటి, రెండు సంఘటనలను ప్రచారంలో పెట్టిన దాఖలా కూడా లేదు.
చివరి మనిషి, చివరి గుండు దాకా పోరాడాలి అనే మావోయిస్టు పంథామూలంగా భద్రతా బలగాలకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా చూసుకోవడానికి గానూ ఇలా కనిపిస్తే కాల్చివేతకు పాల్పడడం ద్వారా దళ సభ్యులను లొంగిపోయేలా ప్రలోభపెట్టవచ్చు అనేది బహుశా సైనిక బలగాల వ్యూహం కావచ్చు.
నిజమే ఈ మధ్యకాలంలో దళ సభ్యుల లొంగిబాటుకు ఒక్కోసారి మూకుమ్మడిగా, సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ప్రచారం కూడా కావచ్చు. తిరుగుబాట్లను ఎదురుకొనే బలగాల వ్యూహంలో భాగం కావచ్చు.
బలగాల కాల్పులలో గాయపడడం మూలంగానో, మందుగుండు ఖాళీ అయిపోవడం మూలంగానో పోరాటం కొనసాగించలేని దళ సభ్యులు లొంగిపోవడానికి సిద్ధం కావచ్చు. కొన్ని సందర్భాలలో గాయపడిన వారిని సహచర దళ సభ్యులు తమ వెంట తీసుకువెళుతుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో జరిగిన కాల్పులలో దళ సభ్యుల మరణాల సంఖ్య చూస్తుంటే అందుకు కూడా అవకాశాలు లేనట్లు కనబడుతున్నాయి.
‘2023 డిసెంబరు నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఒక సంవత్సరకాలంలోనే 380 మంది నక్సలైట్లను హతమార్చినట్టుగా’ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటులో ప్రకటించారు.
సున్నితంగా చెప్పుకోవాలంటే మావోయిస్టుల సంస్థాగత బలంతో పోల్చి చూస్తే ఈ మరణాల సంఖ్య చాలా ఎక్కువ. అమిత్ షా ప్రకటించిన సంఖ్యలో గాయపడిన ఆదివాసుల సంఖ్య వివరాలు లేకపోవడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే భద్రతా బలగాలు నైతిక న్యాయ మార్గాన్ని ఉల్లంఘిస్తున్నాయా అనే ప్రశ్న ఎదురువక మానదు.
నైతిక, న్యాయ మార్గం..
మధ్య భారతదేశంలో నెలకొన్నది సైనిక ఘర్షణ కాదు. కాబట్టి అంతర్జాతీయ మానవతా చట్టం(ఐహెచ్ఎల్) ఇక్కడ వర్తించదని ఎవరైనా వాదించవచ్చు.
వాస్తవానికి ఒకరకంగా చెప్పుకోవాలంటే తిరుగుబాటు పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఐహెచ్ఎల్ మార్గదర్శకాలు వర్తించాలంటే మధ్య భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు రెండు ప్రమాణాలకు లోబడి ఉండాలి. ఒకటి తీవ్రత, రెండవది సాయుధ గ్రూపులు ఘర్షణతో భాగస్వామిగా ఉండడు.
ఐహెచ్ఎల్ మార్గదర్శకాలు వర్తించవు అనుకున్నా అంతర్జాతీయ స్వభావంలేని ఘర్షణలు నెలకొని ఉన్న పరిస్థితులలో జెనీవా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 3 వర్తిస్తుంది. మన దేశం ఈ ఒప్పందం మీద సంతకాలు కూడా చేసింది. ఆ ఆర్టికల్ ఏం చెబుతుందంటే..
1. గాయపడిన మూలంగానో, నిర్బంధంలోకి తీసుకున్న మూలంగానో ఏ వ్యక్తి అయినా ఘర్షణలో క్రియాశీల పాత్ర పోషించని పరిస్థితులలో ఉంటే అతని పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి.
అలాంటి వ్యక్తుల పట్ల ఎక్కడైనా, ఎప్పుడైన ఈ దిగువ పేర్కొన్న రీతిలో చర్యలు తీసుకోవడం నిషేధం.
(అ) అటువంటి వ్యక్తిపట్ల, అతని ప్రాణుల పట్ల ఎలాంటి హింసకు పాల్పడరాదు. ముఖ్యంగా ఏ రకంగానూ హత్యకు పాల్పడరాదు.
(ఈ) శిక్షలు విధించి ఉరితియ్యడం తదితర మార్గాల ద్వారా ప్రాణాలు హరించరాదు.
2. గాయపడి, అనారోగ్యంతో ఉన్నవారిని తీసుకువెళ్లి వైద్య సేవలు అందేలా చూడాలి.
ఒప్పంద చట్టాలు వర్తిస్తాయా లేదా అన్నదానితో సంబంధం లేకుండా సంప్రదాయ రీతిలో మానవతా దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ఇది అనుల్లంఘనీయ నియమం.
”ఇది సాధారణ పౌరులందరికీ వర్తిస్తుంది. ఘర్షణలతో ప్రత్యక్షంగా భాగస్వాములు కాని వారితో పాటు, ఘర్షణలో క్రియాశీల పాత్ర పోషించలేని సిస్సహాయ స్థితిలో ఉన్నవారికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. అధికార శక్తులు ఈ మౌళిక గ్యారంటీని అమలు చెయ్యాలి”. ఎమమర్జెన్సీ కాలంలో అయినా సరే, దేశం విపత్తును ఎదురుకొంటున్న సమయంలో కూడా ఈ సూత్రాలు అనుల్లంఘనీయాలు.
భారతదేశం, అంతర్జాతీయ మానవతా చట్టానికి(ఐహెచ్ఎల్)లోబడి దేశీయ చట్టాలు ఉండేలా చూసుకుంటానని ప్రమాణం చేసింది. సదరు ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందాన్ని గౌరవించడానికి ఉభయ పక్షాలు కట్టుబడి ఉండాలి’.
కాబట్టి దేశీయ చట్టాలు హత్యలకు, మానవ హక్కులకు రెండింటికీ వర్తిస్తాయి. సాయుధ ప్రమాదం కానీ తిరుగుబాటుదారులను హతమార్చడం ఏ విధంగానూ అనుమతించదగినది కాదు.
ప్రస్తుతం మధ్య భారతదేశంలో కొనసాగుతున్న ‘శతృసంహార పరంపరలో’ గాయపడినవారి, బందీలుగా చిక్కిన వారి వివరాలు వెల్లడించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇందుకు జవాబుదారితనం వహించాలి.
ఫలితాలు చూపాలనే ఒత్తిడి.. చట్టాన్ని చాపచుట్టేస్తుంది..
అధికార స్థాయిలో సాధ్యమైనంత త్వరగా ఈ ‘ఆపరేషన్’ను ముగించాలనే తొందరపాటు నెలకొని ఉన్నది.
”నేను బాధ్యతాయుతంగా ఈ సభకు విన్నవించేది ఏంటంటే 2026 మార్చి 21 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా పెకలించివేస్తాం.” అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్లో ప్రకటించారు.
ఆ గడవు నాటికి ముంచుకు వస్తున్న ఎన్నికలు జాతీయస్థాయిలో గానీ రాష్ట్రాల స్థాయిలోగాని ఏమీ లేవు. అయినా కేంద్ర హోంమంత్రి ఒక ‘డెడ్ లైన్’ ప్రకటించేశారు.
‘2026 మార్చి 21 అని గడవు ప్రకటించడం వెనుక ప్రత్యేకమైన సందర్భం ఏమన్నా ఉందా’ అని ఈ మధ్య జరిగిన ఇంటర్యూలో అమిత్‌షాను ప్రశ్నించారు. దానికి ఆయన ‘కేవలం నమ్మకాలతో, విశ్వాసాలతో నక్సలిజాన్ని నిర్మూలించలేం. ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన పని’ ఆధారంగా నేను ఆ ప్రకటన చేశాను అని సమాధానం చెప్పారు.
పూర్తి చేసిన ‘పని’ని- ‘తుడిచిపెట్టు, పట్టు సాధించు, నిర్మించు’ అని మూడు ముక్కల వ్యూహంగా చాలా తేలిగ్గా వివరించారు. ఆపరేషన్ ఉధృతం చెయ్యడం, కాగితం మీద పడ్డ సిరా చుక్కలా వ్యాపిస్తూ(నక్సల్స్) స్థావరాలను స్వాధీనం చేసుకోవడం(నక్సల్స్‌కు) నిధులు అందకుండా బిగపట్టడం,(నక్సల్స్, ప్రభావిత ప్రాంతాల్లో) అభివృద్ధికి పట్టం కట్టడం ఇదీ కేంద్రప్రభుత్వ నాలుగు అంచెల వ్యూహం అని పేర్కొన్నారు.
అమిత్ షా పార్లమెంట్లో చేసిన ప్రకటనను బట్టి ఈ నాలుగంచెల వ్యూహం ద్వారా 2026 మార్చి 21 నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపడానికి కేంద్రప్రభుత్వం కంకణబద్దురాలై ఉన్నది అని భావించాలి.
మొదటి వ్యూహంలో భాగంగా ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. షా మాటల్లోనే చెప్పుకోవాలంటే ”ఎవరైతే చేత తుపాకి బట్టి హింసకు బాధ్యులు అయ్యారో వారి మీద నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలి. అందుకే మేం భారీ ఎత్తున బలగాలను వినియోగిస్తున్నాం”
2018, 2019 సంవత్సరాలలో కశ్మీర్లో చేపట్టిన సైనిక చర్య మూలంగా లొంగిపోయిన ఉగ్రవాదుల సంఖ్య సున్నాగా ఉండడానికి కారణం ఏమిటని ప్రశ్నించినపుడు ఆ ఆపరేషన్ బాధ్యుడిగా ఉన్న సైనిక జనరల్ ఇచ్చిన సమాధానానికి సరిపోలుతా ఉన్నది షా ప్రకటన
భారీ ఎత్తున బలగాలను వినియోగించడం అంటే సర్వసాధారణంగా ‘అవసరమైన కనీస బలప్రయోగం’ చెయ్యడమా లేక ‘బలగాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించడమా?’
గతంలో ప్రభుత్వాలు సైనిక బలగాలను దేశ అంతర్గత వ్యవహారాలలో వినియోగించడం మీద ఒక పరిమితి ఉండేది. బహుశా ఈ మధ్య కాలంలో అమెరికన్- ఇజ్రాయిల్ పాలకశక్తుల వ్యవహారశైలిని అందిపుచ్చుకున్నట్లు ఉన్నది. కానీ భారత ప్రభుత్వం తాను తలపెట్టిన యుద్ధం విదేశీ సైనికులతో కాదని స్వంత పౌరుల మీద అని గుర్తుంచుకోవాలి కదా.
భారత ప్రభుత్వ నయా సిద్ధాంతాన్ని అమిత్ షా పార్లమెంట్ వేదికగా రంగురంగుల్లో ఆవిష్కరించారు. ‘‘వాళ్లు(నక్సల్స్) కనపడితే సూటిగా రెండు కళ్ల మధ్యన(నుదుటిని గురి చేసుకుని) కాల్చి పారేయ్యడమే’’అని ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్చరికగా మోకాళ్ల కింద భాగంలో కాల్చడం వంటి విచక్షణ పాటించాల్సిన అవసరం లేకుండా చేసింది. అమిత్ షా నయా సిద్ధాంతం. ఎత్తుగడల రీత్యా చూసినా ఇదేమీ కేరింతలు కొట్టే వ్యవహారం కాదు.
భద్రతా బలగాలు దళాల ఆనుపానులు కనిపెట్టడానికి డ్రోన్లను వినియోగించడం సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆయుధాలను కలిగి ఉన్నది. నక్సల్ కదలికలున్న ప్రదేశంలో దొరికిన ఆయుధాలను మీడియాలో ప్రదర్శిస్తున్నారు. వార్తా పత్రికలలో ఫొటోలు ప్రచురిస్తున్నారు. సైనిక బలగాల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో పోలిస్తే ఈ ఆయుధాలు ‘బేకార్’ అని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
ఈ అసమశక్తుల మధ్య జరిగే పోరులో చెట్లు, పుట్టలు, పొదల మాటున దాగి ఉండే దళ సభ్యులను హెచ్చరించి లొంగిపోయేలా చూడడానికి బదులు ఏకంగా వారిని తుడిచి పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనబడుతున్నాయి.
కానీ భద్రతాబలగాలు నష్ట తీవ్రతను కనీస స్థాయిలో ఉంచడానికి తగిన జాగ్రత్తలు, హెచ్చరికలు పాటించడం లేదు. ఎన్కౌంటర్ల మృతుల సంఖ్యను బట్టి చూస్తే భద్రతాబలగాలు ఈ నియమాలు పాటించడం లేదని స్పష్టం అవుతుంది. బహుశా ఈ కారణంగానే గాయపడినవారి సంఖ్యగాని, లొంగిపోయిన వారి సంఖ్యగాని ఉండడం లేదు.
చట్టానికి, భద్రతా బలగాలు సాగిస్తున్న ఆపరేషన్‌కు మధ్యన పొంతన ఉండడం లేదు. ఉగ్రవాద కార్యకలాపాల అణిచివేత పేరిట రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు కలిసి దాడికి పూనుకోవడం గతంలో ఎన్నడూ లేదు. కార్గిల్ యుద్ధానంతరం సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణలు సిఫార్సు చెయ్యడానికి ‘అంతర్గత భద్రత’ మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఎన్ ఓహ్రా కమిటీ ఉగ్రవాద కార్యకలాపాల అణిచివేతకు కేంద్ర సాయుధ బలగాలను మరింత పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సిఫార్సు చేసింది.
‘‘రెడ్ కారిడార్ (నక్సల్ ప్రభావిత ప్రాంతాల సమాహారం) దేశ భద్రతకు ప్రమాదకరంగా తయారయ్యింది’’అని మన్మోహన్ సింగ్ తన ప్రధాని పదవీకాలంలో ‘అతి’తో కూడిన ప్రకటనతో కేంద్ర సాయుధ బలగాలకు రంగంలో కాలుమోపడానికి అవకాశం దక్కింది.
అయితే ‘హింస’ గరిష్ట స్థాయిలో ఉండడంతో సైన్యం ఈ ‘ఆపరేషన్ల’కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోహరించిన కేంద్ర సాయుధ బలగాలు కశ్మీర్లో తీవ్ర అణిచివేతకు పాల్పడిన ‘రాష్ట్రీయ రైఫిల్స్’కి మాదిరే ‘మానవ హక్కుల’ను ఏ మాత్రం లెక్కచెయ్యడం లేదు.
ఇది ఇప్పటితో, ఇక్కడితో ఆగేదిగా కాదు. ప్రతి ఉగ్రవాది మరణానికి(హత్యకు) నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం మూలంగా విపరీత పోకడలు చోటు చేసుకున్న కారణంగా సైన్యం ఈ పద్ధతికి స్వస్థి పలికింది. అయితే ప్రస్తుతం కేంద్ర సాయుధ బలగాలు. ఖాకీయూనిఫాంతో కలిసి అదే పద్ధతికి తిరిగి ఊపిరులూదాయి.
ఈ ‘ఆపరేషన్’లో స్థానిక బలగాల పాత్ర ఎక్కువగా ఉండడంతో నైతిక నియమావళిని సరకు చెయ్యడం లేదనే భావన కలుగుతున్నది. కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వడంతో ‘మృత్యు’ కౌంటర్ పని జోరుగా సాగుతున్నది అత్యున్నతాధికారులు బరిలో ముందు ఉండకపోవడం అనే బలహీనత మూలంగా దళాలను హతమార్చే పని నిరాటంకంగా సాగుతున్నది.
‘ఫలితాలు చూపించాలనే ఒత్తిడి’ మూలంగా సాగుతున్న ఈ హత్యాకాండ ఏ రకంగా చూసినా సమర్దనీయం కాదు. ‘మనకు బంధీలతో పనిలేదు’ అనే దేశాలు ఎవరు వచ్చినా అవి అంతర్జాతీయ మానవతా చట్టానికి వ్యతిరేకమే కాదు. మథ్యానేరంమోపదగిన చర్యలే, మానవత్వానికి వ్యతిరేకంగా పాల్పడిన నేరాలే.
నేను మిలిటరీ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు శిక్షణా శిబిరానికి కమాండర్‌గా పనిచేసిన బసంత్ పొన్వర్ ఛత్తీస్గడ్ పోలీసు బలగాల్లో అనేక తరాలకు శిక్షణ ఇచ్చాడు. ఆయన ఏనాడూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మాకు కమాండో శిక్షణ ఇచ్చిన ‘రైజిమెంట్ లెజెండ్‌గా’ పేరొందిన సంతోష్ కురూప్ కూడా మహారాష్ట్ర పోలీసులకు కమాండో శిక్షణ ఇచ్చిన వివిధ సందర్భాలలో కూడా ఏనాడూ ఇలాంటి పాఠాలు నేర్పలేదు.
స్వేచ్ఛకు జాగరూకతకు మూల్యం..
ఈ సైనిక చర్యలో క్రింది స్థాయి నుండి అమిత్ షా వరకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే నిభాయించుకోవాలనే తత్వాన్ని పూర్తిగా వదిలేసిన ఈ ‘ఎత్తుగడలు మానవ హక్కులకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. జిల్లా రిజర్వ్ గార్డుల పేరిట స్థానికులను ఈ ఆపరేషన్‌లో ముందు వరుసలో నిలబెట్టే ఎత్తుగడలను అమిత్ షా శ్లాఘిస్తున్నాడు. కానీ ఇది ఆదివాసీ ప్రజానీకాన్ని ఎంత సంకటంలోకి నెడుతుందో ఆయన గమనింపులో ఉన్నట్లు లేదు. కశ్మీర్లో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ‘ఇక్వాన్’లను ఎలా వాడుకున్నది, దాని పర్యవసానాలు ఏమిటో మననం చేసుకోవాలి.
అపారమైన ఖనిజ, లవణ నిక్షేపాలు ఉన్న ఆదివాసీ నివాసిత ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా, సాధ్యమైనంత త్వరగా కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే అప్రకటిత లక్ష్యం బహుశా అమిత్ షాను ఈ అనైతిక చర్యలకు ప్రేరేపిస్తూ ఉండవచ్చు.
‘రాజ్యం ఈ యుద్ధాన్ని గెలుస్తున్నది’ అనే వార్తా శీర్షీకలు అమిత్ షాకు అమితానందాన్ని కలిగించవచ్చు. కానీ ఈ యుద్ధం ఎవరికోసం, ఎవరి మీద సాగిస్తున్నారు, ఎలా గెలుపు వరిస్తుందనే ప్రశ్నలు ఆలోచనాపరుల నుండి ఎదురవక తప్పదు.
ఇవ్వాళ్టి వంతు నిస్సహాయులైన ఆదివాసులది కావచ్చు. రేపు ఇదే భద్రతా బలగాలు ఎవరి మీదయినా ఇలానే విరుచుకుపడొచ్చు. ఇచ్చిన పనిపూర్తి చెయ్యడం, లెక్కా జమాలేనితనం, చట్టపరమైన చర్యల నుండి రక్షణ ఉన్న బలగాలకు అడ్డూ అదుపూ ఏముంటుంది? తస్మాత్ జాగ్రత్త..
అలీ అహ్మద్
అనువాదం: కె సత్యరంజన్
(అలీ అహ్మద్ వ్యూహ విశ్లేషకుడు, రచయిత. ‘సబ్‌స్టాక్’లో వెలువడిన ఈ వ్యాసంలో పఠనీయతకు అనుగుణంగా స్వల్పమార్పులు చేయడ్డాయి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.