
ఈనాటి భారతదేశంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు బీజేపీను ఎన్నికల రంగంలో వ్యతిరేకించవచ్చు. కానీ అవి భారతీయ ఫాసిజానికి వున్న బ్రాహ్మణీయ, కార్పొరేట్ పునాదులను సవాల్ చేయడం లేదు. “ప్రతి దేశం దానికి తగిన ఫాసిజాన్ని పొందుతుంది” అని ప్రఖ్యాత మార్క్సిస్టు సిద్ధాంతవేత్త ఐజాజ్ అహ్మద్ ఎన్నడో చెప్పారు. భారతదేశంలో ఫాసిజానికి ప్రతిరూపమైన ఆర్ఎస్ఎస్ భావజాల మూలాల గురించిన చర్చ లేకపోయినప్పటికీ, బీజేపీ పాలనలో భారతదేశాన్ని ఫాసిస్టు దేశంగా వర్గీకరించవచ్చా లేదానే అంశం మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఈ చర్చ 20వ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంప్రదాయక ఫాసిజం/నాజీయిజంల మధ్య సూక్ష్మస్థాయిలో వున్న పోలికలను గురించిన చర్చగా మారుతోంది.
ఫాసిజమైనా, అలాంటి ఏ ఇతర భావజాలమైనా ఒక నిర్దిష్ట సమయంలో ఆవిర్భవించడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వుంటాయి. అదే సమయంలో వాటిమధ్య అనేకమైన విశ్వజనీనమైన సారూప్యతలు కూడా వుంటాయి. ఫాసిజం ఓడించబడిందా అనే చర్చకు సమాధానం ఇస్తూ 1967లో జీన్ పాల్ సార్త్ ఇలా అన్నారు. “ఫాసిస్టు భావజాలానికి, ఉద్యమాలకు, పరిపాలనకు అవకాశమిచ్చిన సాంఘిక, ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ వర్ధిల్లుతూ వుండడమే దానికి కారణం.”
1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ అతి దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫాసిస్టు ఉద్యమాలల్లో ఒకటి. సమాజాన్ని, రాజకీయ వ్యవస్థను ఫాసిస్థీకరణ చేయడం ద్వారా(అదేపనిగా సైద్ధాంతికంగా, రాజకీయంగా, భౌతికంగా దాడులు చేయడం ద్వారా ప్రజాస్వామిక విలువలను, రాజకీయాలను నాశనం చేయడం) మాత్రమే ఫాసిస్టు ఉద్యమం లేదా ఫాసిస్టు పార్టీ కొనసాగగలదని ప్రపంచ చరిత్ర నిరూపించింది. పెట్టుబడిదారీ సంక్షోభం పెరిగి పెద్దదై, సాంఘిక సంక్షోభాలకు, ఘర్షణలకు గురైన సమాజాలలో కూడా ఇది సాధ్యం.
2014లో నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ తన స్వంత బలంమీద అధికారాన్ని సంపాదించుకుంది. ఆ తరవాత 2019లో అంతకంటే బలమైన ఓటర్ల మద్దతును పొందింది. దీనికి కారణం అది విభజన రాజకీయాల ఎజెండాను లోతుగా తీసుకువెళ్ళడమే. ఇది జరిగిన తరవాత భారతదేశంలోని వామపక్ష, అభ్యుదయ శ్రేణులలో తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ప్రస్తుతం అధికారంలో వున్న పార్టీ ఫాసిస్టు స్వభావం గురించీ, దాన్ని ఓడించడానికి అవసరమైన వ్యూహాల గురించి ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. మోడీ ప్రభుత్వం అతిమితవాద ప్రభుత్వం అయినప్పటికీ దాన్ని సాంప్రదాయక అర్ధంలో ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణించవచ్చునా లేదా? లేక అది నయా ఫాసిస్టు ప్రభుత్వమా లేక భారత దేశానికి సంబంధించిన నూతన తరహా ఫాసిస్టు ప్రభుత్వమా అనే విషయాల మీద ఈ చర్చలు జరిగాయి. అందుచేత ఫాసిజం పుట్టుక, అభివృద్ధి, దాని విజయానికి గల కారణాల గురించీ, చరిత్రలో అది తీసుకున్న రూపాల గురించీ తెలుసుకోవడం అవసరం. అలా చేయడం ద్వారా మాత్రమే దాని భారతీయ నమూనాను అర్థం చేసుకోగలం. దాని ప్రత్యేకతను, సాంప్రదాయక ఫాసిజానికీ దానికీ వున్న పోలికలను అర్ధం చేసుకోగలం.
అధికారయుత ధోరణులను కలిగి అనాగరికమైన హింసా దౌర్జన్యాలను ప్రయోగించే ప్రభుత్వాలను, సంస్థలపై “ఫాసిస్టు” ముద్రవేసే ధోరణి ఒకటుంది. దీనిమూలంగా అందరిలోనూ ఫాసిజం అంటే కేవలం అనాగరికమైన రాజ్య అణచివేతకు మరోపేరు అనే ఒక దురవగాహన కలిగింది. ఫాసిజం కేవలం పాశవికత మాత్రమే కాదు. ఫాసిజం సాంఘిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ. అది ప్రాథమికంగా ప్రజాస్వామ్యానికీ మానవ సహజీవనానికీ వ్యతిరేకం. అది అధికారయుత పాలన కాదు. దానికి “ప్రజా మద్దతు వుంటుంది” దానిక కార్యకలాపాలతో ప్రజలు “మమేకం” అవుతారు. అనాగరికతకు సంబంధించిన ప్రత్యామ్నాయ నాగరికతగా అది ఆవిర్భవించింది. ప్రజల్ని తనకు అనుకూలంగా మల్చుకోవడానికి తీవ్రజాతీయవాదాన్ని ఉపయోగించుకుంటోంది. ప్రపంచవ్యాపిత పెట్టుబడిదారీ వ్యవస్థ దానికి కావల్సిన మద్దతునిస్తుంది. ముఖ్యంగా సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాలలో దానికి అపారమైన మద్ధతుల లభిస్తుంది.
“ఫాసిజం స్వభావం” (The Nature Of Fascism)అనే సుప్రసిద్ధ పుస్తకంలో రోజర్ గ్రిఫిన్ (Roger Griffin) ఫాసిజం గురించి ఇలా వర్ణించారు. “ఫాసిజం ఒక రాజకీయ భావజాలం. దాని అనేకరకాలైన వాదనలలో కేంద్రీకృతమైన అంశం ‘పునర్జన్మ’. ఈ ‘పునర్జన్మ’ ప్రజామోదాన్ని పొందగలిగే తీవ్ర జాతీయవాద రూపంలో వుంటుంది.” ఇక్కడ ‘పునర్జన్మ’ అనేది జాతి ‘పునర్జన్మ’గా వాడబడింది. ఫాసిజాన్ని కేవలం ఒక పార్టీకి లేదా సంస్థకు లేదా ఒక నిర్దిష్టమైన దౌర్జన్యకర సంఘటనకు మాత్రమే పరిమితం చేయడం అంటే దాని అసలు ప్రమాదాన్ని గ్రహించలేకపోవడం. అలా జరగడం వల్ల దానికి వ్యతిరేకంగా బలమైన, సంఘటితమైన ప్రతిఘటనను నిర్మాణం చేసే ప్రయత్నాలు కూడా బలహీనపడతాయి.
ఇతర కాలాలలో, దేశాలలో ఫాసిజం..
చారిత్రకంగా చూస్తే మానవ సమాజం ఫాసిస్టు ప్రమాదాన్ని మొట్టమొదటగా ఎదుర్కొన్నది రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో. ఆ కాలంలో ఫాసిజానికి ముస్సోలినీ నాయకుడు. దానితోపాటు, హిట్లర్ నాజీ పాలన కింద జర్మనీలో అమలైన ఫాసిస్టు పాలన కూడా ఫాసిజానికి సాంప్రదాయక ఉదాహరణలు.
ఇవేగాక స్పెయిన్లో(1939 నుండి 1975వరకు ఫ్రాంకో పాలనలో), పోర్చుగల్, అనేక లాటిన్ అమెరికా, ఐరోపా దేశాలలో ఫాసిస్టు ఉద్యమాలు ఊపందుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం తలెత్తిన విపత్కరమైన ఆర్థిక పరిస్థితులు, ఉ దారవాద పెట్టుబడిదారీ ప్రభుత్వాల వైఫల్యం కలగలిసి ఫాసిస్టు శక్తులు అభివృద్ధి చెందడానికి కావల్సిన అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.
ఫాసిస్టు ప్రభుత్వాలు ప్రజాస్వామిక విలువలను ఎత్తిపట్టడానికి బదులు వాటి జాతీయవాద, జాతివాద(Racist)భావజాలాన్ని సోషలిస్టు వాగాడంబరంతో కలిపి ప్రచారం చేశాయి. ఉదాహరణకు నాజీ పార్టీ సిద్ధాంతాన్ని“జాతీయ సామ్యవాదం”అనేవారు(నాజీయిజం). కమ్యూనిస్టులు, అరాచకవాదులతో సహా సోషలిస్టు ఉద్యమాలు శ్రామికవర్గంలో గణనీయమైన శక్తిని పొందడం, అంతేగాక ప్రజాస్వామిక ఎన్నికలలో అధికారాన్ని సంపాదించగల శక్తిని కలిగివుండటం దీనికి కారణం.
1917లో రష్యాలో విప్లవం విజయవంతం కావడంతో అంతర్జాతీయ సోషలిస్టు, కమ్యూనిస్టు ఉద్యమాలు పెట్టుబడిదారీ విధానానికి పెనుప్రమాదాలుగా అభివృద్ధి చెందాయి. దీన్ని ఎదుర్కొనే క్రమంలో ఇటలీ, జర్మనీలలోని పాలక పెట్టుబడిదారీ వర్గాలు సోషలిస్టు ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి ఉదారవాద ప్రజాస్వామ్యంపై ఆధారపడలేక ఫాసిస్టు శక్తులను చురుకుగా సమర్థించాయి.
ఫాసిస్టులు ఒకసారి అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులను, సోషలిస్టులను అత్యంత తీవ్రమైన హింస ద్వారా అణచివేశారు. అవి తమ స్వంత శ్రేణులలోని పెట్టుబడిదారీ వ్యతిరేక శక్తులను కూడా నిర్మూలించాయి. ఇలా చేయడం ద్వారా తమ పాలనలో పెట్టుబడిదారీ విధానం వర్ధిల్లడానికి అవసరమైన పరిస్థితిని సృష్టించుకున్నాయి. ఉదాహరణకు, హిట్లర్ యూదు వ్యతిరేక, కమ్యూనిస్టు వ్యతిరేక, మేథో వ్యతిరేక భావజాలాలను జాతీయ విలువలుగా ప్రచారం చేశాడు. అది అత్యంత దుర్మార్గమైన జాతి హననానికి (హోలోకస్ట్), రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది.
ఉదారవాద ప్రజాస్వామ్యం ఫాసిజంతో కుమ్మక్కు కావడం..
తమ దేశాలను హిట్లర్ ప్రత్యక్షంగా బెదిరించేంతవరకు “ఉదారవాద ప్రజాస్వామ్య” ప్రభుత్వాలుగా పిలవబడిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ప్రారంభంలో అతడి ఫాసిస్టు పాలనను సమర్థించాయి. చివరకు సోవియట్ ఎర్ర సైన్యం, తూర్పు ఐరోపాలోని ఫాసిస్టు వ్యతిరేక విప్లవకర శక్తులు కలిసి ఫాసిజాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి.
నాజీ జర్మనీ ఓటమి చెందినప్పటికీ వేలాది మంది ఫాసిస్టు యుద్ధనేరస్థులను ఈ “ప్రజాస్వామిక” పాశ్చాత్య దేశాలతోపాటు అర్జెంటీనా కూడా కాపాడి పునరావాసాన్ని కల్పించాయి. పెట్టుబడిదారీ పాలకవర్గాలకు ఫాసిజం సోషలిస్టు సవాళ్ళను ఎదుర్కొవడానికి ఉపయోగపడే “రిజర్వు చేయబడిన రాజకీయ పనిముట్టుగా” ఉపయోగపడుతోందని దీన్నిబట్టి తెలుస్తోంది.
నేటి ఫాసిజం: భారతదేశంలో దాని విలక్షణ రూపం..
భారతదేశంతో సహా ప్రపంచమంతా మరోసారి తీవ్ర ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. చరిత్ర మనకు ఎన్నో పాఠాలను నేర్పుతోంది. దానితోపాటు మనం వర్తమాన భారతదేశంలోని ఫాసిజంకు వున్న నిర్దిష్ట లక్షణాలను కూడా గుర్తించాలి. ప్రజాస్వామిక సమాజాన్ని విధ్వంసం చేయడం, ప్రజల మద్ధతుతో అణచివేత స్వభావం గల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కార్పొరేట్ పెట్టుబడికి సేవలు అందించడం అనే, ఫాసిజం మూలసారం ఇప్పటికీ మారలేదు. అయితే దాని బయటి రూపం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కో కాలంలో ఒక్కో రకంగా వుంటున్నది. అందుచేత ఒక దేశం ఫాసిస్టు దేశంగా మారిందా లేదా అనేదాన్ని దాని రూపాన్నిబట్టి కాక సారాన్ని బట్టి నిర్ణయించాలి.
భారతదేశపు ఫాసిజం, సాంప్రదాయక ఫాసిజాల మధ్య తేడాలు..
ప్రస్తుతం తీవ్ర మితవాద ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక విలువల సారాన్ని నాశనం చేయడానికి అది ప్రజాస్వామిక నిర్మాణాలను ఉపయోగించుకుంటుంది. 20వ శతాబ్దం తొలికాలం నాటి ఐరోపాలో వలె కాకుండా ప్రస్తుత ప్రపంచంలో బహుళపార్టీల ప్రజాస్వామ్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఎప్పుడూ కేవలం లోతుగా పాతుకుపోయిన బ్రాహ్మణీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు వేసిన పై ముసుగు మాత్రమే. తీవ్రమైన సాంఘిక అణచివేతను, హింసను బలోపేతం చేసే కుల వ్యవస్థ ప్రస్తుతం “హిందూ నాగరికతలో, వ్యవస్థాగత హింసలో” విడదీయరాని భాగమైపోయింది.
దీనికితోడు 1991 నుండి భారత పాలకవర్గాలు నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అవలంబించాయి. దాని ఫలితంగా సాంఘిక, ఆర్థిక రంగాలలో నిరాశా నిస్పృహలు విస్త్రతంగా వ్యాపించాయి. ఈ సంక్షోభం ఫాసిస్టుశక్తులు అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించింది. అయితే ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన ధోరణి మాత్రం కాదు. ఆర్థిక అస్థిరత కారణంగా అనేక పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాలు ప్రపంచవ్యాప్తంగా అధికారయుత పాలనలుగా మారిపోతున్నాయి. భారతదేశం కూడా ఇలాంటి ఫాసిస్టు పాలనా ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ అది ఇంకా పూర్తిగా ఫాసిస్టుగా మారలేదని కొందరి వాదన. ఎందుకంటే..
- ప్రజాస్వామ్యం పూర్తిగా విధ్వంసం కాలేదు.
- కొన్ని ఫాసిస్టేతర పార్టీలు, సంస్థలు ఇంకా ప్రతిఘటిస్తూనే వున్నాయి.
- ఫాసిస్టు శక్తులు అధికారాన్ని సంపూర్ణంగా సంఘటితం చేసుకోలేదు.
అయితే భారతదేశంలో ఫాసిజం తీవ్ర జాతీయవాదం మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టడం, రాజకీయ, సామాజిక వ్యవస్థలలోకి చొచ్చుకుపోవడంలో అది విజయవంతం కావడం కారణంగా సమకాలిక ప్రపంచంలో ఇది అత్యంత విజయవంతమైన ఫాసిస్టు ఉద్యమంగా మారింది. కానీ పాలన ఫాసిస్టు పాలన అయిందా? ఒక పాలన పూర్తిగా ఫాసిస్టు పాలనగా మారిందని ఎప్పుడు చెప్పగలం? హిట్లర్ కూడా అధికారాన్ని 1933లోనే హస్తగతం చేసుకున్నప్పటికీ, ప్రజాస్వామ్య వ్యతిరేక ఫాసిస్టు విధానాలను దశలవారీగా అమలుపరిచాడు. ప్రసిద్ధి చెందిన “ఫాసిజం ఎలా పనిచేస్తుంది”(How Fascism Works)అనే పుస్తకంలో జాసన్ స్టేన్లీ(Jason Stanley) వర్ణించినట్లుగా, హిట్లర్ తాను అమలుపరచబోయే తీవ్రవాద ఫాసిస్టు చర్యలకు అనుకూలంగా జర్మన్ సమాజాన్ని సంసిద్ధం చేసుకున్నాడు. ఇందుకోసం అతడు వ్యవస్థాగతమైన అసత్య ప్రచారాన్ని కొనసాగించాడు. అవాస్తవాలను, మేథో వ్యతిరేకతను, నిచ్చెనమెట్ల వ్యవస్థను, జర్మన్ జాతి గత కాలంలో గొప్పదనే ఊహను, అది దెబ్బతిన్న జాతి అని ప్రచారం చేశాడు.
యూదులను మొత్తంగా మడగాస్కర్కు బలవంతంగా పంపించివేసి అక్కడ వాళ్ళు వుండేటట్లు చేయడం ద్వారా “యూదుల సమస్యను” పరిష్కరించాలని 1938లోనే ఆయన ఆలోచించినప్పటికీ, యూదులకు వ్యతిరేకంగా అమలుపరిచిన తుది పరిష్కార మార్గంగా నరమేధం గురించి 1943లో మాత్రమే అలోచించాడు. అప్పటికి జర్మనీ అసాధారణమైన యుద్ధ పరిస్థితిలో కూరుకుపోయి వుంది. సమాజాన్ని, రాజకీయ వ్యవస్థను ఫాసిస్థీకరణ చేయడం అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక క్రమక్రమంగా అమలుపరిచే క్రమం అని దీన్నిబట్టి అర్ధమౌతుంది. అందుచేత ఈ సమయంలో ఈ దశలో ఫాసిజం అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుందని ఎవరూ చెప్పలేరు. రాజ్యయంత్రాంగం మీద ఆధిపత్యాన్ని సంపాదించడం ఫాసిస్టు అధికారానికి ప్రారంభ బిందువు.
ఫాసిస్టు ప్రభుత్వమా లేక ఫాసిస్టు పాలనా ?
అయితే ఈ చర్చలో ప్రధానమైన రాజకీయ ప్రశ్న ఏమిటంటే నేటి భారత ప్రజాస్వామిక వ్యవస్థకు ఫాసిజాన్ని ఎదుర్కొనగలిగిన శక్తి వుందా లేదా అనేది? బీజేపీయేతర లౌకిక పార్టీలు తమ రాజకీయ స్వభావంలో “ఫాసిస్టు వ్యతిరేకతను” కొనసాగిస్తాయా లేదా ? విశాలమైన ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ కూటమిని ఏర్పాటు చేయగల శక్తి భారతీయ రాజకీయ పార్టీలకు ఇంకా వున్నదా లేదా?
21వ శతాబ్దపు ఫాసిజంగాని, ఆ మాటకు వస్తే నయా ఫాసిజంగాని పెట్టుబడిదారీ సంక్షోభం, ప్రజాస్వామిక తిరోగమనం వంటి వాస్తవ అంశాలపై ఆధారపడి బలపడతాయి. 20వ శతాబ్దంలో ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో వామపక్ష, వామపక్ష తరహా రాజకీయ నిర్మాణాలు వుండి, అవి ఫాసిజం అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా వ్యతిరేకించాయి. 1991లో నయా ఉదారవాద వ్యవస్థ ప్రారంభమైన తరవాత కాలంలో మధ్యేమార్గవాద పార్టీలు కూడా మితవాద పార్టీలవైపు మళ్ళాయి. దీంతో భారతీయ ఫాసిస్టులకు ఉదారవాద రాజ్యాంగాన్నిగాని ఉదారవాద పార్టీలనుగాని రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఇది 21వ శతాబ్దపు నయా ఫాసిస్టు రాజకీయ సందర్భం. ఫాసిజం ఒకవైపు ప్రజాస్వామ్య సారాన్ని మౌలికంగా మార్చివేస్తూనే ఎన్నికల ప్రజాస్వామ్యంతో సహజీవనం చేయగలదు. కార్పొరేట్ పెట్టుబడి, బ్రాహ్మణీయ సాంఘిక నిర్మాణాల మద్దతు కలిగిన బీజేపీ లాంఛనప్రాయమైన ప్రజాస్వామ్య నిర్మాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే దాని ప్రజాస్వామిక సారాన్ని పీల్చివేసింది.
చారిత్రకంగా చూస్తే సంక్షోభాల కాలంలో ఉదారవాద ప్రజాస్వామికవాదులుగా చెప్పుకున్నవాళ్ళుకూడా ఫాసిజంతో స్నేహం చేశారు. ఈనాడు భారతదేశంలో ప్రధాన స్రవంతికి చెందిన రాజకీయ పార్టీలు ఎన్నికలలో బీజేపీని వ్యతిరేకించవచ్చుగాని, భారత ఫాసిజానికి వున్న బ్రాహ్మణీయ, కార్పొరేట్ పునాదులను సవాల్ చేయలేవు. దీంతో వ్యవస్థ చట్రంలో భాగస్వాములైన ప్రతిపక్ష పార్టీలు ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి నాయకత్వం వహిస్తాయని ఆశించడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది. ఈ “ఉదారవాద ప్రతిపక్షానికి” వైరం బీజేపీతోనే గాని, బ్రాహ్మణీయ హిందూత్వతోగాని లేదా నయా ఉదారవాద ఫాసిజంతోగాని కాదు. మరోపక్క ఈ “ఉదారవాద పార్టీలే తాము స్వత్రంతంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఫాసిస్టు సాంఘిక, ఆర్థిక విధానాలను అమలుపరుస్తున్నాయని, ఇలాంటి చట్టాలను తీసుకురావడంలో బీజేపీకి మద్ధతు ఇస్తున్నాయని చెప్పడానికి వందలాది ఉదాహరణలున్నాయి. అంటే బీజేపీ ఎన్నికలలో ఓడిపోవచ్చు. కాని ప్రత్యామ్నాయ రాజకీయశక్తులు కూలదోయనంత కాలం ఫాసిస్టు పాలన మాత్రం కొనసాగుతుంది. దీంతో భారతదేశంలో ఫాసిస్టు వ్యతిరేక పోరాటం తప్పనిసరిగా మూడు లక్షణాలను కలిగి వుండాలి.
- బ్రాహ్మణీయ వ్యతిరేకత, అంటే హిందూ జాతీయతను రెచ్చగొట్టే లోతుగా వేళ్లూనుకున్న కుల అణచివేతపై పోరాటం చేయడం.
- కార్పొరేట్ పెట్టుబడిపట్ల వ్యతిరేకత. అంటే ఫాసిజానికి బలం చేకూర్చే ఆర్థిక నిర్మాణాలను ప్రతిఘటించడం.
- అత్యంత అణచివేతను అనుభవిస్తున్న వర్గాలు నాయకత్వాన్ని కలిగివుండడం. అంటే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, కార్మికవర్గం ముందు వుండడం.
హిట్లర్ సాగించిన నరమేధం అత్యంత తీవ్రమైన ఫాసిస్టు చర్య. అమెరికాలో ఈ అంశం గురించి పరిశోధన చేసిన మేధావి గ్రెగరీ స్టాంటన్(Gregory Stanton), భారతదేశం“నరమేధం తప్పని స్థితి” అనే దశగుండా ప్రయాణిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏ సమాజంలోనైనా నరమేధం పది దశలను దాటి అంతిమంగా సామూహిక హత్యల స్థాయికి చేరుతుందని ఆయన సూచిస్తున్నారు.
ఆ పది దశలు..
- వర్గీకరణ – కొందరిని “ఇతరులు”గా నిర్వచించడం
- గుర్తింపు – అలాంటి బృందాన్ని గుర్తించి దానికొక పేరు పెట్టటం
- వివక్ష – అలాంటివారిని పథకం ప్రకారం ప్రధాన స్రవంతి నుంచి వెలుపలికి నెట్టివేయటం.
- అమానవీయకరణ – వాళ్ళ గౌరవాన్ని, హక్కులను బలవంతంగా రద్దుచేయడం.
- వ్యవస్థీకరణ – ఈ వివక్షను రాజకీయంగా వ్యవస్థీకరించడం.
- సమీకరణ – సాంఘిక విభజనలను మరింత లోతుగా విస్తరింపచేయడం.
- సన్నద్ధ చర్యలు – హింసను ప్రేరేపించడానికి అవసరమైన పునాదిని పద్ధతి ప్రకారం రూపొందించుకోవడం.
- వేధించడం – చట్టపరమైన అణచివేత, రాజ్య హింస.
- భౌతిక నిర్మూలన – పెద్ద ఎత్తున హత్యలు
- నిరాకరణ – సాక్ష్యాలను తుడిచిపెట్టటం, ఎవరు దేనికి బాధ్యులో తెలియకుండా చేయడం.
మోడీ పరిపాలనలో భారతదేశం ఈ పది దశలన్నింటిగుండా చాలా వేగంగా ప్రయాణిస్తోంది. పూర్తిస్థాయి నరమేధం ఇంకా జరగగపోయినప్పటికీ సమాజాన్ని లోతైన ఫాసిస్టు సమాజంగా పరిణమింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ముస్లింలను అమానవీయతకు గురిచేయడం, దళితులను, శూద్రులను అభివృద్ధి అంచులకు నెట్టివేయడం, ప్రజాస్వామిక సంస్థల విలువలను డొల్లచేయడం.
భారతదేశంలో ఫాసిజం- మన ముందున్న మార్గం..
భారతదేశంలో ఫాసిజం నిలదొక్కుకుంటున్నది. కుల వ్యవస్థ ద్వారా, లాంఛనప్రాయమైన ప్రజాస్వామ్యం ద్వారా అది ఫాసిస్టు విలువల వారసత్వాన్ని స్వీకరించి సమాజంలోకి లోతుగా చొరబారి శక్తివంతమౌతోంది. దాన్ని ఓడించాలంటే అంతే దీర్ఘకాలికమైన ప్రణాళికతో విప్లవకర సామ్యవాద పోరాటం తప్పనిసరి. శిష్ట ప్రతిపక్ష పార్టీలు ఈ పోరాటానికి నాయకత్వం వహించలేవు. బ్రాహ్మణీయ ఆధిపత్యానికి, కార్పొరేట్ పెట్టుబడికి వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమం తప్పనిసరిగా పునాది వర్గ ఉద్యమంగా వుండాలి. అలాచేయడం ద్వారా మాత్రమే భారతదేశంలో ఫాసిస్టు పురోగమనాన్ని తిప్పిగొట్టగలం. కేవలం భ్రమాత్మకమైన బీజేపీ వ్యతిరేక కూటములు కట్టటం గురించి ఆలోచించడం కంటే నిజాయితీతో కూడిన ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం గురించి మన శక్తియుక్తులను వెచ్చించాలి.
శివసుందర్
(కర్ణాటకకు చెందిన రాజకీయ విశ్లేషకులు)
అనువాదం: సియస్ఆర్ ప్రసాద్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.