
మనిషి పరిణామక్రమంలో ఆసియా, ఆఫ్రికా దేశాలే ముందున్నాయి. కానీ తెల్లజాతి వాళ్లు నల్ల వాళ్లకు చరిత్ర లేనట్లుగా రాశారు. ఎందుకంటే వాళ్లు విజేతలు. చరిత్ర ఎప్పుడు విజేతల పక్షంలోనే రాయబడుతుంది. ఇండియాలో, అమెరికాలో వేల యేళ్ల నుండి మానవ నాగరికత వికసిస్తూ ఉండగా కొలంబస్ వాస్కోడిగామాలు ఈ దేశాలను కనుగొన్నారని రాస్తారు. ఆఫ్రికా బంగారు గనులు కానీ, భారతదేశపు ప్రాచీన చరిత్ర కానీ వీళ్ళ దృష్టిలో అప్పుడు కనుగొనబడ్డదే.
ఆఫ్రికా నుండి నల్లవాళ్ళను కొని బానిసలుగా తెచ్చి వాడుకోవడం 1619లో ప్రారంభమైంది. తెల్లవాళ్ల సుఖాలకు నీగ్రోలు తమ జీవితాలనే అర్పించుకోవలసి వచ్చింది. నీగ్రోల పట్ల అమెరికన్ల ప్రవర్తన అమెరికా దేశచరిత్రలో ఒక మాయని మచ్చగా మిగులుతుంది. మనుషులను అమ్మడం కొనడం జంతువులను వేరుచేసినట్లు నీగ్రోల కుటుంబాలను వేరు చేయడం అమెరికన్లు చేసిన ఘోర తప్పిదం. తల్లిని ఒకరు కొంటే పిల్లలను ఒకరు కొనడం, చాకిరీకి వాడుకోవడం, లైంగికంగా వినియోగించుకోవడం, తెల్లజాతి చరిత్రకు మాయని మచ్చ. రూట్స్ నవల ఇతివృత్తమంతా ఇదే. ఇది ఒక చారిత్రక నవల. ఆఫ్రికా నుండి జంతువుల్లా తీసుకురాబడిన నల్లవారి దీనగాథ ఇది. శ్రమదోపిడి, లైంగిక దోపిడీ, కనీస అవసరాల తిరస్కారం, నల్ల వాళ్ళని మనుషులుగా కూడా చూడకపోవడంతో చాలా కాలం తర్వాతనైనా నల్లజాతి తిరగబడింది. తదనుగుణంగా అబ్రహం లింకన్ అమెరికాలో బానిసత్వాన్ని నిర్మూలించాడు. అమెరికాలో కొనసాగిన అంతర్యుద్ధం ముగిసింది. ఈ కారణంగానే జాన్ విల్కిస్ బూత్ అనే ఒక తెల్లవాడి చేతిలో అబ్రహం లింకన్ హత్యకు గురయ్యాడు. చట్టరీత్యా బానిసత్వం నిర్మూలించబడ్డా దాని పరోక్ష రూపమైన వర్ణ వివక్ష మొదలైంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఇప్పటికీ పోరాటం కొనసాగుతుందనే చెప్పాలి. యాంటీ రేసిజం మూమెంట్ అవసరం ఇంకా ఉంది.
ఎలెక్స్ హేలీ..
హేలీ ఏదీ పైపైన రాయడు. పరిశోధన లేకుండా అసలు రాయడు. రూట్స్ అలా గొప్ప పరిశోధనతో వచ్చిన పుస్తకం. నీగ్రోల చరిత్ర మూలాలను వెతికితీసి లోతుగా పరిశోధించి ఎలెక్స్ హేలీ రాసిన చారిత్రక నవల ‘రూట్స్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అమెరికన్ ఫ్యామిలీ’. ఇది 780 పేజీల బృహద్గ్రంథం. ఈ బృహద్గ్రంథానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ పుస్తకం చదవని నల్లజాతి వ్యక్తి ఎవరూ లేరు అంటే ఆశ్చర్యం కాదు. చదువు వచ్చిన వాళ్ళు సొంతంగా చదువుకుంటే, చదువు రాని నల్లజాతి వారు ఆ పుస్తకాన్ని కొనుక్కొని ఇతరుల చేత చదివించుకుని విన్నారు. ఆ తర్వాత ఈ గ్రంథం సినిమాగా రూపొందింది. బుల్లితెర సీరియల్‌గా విస్తారంగా ప్రసారం కాబడింది. రచయిత ఎలక్స్ హేలీ ఈ ఒక్కరచనతోనే కోటానుకోటీశ్వరుడుగా మారిపోయాడు.
అలెగ్జాండర్ సైమన్ హేలీ, బెర్తా జార్జ్ల మొదటి సంతానంగా అలెగ్జాండర్ ముర్రే పల్మేర్ హేలీ న్యూయార్క్ సిటీలోని ఇతాకాలో 1922 ఆగస్టు 11న జన్మించాడు. వాషింగ్టన్ దగ్గరి సియాటెల్‌లో 1992 ఫిబ్రవరి 10న మరణించాడు. నానీ బ్రాంచ్, జూలియట్ కోలిన్స్, మైరాన్ లెవిస్లతో హేలీ తన వైవాహిక జీవితాన్ని పంచుకున్నాడు. ఎలెక్స్ హేలీ కుటుంబానికి ఆఫ్రికా, మాండింకా, చెరోకి, స్కాటిష్, స్కాటిష్- ఐరిష్ మూలాలు ఉన్నాయి. నల్లజాతి వాడినన్న న్యూనత హెలీలో ఎంత మాత్రం ఉండేది కాదు. హేలీ ఎప్పుడూ తన తండ్రి అలెగ్జాండర్ సైమన్ హేలీ అధిగమించిన జాత్యహంకార అడ్డంకుల గురించి గర్వంతో మాట్లాడేవాడు. హేలీలో రేసిజం గురించిన సంఘర్షణ ఉండేది.
నల్ల జాతికి గొప్ప చరిత్ర ఉందని, బానిసత్వం అనేది అమెరికన్లు ఆఫ్రికన్ల మీద చేసిన అమానుషం అని హెలీ భావన. తండ్రి లాగానే హేలీ కూడా చారిత్రాత్మకంగా నల్ల వాళ్ళ కాలేజీగా పేరు పొందిన మిసిసిపిలోని అల్కర్న్ స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. మరుసటి సంవత్సరం నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఎలిజబత్ సిటీ స్టేట్ కాలేజీలో చేరాడు. ఇది కూడా నల్ల వాళ్ళ కాలేజీయే. మరుసటి సంవత్సరం ఆ కాలేజీ నుంచి కూడా బయటకు వచ్చాడు.
హేలీకి మంచి క్రమశిక్షణ అలవాడాలని భావించి తండ్రి అతన్ని 18వ యేట మిలిటరీలో చేర్పించాడు. అలా హేలీ 20 సంవత్సరాల పాటు యూఎస్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగం చేశాడు. యూఎస్ కోస్ట్ గార్డులో నల్లవారికి ఇవ్వదగ్గ వరకు ప్రమోషన్ పొంది, మెస్ అటెండెంట్ నుండి ప్రెటి ఆఫీసర్ థర్డ్ క్లాస్ వరకు ఎదిగాడు. పసిఫిక్ థియేటర్ ఆపరేషన్‌లో పనిచేస్తూ ఉన్న కాలంలో కథలు రాయాలన్న ఆసక్తి పెంచుకున్నాడు. తర్వాత రిటైర్ అయి రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్‌కు సీనియర్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఈ మ్యాగజైన్లో తన తమ్ముడు జార్జ్ గురించి ఒక కథనం రాశాడు. సదరన్ లా స్కూల్లో మొదటి నల్లజాతీయుడిగా విజయవంతమైన విద్యార్థి కథనం అది. ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం అనేక ఇంటర్వ్యూలు నిర్వహించాడు. 1960లో నాజీ పార్టీ నాయకుడు జార్జ్ లింకన్ రాక్వెల్తో ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ చేశాడు. హేలీ యూదు కాదని హామీ పొందిన తర్వాతే హేలీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాక్వెల్ అంగీకరించాడు. ఇంటర్వ్యూ సమయంలో రాక్వెల్ టేబుల్ మీద హ్యాండ్ పిస్టల్ ఉంచినప్పటికీ చలించకుండా ఎలెక్స్ హేలీ ఇంటర్వ్యూ చేశాడు. షో బిజినెస్ ఇలస్ట్రేటెడ్ కోసం మైల్స్ డేవిస్‌తో చేస్తున్న ఇంటర్వ్యూ సందర్భంగా జాత్యాహంకారంపై నిష్కపటమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఈ మ్యాగజైన్‌కు టోన్ సెట్ చేసింది. హేలీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తో ప్లే బాయ్ కోసం చాలా విస్తారమైన ఇంటర్వ్యూ చేశాడు.
హేలీ రచనలు..
రూట్స్‌తో పాటు హేలీ రాసిన ఇతర రచనలు కూడా ప్రముఖంగానే చెప్పుకోవలసి ఉంది. హేలీ రాసిన ‘ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కం ఎక్స్’ 1965లో ప్రచురించబడింది. నల్లజాతి వారిని నీచంగా చూస్తున్న ఆత్మగౌరవ హణనానికి వ్యతిరేకంగా పెల్లుబికిన ధిక్కారస్వరం మాల్కం ఎక్స్. అందువల్ల అది కూడా చాలా ప్రసిద్ధిలోకి వచ్చిన పుస్తకం అయింది. హేలీ రాసిన మరో పుస్తకం ‘క్వీన్: ది స్టోరీ ఆఫ్ ఎన్ అమెరికన్ ఫ్యామిలీ’. ఇది పాక్షిక చారిత్రక నవల. ఇది హేలీ మరణించాక 1992లో ప్రచురించబడింది. ఇది రాస్తూ ఉండగా ఎలెక్స్ హేలీ చనిపోవడంతో హేలీ కోరిక మేరకు స్క్రీన్ ప్లే రైటర్ డేవిడ్ స్టీవెన్సన్ దీన్ని పూర్తి చేశాడు. నల్లవారి పిల్లల, స్త్రీల మానసిక శారీరక వేదనలని తెల్లవారి మనసుకు తగిలేలా చెప్పిన నవల అది. సూపర్ ప్లే టిఎన్టి అనే సినిమా కథను కూడా హేలీ 1973లో రాశాడు. ఇది ఓ నీల్ దర్శకత్వంలో సినిమాగా వచ్చింది.
రూట్స్ ఇతివృత్తం..
దక్షిణాఫ్రికాలోని గాంబియాలోగల ఒక స్వయం సమృద్ధమైన, స్వయం పరిపాలన కలిగిన గ్రామం జఫూర్. ఇది మాండింకా తెగకు చెందిన ప్రిమిటివ్ ముస్లింల గ్రామం. అక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయమే. ఆ వ్యవసాయం కూడా వారికి సరిపోయేంతగా ఉండేది కాదు. అందువల్ల మేకలు కాయడం వాళ్ళ ఇంకొక ప్రధానమైన పని. మేకలు కాయడం కోసం బోలాంగ్ నదీ తీరంలో పిల్లలకు చాలా అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. కొంచెం పెద్దయిన పిల్లలు పొద్దటి పూట చదువుకొని మధ్యాహ్నం పూట మేకలను కాయడానికి వెళ్లేవాళ్లు. మధ్యాహ్నం పూట మేకలను కాయడంలో భాగంగా పిల్లలకు తెల్లబూచీల నుండి తప్పించుకోవడం ఎలా అనే శిక్షణ లాంటిది ఇచ్చేవారు పెద్దవాళ్లు. వ్యవసాయపు సీజన్లో వరి కోతలు తర్వాత పండుగలు జరుపుకునే వారు. ఆ పండుగల్లో ఆటపాటలు కుస్తీ పోటీలు జరిగేవి. ఆ గ్రామాన్ని అప్పుడప్పుడు కరువు వెంటాడుతూ ఉండేది. ఆ కరువు కాలంలో తిండి లేక పిల్లలు కుమ్మరి పురుగుల్ని, తిమ్మిస్కల్ని పట్టుకొని తినాల్సి వస్తూ ఉండేది. కానీ వాళ్ళ జీవితంలో సర్దుకుపోయే స్వభావం ఉండేది. అక్కడి పిల్లలు అత్యంత సహజసిద్ధ వాతావరణంలో స్వేచ్ఛగా పెరుగుతారు. తెల్లబూచీల గురించిన భయం మాత్రం ఆ ఊరి పిల్లలను వెంటాడుతూ ఉంటుంది. తెల్ల బూచీలు పిల్లలను దొంగిలించుకపోయి కోసుకుతింటారని ఆ ఊర్లో కథలు చెప్పుకునేవారు. ఒక వయసు వచ్చిన మగ పిల్లలకు నాలుగు నెలలు ఊరికి దూరంగా తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చేవారు. ఈ శిక్షణలో ప్రధానమైన విషయం- తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, సున్తీ చేయించుకోవడం, విద్య నేర్చుకోవడం. స్వతంత్ర పురుషుడిగా మారడానికి ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటి వ్యవహారం.
ఆ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలోని ఉమరో, బింటా దంపతులకు కొడుకు పుడతాడు. అతనికి కుంటాకింటే అని పేరు పెడతారు. కుంటా తన బాల్యాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉండగా అతని చెవిలో తెల్ల బూచీల కథ పడుతుంది. జఫూర్లో అందరికీ కథలు చెప్పే న్యోబొటొ అనే ముసలి అవ్వే కుంటాకింటేకు కుడా తెల్ల బూచీల కథ చెబుతుంది. ఒక్క క్షణం కూడా అమ్మను వదిలి ఉండని కుంటాకింటే తెల్లబూచీల కథను విని ఆలోచనలో పడిపోతాడు. చూస్తుండగానే కుంటాకింటేకు కూడా శిక్షణా సమయం సమీపిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇంట్లో తన తల్లి తనతో ఇదివరకు ఉన్నంత చనువుగా ఉండదు. ఇతర అందరు పిల్లలకు వేసిన విధంగానే కుంటాకు కూడా వేరే గుడిసె వేస్తారు. ఆ గుడిసెలో ఉండి సొంతంగా మేకలను కాస్తూ ఉంటాడు.
కుంటాకు 17 సంవత్సరాల ఈడు వస్తుంది. కుంటా మేకలను కాసే సమయంలో ఒకరోజు అడవిలో విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అనూహ్యంగా తనను తెల్లబూచీలు వలలో పట్టేస్తారు. ఎంత పెనుగులాడినా తప్పించుకోలేకపోతాడు. పోరాడి పోరాడి తన శక్తి సరిపోక కూలబడిపోయినప్పుడు కుంటాను తెల్లబూచీలు సముద్ర తీరానికి తీసుకువస్తారు. ఒక ఓడలోకి ఎక్కిస్తారు. గొలుసులతో కట్టేస్తారు. భయంకరమైన ఆ ఓడలో తనలాంటి వందల మంది పిల్లలు వస్తువుల మాదిరిగా పడేసి ఉంటారు. ఓడ అడుగు భాగాన చెక్కపెట్టెలాంటి కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్లలో ఒక్కొక్క అరలో ఒక్కొక్కరిని కుక్కుతారు. లేచి కూర్చోవడానికి వీలుండదు. పక్కకు పొర్లడానికి అవకాశం ఉండదు. నిలబడడానికి అసలే అవకాశం ఉండదు. వాళ్లు ఓడ పైనుండి వేసిన తిండి తిని జీర్ణించుకోలేక చాలామంది వాంతులు చేసుకుంటారు. ఆ వాంతుల వాసన, మలవిసర్జన తర్వాత భరించలేని వాసన తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఓడ వాతావరణాన్ని తట్టుకోలేక ఆ మలినాన్ని భరించలేక కొంతమంది చనిపోతారు. కొంతమంది తెల్ల బూచీలకు ఎదురు తిరిగి కొట్లాడతారు. అట్లా కొట్లాడిన వాళ్ళలో కొందరిని తెల్లవాళ్లు చంపేస్తారు. చెక్కలతో పేర్చిన అరల్లో పైన ఒకరిని కింద ఒకరిని, ఆ కింద ఒకరిని పేర్చుకొని తీసుకుపోతూ ఉంటారు. ఈ దైన్యాన్ని భరించలేక ఒక యువతి ఓడ పైకెక్కి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. బానిసలుగా తీసుకుపోబడుతున్న ఈ నల్ల వాళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తూ తమలోతాము చర్చించుకుంటారు. తెల్లవాళ్లను ఎదిరించి కొట్లాడాలని ఒక వర్గం, సైలెంట్‌గా సర్దుకుపోవాలని మరో వర్గం భావిస్తుంది. కొద్ది రోజుల ప్రయాణంలో హత్య, ఆత్మహత్య, అనారోగ్యంతో మరణాలు సంభవిస్తుంటాయి. ఇన్ని రకాలుగా మనుష్యులు కళ్ళముందే మరణించడం కుంటాకింటే భరించలేక పోతాడు. అలా 140 మందితో బయలుదేరిన ఓడలో 42 మంది వివిధ కారణాలతో చనిపోతారు. చనిపోయిన వాళ్లందర్నీ సముద్రంలో విసిరేస్తూ వస్తుంటారు.
నీగ్రోలను తీసుకొస్తున్న ఓడ అన్నా పోలీస్ తీరం చేరుతుంది. బతికి ఉన్న నీగ్రోలను బయటికి తీసుకొచ్చి అంగట్లో పశువులలానే వేలం పెడతారు. కుంటా కింటేను కిందికి దించి వేలం పెట్టే దృశ్యాన్ని ఏడుతరాలు పుస్తకంలో సహవాసి చేసిన అనువాదం ఆ దైన్యాన్ని ఇలా కళ్ళకు కడుతుంది. “కుంటాతో కలిపి మొత్తం ఆరుగురిని వరుసగా నిలబెట్టి బయటికి నడిపించుకుపోయారు. బయట కొందరు తెల్లవారు విచిత్రంగా అరుస్తున్నారు. కుంటాకి అర్థం కాలేదు. ‘మూడు వందల యాభై’, ‘నాలుగు వందలు’, ‘ఐదు!’, ‘ ఆరు అనండి. ఎలా ఉన్నాడో చూడండి. గాడిదలాగా చాకిరీ చెయ్యకపోతే నన్ను అడగండి’. ఆ కేకలు, వాటి అర్థం తెలియకుండానే కుంటా కింటే భయంతో గిజగిజలాడిపోయాడు. మొహం చెమటతో తడిసి ముద్దయింది. గొంతులో ఊపిరాడలేదు.
‘ఇప్పుడే చెట్టూ చేమా వెతికి పట్టుకొచ్చాం’ అని వేదిక మీద నిలబడి ఒకడు అరుస్తున్నాడు. అతని ముందు వందల మంది తెల్లవాళ్ళు నిలబడి ఉన్నారు. ‘చూడండి! కోతి మాదిరిగా ఎంత హుషారుగా ఉన్నాడో. ఏ పనికైనా తర్ఫీదు ఇవ్వచ్చు’ . వేదిక ఎక్కి అరుస్తున్న వాడు కిందికి దిగి కుంటా చేతులకి వేసిన బేడీలు విప్పి వేదికకు దగ్గరగా ఒక తోపు తోశాడు. కుంటా కొంచెం వణికాడే తప్ప ముందుకి కదల్లేదు. పుల్లు పక్కు కట్టిన పిర్రల్ని కొరడా కొస అడ్డంగా చీరేసింది. ఆ నొప్పికి ఆగలేక దాదాపు కుప్పకూలినంత పనైంది. ముందుకి తూలిపడ్డాడు.
‘మల్లె మొగ్గండి బాబూ! మల్లె మొగ్గ! పడుచుదనం… పనిలో చురుకుదనం’ వేదిక దిగిన తెల్లవాడు గొంతు చించుకొని అరిచాడు. కుంటాను కొంటానికొచ్చిన తెల్లమూక అతని చుట్టూ మూగారు. అతని మూసిన పెదాల్ని పుల్లలతో తెరిచి పలువరస చూశారు. చేతుల్తో ఒళ్లంతా ఒత్తి చూశారు. వీపు, రొమ్ములు, చంకలు, గజ్జలు- అన్నీ గుచ్చి గుచ్చి చూశారు.
‘ముడుందల యాభయ్యట… మూడొందల యాభై’ వేలం పాట పాడే తెల్లవాడు ఎకసెక్కం చేశాడు.
‘అయిదొందలా! ఆరొందలా!’ అతని గొంతు కోపంగా మోగింది.
‘కోరి ఎగరేసుకు పోవలసిన కుర్ర నిగ్గరు! కనీసం ఏడొందల యాభై’ పాట పెరిగింది.
‘ఏడు యాబై…… ఏడు యాబై…. ఏడు యాభై’
‘ఎనిమిది’
‘ఎనిమిది యాభై!’
అక్కడితో ఆగిపోయింది. గొంతు పోయేటట్లు అరిచిన తెల్లవాడు గొలుసుని కొక్కెం నుంచి తప్పించి కుంటాను కొనుగోలు చేసిన తెల్ల యజమాని ముందుకు తోశాడు”. ఈ కుర్ర నిగ్రోను ఎక్కువ రేటుకు కొనచ్చని మరీ 850కి అమ్ముతారు. జాన్ వాలర్ దొర అలా కుంటాకింటేను 850కి కొంటాడు.
కుంటాను కొన్న జాన్ వాలర్ దొర అతన్ని తన బగ్గీలో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకొని తన జఫూర్కు చేరుకోవాలని కుంటా తపిస్తుంటాడు. దొర పెరట్లో కుంటాను పడవేయగానే, అతను ఎలాగైనా తప్పించుకోవాలనే ఆలోచనలోకి వస్తాడు. దొర ఎస్టేట్ గోడ దూకి పరిగెత్తుతూ ఓడలు నిలబడే సముద్ర తీరం లక్ష్యంగా అడవుల్లో పరుగుతీస్తుంటాడు. కానీ యజమాని వేట కుక్కలు కుంటాను తరుముతూ వచ్చి పట్టుకొని వెనక్కి లాక్కుపోతుంటాయి. యజమాని మనుషులు కూడా కుంటాని పట్టి బంధించి వెనక్కి తీసుకుపోయి కొరడాలతో కొడతారు. కొద్ది రోజులు ఏమీ చేయలేని స్థితిలో కుంటా అచేతనంగా పడి ఉంటాడు. బలవంతంగా అతనికి తినడానికి కొంత పడేస్తారు. మొదట అసలే తినడు కానీ తప్పనిసరైన పరిస్థితుల్లో తింటాడు. కానీ తప్పించుకోవడం అనే ఆలోచనను మరవడు. ఈసారి ఎవరికీ దొరకకుండా గోడ దూకి పారిపోవాలని మరొక ప్రయత్నం చేస్తాడు. తన ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద దూరాన్ని అడవుల ద్వారా ప్రయాణం చేసి సముద్ర తీరాన్ని చేరతాడు. ఓడలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఓడల్లో ఎక్కడానికి తనకు అనుమతి ఉంటుందా? తన దేశానికి తనని తీసుకుపోతారా? అనే సందేహం కుంటాలోనే మొదలవుతుంది. తను ఆలోచనలో ఉండగానే వెనక నుండి యజమాని మనుషులు వేట కుక్కలతో సహా పరుగెత్తుకొచ్చి తనని పట్టుకుంటారు. రెండోసారి తప్పించుకుపోయినందుకు అతనికి తీవ్రమైన శిక్ష విధించడానికి నిర్ణయిస్తారు. దొర మనిషి అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ‘రెండుసార్లు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేసినందుకు మనిషిగా సజావుగా జీవించడానికి వీలు కలిగించే శిక్ష ఒకటి ఉంది. అది పురుషాంగాన్ని నరికి వేయడం, లేదా ఒక పురుషుడిగా జీవించాలని కోరుకుంటే వికలాంగుడిగా జీవించడానికి సిద్ధపడి కాలు తీసేయడాన్ని కోరుకోవడం. ‘కత్తితో లింగం కోసెయ్యమంటావా? గొడ్డలితో పాదం నరకమంటావా?’ అని యజమాని మనిషి అడుగుతున్నట్లు కుంటాకు అర్థమవుతుంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి కోరుకోమ్మని అడుగుతాడు యజమాని మనిషి. కుంటా మనిషిగా జీవించడం అంటే పురుషుడిగా జీవించవలసిందే. పురుషాంగం లేని జీవితం అసలు జీవితమే కాదని భావించుకొని తన కాలు మాత్రమే నరికి వేయమని కోరుకుంటాడు. అలా కుంటా వికలాంగుడిగా మారి, దొర ఇంటికి చేరతాడు. అయినా తను ఎన్నడో ఒక రోజు జఫూర్కు చేరి తన తల్లిని చూడగలనని ఆశతోనే జీవిస్తూ ఉంటాడు. తను జఫూర్ని వదిలి ఎన్ని రోజులైందో లెక్క వేయడం కోసం సొరకాయ బుర్రలో ప్రతి పౌర్ణమి నాడు ఒక రాయి వేసి దాచి పెడుతూ ఉంటాడు. కొంత కాలం గడిచాక ఒక సాయంకాలాన తన ఊరు, తల్లిదండ్రులు గుర్తువచ్చి, సొరకాయబుర్రను దొర్లించి, రాళ్ళను లెక్కించి తను జాపూర్ను వదిలి ఇరవైసంవత్సరాలు దాటిపోయిందని అర్థమై భోరున విలపిస్తాడు.
కుంటా క్రమేణా బానిస జీవితానికి అలవాటు పడతాడు. యజమాని చెప్పిన పనుల్ని చేయడానికి ఇతరుల సహకారం కూడా తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో తోటి బానిస బెల్‌తో స్నేహం ఏర్పడుతుంది. బెల్ చాలాసార్లు కుంటాకు భోజనం ఏర్పాటు చేస్తుంది. కొన్నిసార్లు బెల్ తన జీవిత భాగస్వామి అయితే బాగుండు అనే ఆలోచన కూడా వస్తుంది. బెల్కు బాధాకరమైన పూర్వ గాథ ఉంటుంది. అదంతా విన్న తర్వాత కూడా కుంటా బెల్‌ను ప్రేమిస్తాడు. కుంటా బెల్లు పెళ్లి చేసుకుంటారు. వారికి అమ్మాయి పుడుతుంది. ఆమెకు కిజ్జీ అని పేరు పెడతారు. ఆమెకు మాటలు వచ్చీ రాగానే కుంటాకింటే, గాంబియా గురించి, జఫూర్ గ్రామం గురించి, తను అక్కడి నుండి ఎలా ఎత్తుకు రాబడ్డాడో అంతా చెబుతాడు. జపూర్ వాతావరణ పరిస్థితులను కిజ్జీకి వివరిస్తాడు. మనం ఎప్పుడైనా మళ్లీ జఫూర్కి పోవాల్సిందే అంటాడు. కిజ్జీకి యజమాని వాలర్ కూతురు మిస్సిఆని అనే అమ్మాయి చదువు చెబుతుంది. కిజ్జీ నోవాకు దొంగ ట్రావెల్ పాస్ మీద ఫోర్జరీ సంతకం చేస్తుంది. అందుకు పనిష్మెంటెగా కిజ్జీని ఇంకొక యజమానికి అమ్మేస్తాడు. తన కూతురిని ఇంకొక యజమానికి అమ్మి తమకు దూరం చేయవద్దని కుంటా బెల్లు ఎంతో దీనంగా వేడుకుంటారు. అయినప్పటికీ యజమాని కరుణించడు. చివరికి కిజ్జీ తల్లిదండ్రులకు దూరమై టామ్ లే అనే యజమానికి అమ్ముడు పోతుంది.
కిజ్జీని కొన్న కొత్త యజమాని టామ్ లే. కిజ్జీని తీసుకు వచ్చిన మొదటి రోజే టామ్ లే ఆమెను బలవంతంగా అనుభవిస్తాడు. కొన్ని రోజులకు కిజ్జీకి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు జార్జ్. జార్జ్‌కు కొంత వయసు రాగానే కిజ్జీ తన తండ్రి కుంటా కథ అంతా వివరంగా చెబుతుంది. చెప్పడమే కాకుండా ఈ కథను శ్రద్ధగా గుర్తు పెట్టుకొని నువ్వు పెద్దయ్యాక పెళ్లి అయ్యాక నీకు పిల్లలు పుడితే వాళ్లకి కూడా ఈ కథ చెప్పాలని చెబుతుంది. ఎప్పుడైనా మనం గాంబియాకు జఫూర్కు వెళ్లాల్సిన వాళ్ళమే అని కూడా చెబుతుంది. జార్జ్ మనసులో ఈ ముద్ర బలంగానే వేయబడుతుంది. జార్జ్‌ను యజమాని కోళ్ల పెంపకానికి అప్పజెప్పాడు. కోళ్ల పెంపకంలో జార్జ్ చాలా మెలకువలు తెలుసుకుంటాడు. యజమాని నౌకర్ల అందరిలో జార్జ్‌కు మంచి పేరు వస్తుంది. అతన్ని అందరూ కోళ్ల జార్జ్ అని పిలుస్తూ ఉంటారు. యుక్త వయసు వచ్చాక కోళ్ల జార్జ్, యజమాని దగ్గర నమ్మిన బంటులా పనిచేసే మరొక అమ్మాయి మెటిల్డాను పెళ్లాడతాడు. వీళ్లకు వర్జిల్, టామ్, జేమ్స్, లెనిన్, ఆష్‌ఫర్డ్, బేబీ కిజ్జీలు పుడతారు. కోళ్ల జార్జ్ అతని భార్య మెటిల్డా పిల్లలకు తన తాత కుంటా కథనంతా చెబుతారు. కుంటా వీరత్వం సాహసం మంచి కథగా వర్ణించి చెబుతారు. ఈ కథను మీరు పెద్దయ్యాక మీ పిల్లలకు కూడా చెప్పమని మరీ చెబుతారు.
కొద్ది రోజుల్లోనే జార్జ్ యజమాని టామ్ లే ఆర్థికంగా దివాలా తీస్తాడు. అందువల్ల డబ్బుల కోసం జార్జ్‌ను ఇంగ్లాండుకు అమ్మేస్తాడు. జార్జ్ భార్యను పిల్లలను మాసా ముర్రే అనే ఇంకొక యజమానికి అమ్మేస్తాడు టామ్ లే. జార్జ్ తల్లి కిజ్జీ ముసలిదవడం వల్ల రేటు రాదని టామ్ లే తన ఫామ్‌లోనే ఉంచుకుంటాడు. ఆ విధంగా జార్జ్ కుటుంబం మూడు ముక్కలుగా చిన్నాభిన్నమైపోతుంది. కొన్నాళ్ల తర్వాత జార్జ్ ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి టామ్ లే ఫామ్‌లో తల్లి కిజ్జీ కోసం వెతకగా ఆమె చనిపోయిందని తెలుస్తుంది. భార్యా పిల్లల గురించి ఆరా తీయగా వాళ్లని మాసాముర్రేకు అమ్మాడని తెలిసి యజమానితో చాలా గొడవ పడతాడు. ఎలాగోలా మాసాముర్రే ఫామ్ చిరునామా కనుక్కొని వెళ్లి భార్యా పిల్లలను కలుసుకోగలుగుతాడు జార్జ్. అక్కడ 60 రోజుల కంటే మించి ఉంటే మళ్ళీ బానిసత్వం వస్తుందని చట్టంలో ఉందని తెలవడంతో తిరిగి భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోతాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అబ్రహం లింకన్ అధ్యక్షుడు అవుతాడు. బానిసత్వం నిర్మూలించబడుతుంది. జార్జ్ కుటుంబం మరోచోట స్థిరపడుతుంది. జార్జ్ కూతురు ఇరీన్‌కు మెరియా, ఎలెన్, సింతియాలు జన్మిస్తారు. సింతియా విల్ పామర్ను పెళ్లాడుతుంది. వారికి బెర్తా జార్జ్ అనే అమ్మాయి పుడుతుంది. బెర్తా జార్జ్‌కు అలెగ్జాండర్ హేలీకి పుట్టిన పిల్లవాడే ఈ గ్రంథ రచయిత ఎలక్స్ హేలీ. ఎలక్స్ హేలీ మాతృమూర్తి తన చిన్నతనం నుండి ఈ కథను పదేపదే చెబుతూ ఉండేది. ఒక వయసు వచ్చాక ఈ కథ వెనక ఉన్న నిజాలు ఏమిటో పరిశోధించాడు హేలీ.
విశేషాలు
హేలీ కుటుంబ చరిత్ర ఆధారంగా రాయబడిన నవల రూట్స్. 1767లో గాంబియాలోని జఫూర్లో కిడ్నాప్ చేయబడి నౌకలో తరలించబడి మేరీ ల్యాండ్ ప్రొవెన్సెస్లో బానిసగా విక్రయించబడ్డ కుంటాకింటే కథతో ప్రారంభమవుతుంది. ఈ నవలారచయిత హేలీ కుంటాకు ఏడవ తరం వాడు. 12 సంవత్సరాల పరిశోధన ఖండాంతర ప్రయాణం, లార్డ్ లిగోనియర్ అనే ఓడ రికార్డులు, జఫూర్ గ్రామ గిరిజన చరిత్రకారుడు గ్రియోట్ మౌఖికంగా చెప్పిన కథ ఆధారంగా ఈ నవలలో చెప్పబడ్డ విషయాలను నిర్ధారించుకున్నాడు రచయిత. ఈ రచయిత తన జీవితంలో అత్యంత ఉద్వేగ భరితమైన క్షణం 1967 సెప్టెంబర్ 29న మేరీ ల్యాండ్‌లోని అన్నా పోలీసులోని సైట్లో నిలుచున్నప్పుడు జరిగిందని, సరిగ్గా 200 సంవత్సరాల కింద గొలుసులతో కట్టి వేయబడి తన పూర్వికుడు ఇక్కడకు వచ్చాడని పేర్కొన్నాడు. తన పాదాల వద్ద గుమిగూడిన చిన్న పిల్లలకు కథ చెబుతున్నట్లు ఉన్న స్మారక చిహ్నాన్ని అన్నా పోలీస్ మధ్యలో రచయిత హేలీ నిర్మించాడు.
రూట్స్ అనేక భాషలలోకి అనువాదం అయింది. పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. ఏబిసి సిరీస్‌గా రూట్స్ సీరియల్‌గా తీయబడింది. ఈ సీరియల్ 130 మిలియన్ల ప్రజలు వీక్షించారు. అమెరికాలో ప్రతి నల్ల జాతి ఇంట్లో ఈ గ్రంథం అవశ్య పఠనీయ గ్రంథంగా భద్రపరచబడింది.
అయితే రూట్స్ నవల వివాదాస్పదం కూడా అయింది. ‘కుంటాకింటే కథ వృత్తాకార రిపోర్టింగ్ కేసుగా కనిపిస్తుంది. దీనిలో హేలీ స్వంత అభిప్రాయాలు అందులో చెప్పబడ్డాయి. వర్జినియా, నార్త్ కరోలినాలో రాతపూర్వక రికార్డులు ఏవీ అంతర్యుద్ధం తర్వాత వరకు రూట్స్ కథకు అనుగుణంగా లేవు. హేలీ కుటుంబ కథనంలోని కొన్ని అంశాలు మాత్రమే రాతపూర్వక రికార్డుల్లో కనిపిస్తాయి. అయితే వంశవృక్షం రూట్స్‌లో వివరించిన దానికి భిన్నంగా ఉంటుందని అంటారు వంశపారంపర్య హెరిడిటరీ సైంటిస్ట్స్.
మార్గరెట్ వాకర్, హెరాల్డ్ కొర్లాండర్లు ఈ పుస్తకంపై కాపీ రైట్ కేసులు వేశారు. మార్గరెట్ వాకర్ కేసు కొట్టి వేయబడగా కొర్లాండర్ కేసు మాత్రం గెలిచింది. ఎలెక్స్ హేలీ, హెరాల్డ్ కొర్లాండర్ రాసిన ది ఆఫ్రికన్ లోని కొన్ని భాగాలను రూట్స్‌లో చేర్చినట్లు అంగీకరించి 6,50,000 డాలర్లను 1978లో ఫైన్‌గా ఈ రచయిత చెల్లించాడు. ఇది 2023 నాటి ద్రవ్యోల్బణం ప్రకారం 30,36,429 డాలర్ల కింద లెక్క. అంటే రూ. 24,28,80,000 అన్నమాట.
చరిత్రను పరిశోధించి మానవీయకోణం ఉట్టిపడేలా రాసిన అరుదైన నవల రూట్స్. అందువల్లనే అది ప్రపంచ ప్రసిద్ద చారిత్రక నవలల్లో గణనీయమైన పేరు సంపాదించుకుంది. సామాన్యుల పక్షాన ఆలోచించడం వల్ల రచనలు ప్రజల మనస్సులో చిరకాలం నిలిచిపోతాయని చెప్పడానికి రూట్స్ ఒక తిరుగులేని దాఖలా.
ఏనుగు నరసింహారెడ్డి
8978869183
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.