
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న బలబలాలను చూస్తే, సంఖ్యా బలముండటంతో కూటమికి రాజ్యసభలో మరింత బలం పెరగనుంది. అయితే, రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య చర్చలు జరిగాయి. ఇదే విషయంపై ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్‌షాతో కూడా చర్చలు జరిపారు.
రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని నిర్ణయించినప్పటికీ, అభ్యర్థి విషయంలో కొంత స్పష్టత కరువయింది. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నేతల పేర్లు తెరమీదకు వచ్చాయి. రాజ్యసభ స్థానం కోసం ఇటీవల అమితాషాను చంద్రబాబు కలిసిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరును కూడా చర్చకు వచ్చినట్టుగా రాజకీయవర్గాలలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
అంతేకాకుండా, ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కోసం బీజేపీ పెద్దలు త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, తమిళ బిజెపి నేత అన్నామలై పేరును కూడా పరిశీలించినట్టుగా కూటమి శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి నేతల పేర్లు తెరపైకి రాగ, ఏపీకి చెందిన నేతకే బీజేపీ సీటు కట్టబెట్టడం విశేషం.
పోటీ నుంచి విరమించుకున్న వైసీపీ..
వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయినా రాజ్యసభ స్థానానికి ఇప్పుడు జరగనున్న రాజ్య సభ ఉప ఎన్నికలో వైసీపీకి సంఖ్య బలం లేకపోవటంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉపఎన్నిక జరగనున్న రాజ్యసభ స్థానం ఎన్డీఏలో భాగమైన బీజేపీకి దక్కనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణకు ఎన్డీఏ తరుఫున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున బీసీ సామాజిక వర్గం నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పాకా సత్యనారాయణ నేపథ్యం..
భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతగా దాదాపుగా 45 ఏళ్లుగా బీజేపీలో ఉన్నారు. చదువుకునే రోజుల్లో భీమవరంలోని డీఎన్ఆర్ కాలేజీలో ఏబీవీపీలో చురుగ్గా పనిచేస్తూనే, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరారు. భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష పదవితో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు హోదాల్లో పనిచేశారు. తొలి నుంచి పార్టీ పట్ల విధేయతతో ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రణాళికలు వేస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరున్న పాకా వెంకట సత్యనారాయణను 2021 నుంచి రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచి కూడా అదే పదవిలో పాకా కొనసాగుతున్నారు.
అయితే, రాజ్యసభలో కూడా తమ ఆధిపత్యాన్ని బీజేపీ నిలుపుకునేందుకు వచ్చిన ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘటనని బట్టి చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుత రాజ్యసభ స్థానం తమకే కావాలని పట్టుబట్టి, రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలనే ఆలోచనతో ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు సూచినచ్చినట్లుగా కూటమి నేతలలో బలమైన ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా చివరికి రాజ్యసభ స్థానం బీజేపీ ఖాతాలోనే పడింది. పాకా సత్యనారాయణకు ఆ రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. దీంతో ఇప్పటికే రాజ్యసభలో బీజేపీకి 98 మంది సభ్యులు ఉండగా ఈ స్థానంతో సంఖ్య 99కి పెరగనుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.