
“దౌత్యం అంటే మరేమీ లేదు. మిత్రులని సంపాదించుకోవడం, ఇంకా ప్రజల్ని ప్రభావితం చేయడం” అని ఎస్ జై శంకర్ తన ఇటీవలి రచనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో ఇండియా, పాకిస్తాన్ల మధ్య చెలరేగిన సాయుధ ఘర్షణల్లో చైనా తాను ఇస్లామాబాద్‌కు “శాశ్వత మిత్రుడి”నని మరోసారి బలంగా ప్రకటించింది. రెండు పొరుగు దేశాల మధ్య గతంలో జరిగిన యుద్ధాల సందర్భాలలో కంటే ఈ సారి బీజింగ్ చాలా స్పష్టంగా పాకిస్తాన్ పక్షం వహించింది.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకునే వాతావరణం ఏర్పడినప్పుడు చైనా విదేశాంగ శాఖా మంత్రి వాంగ్ యి ఇలా ప్రకటించారు: “పాకిస్తాన్‌కు వ్యూహాత్మక సహకార భాగస్వామి,తిరుగులేని మిత్రుడు అయిన చైనా- పాకిస్తాన్ తాలూకు న్యాయమైన భద్రతా అంశాలను పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఇంకా సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్‌కు మద్దతునిస్తుంది.”
భారతవర్గాల సమాచారం ప్రకారం ఘర్షణ సమయంలో చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, శాటిలైట్ ఛాయాచిత్రాలను పాకిస్తాన్‌కు అందించి సహాయపడింది. కాల్పుల విరమణ జరిగిన తర్వాత, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు అందాల్సిన నీటిని అందకుండా చేస్తామని ఇండియా సూచనప్రాయంగా వెల్లడించినప్పుడు, తాను కూడా బ్రహ్మపుత్ర నీటిని ఇండియాకు అందకుండా చేస్తానని చైనా హింట్ వదిలింది.
ఈ రకంగా బేషరతుగా మద్దతు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మొదటిది, చైనా ఆయుధ వ్యాపారులకు పాకిస్తాన్ ఒక ప్రధానమైన కస్టమర్‌గా మారింది. పాకిస్తాన్ ఆయుధాగారంలో 80 శాతానికి పైగా ఆయుధాలు చైనాలో తయారైనవే. చైనాకు పాకిస్తాన్ ఒక ఆకర్షణీయమైన మార్కెట్‌గా వుండటం మాత్రమే కాదు. రెండు దేశాలు కొన్నిసార్లు కలిసి అభివృద్ధి చేసిన ఆయుధాలను యుద్ధరంగంలో పరీక్షించడానికి కూడా చైనాకు అవకాశం కల్పిస్తుంది.
రెండోది, చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పథకంలో భాగంగా పాకిస్తాన్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద 68 బిలియన్ డాలర్లను చైనా మదుపు పెట్టింది. పాకిస్తాన్ ఆలస్యంగా చెల్లింపులు చేయడం, బలూచ్ జాతీయవాదులు చైనీస్ ఇంజనీర్లపై దాడులు చేయడం వంటి వాటి కారణంగా బీజింగ్- ఇస్లామాబాద్‌ల మధ్య పదేపదే ఉద్రిక్తతలు తలెత్తుతున్నప్పటికీ బెల్ట్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ ప్రధాన లక్ష్యం చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పథకం. ఇంకా చెప్పాలంటే, ఈ 68 బిలియన్ డాలర్లలో కొంత భాగాన్ని ఇండియా తన భూభాగాలుగా క్లైయిమ్ చేసే గిల్గిట్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు, ఇంకా పవర్ ప్లాంట్లను నిర్మించడానికి వినియోగించారు.
మూడోది, నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు వివాదాలు పదేపదే తలెత్తుతూ ఉండడంతో ఇండియాని ఇరకాటంలో పెట్టడానికి చైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకొంది. మొదటిది, భారత ప్రభుత్వం హిందూ జాతీయతావాద భావజాలంతో రివిజనిస్టు అభిప్రాయాలను వ్యక్తం చేసింది. అందులో భాగంగా 1962 యుద్ధంలో చైనా గెలుచుకొన్న లద్ధాక్ భాగాన్ని కూడా కలుపుకుని అఖండ్ భారత్‌ను పునరుద్ధరించడం తమ లక్ష్యమని ప్రకటించింది. రెండోదేంటంటే బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి వాటితో మొదలుపెట్టి దక్షిణాసియా దేశాల్లోకి చైనా ప్రవేశాన్ని ఇండియా నిరోధించాలని చూసింది. మూడోది, పాకిస్తాన్‌కు చైనా దశాబ్దాలుగా ఆయుధ సహాయం అందిస్తూ ఇండియా తన పశ్చిమ భాగంలో నిత్యం బిజీగా ఉండేలా చేసింది. “నైబర్ హుడ్ ఫస్ట్ ఆర్ లుక్ ఈస్ట్” వంటి ప్రాంతీయ విధానాలను న్యూ ఢిల్లీ ఎంచుకోక తప్పని పరిస్థితిని కల్పించింది.
నాలుగోది, అమెరికాతో ఇండియా తన స్నేహ సంబంధాలను పునరుద్ధరించి, చైనాను దూరం పెట్టింది. ఇది ఇటీవలి వరకూ మోదీ– ట్రంప్‌ల మధ్య వున్న సత్సంబంధాలతో స్పష్టంగా వెల్లడయింది. తమ చైనీస్ ఫ్యాక్టరీలను ఇండియాకు తరలించాలని చూస్తున్న అమెరికన్ కంపెనీలను ఆకర్షించాలనేది ఇండియా ఉద్దేశ్యం.
ఇండియాకు శాశ్వత మిత్రులు ఎవరు?
చైనా ప్రపంచంలో రెండవ ప్రధాన శక్తి కావడంతో పాటు, ఇండియాతో హిమాలయాల్లో ఘర్షణ పడుతున్న కారణంగా కూడా చైనాను తన బలమైన శాశ్వత మిత్రునిగా ఇస్లామాబాద్ పరిగణించి వ్యవహరిస్తుంది. న్యూఢిల్లీ మాత్రమే సంక్షోభంలో ఒంటరిగా మిగిలిపోయింది.
పహల్గాం దాడికి పాకిస్తాన్, లేదా టెర్రరిస్టు గ్రూపు కారణమని ఇండియా తన పత్రికాప్రకటనలో పేర్కొన్న అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒప్పించడంలో విఫలమైంది. అన్నిటికీ మించి ఇండియా ఊహించని విధంగా అమెరికా జోక్యం చేసుకొంది. ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి నిరాకరించినప్పటికీ, ఘర్షణ మొదలైన మూడో రోజున అణు యుద్ధ ప్రమాదం తీవ్రమవుతోందన్న భావనతో వైట్‌హౌస్ జోక్యం చేసుకొంది. అది కూడా ఇండియాను పరిగణనలోకి తీసుకోకుండా. మే 10న డోనాల్డ్ ట్రంప్ యుద్ధశక్తులకు విలువైన వాణిజ్య ఒప్పందాలను హామీగా ఇస్తూ, తన సత్వర మధ్యవర్తిత్వంతో తుపాకీ మాటలని ఆపానని ప్రకటించారు. ఇరుదేశాలను శాంతి చర్చలకు ఆహ్వానించడంతో పాటు, కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తమ తరఫున మధ్యవర్తులుగా వ్యవహరించమని కూడా పిలుపునిచ్చారు.
ఈ మొత్తం క్రమాన్ని న్యూ ఢిల్లీ రెండు కారణాల చేత అవమానంగా భావించింది. ఇందులో మొదటిది, ఇండియా- పాకిస్తాన్ల మధ్య తలెత్తిన వివాదాలకు గతంలో అమెరికా అధ్యక్షులు ముగింపు పలికిన అన్ని సందర్భాల్లో ఆయా అధ్యక్షులకే లాభం చేకూరింది. కార్గిల్ నుంచి పాకిస్తానీ బలగాలను ఉపసంహరించుకోవాలని చెప్పడానికి 1999 జులై 4న నవాజ్ షరీఫ్‌ను బిల్ క్లింటన్ వాషింగ్టన్ పిలిపించారు. ఈ సారి ట్రంప్ తనను తాను ప్రపంచాన్ని అణుయుద్ధం నుంచి కాపాడిన రక్షకుడిగా ప్రచారం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇండియా తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించానని అనుకున్నది. కానీ ప్రపంచం మాత్రం ఈ ఘర్షణ డ్రాగా ముగుసిందనే భావించింది.
ప్రభుత్వ ఆధీనంలోని మీడియా ప్రచారం చేసిన జాతీయోన్మాదంతో వెర్రెక్కిపోయి, “పాకిస్తాన్‌ను అంతం చేయాల”ని బలంగా అనుకున్న భారతీయులు మాత్రం తీవ్రంగా నిరాశ పడ్డారు.
రెండోది, 1972లో ఇందిరా గాంధీ హయాంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక వ్యవహారంగా పరిగణించాల్సిన కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా చేయకుండా ఉండడానికి ఇండియా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నాలను ట్రంప్ నాశనం చేస్తున్నారు. ఇక్కడ కూడా ట్రంప్ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్‌తో ఎడతెగని శత్రుత్వం ఉన్నట్లుగా కనిపించకుండా ఉండడానికి ఇండియా అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ వుండగా, ట్రంప్ దానికి భిన్నంగా “ఇండియా-పాకిస్తాన్ విభేదాలు”అన్న అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఇండియా స్థానాన్ని దిగాజార్చుతున్నారు. ఎడతెగని ప్రాంతీయ వివాదాల్లో చిక్కుకున్న దేశంగా ఇండియాను చూపిస్తూ, ప్రపంచ శక్తిగా ఇండియా అవతరించలేదని చెప్పదలుచుకున్నారు.
తర్వాత్తర్వాత ట్రంప్ పాకిస్తాన్ పట్ల మరింత సానుకూలతను ప్రదర్శించారు. ఇంకా ట్రంప్, “పాకిస్తాన్ నాయకత్వం చాలా బలమైంది. నేనిలా చెప్పడం కొంతమందికి నచ్చదు. కానీ ఇదే వాస్తవం. వాళ్ళు యుద్ధాన్ని ఆపేశారు. వాళ్ళను చూసి నేను గర్వపడుతున్నాను”అని కూడా ప్రకటించారు. దీంతో ఏకీభవిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి మైకేల్ కురెల్లా పాకిస్తాన్‌ను “ఉగ్రవాద నిరోధక శక్తులకు అద్భుతమైన భాగస్వామి”అని ప్రశంసించారు.
అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఇటీవలి సత్సంబంధాలకు ఈ ‘ఉగ్రవాదం పై పోరు’ ఒక కారణం కావచ్చు. పాకిస్తాన్‌కు కత్తిరించిన విదేశీ సహాయం నుంచి 397 మిలియన్ డాలర్ల మొత్తాన్నిమినహాయించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్లో వున్న అమెరికా తయారీ ఎఫ్-6 ఫైటర్ జెట్లను ఇండియాకి వ్యతిరేకంగా ఉపయోగించడానికి కాక, ఉగ్రవాద నిరోధక చర్యలకు ఉపయోగించేలా పర్యవేక్షించేందుకు ఈ నిధులను కేటాయిస్తారు. పహల్గాం ఘటన తర్వాత ఇండియా- పాకిస్తాన్లను ట్రంప్ సమానంగా పరిగణిస్తూ వ్యవహరించడంలో ఏదో వైరుధ్యం వుంది. ఒకటి ఉగ్రవాదానికి బాధితురాలు కానట్టు, మరొకటి అనేక ఉగ్రవాద గ్రూపులతో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
పాకిస్తాన్- అమెరికాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించడానికి ఫీల్డ్ మార్షల్ ఆషిం మునీర్‌ను ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం వాషింగ్టన్కు ఆహ్వానించారు. ఈ సందర్శనలో విషయాలు మరింత తేటతెల్లం కావచ్చు.
పాకిస్తాన్ పట్ల ట్రంప్ సానుకూలంగా ఉండడానికి కారణమేమైనప్పటికీ, పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు ఇది విరుద్ధమైనది. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామాబాద్‌ను ప్రాముఖ్యత లేనిదిగా చేయడానికి గాను ఏళ్ల తరబడి న్యూఢిల్లీ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ అమెరికాతో పాటు ఇంకా అనేకమంది మద్దతుదారులను పాకిస్తాన్ కూడగట్టగలిగిందని గత కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు తెలుపుతున్నాయి.
ఇండియా- పాకిస్తాన్‌లు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ఇండియా భూభాగంలో పని చేస్తున్న జిహాదిస్టు గ్రూపులకు పాకిస్తాన్ సహకారం అందిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిగ్గా అప్పుడే, మే 9న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాలూకు ఎగ్జిక్యూటివ్ బోర్డు పాకిస్తాన్ కోలుకోడానికి కొత్తగా 1.4 బిలియన్ డాలర్ల అప్పును మంజూరు చేసింది. ఇంకా 7 బిలియన్ డాలర్ల పథకానికి సంబంధించిన మొదటి రివ్యూని కూడా ఆమోదించి, ఒక బిలియన్ డాలర్ల నగదును విడుదల చేసింది. దీన్ని బోర్డు సమావేశంలో ఇండియా వ్యతిరేకించింది. ఈ పథకం ద్వారా పాకిస్తాన్లో ప్రభుత్వ ప్రాయోజిత సరిహద్దు ఉగ్రవాదానికి నిధులను సమకూర్చడానికి ఈ రుణాన్ని ఉపయోగిస్తారని వాదించింది. కానీ ఆ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఇతర దేశమూ కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు. కనీసం వోటింగ్‌కు దూరంగా వుండడం ద్వారా కూడా మద్దతు ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ఒక నెల తర్వాత, ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు సంస్థల్లో పాకిస్తాన్ రెండు పదవులను పొందింది. ఒకటి, ఐక్యరాజ్యసమితిలోని పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 1988 శాంక్షన్ల కమిటీకి అధ్యక్షులుగా నియమించడం. ఈ అధ్యక్షులు తాలిబాన్లను లక్ష్యంగా చేసుకొన్న శాంక్షన్లను పర్యవేక్షిస్తారు. రెండోది, 1373 కౌంటర్ టెర్రరిజం కమిటీకి కూడ పాకిస్తాన్ దౌత్యవేత్తను ఉపాధ్యక్షులుగా నియమించడం. నాన్-పర్మనెంట్ మెంబర్‌గా పాకిస్తాన్‌కు వున్న హోదా కారణంగానే ఈ పదవులు దక్కాయి. 2024లో 182 ఓట్లతో పాకిస్తాన్ నాన్-పర్మనెంట్ మెంబర్‌గా ఎన్నిక కావడం అనేదే ఆ దేశం ఒంటరిగా లేదన్న విషయాన్ని రుజువు చేస్తోంది. ఇండియాకు సుదీర్ఘకాలంగా భాగస్వామిగా వున్న రష్యా ఈ సందర్భంలో ఎలా వ్యవహరిస్తోంది? అది తటస్థంగా ఉంటూ, పాకిస్తాన్ వైపు కూడా మొగ్గు చూపింది. పహల్గాం దాడి తర్వాత మాస్కో నిశ్శబ్దంగా ఉండడమే కాక, కరాచి దగ్గరున్న సోవియట్ కాలంనాటి ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరిస్తానని మాట కూడా ఇచ్చింది. పాకిస్తాన్- రష్యాలు మధ్య ఆసియా గుండా కారిడార్‌ను అభివృద్ధి చేయాలనుకొంటున్న దానికి రుజువుగా లాహోర్- మాస్కో రైలు తాలూకు కొత్త రైలు మార్గాన్ని కూడా ఈ నెల్లోనే ప్రారంభించారు.
పహల్గాం దాడి తర్వాత రెండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్,ఇజ్రాయెల్ మాత్రమే సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు ఆఫ్ఘనిస్తాన్ స్పందించింది. పాకిస్తాన్ బలహీనంగా వున్నప్పుడు చూసి దెబ్బ తీయాలని న్యూఢిల్లీ, కాబూల్లు కలిసి ప్రయత్నించాయి. కానీ బీజింగ్ జోక్యంతో ఈ వ్యూహానికి అడ్డుకట్ట పడింది. న్యూ సిల్క్ రోడ్‌ను ఏర్పాటు చేయాలన్న బీజింగ్ నిర్ణయంతో ఈ వ్యూహం ఆగిపోయింది. చైనా మధ్యవర్తిత్వం వల్ల ఆఫ్ఘన్-పాకిస్తాన్ల మధ్య సయోధ్య ఏర్పడింది. చివరికి కాబూల్‌లో పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.
ముంబైలో వుండే “ఇండియాకి మిత్రుడు” అయిన ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబీ షోషనీ మాటల్లో చెప్పాలంటే, పహల్గాం తర్వాత ప్రతీకార చర్యకు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. చాలామంది ఇజ్రాయెలీ పరిశీలకులు 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత నెతన్యాహు ప్రతీకార దాడి, క్రితం మే నాటి మోడీ దాడికి గల పోలికలు పేర్కొన్నారు. పోలిక సరైనదైనా, కాకపోయినా ఇండియా అలానే వుంది.
2025 జూన్‌లో గాజా కాల్పుల విరమణకు సంబంధించి పిలుపునిచ్చే తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టినప్పుడు 149 దేశాలు దాన్ని సమర్ధించగా, ఇండియా దూరంగా వుంది. జూన్ మధ్యలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండించడంలో ఇండియా విఫలమైంది. ఈ కారణంగా చైనా,రష్యాలు మూలస్తంభాలుగా వున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించిన వైఖరి నుంచి తనను తాను దూరం చేసుకొంది. ఇటీవలి పరిణామాలను బట్టి ఇజ్రాయెల్‌ను ఇండియాకు శాశ్వత స్నేహితునిగా అనుకోవచ్చా? ఇప్పుడే అలా నిర్థారణకు రాలేం. కానీ ఇంకో ప్రశ్నను వేసుకోవాలి. గతం కంటే కూడా ఎక్కువగా పాకిస్తాన్‌కు చైనా బేషరతు మిత్రునిగా వ్యవహరిస్తూ వుంటే, దానికి తగినట్లుగా ఇండియా –చైనాతో వ్యవహరించగలదా?
చైనాపై ఇండియా ఆధారపడడం..
ఆర్ధిక,పారిశ్రామిక,వాణిజ్య రంగాల్లో ఇండియా గతం కంటే కూడా ఎక్కువగా చైనా మీద ఆధారపడి వుంది. ఇదే సమయంలో భారతదేశ రాజకీయ నాయకత్వం ఎవరినైతే ‘నెంబర్ వన్ ప్రజాశత్రువు’అని చిత్రీకరిస్తోందో, ఆ దేశానికి చైనా అపారంగా మద్దతును అందిస్తోంది.
2024-25లో ఇండియాకు చైనా ఎగుమతులు రికార్డు స్థాయిలో 113.5 బిలియన్ డాలర్లు వుండగా, చైనాకు ఇండియా చేసిన ఎగుమతులు 14.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఫలితంగా 99.2 బిలియం డాలర్లలోటు ఏర్పడింది. ఈ అంకెలు చైనా ఉత్పత్తులతో పోటీ పడలేని భారత పారిశ్రామిక వ్యవస్థ బలహీనతను తెలియజేస్తున్నాయి. దాంతో పాటు చైనా సరఫరాల మీద ఇండియా ఆధారపడిన తీరుని కూడా ప్రతిబింబిస్తున్నాయి.
నిజానికి చైనా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే వాటిల్లో ఫినిష్డ్ గూడ్స్ భాగం చాలా తక్కువ(2023 -24లో 6.8%)కాగా, వాటిల్లో ఎక్కువ భాగం భారత పారిశ్రామిక,సేవా రంగాలు తయారు చేసి ఎగుమతి చేయాల్సిన ఇంటర్మీడియట్ గూడ్స్ (70.9%), ఇంకా ప్రొడక్షన్ గూడ్స్ (22.3 %) ఉన్నాయి. ఫలితంగా ఇండియా ఎంత ఎక్కువ ఎగుమతి చేస్తుందో అంత ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వుంటుంది. ఈ సూత్రం ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, ఇంకా ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో మరింతగా వర్తిస్తుంది. ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో ఐ ఫోన్లు మొదలుకొని అనేక స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తూ , వాటి విడి భాగాలను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకొంటోంది. అలాగే ఫార్మసీ రంగంలో జెనెరిక్ మందుల్ని ఎగుమతి చేస్తూ ఇండియా ‘ప్రపంచ ఫార్మసీ’గా పేరు పొందినప్పటికీ, అనేక యాక్టివ్ ఇన్ గ్రేడియంట్లు వచ్చేది చైనా నుంచే.
లెక్కల్లో కన్పించే దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో చైనా మీద ఇండియా ఆధారపడి వుంది. ఎందుకంటే ఇండియాతో సహా అనేక దేశాలు విధించిన టారిఫ్ పరిమితులని, దిగుమతి కోటాల్ని తప్పించుకోడానికి చైనా సంస్థలు మలేసియా, లేదా వియత్నాంలలో స్థాపించిన పరిశ్రమల నుంచి ఇండియా ఉత్పత్తులని దిగుమతి చేసుకొంటుంది. సోలార్ ప్యానెల్స్ దీనికొక ఉదాహరణ. ఎనర్జీ ట్రాన్సిషన్ అంశంలో ఇండియా-చైనా మీద చాలా ఎక్కువగా ఆధారపడి వుంది.
ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఏప్రిల్- మే సంక్షోభం చైనాకు న్యూఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావడానికి తగిన అవకాశాన్ని కల్పించింది. ఏప్రిల్ 28న చైనా కారణంగా ఐఫోన్ విడిభాగాల సరఫరాలో జాప్యం జరగడాన్ని భారతదేశ పత్రికలు రిపోర్ట్ చేశాయి. తర్వాత కొద్ది కాలానికే చైనా రేర్ ఎర్త్ మూలకాల లభ్యతను కఠినతరం చేసింది. ఫలితంగా భారత ఆటోమోటివ్ రంగం ఇబ్బందుల్లో పడింది. దీనిపై చర్చలు జరిపడానికి బీజింగ్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపాలని న్యూ ఢిల్లీ ఆలోచన చేసింది.
దీనితో పాటుగా ఇంకా ఇతర విషయాల మీద చైనాతో ఇండియా చర్చలు ప్రారంభించి రాజీ కోసం ప్రయత్నిస్తోంది. ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం తన భూభాగంలో చైనా పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తామని ప్రకటించింది. 2020 రెండు దేశాల సైనికుల మధ్య చోటుచేసుకొన్న ఘర్షణల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడుతూ ఈ ప్రకటన చేసింది. అదే సమయంలో జూన్ 5న చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్‌ను చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సన్ వీడాంగ్ స్వాగతించారు. “నాయకులు సంయుక్తంగా ఆమోదించిన అంశాలను కలసి అమలు చేస్తామని, పరస్పర సహకారంతో ప్రజల మధ్య బంధాన్ని బలపరుస్తామని, ఆరోగ్యకరమైన, స్థిరమైన మార్గంలో చైనా-ఇండియా సంబంధాలను నిర్వహిస్తామని” ఇరువర్గాలు ప్రతిన పూనాయి.
జై శంకర్ చెప్పినట్లుగా “దౌత్యం అంటే మరేమీ లేదు. మిత్రుల్ని సంపాదించుకోవడం, ఇంకా ప్రజల్ని ప్రభావితం చేయడం” అని అనుకొన్నట్లయితే భారత దౌత్యవేత్తలు ఈ విషయాల్ని నిశితంగా పరిశీలించాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఇండియా ప్రప్రథమ బహిరంగ శత్రువు అయిన పాకిస్తాన్‌ను ఒంటరిని చేసి, ఇండియాకి మద్దతు నివ్వడానికి సిద్ధపడే వాళ్ళెవరు? ఇండియా ఆర్థికంగా అత్యంత ఎక్కువగా ఎవరిమీద ఆధారపడి వుందో; హిమాలయాల్లో, ఇంకా దేశ పొరుగు ప్రాంతాల్లో ఎవరితో ప్రమాదం వుందో- ఆ చైనాయే పాకిస్తాన్‌కు నమ్మకస్తుడైన శాశ్వత మిత్రునిగా వుంది. అమెరికా, రష్యా గానీ ఇండియాకి విశ్వసించ దగిన స్నేహితులుగా వ్యవహరించకపోతే, చైనాని ఎదుర్కోవడం ఇండియాకు ఇంకా ఎక్కువ కష్టమవుతుంది.
భారత దౌత్య విధానాన్ని ఇతర శక్తులతో బలోపేతం చేయాల్సి వచ్చింది. మొత్తం 32 దేశాల్లో ఇండియా విధానాన్ని వివరించడానికి న్యూఢిల్లీ- ఏడుగురు ప్రతినిధులతో కూడిన బృందాన్ని పంపించవలసి వచ్చింది. చైనా-పాకిస్తాన్ జంట నుంచి నానాటికీ పెరుగుతున్న బెదిరింపులను ఎదుర్కోవడంతో పాటు, న్యూ ఢిల్లీ సాపేక్షికంగా ఒంటరయిపోయే ప్రమాదానికి పరిష్కారాన్ని వెతకాల్సి వుంది.
మొత్తమ్మీద ఒక ఉమ్మడి లక్ష్యం కోసం అనేక దేశాలు కలిసి పనిచేసే బహుపాక్షిక విధానాన్ని తిరిగి పరిశీలించాల్సిన అవసరం కన్పించడం లేదా? ఎస్ జై శంకర్ తన 2020 రచన “ది ఇండియా వే :స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్ సర్టెన్ వరల్డ్”లో ఇలా అన్నారు: “ఈ సమయంలో మనం అమెరికాను కలుపుకోవాలి. చైనాతో తెలివిగా వ్యవహరించాలి. యూరప్‌తో సంబంధాలు పెంచుకోవాలి. రష్యా మద్దతును తిరిగి పొందాలి. జపాన్ని కూడా భాగస్వామిని చేయాలి. పొరుగు వాళ్ళని ఆకర్షించాలి” అదంతా సరే, మిత్రులని సంపాదించుకోవడం ఎలా? ముఖ్యంగా దౌత్యం అంతా దానికోసమే అయినప్పుడు. ఎప్పుడూ పొత్తులను తిరస్కరించే భారతదేశ సంప్రదాయం ప్రస్తుతం ప్రమాదంలో పడింది. బహుళపక్ష ఒప్పందాల ద్వారా ఇండియా తన మద్దతును వికేంద్రీకరించింది. ఈ పధ్ధతి వాటిని కూడా బలహీనపరిచింది. ఈ లావాదేవీల సంబంధాలు మిత్ర దేశపు వాటితో పోల్చి చూసినప్పుడు బలహీనంగా వున్నాయి.
అనువాదం: అమలేందు ముప్పాళ్ళ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.