
దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడి 50 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా పత్రికా రంగంలో పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన రామ్ నాథ్ గోయంకా సమకాలీన భారతీయ మీడియా గురించి ఏమనేవారో ఊహించుకుందాం.
కళంకిత దినంగా 1975 జూన్ 25 గుర్తింపు పొందింది. ఆరోజు భారతదేశంలో కేవలం ప్రజాస్వామ్యం మాత్రమే బెదిరింపులకు గురి కాలేదు. పత్రికా స్వేచ్ఛ కూడా పీక నులమబడింది. గాడాంధకారపు నడిరాత్రి రాజ్యాంగం రద్దయింది. ధిక్కారం నేరమైంది. మీడియా గొంతు మూగబోయింది. ప్రజలు పౌరులుగా తమ హక్కులు కోల్పోయి కేవలం పాలితులుగా మిగిలారు.
ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకులు, 1975 నాటి అత్యవసర పరిస్థితిలో అమలైన నియంతృత్వాన్ని ఎదుర్కొన్న ధీశాలి రామ్ నాథ్ గోయంకా నేడు బ్రతికుంటే, అప్రకటిత అత్యవసర పరిస్థితిగా పరిగణించబడుతున్న వర్తమాన రాజకీయ పరిస్థితి గురించి పత్రికాధిపతులకు లేఖ రాయాలని ఉపక్రమిస్తే ఆయన మాటలు పాలకులకు తూటా శబ్దాళ్లా వినిపిస్తాయి. వర్తమానంలో పాలకుల ముందు మోకరిల్లిన మీడియాకు ఆయన మాటలు నిందా వాక్యాలుగా అనిపిస్తాయి.
సీనియర్ జర్నలిస్టు బీజీ వర్గీస్ మాటల్లో పత్రికరంగ ధీరుడిగా పిలవబడుతున్న రామ్ నాథ్ గోయంకా సమకాలీన భారతీయ మీడియా గురించి ఏమంటారో చూద్దాం..
ప్రియమైన తోటి సంపాదకులు, పత్రికాధిపతులు, జర్నలిస్టులకు,
జూన్ 25 కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు. పాలకుల ముందు మోకరిల్లటానికి తిరస్కరించిన ధీరుల సిరా, రక్తంతో లిఖించబడిన రోజు. 1975లో ఈ రోజున దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. దాంతో గణతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయం మొదలైంది. ఈ చీకటి అధ్యాయాన్ని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలా వ్యతిరేకించడానికి కారణం ఇండియన్ ఎక్స్ప్రెస్ కోసం పని చేసే వారంతా ధైర్యవంతులని కాదు. ఎందుకంటే పిరికితనం మార్గం కాదు కాబట్టి. దేశంలో అడుగడుగునా భయబ్రాంతులతో నిండిన నేటి పరిస్థితిలో కాలం మరుగునపడిన జ్ఞాపకాల పొరలను తవ్వి తీసి ఈ లేఖ రాస్తున్నాను. శబ్దం రాకుండానే తలుపు కొడుతున్నారు. సెన్సార్ షిప్ మరింత నాజుకుగా సున్నితంగా మారింది. రెచ్చగొట్టడం చట్టబద్ధమైంది. ఇక్కడ మనం పొరపాటు పడటానికి ఏమీ లేదు. మౌలిక సూత్రం ఒకటే. ధిక్కారాన్ని అసమ్మతిని గొంతు నులమటం. వాస్తవాన్ని మసిబూసి మారేడు కాయ చేయటం. పాలకుల చేతుల్లో మీడియా ప్రచార సాధనంగా మారటం.
జర్నలిస్టులు జైలు పాలవుతున్నారు. పత్రిక కార్యాలయాలపై ప్రభుత్వ విభాగాలు దాడులు చేస్తున్నాయి. విలేకరులు పరువు నష్టం కేసులో ముద్దాయిలవుతున్నారు. ఒకప్పుడు గణతంత్ర భారతానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా నేడు పదేపదే పాలకుల ముందు మోకారిల్లుతోంది. ప్రభుత్వ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతామని భయపడుతోంది. ఏదైనా తప్పుడు కేసుల్లో ఇరికించబడతామేమోనని బెదిరిపోతుంది.
సత్యం ఎంత తేలిగ్గా దేశ ద్రోహం అవతారం ఎత్తుతుందో చూస్తున్నాం కదా! ప్రశ్నించడమే కుట్రగా మారుతుంది. జర్నలిస్టులను ప్రభుత్వ సంస్థలు వెంటాడుతున్నాయి. వికారాన్ని శిక్షించేందుకు ప్రచార ప్రకటనలే ఆయుధాలు అవుతున్నాయి. 1975లో కనీసం ప్రభుత్వం బాహాటంగా నిరంకుశపోకడలు పోతుందని చెప్పుకోవటానికైనా కొన్ని కారణాలు ఉండేవి. మరి ఈరోజు ఏం చెప్పుకోవాలి? ఒక విషయం గుర్తు పెట్టుకోండి. పాలకులు అనుమతిస్తేనే అచ్చు వేద్దామని ఎదురుచూసే పత్రికలు శాశ్వతంగా ఎదురు చూస్తూనే ఉంటాయి. తాము కోరుకున్న ఎదురుచూపుల్లోనే బంధీలయిపోతాయి. సత్యాన్ని త్యజించిన తర్వాత ఎవరైనా సంపాదక బాధ్యతల్లో కొనసాగే అర్హతను కోల్పోతారు.
ఇదేదో ఒక ప్రభుత్వం గురించి ఒక నాయకుడికి గురించి మాట్లాడుకోవడం కాదు. ఒక ప్రభుత్వానికి ఒక నాయకుడికి పరిమితమైన విషయము కాదు. ఇది యావత్ గణతంత్ర భారతానికి సంబంధించిన అంశం. గణతంత్ర ఆత్మకు సంబంధించిన అంశం. మన అవగాహనలను చైతన్యాన్ని ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని ప్రచార ప్రకటనలకు తాకట్టు పెడదామా? పాలకులకు సన్నిహితంగా ఉండటానికి సంపాదక స్వాతంత్రాన్ని స్వయంప్రతిపత్తిని తాకట్టు పెడదామా? మనతో సహితంగా ఉన్నంత మాత్రాన అటువంటి సంహితత్వాన్ని కాపాడుకోవడానికి సత్యాన్ని ఫణంగా పెడదామా?
నేను మిమ్ములను అడుగుతున్నాను. మీరు కూడా మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మనం పాలకులు చెప్పింది రాసుకునే స్టెనోగ్రాఫర్స్మా లేక ప్రజాస్వామ్యాన్ని అత్యున్నతంగా నిలిపివుంచే పతాకాలమా? ఏది మీ వారసత్వం? ధైర్యమా పిరికితనమా? ఈరోజు పాలకులను ఆకాశానికెత్తి కీర్తించడానికి మనం ఖర్చు పెడుతున్నా సిరా చుక్కలు ఏదో ఒక రోజు మనం మోయలేని గుదిబండలవుతాయి. ఆ సిరా చుక్కలే మన చేతులకు అంటిన మరకలుగా మిగులుతాయి. ప్రజాస్వామ్యం ప్రాణాంతక దాడులను ఎదుర్కొంటున్న సమయంలో మన తరం సంపాదకులు రచయితలు కళ్ళు మూసుకున్నారు అన్న అపవాదు రానీయవద్దు. అందువలన మన ముందు మరో మార్గం లేదు. సత్యాన్ని ప్రచురించడం తప్ప. సత్యాన్ని మాత్రమే మాట్లాడటం తప్ప. సత్యానికి కట్టుబడి ఉండటం తప్ప. అలా చేయటం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ మన ముందు మిగిలిన మార్గం ఇది ఒక్కటే. ఈ విషయాన్ని పెద్ద ఫ్లకార్డు మీద రాసుకొని మీ న్యూస్ రూములలో పెట్టుకోండి. కారు చీకట్లో ప్రజాస్వామ్యం తుది శ్వాస విడుస్తున్నప్పుడు మీడియా ఆ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే పనిలో నిమగ్నమై ఉంటుంది.
పార్లమెంటు వంటి గొప్ప సంస్థలను పక్కనపెట్టేయటం పార్లమెంట్లో జరగాల్సిన చర్చలను. తూతూ మంత్రాలగా మార్చేయటం మనందరినీ ఆందోళన పరిచే విషయం. రాజకీయంగానే కాక నైతికంగా కూడా ప్రతిపక్షాన్ని రాక్షసులనే భావన కల్పించబడుతోంది, నిర్మించబడుతుంది. చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ అంగాలు, విభాగాలు నేడు రాజకీయ కక్ష సాధింపు సాధనాలుగా మారుతున్నాయి. అయితే ఇవన్నీ 1975లో లాగా కండబలంతో జరగటం లేదు. చట్టబద్ధం అనే ముసుగు వేసుకొని జాతీయవాదం ముసుగులో సమర్ధించుకుంటూ, సుస్థిరత సాధన దిశగా అడుగులు అని చెప్పుకుంటూ మోసపూరితమైన నవ్వును ముఖమంతా పులుముకుంటూ బాహాటంగానే సాగుతోంది.
ఇక్కడ దారుణం ఏమిటంటే పాలకులు చక్రవర్తుల్లాగ వ్యవహరించడం కాదు. ప్రతిఘటించడం తమ కర్తవ్యమనే విషయాన్ని పత్రికలు, ప్రజలు మర్చిపోవటమే విషాదకరం. దీంతో ఎమర్జెన్సీ గురించి విచారించడానికి గుర్తు చేయటం లేదు. మనం కర్తవ్యోన్ముఖులు కావటానికి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాను. గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను. ఇది కేవలం ఇందిరాగాంధీ గురించి మాత్రమే కాదు. సత్యాన్ని సమాధి చేసి భయాన్ని దగ్గుతెరువుగా మార్చుకునే అన్ని కాలాలకు సంబంధించిన అంశం ఇది. క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు అని మీ అంతరాత్మలకే తెలుసు. ధైర్యవంతమైన ప్రతిఘటనతోనే ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టగలుగుతుంది. నోరు మూసుకుంటే భూమ్మీద నూకలు ఉంటాయని, యోగక్షేమాలు, ప్రయోజనాలు ఉంటాయని తెలిసినా, సత్యం చెప్పడం కోసం గుండెల నిండా ధైర్యం నింపుకున్నప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలుగుతుంది.
అత్యవసర పరిస్థితిని ఒక హెచ్చరికగా గుర్తుంచుకోకపోతే ఏదో ఒక రోజు అదే అసలైన పాలనా విధానంగా స్థిరపడిపోతుంది. మనం ఎమర్జెన్సీలో ఉన్నామా లేమా అన్నది మన ముందున్న ప్రశ్న కాదు. మనం ఉన్నది ఎమర్జెన్సీ స్థితిలోనే అని మాట మాత్రంగా కూడా నోరెత్తి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాం అన్నదే ప్రశ్న.
సమకాలీన భారతంలో పత్రిక రంగాన్ని చూసిన తర్వాత నా గుండె ముక్కలైంది. 2024 నాటికి ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచికలు మన స్థానం 151వ స్థానానికి పడిపోయింది. ఈ విషయం తెలిస్తే స్వాతంత్ర పోరాట యోధులు కన్నీరు పెట్టుకుంటారు. నా జీవితాన్ని ఏ వృత్తికి అంకితం చేశానో అటువంటి పత్రిక రంగం నేడు అపహాస్యం పాలవుతోంది. వాస్తవాలు తనిఖీ చేసే యువకులు, స్వతంత్ర విలేకరులు, యూట్యూబ్ నిర్వహకులు నేడు సత్యాన్వేషకులుగా మారటం కాస్తంత ఊరట కల్పించే అంశం. ప్రధాన స్రవంతి మీడియాలో పెరుగుతున్న పిరికితనాన్ని ఈ స్వతంత్ర మీడియా సంస్థలు యూట్యూబ్లో ఎత్తిచూపుతున్నారు. నేను ఏ నాలుగు మూల స్తంభాలని కాపాడటానికి జీవితం అంకితం చేశానో, ఆ పత్రిక రంగం నేడు తనను తాను కాపాడుకోవాల్సిన దుస్థితికి చేరుకున్నది.
మీ ఆశావాది
రామ్ నాథ్ గోయేంకా
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత ఆర్జేడీ తరఫున రాజ్య సభ సభ్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.