
అస్సాంలోని ధుబ్రి జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతల రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జిల్లాలో రెండవసారి పర్యటించారు. ఉద్రిక్తతలతో సంబంధమున్న 150 మందిని అరెస్టు చేసినట్టుగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ‘సున్నితమైన జిల్లాలో భారత సైన్యం శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసే విషయం గురించి పరిశీలిస్తున్నాము’ అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఈ నెల ప్రారంభంలో అస్సాంలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. దీని తర్వాత అస్సాంలోని ధుబ్రీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రెండవసారి పర్యటించారు. ఈ సందర్భంగా కీలకవాఖ్యలు చేశారు. భారతదేశం- బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలో శాశ్వత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దాని గురించి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలియజేశారు.
జూన్ 7- 9 మధ్య ధుబ్రీ నగరంలో హనుమాన్ ఆలయం దగ్గర పశువుల తలలను ఉంచారనే ఆరోపణలతో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దీని తరువాత, అస్సాం ప్రభుత్వం జిల్లాలో విస్తృత చర్యలను తీసుకుంది. “కనిపించిన చోట కాల్చివేయాల”నే ఆదేశాలను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జారీ చేశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, మంగళవారం శర్మ ధుబ్రీని సందర్శించారు. పట్టణంలో అశాంతిని సృష్టించడం వెనుక “బయటి శక్తులు”, ఒక మతపరమైన సమూహం ఉన్నాయని ఆరోపించారు.
మంగళవారం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో, “150 మంది అసాంఘికశక్తులను నిర్బంధించడంతో మా జీరో టోలరెన్స్ విధానం కొనసాగుతోంది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరడడానికి మా శక్తియుక్తులను తగ్గించడం లేదు. ఈ సున్నితమైన జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత సైన్యం శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాము” అని ఆయన రాశారు.
ఉద్రిక్తతల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా, జూన్ 13న ధుబ్రీలో పర్యటించిన శర్మ కీలక నిర్ణయం తీసుకుని “కనిపిస్తే కాల్చివేత” ఆదేశాలను జారీ చేశారు. ఆలయ సంఘటన, తదనంతర ఘర్షణలకు కారకులైన వారిని అరెస్టు చేయడానికి అస్సాం పోలీసులు భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
జూన్ 13న శర్మ సందర్శన తర్వాత రాత్రి, 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఇతర కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని తెలిపారు. దీనికి కంటే ముందు జూన్ 8, 9 తేదీలలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధించి మొత్తం 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం పర్యటన సందర్భంగా, ఉద్రిక్తత ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 150 మందిని అరెస్టు చేసినట్లు సీఎం శర్మ ప్రకటించారు. శర్మ చివరి పర్యటన తర్వాత జిల్లాలో పోలీసు అధికారుల ప్రధాన పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో భాగంగా ధుబ్రీ జిల్లాకు ఎస్ఎస్పీగా లీనా డోలీ నియమించబడ్డారు. తను మాట్లాడుతూ, ఈ 150 మందిలో వివిధ రకాల ‘రౌడీలు’ ఉన్నారని చెప్పారు.
“ఈ నెల ప్రారంభంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్లు దాఖలు చేయబడ్డాయి. అదుపులోకి తీసుకున్న 150 మందిలో, ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొనబడ్డ ఒక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇందులో కొందరు మాదకద్రవ్యాలు, పశువుల దొంగతనానికి పాల్పడిన దుండగులు ఉన్నారు. మరికొందరు కోర్టులు వారెంట్లు జారీ చేసిన వారున్నారు” అని ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పద పశువుల అవశేషాలను వదిలివేయడం వెనుక మింటు అలీ అనే వ్యక్తి “సూత్రధారి”గా గుర్తించబడ్డాడని శర్మ మంగళవారం పేర్కొన్నారు. “అతన్ని గుర్తించారు, కానీ అతను పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్ కూడా మాకు దొరికింది. అతను అతి త్వరలో లొంగిపోతాడని మేము ఆశిస్తున్నాము” అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, ధుబ్రి జిల్లాలో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో ముస్లింల వాటా దాదాపు 74%గా ఉంది.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.