
ఎమర్జెన్సీ విధించిన యాభై ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇందిరాగాంధీ నియంతృత్వం మాత్రమే కనిపించదు. సంఘ్ పరివార్‌తో జయప్రకాశ్ నారాయణ కుదుర్చుకున్న దురదృష్టకరమైన సంకీర్ణం గురించి కూడా కనిపిస్తుంది. జయప్రకాశ్ నారాయణకు ఉన్న పొరపాటు అభిప్రాయం కారణంగా ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను, రాజకీయ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అల్లకల్లోలం చేస్తోంది.
సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1975 జూన్ 25న, ఎమర్జెన్సీ విధించే రోజు నాటికి గాంధీ- నెహ్రూ దేవాలయానికి ప్రధాన పూజారిగా తనకు తాను భావించుకునే నట్వర్ సింగ్ లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ హై కమిషనర్‌గా పనిచేస్తున్నారు. నియంతృత్వం విషయంలో ఇందిరా గాంధీ చేపట్టిన ప్రయోగాలు చూసి నట్వర్ సింగ్ గందరగోళానికి గురయ్యారు. తన గందరగోళాన్ని తీర్చుకోవడానికి ప్రధానమంత్రి కార్యాలయంలో సమాచార సలహాదారుగా ఉన్న హెచ్‌వై శారద ప్రసాద్‌ను సంప్రదించారు. భారతదేశం గురించి విమర్శించే సాంప్రదాయవాదులకు ఎంతైనా సమాధానం చెప్పగలనని, కానీ తాజా చర్య పట్ల నెహ్రూను ఇందిరాగాంధీని అభిమానించి గౌరవించే వారి నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేకపోతున్నానని నట్వర్ సింగ్ వాపోయారు.
జూన్ 20వ తేదీ నిర్ణయాని కంటే ముందు జరిగిన పరిణామాల గురించిన సమగ్ర అవగాహన శారద ప్రసాద్‌కు ఉండే అవకాశం ఉంది. నట్వర్ సింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి జూలై 20 తేది వరకు శారదా ప్రసాద్‌కు తీరిక లేకపోయింది. సూక్ష్మమైన వివరాలకు, సారాంశానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలని శారదా ప్రసాద్ నట్వర్ సింగ్‌కు సున్నితమైన హితబోధ చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన దేశవ్యాప్త ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ కీలక నాయకుల్లో ఒకరు నానాజీ దేశముఖ్‌ను చీఫ్ కమాండర్‌గా నియమించడం ద్వారా ప్రతిపక్షం లక్ష్మణ రేఖను దాటిందని శారద ప్రసాద్ వివరించారు.
నట్వర్ సింగ్‌కు రాసిన లేఖలో శారద ప్రసాద్ “మన వ్యవస్థలను కాపాడటానికి ఈ రాజకీయ నిర్ణయం అనివార్యం అయ్యింది. మన రాజకీయ నిర్మాణం లేదా లక్ష్యాలు అని మాట్లాడినప్పుడు, వామ పక్షాలు సోషలిజం గురించి మాత్రమే మాట్లాడతాయి. లౌకికవాదం ఆవశ్యకత పరిరక్షణ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. భారత ప్రజాస్వామ్యానికి పునాది లౌకిక తత్వం. ఈ ఉద్యమ నాయకత్వాన్ని ఆర్ఎస్ఎస్ చేతుల్లో పెట్టడం జయప్రకాష్ నారాయణ, ఆయన సహచరులు చేసిన అత్యంత ఘోరమైన తప్పిదం. ఇంగితం కలిగిన నాయకులు ఎవరు ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో సాగుతున్న ఉద్యమం భారత దేశంలో పరమత సహనం, సమానత్వాన్ని సంరక్షిస్తుంది అని భావించలేరు” అని స్పష్టం చేశారు.
ఎంత గొప్పదో దూర దృష్టి..
50 ఏళ్ల తర్వాత భారతదేశంలో అత్యంత ఉన్నతమైన వ్యక్తిగత భద్రతా కవచాన్ని(జెడ్ ప్లస్)సర్ సంగ్ చాలక్ మోహన్ భగవత్ కలిగి ఉన్నారు. ఆయన సంఘపరివారకులను ఉద్దేశించి చేసే ప్రసంగాలు న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో బాహాటంగా రాజ్య సంరక్షణలో చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆయన ప్రధానమంత్రి తర్వాత ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత ప్రభావం చూపగలిగిన వ్యక్తిగా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పై కాల్పులు జరపటానికి నాదూరం గాడ్సేను ప్రేరేపించిన వ్యవస్థలను, సిద్ధాంతాన్ని ప్రబోధించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేడు దేశంలో అత్యంత గౌరవాదరణలు కలిగిన సంస్థగా పరిగణించబడుతోంది. జాతీయ, రాజకీయ జీవితంలో గుర్తింపు గౌరవాలు మాత్రమే కాదు. అత్యంత ప్రభావశాలి శక్తి, ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ తరహాలో ఆశ్రిత సామాజిక వ్యవస్థ, జాతీయ రాజకీయ వ్యవహారాలలో వీటో అధికారం కలిగిన సంస్థగా నేడు ఆర్ఎస్ఎస్ అవతరించింది.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడిన 50 ఏళ్ల తర్వాత దేశ రాజకీయ వ్యవహారాలపై పరిశోధన చేసేవారు ఎవరైనా అడిగే ప్రశ్న ఒక్కటే. సమకాలీన రాజకీయాలలో అత్యంత ప్రతిభావంతమైన నాయకుడుగా ఉన్న జయప్రకాశ్ నారాయణ, సమకాలీన ప్రపంచ రాజకీయ పరిణామాలను లోతుగా అధ్యయనం చేయగలిగిన సామర్ధ్యం కలిగిన వ్యక్తిగా ఉన్న నేత, ఐరోపా దేశాల్లో జరుగుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకోగల సామర్థ్యం కలిగిన నాయకుడు తన సంపూర్ణ విప్లవ నినాదం బీటలు వారుతున్న క్రమానికి సంబంధించి వాస్తవిక స్థితిని ఎలా గుర్తించలేకపోయారు అన్నదే ఆ ప్రశ్న. తనకంటూ సైన్యం లేదు. సైన్యాధికారులు లేరు. సాయుధ సామాగ్రి లేదు. అలాంటిది అంత పెద్ద అనుభవం కలిగిన నేత అడపాదడపా ఆందోళనల్లో కన్పించే వివిధ రకాల వాహినులను తన సైన్యంగా ఎలా భావించారు అన్నది పెద్ద ప్రశ్న. తన సైన్యం అంటే ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడిచే సాయుధ దళం. ఎమర్జెన్సీకి ముందు పాట్నలోను అహ్మదాబాద్‌లోనూ సాగుతున్న ఆందోళనలు విప్లవానికి దారి తీస్తాయని ఎలా భావించారు? ఈ ఆందోళనలో పాల్గొన్న వివిధ సామాజిక శక్తులలో తనదైన క్రమశిక్షణను పాటించే శ్రేణులు కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్ ఒకటే. ఈ మొత్తం ‘ఉద్యమాని’కి కావలసిన భూమికను సిద్ధం చేసిన సంస్థ అది ఒక్కటి మాత్రమే.
అంతర్జాతీయ చారిత్రక అనుభవాలను విస్మరించడం మాత్రమే కాక జయ ప్రకాష్ నారాయణ భారతీయ చారిత్రక వాస్తవాలను కూడా విస్మరించారు. ఆర్ఎస్ఎస్ స్వభావం గురించి పూర్తిగా విస్మరించారు. “సంపూర్ణ విప్లవం కోసం సాగే ఉద్యమాల్లో ఆర్ఎస్ఎస్ను భాగస్వామిని చేయడం ద్వారా వారికున్న మతోన్మాద వైఖరులను నీరుగార్చటానికి ప్రయత్నం చేశాము. ఈ ఉద్యమం మత సహనానికి, లౌకిక తత్వానికి అందించిన భారీ సేవ- తోడ్పాటు ఇదే అని నిష్పాక్షిక పరిశీలకులు ఎవరైనా చెప్తారు. సంపూర్ణ విప్లవంలో జన సంఘ్, ఆర్ఎస్ఎస్ను భాగస్వాములను చేయటం ద్వారా భారతదేశంలో లౌకికతత్వ పునాదులను బలోపేతం చేయడానికి కృషి చేశాను”అని జయప్రకాశ్ నారాయణ రాసుకున్నారు. జయప్రకాష్ నారాయణ అమాయకత్వం పట్ల నాటి నుంచి నేటి వరకు ఆర్ఎస్ఎస్ అధినేతలు నవ్వుకుంటూనే ఉన్నారు.
1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇందిరాగాంధీని, ఆమె విధించిన అత్యవసర పరిస్థితిని తిరస్కరించినా, జనతా పరివార్- ఆర్ఎస్ఎస్ పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకోవడం ఈ ఉద్యమపు దీర్ఘకాలిక పర్యవసానం. తీవ్రమైన విమర్శకుడిగా గుర్తింపు పొందిన మధు లిమాయే సైతం “జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నవారు మద్దతు తెలిపిన వారు, ఆర్ఎస్ఎస్ శ్రేణులతో కలిసి జైల్లో మగ్గటం ద్వారా ఆ సంస్థ గురించి మరింత లోతైన అవగాహన పెంపొందించుకునేందుకు అవకాశం కలిగింది” అని అభిప్రాయపడ్డారు. కానీ మధు లిమాయే ఇంకా ఇతరులు ఆర్ఎస్ఎస్ను జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన ఉద్యమానికి అనుకూలంగా పనిచేసిన వివిధ సంస్థలను ఒకే వేదికగా మార్చాలని ప్రయత్నించినప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేతలు అది సాధ్యం కాదని స్పష్టంగా తెలిపారు. జనతా పార్టీలోనే భాగస్వామిగా ఉన్న జనసంఘ్ బృందం తమ స్వతంత్ర అస్తిత్వాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న విధేయతను కూడా వదులుకోలేదు. అవసరమైతే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూల్చి తిరిగి ఇందిరా గాంధీకి పట్టం కట్టడానికైనా సిద్ధపడ్డారు కానీ ఆర్ఎస్ఎస్ పట్ల తమ విధేయతను మాత్రం వదులుకోలేదు.
కానీ అధికారం రుచిమరిగిన తర్వాత జనతా పార్టీ నేతలు అందరూ తమకు రాజకీయ గురువుగా ఉన్న జయప్రకాష్ నారాయణ ఆలోచనలను అవగాహనలను వదిలేసుకోవడానికి ఎన్నడూ వెనకాడ లేదు. జనతా పరివారంలో విభేదాలు ముదిరినప్పుడు వాటిని తగ్గించేందుకు జయప్రకాశ్ నారాయణ ప్రయత్నం చేశారు. కానీ తమ అంతర్గత విషయాలలో ఇతరుల జోక్యం అవసరం లేదని మొరార్జీ దేశాయ్ స్పష్టం చేశారు. దీంతో జనతా పార్టీని ఐక్యంగా ఉంచాలన్న జయప్రకాశ్ నారాయణ ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతో దూరదృష్టి కలిగిన నేతగా సంపూర్ణ విప్లవోద్యమాన్ని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీ ముగిసేనాటికి దిక్కూమొక్కు లేని నాయకుడిగా మిగిలిపోయారు. చివరికి తనకంటూ ఒక పార్టీ, తనవైన శ్రేణులు, తన ఆలోచన పట్ల విశ్వాసం కలిగిన వారు ఆయన వెంట ఎవరు లేకుండా పోయారు.
మరోవైపున జయప్రకాష్ నారాయణ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పట్ల ఏర్పడిన సానుకూల అభిప్రాయాన్ని రాజకీయ పునాదిగా మార్చుకుంటూ ఆర్ఎస్ఎస్ క్రమంగా పావులు కదిపింది. హిందుత్వ శక్తుల రాజకీయ పురోగమన పట్ల ఆర్ఎస్ఎస్ సంతృప్తి చెందింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రత్యేకించి జనసంఘ్, తాజా అవతారం బీజేపీలు జయప్రకాష్ నారాయణ ఆదర్శలతోటి స్ఫూర్తి పొందినట్లుగా నటిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఆయన అవగాహనలను నిలువెత్తు గోతిలో పాతి పెడుతున్నారు. జయప్రకాష్ నారాయణ బ్రతికే ఉంటే భారత రాజకీయ చిత్రపటాన్ని ఆవహిస్తున్న హిందుత్వ శక్తుల దూకుడును చూసి భయభ్రాంతులకులోనై ఉండేవారు.
50 ఏళ్ల క్రితం దారితప్పిన ఇందిరాగాంధీకి చరిత్ర ఆమె స్థానం ఏమిటో చూపించింది. ఆ చీకటి రోజుల్లో ఇందిరా గాంధీ చేసిన పొరపాట్లు అన్నింటిని ప్రజలు తిప్పికొట్టగలిగారు. పరిస్థితులను చక్కదిద్దగలిగారు. గరుడుగట్టిన హిందుత్వ శక్తిగా ఉన్న ఆర్ఎస్ఎస్ను సాధారణమైన రాజకీయ శక్తిగా చూపించేందుకు ప్రయత్నం చేసిన జయప్రకాష్ నారాయణకు కూడా చరిత్ర ఆయన స్థానం ఏమిటో చూపించింది. 50 ఏళ్ల తర్వాత జయప్రకాష్ నారాయణ చేసిన తప్పుల ముందు ఇందిరాగాంధీ అనుసరించిన దుందుడుకు విధానాలు చిన్నబోతున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం సాగిన పోరాటంలో అసలైన విజేత ఆర్ఎస్ఎస్ మాత్రమే.
అనువాదం : కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత హరీష్ ఖరే ది ట్రిబ్యూన్ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.