
బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జూన్ 5న ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురి మరణించారు. వారిలో ఒక కుటుంబం, చనిపోయిన తమ వ్యక్తి మావోయిస్టు కాదని, ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషనిగా పనిచేస్తున్నారని పేర్కొంది. అయితే, అతను మావోయిస్టుతో పాటు వంటమనిషని పోలీసులు అన్నారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జూన్ 5న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడులలో మరణించిన ఏడుగురిలో ఒకరు గిరిజన తెగకు చెందిన మహేష్ కుటియం(38 ఏళ్లు) ఉన్నారు. ఆయన స్థానిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక సంవత్సరం నుంచి వంటమనిషనిగా పనిచేస్తున్నారు.
మహేష్ కుటియంతో సహా చనిపోయిన ఏడుగురు వ్యక్తులు మావోయిస్టులేనని పోలీసులు అంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇర్పగుట్ట గ్రామానికి చెందిన పాఠశాలలో మహేష్ వంటమనిషనిగా ఉన్నారు. అంతేకాకుండా సీపీఐ(మావోయిస్ట్) నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యులు కూడా. దీంతోపాటు ఆయనపై లక్ష రూపాయల రివార్డు ప్రకటించబడి ఉంది.
అయితే, మహేష్‌కు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని, అతను పాఠశాలలో వంట వండటం మాత్రమే చేసేవారని బాధిత కుటుంబం తెలిపింది.
“నా భర్త పశువులను మేపడానికి అడవికి వెళ్ళారు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. తరువాత, ఆయనను భద్రతా దళాలు తీసుకెళ్లాయని, మరుసటి రోజు మావోయిస్టని చెప్పి ఎన్కౌంటర్లో చంపారని గ్రామస్తుల వల్ల మాకు తెలిసింది” అని మహేశ్ భార్య సుమిత్ర కుటియం హిందూస్తాన్ టైమ్స్‌కు తెలియజేశారు.
“ఆయన నిర్దోషి. మేము పేదవాళ్ళం, కానీ చట్ట ప్రకారం నడుచుకుంటున్నాము. నా పిల్లలు(ఏడుగురు పిల్లలు, వారిలో నలుగురు పాఠశాలకు వెళ్తారు) నాన్న ఎప్పుడు వస్తారని పదేపదే అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు వారిని ఒంటరిగా ఎలా పెంచాలో నాకు అర్థం కావడం లేదు” చెమ్మగిళ్లిన కళ్లతో ఆమె చెప్పుకొచ్చారు.
మరో గ్రామస్తురాలు ఇర్మా వెలాడి వార్తాపత్రికతో మాట్లాడుతూ, “భద్రతా సిబ్బంది ఆయనను అడవిలో తీసుకెళ్తున్నప్పుడు మేము చూశాము. ఆయన ఆయుధాలు లేకుండా తమ పశువుల కోసం వెతుకుతున్నారు. ఆ తర్వాత ఆయనను మావోయిస్టని చెప్పి చంపారని మాకు తెలిసింది. ఇది తప్పు” అని అన్నారు.
ఏ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మహేష్ పనిచేసేవారో, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ ఉప్పల్, మహేశ్ గుర్తింపును, పాఠశాలలో తన పాత్రను ధృవీకరించారు.
ఉప్పల్ మాట్లాడుతూ, “2023లో మా పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటమనిషిగా మహేష్ చేరారు. ఆయన క్రమం తప్పకుండా పనిచేసేవారు. నెలకు రూ 1,200 జీతం తీసుకునేవారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆయన చివరిసారిగా పాఠశాలలో ఉన్నార”ని చెప్పారు.
అయితే, బీజాపూర్ జిల్లాలోని జాతీయ ఉద్యానవన ప్రాంతంలో జరిగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో మహేష్, మరో ఆరుగురు మరణించారని బస్తర్ పోలీసులు ఆదివారం(జూన్ 22)ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ ప్రకటన ప్రకారం, “నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఇంకా ఎన్కౌంటర్ తర్వాత ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామ”ని చెప్పారు.
ఈ ఘటనపై నిష్పాక్షికమైన మెజిస్టీరియల్ విచారణ జరుగుతోందని బీజాపూర్ కలెక్టర్ సంబిత్ మిశ్రా తెలిపారు.
జూన్ 10న ఇంద్రావతి జాతీయ ఉద్యానవనంలోని దట్టమైన అడవులలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా సీనియర్ నక్సల్ నాయకుడు సుధాకర్ సహా ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు భద్రతా దళాలు తెలిపాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తరువాత గుర్తించబడిన మృతదేహాలలో మాదేడ్ బ్లాక్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మహేష్ కుటియం మృతదేహం కూడా ఉంది.
బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందరరాజ్ అధికారిక ప్రకటన జారీ చేశారు. అందులో మహేష్ కుటియం పాఠశాలలో వంటమనిషిగా ఉండేవారని, దీంతోపాటు మావోయిస్టు కూడా అని పేర్కొన్నారు.
ఆ ప్రకటనలో, “దర్యాప్తులో మహేష్ కుటియం నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) సంస్థలో క్రియాశీల సభ్యులని, నేషనల్ పార్క్ ఏరియా డివిజన్లో పనిచేస్తున్నారని నిర్ధారించబడింది. ఆయనకు ఈ సంస్థతో స్పష్టమైన సంబంధాలు ఉన్నాయి. తను ఇర్పగుట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నారని కూడా వెలుగులోకి వచ్చింది. గ్రామ స్థాయి పాఠశాల నిర్వహణ కమిటీ తనని నియమించింది. అంతేకాకుండా, మార్చి 2025 వరకు తనకు జీతం చెల్లించబడింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు గౌతమ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ వంటి సీనియర్ మావోయిస్టు నాయకులను మహేష్ కుటియం ఎలా, ఎప్పుడు కలిశారనేది కూడా దర్యాప్తులో తేలిన విషయమే. కేసులోని అన్ని అంశాలను క్షుణ్ణంగా, నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా దర్యాప్తు చేస్తున్నారు.” పేర్కొన్నారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.