
ఫిబ్రవరిలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తరువాత పెరుగుతున్న రైలు ప్రమాదాలపై విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తొలిసారి పార్లమెంటులో మాట్లాడారు. రైళ్ల భద్రతను రాజకీయం చేయవద్దన్నారు. తగ్గుతున్న భద్రత గురించి ఆందోళన వెలిబుచ్చిన ప్రతిపక్ష ఎంపీలపై దాడి చేస్తూ యుపిఏ పాలనా కాలంతో పోల్చితే మోడీ ఏలుబడిలో రైల్వే పెట్టుబడులు పెరిగాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో రైళ్ల భద్రతలో ఒక అడుగు ముందుకు వేయటానికి రెండు దశాబ్దాలు పడితే తమ ప్రభుత్వం కేవలం ఐదేండ్లలోనే సాధించిందన్నారు. దీన్ని సమర్ధించని వారికి దేశం వీడ్కోలు పలుకుతుందన్నారు. రైల్వే సవరణ బిల్లు(2024)పై రాజ్యసభలో చర్చకు జవాబిచ్చిన సందర్భంగా వైష్ణవ్ మార్చి పదవ తేదీన మాట్లాడారు. ఈ బిల్లును డిసెంబరులోనే లోక్‌సభ ఆమోదించింది. ఇండియన్ రైల్వేబోర్డు చట్టం 1905ను ఉపసంహరిస్తూ దానిలోని ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారాలు, విధులకు సంబంధించి 1989లో చేసిన రైల్వే చట్టానికి సవరణ చేశారు. రాజ్యసభలో దీన్ని మూజువాణితో ఆమోదించారు. అంతకు ముందు జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చినపుడు మంత్రి అహంకారంతో మాట్లాడారంటూ ప్రతిపక్షం వాకౌట్ చేసింది, తరువాత సవరణలు ప్రతిపాదించే సమయానికి తిరిగి హాజరైంది.‘‘ ఔను నేను ఒక బ్యూరోక్రాట్, టెక్నోక్రాట్నే అయితే ఈ దేశంలో ఏ రాజకీయనాయకుడితో పోల్చుకున్నా నిబద్ధత నాకు తక్కువ లేదు. దానితో మీకు ఏదైనా సమస్య ఉంటే వేలెత్తి చూపండి, లేకుంటే మీకు వేలెత్తే అర్హత లేదు ’’ అని మంత్రి సమాధానంలో మాట్లాడారు.
మీది నిరంకుశాధికారవర్గ మనస్తత్వం !
అంతకు ముందు చర్చలో కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తనఖా మాట్లాడుతూ 2023లో బాలాసోర్‌లో 200 మంది మరణించిన రైలు ప్రమాదం నుంచి ఇటీవలి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట వరకు జరిగిన ప్రమాదాలను ప్రస్తావించారు. ఒక బ్యూరాక్రాట్గా తప్ప మంత్రికి రాజకీయ నిష్కాపట్యం లేదన్నారు.‘‘ మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేమిస్తారు, మీరు ట్విటర్(ఇప్పుడు ఎక్స్) మీద వెంటనే స్పందిస్తారు, మీకు నిరంకుశాధికార, నవప్రవర్తక మనస్తత్వం ఉంది తప్ప రాజకీయ నిష్కాపట్యం లేదు ’’ అని విమర్శించారు.
“అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ప్రతి పండుగలోనూ దీన్ని చూస్తాం, గత పదకొండు సంవత్సరాల్లో మీరు సాధించిందేమిటి ? బాధ్యత కొందరు అధికారులకే పరిమితమా? కుంభేమేళాకు లక్షల మంది వెళతారని అందరికీ తెలుసు, కానీ ఎవరికీ బాధ్యత ఎందుకు లేకపోయింది. రైలు ప్రమాదాలు జరిగినపుడు లాల్ బహదూర్ శాస్త్రి వంటి రైల్వే మంత్రులు రాజీనామా చేశారు, అయితే నేను ఎవరినీ అలా చేయాలని కోరటం లేదు” అని కూడా కాంగ్రెస్ సభ్యుడు అన్నారు.
జవాబుదారీతనంతో ఉండండి !
చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ “ఈ బిల్లు భారతీయ రైల్వేను సంస్కరించటంలో విఫలమైంది, పెరుగుతున్న ప్రమాదాల పట్ల జవాబుదారీతనం కావాలి, చట్టంద్వారా రైల్వేబోర్డు మరింత కేంద్రీకృతం అవుతున్నది, దాని మీద ప్రభుత్వ అదుపు పెరుగుతోంది” అని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ సుష్మితా దేవ్ మాట్లాడుతూ అసమర్ధత, నిర్లక్ష్యాలపట్ల ఎన్డిఏ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవటం లేదనే రాజకీయ సందేశాన్ని ఈ బిల్లు ఇచ్చిందన్నారు. “దేశ పౌరులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. ప్రమాదం జరిగినపుడు జనాలు చనిపోతున్నారు, గాయపడుతున్నారు, అప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాం, గౌరవ మంత్రి జవాబుదారీతనం ఏమిటి ? 1989 నాటి చట్టం అధికారులను శిక్షించటానికి అవకాశం ఇస్తుంది తప్ప మంత్రిని ఏమీ చేయలేదు, ఎందుకంటే అధికారిక రక్షణ ఉంది. ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితిలో గౌరవ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రధాని అడగాలి. 2014, 2023 మధ్య 678 ప్రమాదాలు జరిగాయి, 781 మంది ప్రాణాలు కోల్పోయారు, ఉద్యోగులతో సహా 1,500 మంది గాయపడ్డారు. మన వంటి ప్రజాస్వామిక దేశంలో జవాబుదారీతనం కావాలని ఇది కోరటం లేదా?” అని దేవ్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట గురించి నిష్పాక్షిక విచారణ జరుగుతున్నదంటూ సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారని ఆర్జెడి ఎంపీ మనోజ్ కుమార్ ఝా ఆరోపించటాన్ని మంత్రి వైష్ణవ్ ఖండించారు. తాను కెమెరాల్లో నమోదైనదాన్ని చూశానని, అది ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. “ప్రతి వ్యక్తి, ప్రతి జీవితం ముఖ్యమైనదే, ప్రతి ప్రమాదం దురదృష్టకరం, వాటి మీద రాజకీయాలు చేయవద్దు, మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాము” అన్నారు.
రైళ్లు ఢీకొనకుండా నివారించే పరికరాలు విఫలమైనట్లు యుపిఎ పాలనా కాలంలో ప్రకటించారు. వాటిని తొలగించాలని 2012లో నిర్ణయించారు. టిఎంసి ఎంపీ దాని గురించి ప్రస్తావించకపోవటానికి కారణం ఆ పరికరాలు విఫలమైనట్లు వారి హయాంలోనే ప్రకటించారని మంత్రి చెప్పారు. “2016లో రక్షణలో నాలుగవ ఉన్నత స్థానంలో ఉన్న కవచ్‌ను మోడీ పూర్తి చేశారు. దానికి మూడు సంవత్సరాలు పట్టింది. కరోనా సమయంలో కూడా దేశమంతటా అన్ని ప్రాంతాలలో ప్రయోగాలు జరిగాయి. అన్ని రకాల అంశాలను దానిలో చేర్చారు, 2021 నుంచి 24వరకు వాటన్నింటినీ పరీక్షించారు, కవచ్ 4.0ను 2024లో ఆమోదించారు. ఇప్పుడు పదివేలు కావాలని ఆర్డర్ పెట్టారు. ఈ విషయాన్ని నేను బాధ్యతాయుతంగా చెబుతున్నాను, అభివృద్ధి చెందిన దేశాలకు 20 ఏండ్లు పట్టినదానిని మేము ఐదు సంవత్సరాల్లోనే చేశాము. దీనిలో మాకు మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు చెబుతాము, చెప్పని వారికి దేశం వీడ్కోలు పలుకుతుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.
రైళ్లు కాదు రీల్స్ !
చర్చ సందర్భంగా సిపిఐ సభ్యుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ మంత్రి రీల్స్ మీద కాకుండా రైళ్ల మీద కేంద్రీకరించాలని కోరారు. ఎన్డిఏ పదేండ్ల పాలనా కాలంలో 678 రైలు ప్రమాదాలు జరిగాయని అంటే ఏడాదికి 68 ప్రమాదాలన్నారు. రైల్వే భద్రతకు సంబంధించిన సిబ్బంది పోస్టులలో కనీసం 15శాతం ఖాళీగా ఉన్నాయని వాటి సంగతి చూడాలన్నారు. మంత్రి సమాధానమిస్తూ యుపిఎ కాలంలో ఏటా ఎనిమిది నుంచి పదివేల మధ్య రక్షణకు ఖర్చు చేస్తే తాము భద్రతను పెంచేందుకు ప్రతి ఏటా రు.1.14లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్థాయికి పెరిగినప్పటికీ తాము సంతృప్తి చెందటం లేదని, సమస్యలను పరిష్కరించేందుకు మూలాలను కనుగొనేందుకు చూస్తామన్నారు. మంత్రి సమాధానం చెబుతుండగా సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు అహంకారంతో మాట్లాడుతున్నారంటూ నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. సభ వెలుపల టిఎంసి ఎంపీ దేవ్ మాట్లాడుతూ “ప్రధాని మోడీ, అశ్వనీ వైష్ణవ్ హయాంలో 670కిపైగా ప్రమాదాలు జరిగాయి, 700కు పైగా మరణించగా 1,500 మంది గాయపడ్డారు, ఇటీవలనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. కానీ మా ఆందోళన పట్ల మంత్రి అహంకారంతో మాట్లాడిన కారణంగానే వాకౌట్ చేశాము. రైల్వే మంత్రిత్వశాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సంభిస్తున్న హానిని గుర్తించేందుకు మంత్రి నిరాకరిస్తున్నారు, నిర్మాణాత్మక విమర్శలకు అవకాశం ఇవ్వటం లేదు, అందుకే వాకౌట్ చేశాం, బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు తిరస్కరించాం” అని దేవ్ చెప్పారు.
శ్రావస్తి దాస్‌గుప్త
అనువాదం : ఎం కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.