
భక్తిలో పారవశ్యం ఉంటుందా? ఉన్మాదం ఉంటుందా? పాండురంగని పలవరిస్తూ పారవశ్యానికి గురైన భక్తుడి గురించి విన్నాం. అంతేకాకుండా శివుడికి తన కన్నునే బహుకరించిన భక్త కన్నప్ప గురించి విన్నాం. ఏ ఒక్క భక్తుడు తాను పూజించే సమయంలో భావోద్వేగానికిలోనై ఇతరులను దూషించిన, లేదా అన్యమతాలని ద్వేషించడానికి పూనుకున్న సందర్భాలను ఇతిహాసాలలో ఎక్కడా చదవలేదు. లంకాసురుడు తన ఇష్ట దైవం ముక్కంటికి మొక్కిన తర్వాతే రాముడు తన బాణాన్ని అతనిపైకి ఎక్కుపెట్టినట్టు విన్నాం. కానీ నేటి రామభక్తులు రాముడిని కొనియాడడం కంటే ఇతర మతస్తుల భౌతిక కట్టడాల పట్ల ఎక్కువ చింతితులై పేట్రేగి పోతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి పోకడలు ఎంతో అపకారాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. మర్యాద పురుషోత్తముని భక్తుల్లో ఇంతటి అమర్యాద పూర్వక క్రోధం ఆలోచించాల్సిన విషయం.
శ్రీరామ నవమి రోజు రాముడి శోభాయాత్ర గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్న దారి పొడవునా ఎక్కడైనా మసీదులు, దర్గాలు ఉంటే వాటిని పరదాలతో పూర్తిగా కప్పి, అటునుంచి వెళ్లే వాళ్ళకి కనిపించకుండా చేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని పోలీసులను, కొందరు పెద్దలను ఆరాతీస్తే తెలిసిందేమంటే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు సదరు దర్గాలపై, మసీదులపై దాడి చేసే ప్రమాదముందని, దీంతో జాగ్రత్త పడుతున్నామని చెప్పారు.
ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇలాంటి పోకడలను ఎవరైనా సమర్థిస్తే అంతకు మించిన అనాలోచిత చర్య మరొకటి లేదు. ముస్లిం పండుగల సందర్భంగా హిందూ దేవాలయాలను పరదాలతో మూసి ఉంచితే అంగీకారమేనా? హిందూ దేవాలయల వైపు బాణాలను ఎక్కుపెట్టి వెక్కిరింతలు చేస్తే సమర్థనీయమేనా?
ముంబాయి నగరంలో జరిగిన శోభాయాత్ర జరిగింది. అందులో పాల్గొన్న కొందరు ఇస్లాం మతాన్ని, ఔరంగజేబును తీవ్రంగా దూషించారు. ఆ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా కలకత్తాలో జరిగిన ఇదే తరహా యాత్రలో కత్తులు- కటార్లు పట్టుకుని, దారిపొడుగునా బెదిరింపుతో కూడిన అభివాదాన్ని చేస్తూ సాగిన తీరు భయభ్రాంతికి గురి చేసేలా ఉంది. యువతీ యువకులను పిలిచి మరీ మారణాయుధాలని చెతికిచ్చి ద్వేషంతో ఊగిపోయేలా నినాదాలిస్తూ తిరిగిన తీరు చాలా అభ్యంతరకరమైనదే. మారణాయుధాలని బహిరంగంగా ప్రదర్శిస్తే చట్టం ప్రకారం శిక్షార్హులు. కానీ అలాంటి వారిని కనీసం మందలించే సాహసం కూడా పోలీసులు చేయలేక పోతున్నారు. దీనికి కారణం పాలక రాజకీయ పక్షాల బహిర్గత మద్దతేనని గుర్తుచేసుకోవాలి.
జైశ్రీరాం నినాదం దినదినానికి ఉన్మాదంలా ఉచ్ఛరించబడుతుంది. గుడ్ మార్నింగ్కి బదులు కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో “రాంరాం” అనే సంప్రదాయముంది. అంటే ఉభయ కుషలోపరి అని అర్థం. ఇప్పుడు దేశమంతా “జై శ్రీరాం” అంటూ చాలా చోట్ల పలకరిస్తున్నారు. కానీ ఈ నినాదం ఒక ఉన్మాదంలోంచి ఉద్భవిస్తున్న హెచ్చరికలా ఉంటున్నది.
ఈ యేడు జరిగిన సీతారాముల కల్యాణ మండపాల్లో మంత్రోచ్ఛరణల కంటే జై శ్రీరాం అంటూ భక్తులు చేసిన నినాదాలే ఎక్కువగా వినిపించాయి. గుంపులు గుంపులుగా యువకులు ఈ నినాదాలనిస్తూ ఆపమన్నా కూడా ఆపకుండా రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా అందరిని రెచ్చగొట్టటం భయానికి గురి చేసింది. జై శ్రీరాం నినాదంలో ప్రతీకారేచ్ఛ స్పష్టంగా కనబడుతోంది. రామాయణాన్ని చదివినా లేదా రామానంద్ సాగర్ నిర్మించి ప్రసారం చేసిన రామాయణ్ టీవీ సీరియల్ చూసినా రాముడంటేనే సౌమ్యుడనీ ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అలాంటి దేవుడికి ఇలాంటి ద్వేషోన్ముఖులు భక్తులుగా ఉండటం దేవుడికే దురదృష్టం.
భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ, దీన్ని చూసుకొని తమని అడ్డుకునేదెవరు, అడ్డగిస్తే అంతు చూస్తామని ఆధిపత్య భావజాలంలోంచి ఇలాంటి ఉన్మాదం ఉరకలేస్తూ ఉండవచ్చు. నిస్సహాయ స్థితిలో పోలీసు వ్యవస్థ కూడా “ఎందుకొచ్చిన తంటాలే” అని మసీదులను, దర్గాలను కనపడకుండా తాత్కాలికంగా దాచిపెట్టవచ్చు. ఇలాంటి ఆధిపత్యాన్ని ఎంతకాలం కొనసాగించవచ్చు? భక్తులలో ఇంతటి జంతు ప్రవృత్తి ఎలా పాదుకుంటున్నదో దిగ్భ్రాంతి కలుగుతుంది. విచక్షణ లేని విధంగా ఇంతటి ఉన్మాదాన్ని ఎలా పొందుతున్నారో అర్ధం కావడం లేదు. “ఇది సరైనది కాదు” అని చెప్పి చూసే అవకాశాన్ని కూడా ఇవ్వలేనంత ఆక్రోశం, అహంకారం, ద్వేషం వీరి నుండి బయటపడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో రానున్న హనుమాన్ జయంతికి ఇంకెన్ని ఆక్రోషాలూ అరుపులూ చూడాల్సి వస్తుందోనన్న భయం సహజమేగా..!
అందం, ఐశ్వర్యం, యవ్వనం ఎంత శాశ్వతమైనవో ఆధిపత్యం కూడా అంతే శాశ్వతమైనదనే సత్యాన్ని మరిచిపోతే ఎలా? చరిత్రలో ఆధిపత్యాన్ని చెలాయించిన రాజులు, రారాజులు, మహారాజులు మట్టి కొట్టుకుపోయి వారి ఆనవాళ్ళు కూడా లేవు. ఏ ఆధిపత్యమైనా చిరకాలం ఒకే సమూహానికి సొంతమైపోదు. ఆధిపత్య భావజాలంతో పిల్లిని ఒక గదిలో బంధించి హింసించాలని చూస్తే జరిగే పరిణామం ఏంటో తెలియనిది కాదు.
చాలా బాధాకరమైన, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశమేమంటే, ఈ ఆధిపత్య భావజాలంతో ప్రేరేపించిన వాళ్ళు అలాంటి ఆధిపత్యం తిరగబడిన రోజు ఉండకపోవచ్చు. కానీ దానికి బలి అయ్యేది వారి వారసులేనని గుర్తించలేనంత మూర్ఖత్వంలో ఉంటే ఎలా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.