
ది వైర్ వివరణాత్మక కథనం
తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న షెడ్యూల్ కులాలను మూడు గ్రూపులుగా ఉప వర్గీకరించి అమలులోకి తెచ్చేందుకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వారికి ఇప్పటి వరకు అమలులో ఉన్న 15% రిజర్వేషన్ కోటాలోనే ఈ మూడు గ్రూపులకు సమానంగా రిజర్వేషన్‌ను అమలు చేస్తారు.
అయితే, గత ఏడాది ఆగస్టులో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ విషయంలో తమ సొంత చట్టాలను అమలు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్పును అమలు చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌కు వడివడిగా అడుగులు వేసింది. ఈ బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి ఉత్తమ్‌ను ప్రభుత్వం నియమించింది.
ఇందులో భాగంగా వర్గీకరణపై ఎంక్వయిరీ కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నాయకత్వంలో ఏక సభ్య కమిషన్‌ను క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆయన చేపట్టిన విచారణకు తుది రూపమే తెలంగాణ షెడ్యూల్ కులాలు రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ- 2025 బిల్లు. ఈ కమిషన్ ప్రభుత్వానికి అందించిన 200 పేజీల నివేదికలో, రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందే క్రమంలో షెడ్యూల్ కులాలలో వివిధ వర్గాల మధ్య గణనీయమైన అసమానత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషన్ తెలిపింది. తన నిర్ధారణలకు కమిషన్ 2011 జనాభా లెక్కల సమాచారాన్ని ఆధారంగా తీసుకుంది.
తెలంగాణ మొత్తం జనాభా 3.50 కోట్లు. వీరిలో ఎస్సీ జనాభా సంఖ్య 54.32 లక్షలు(మొత్తం జనాభాలో 15.52%). ఎస్సీ జాబితాకు చెందిన జనాభాలో ఉపకులం పేర్కొనబడని జనాభా 2.14 లక్షలు కాగా, పేర్కొన్న జనాభా 52.17 లక్షలు. జనాభా లెక్కల సేకరణ సమయంలో తమను తాము ఎస్సీ కమ్యూనిటీలకు చెందినవారీగా చెప్పుకున్నారు. అయినప్పటికీ, తమ ఉపకులాలను బయటకు చెప్పని కారణంగా వారిని జాబితాలో చేర్చలేదు. రాష్ట్రంలో కమిషన్ సేకరించిన 59 ఎస్సీ ఉప కులాలకు సంబంధించిన సమాచారం పార్లమెంటు ఆమోదించిన, అధికారిక జాబితాలో చేర్చబడిందే.
అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ షెడ్యూల్ కులాలు(రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ)బిల్లును 2025 మార్చి 18న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. గవర్నర్ జిష్ను దేవ్‌వర్మ ఏప్రిల్ 8న బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆరోజు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గెజిట్ మొదటి కాపీని, ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌కు అందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు. “ఎస్సీ ఉప వర్గీకరణ విప్లవాత్మక నిర్ణయాన్ని భారతదేశంలో అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మనం ఈ చరిత్ర సృష్టించినందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ డిమాండును అమలులోకి తీసుకురావటం ద్వారా, సామాజిక న్యాయాన్ని అందించే గొప్ప పనిని చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు సరైన రీతిలో నివాళి అర్పించింది” అని ట్వీట్ చేశారు.
ఉప వర్గీకరణను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తమదేనని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన గత సంవత్సరం నవంబర్ 14న హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ చేసిన ప్రకటనకు భిన్నంగా ఉంది. సుప్రీంకోర్టు అనుమతించిన కొత్త చట్టంతో తన రాష్ట్రం ముందుకు సాగడం గురించి గత శీతాకాలపు సమావేశాల మొదటి రోజున సైనీ హర్యానా అసెంబ్లీలో మాట్లాడుతూ “ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి(నవంబర్ 14) చట్టం అమలు చేయబడుతుంది” అని అన్నారు.
రిజర్వేషన్ల ప్రయోజనం..
32.33 లక్షల జనాభాతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం ప్రధాన సంఖ్యగా ఉండగా, 15.27 లక్షల జనాభాతో మాల సామాజిక వర్గం గతంలో ఉన్న జనాభా కన్నా సగం కంటే తక్కువగా ఉంది. కానీ రిజర్వేషన్లను పొందే విషయంలో మాత్రం కొన్ని సందర్భాలలో మాదిగలతో సమానంగాను, ఎక్కువ సందర్భాల్లో వారి కంటే ఎక్కువగాను ప్రయోజనాలు పొందింది.
ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం ఉద్యోగులు 5.21 లక్షల మంది ఉన్నారని షమీమ్ కమిషన్ నివేదిక పేర్కొంది. వారిలో ఎస్సీ ఉద్యోగులు 94,114 మంది. అంటే 8.04%. వారిలో మాదిగ ఉద్యోగులు 45,971 కాగా మాల ఉద్యోగులు 36,956 మంది ఉన్నారు.
2024- 2025 మధ్య మాదిగ సామాజిక వర్గానికి చెందిన 541 మంది విద్యార్థులు రాష్ట్రంలోని టాప్ 10 మెడికల్ కాలేజీలలో చేరగా, 2021- 2024 మధ్య 3,384 మంది విద్యార్థులు టాప్ ఇంజనీరింగ్ ఇంకా ప్రొఫెషనల్ కాలేజీలలో సీట్లు సాధించారు. అదే సమయంలో వైద్య, ఆరోగ్య సేవల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన లెక్కల ప్రకారం మాదిగ సామాజిక వర్గం నుంచి 162 మంది సివిల్ సర్జన్లు, 91 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,203 మంది నర్సులు ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మాదిగ జనాభా 61.967% కాగా, మాలలు 29.265%. మాదిగ, మాల సామాజిక వర్గాల జనాభా మొత్తం ఎస్సీ జనాభాలో 91.232 శాతం కాబట్టి, రిజర్వేషన్ సమస్యలు ఇంకా సామాజిక-ఆర్థిక-విద్యా రంగాలలో ఎస్సీల వెనుకబాటుతనం వల్ల ఈ రెండు వర్గాలకు మధ్య తగాదాలు ఏర్పడ్డాయి. విద్య, ఉపాధిలో రిజర్వేషన్ ప్రయోజనాలను పొందే విషయంలో కూడా ఈ రెండూ కులాల మధ్య గణనీయమైన అసమానత ఉంది. మిగిలిన 50 సమూహాలు కూడా ఐదు లేదా ఆరు అంశాలలో ఆధిపత్య సామాజిక మినహాయింపులున్నా, వీరు కూడా గత ఏడు దశాబ్దాల కాలంగా సామాజిక అణచివేతను ఎదుర్కొన్నారు. కానీ వెనుకబాటుతనం విషయంలో వీరి గురించి పెద్దగా ప్రస్తావించలేదు.
మాదిగలతో పోలిస్తే మాల కులస్తులు రాజకీయంగా చాలా చురుకుగా ఉండటంతో పాటు రాజకీయాల్లో పైచేయి కూడా సాధించారు. 2007- 2024 మధ్య జరిగిన ఎన్నికల్లో వీరిలో 29 మంది ఎమ్మెల్యేలుగా, ముగ్గురు ఎమ్మెల్సీలు, పార్లమెంట్లో నాలుగు ఎంపీ సీట్లను పొందారు. మాదిగల విషయంలో చూస్తే తొమ్మిది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, మూడు ఎంపీ సీట్లకు ప్రాతినిద్యం వహించారు.
కమిషన్ నిర్వహించిన విశ్లేషణ ఇతర ఎస్సీ వర్గాలలోని అసమానతలను కూడా ప్రముఖంగా చూపింది. రాష్ట్ర సేవల్లో ప్రాతినిధ్యం, విద్యా సంస్థలలో ప్రవేశం, రాజకీయ ఎన్నికలలో ప్రాతినిధ్యం వహించడం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ 59 ఉప కులాలను ఉప వర్గీకరణ చేస్తూ సిఫార్సులను జారీ చేసింది. ఇందులో 15 అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన గ్రూపులను గ్రూప్ Iలో చేరుస్తూ వారికి 1% రిజర్వేషన్లను కేటాయించింది. గ్రూప్ IIలో మాదిగలు. వాటి ఉప కులాలతో సహా 18 మధ్యస్తంగా ప్రయోజనం పొందిన కులాలు ఉన్నాయి. వీరు 9% రిజర్వేషన్లను పొందుతున్నారు. గ్రూప్ IIIలో 26 గణనీయంగా లబ్ది పొందిన వర్గాలు ఉన్నాయి. ఇందులో మాలలు, వాటి ఉప-కులాలు ఉన్నాయి. వీరు 5% రిజర్వేషన్‌ను పొందుతారు.
సంఘీభావం వర్సెస్ వైవిధ్యం..
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ ఘంటా చక్రపాణి ద వైర్‌తో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ సామాజిక సంఘీభావం నుంచి కుల సంఘీభావానికి వారి దృష్టిని మార్చిందన్నారు. గ్రూపులను ఉప వర్గీకరించడంలో కమిషన్ సుప్రీంకోర్టు తీర్పులోని కొన్ని సూచనలను విస్మరించటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉదాహరణకు, సామాజిక వెనుకబాటుతనాన్ని అంచనా వేసేటప్పుడు ప్రభుత్వాలు సామాజిక ప్రత్యేకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తీర్పు సూచించింది. “కానీ, ఇక్కడ అది జరగలేదు,” అని చక్రపాణి అన్నారు.
అలాగే ఆయా ప్రయోజనాలను పొందటానికి గ్రూపుల అర్హతను కూడా ఈ ప్రక్రియలో పరిగణించలేదని చక్రపాణి అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం కసరత్తులో జనాభానే ఏకైక ప్రామాణికంగా తీసుకున్నట్లు అనిపించిందన్నారు. అదే సందర్బంలో శాతవాహనా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ఎస్. మల్లేష్, జనాభా ఆధారంగా రిజర్వేషన్లను విస్తరించడం ప్రభుత్వం చైతన్య పూర్వకంగా తీసుకున్న రాజకీయ నిర్ణయమని అన్నారు. “ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ నుంచి ఇప్పటివరకూ ప్రయోజనం పొందని గ్రూపులను గుర్తించటం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంబించి ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు, ఇది ఎక్కువ ప్రయోజనం పొందిన కులాల నుంచి ప్రారంభమైంది”అని అభిప్రాయపడ్డారు.
పరిపాలన- బడ్జెట్..
షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం, వాటి అమలు కోసం ద్వారాలు తెరిచింది. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాలలోని వివిధ సామాజిక గ్రూపులలో సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రస్తుత చట్టం సరైనదని అన్నారు.
షెడ్యూల్ కులాలకు చెందిన ప్రత్యేక అభివృద్ధి నిధి బడ్జెట్ మొత్తంలో 15% ఇప్పుడు మూడు గ్రూపులకు నిర్ణయించిన వాటాల(శాతాల) ప్రకారం పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ నిధిని రాష్ట్ర ప్రభుత్వంలోని 34 విభాగాలకు కేటాయించారు. తద్వారా నిధులను గ్రూపుల వారీగా క్షేత్ర స్థాయి వరకూ కేటాయింపు చేయటానికి అవకాశం ఉంటుంది.
నూతన వధువులకు ఆర్థిక సహాయం కోసం ఇచ్చే కల్యాణ లక్ష్మి, యువతకు విదేశీ విద్య కోసం స్కాలర్షిప్లు, స్వయం ఉపాధి కోసం రుణాలు మొదలైన పథకాలకు నిధులను కొత్త కోటాల ప్రకారం సవరించి అమలు చెయ్యాలి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి, తెలంగాణ ఏర్పడిన కొన్ని నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గుర్తుచేశారు.
ఆ తీర్మానం సారాంశం ఇలా ఉంది, “షెడ్యూల్డ్ కులాల జనాభా, వారి వెనుకబాటుతనం స్థాయిని బట్టి చట్టబద్ధమైన ప్రయోజనాలు సమానంగా పంపిణీ జరగటాన్ని నిర్ధారించడానికి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు ఈ సభ మద్దతు ఇస్తున్నది. ఇందుకు అనుగుణంగా, భారతదేశ రాజ్యాంగంలో అవసరమైన సవరణను చేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము”.
ఈ తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించారు. కాని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయాధికారులతో ఒక ధర్మసనాన్ని ఏర్పాటు చేసి, గత ఏడాది ఆగస్టులో ఈ తీర్పు ఇచ్చే వరకు ఎటువంటి కార్యాచరణ జరగలేదు.
మొత్తం మీద, ప్రస్తుత రిజర్వేషన్ల వ్యవస్థలో పరిమిత రిజర్వేషన్ ప్రయోజనాలు ఉండటం వల్ల ఎస్సీ కమ్యూనిటీల మధ్య అనారోగ్య పోటీని సృష్టించిందని అర్ధమవుతోంది. చాలా మంది భావించినట్లు ఉప వర్గీకరణ అమలు వల్ల వనరులను మరింత క్రమపద్ధతిలో కేటాయించడం ద్వారా ఈ ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయి.
ఎన్ రాహుల్
అనువాదం : ఎం పద్మజ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.