
ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. అందుకే ప్రజల ప్రాపకం కోసం పాలకులు ఏదో ఒక కొత్త పథకం ఆలోచించాల్సిందే. నిన్నటి వైసీపీ ప్రభుత్వమైనా, నేటి కూటమి ప్రభుత్వమైనా పబ్లిక్ అట్రాక్షన్ కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. సంక్షేమ పథకాల సత్వర అమలంటూ, బటన్ నొక్కి అకౌంట్లలో నేరుగా డబ్బులేసి, ప్రజలకు మరింత దగ్గరవ్వాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు సంక్షేమ పథకాల హామీలతో పాటు, పీ-4 అని చంద్రబాబు ప్రభుత్వం అంటోంది.
అయితే, ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్స్ సిక్స్ హామీలను అమలు చేయడం విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. చంద్రబాబు ప్రభుత్వం పీ-4 పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ అని పీ- 4 అనే దానికి పూర్తి రూపం. పేదల ఎదుగుదలకు ధనవంతులు సహకరించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ పేరుతో స్వయంగా సీఎం చంద్రబాబే ఈ పథకాన్ని భుజానికెత్తుకున్నారు. సీఎం నుంచి సర్పంచ్ వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామంటున్నారు.
అసలు ఈ పీ-4 అంటే ఏంటి..?
సహజంగా ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంలో అభివృద్ధి పనులు చేపడతాయి. కానీ ఇక్కడ ప్రజలను భాగస్వాములను చేసి, అదే ప్రజలను పేదరికం నుంచి బైటపడేలా చేయడమే ఈ పీ- 4 ఉద్దేశ్యం. కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టుబడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ-4 కాన్సెప్ట్. కొన్ని పెద్ద సంస్థలు లేదా పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొన్ని గ్రామాలను, కుటుంబాలనూ దత్తత తీసుకొని వాటి ఆర్థికాభివృద్ధికి సహకరించడం కూడా ఇందులో భాగమే. ఇదిలా ఉంటే పీ-4 వెనుక విలువైన భూములు, ప్రాజెక్టులను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలే దోచిపెడుతున్నాయన్న ఆరోపణ కూడా లేకపోలేదు.
పీ-4 ఫార్ములాలో మరో ట్విస్ట్ ఉందా?
పీ-4 ఫార్మేట్లో మనకు కనబడని ట్విస్ట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఓ కంపెనీ వచ్చి ఓ గ్రామంలో ఓ ఫ్యాక్టరీయో, పవర్ ప్లాంట్‌లో పెట్టాలంటే భూమి కావాలి. అక్కడ ప్రభుత్వ భూమి వుంటే, దానిని ఆ కంపెనీకి కేటాయిస్తే సరి. ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి లేకుంటే ఆ భూములను ప్రజల నుంచే తీసుకొని, వారికి సదరు ప్రాజెక్టులో భాగమిస్తారు. అంటే వాటాదారులన్నమాట. ఆ భూములు రైతుల పేరు మీదే ఉన్నా వాటిపై కొంత కాలంపాటు కంపెనీ యాజమాన్యానికే సర్వహక్కులుంటాయి.
కంపెనీకి లాభాలొస్తే ఇస్తారా? ఇస్తే ఎంతశాతం ఇస్తారు? ఒక వేళ నష్టమొస్తే కనీసం భూమికి కౌలు అయినా ఇస్తారా? అన్నది క్లారిటీ ఉండదు. ఏ కంపెనీలయినా లాభాలు వస్తే ప్రజలకు ఇళ్లు, మరుగుదొడ్లు కట్టించడం, జీవనోపాధి చూపించడం వంటివి చేస్తే చేయవచ్చు. కానీ నష్టాలు వచ్చినా ప్రాజెక్టు దివాళాతీసినా పత్తాలేకుండా పోవడం ఖాయం. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం నుంచో, రైతుల నుంచో భూములు తీసుకున్న కంపెనీ ఏళ్ల తరబడి పనులు మొదలుపెట్టకపోవడమూ జరుగుతోంది. అదే కోవలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న చాలా సెజ్‌లకు భూములిచ్చిన రైతులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం కంపెనీలు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మేఘా కృష్ణా రెడ్డిని, గ్రీన్కో సీఈఓ అండ్ ఎండీ చలమల శెట్టి అనిల్ కుమార్‌లను మార్గదర్శకులుగా అభివర్ణిస్తున్నారు. ఇది ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పీ-4 కార్యక్రమంలో వీళ్ళిద్దరూ భాగస్వాములు కావటమే. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఎంపిక చేసిన పేద కుటుంబాలకు ఈ కంపెనీలతో పాటు మరి కొంతమంది పారిశ్రామిక వేత్తలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఇలా సాయం చేసే వాళ్ళను మార్గదర్శకులుగా పిలుస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పుడు మార్గదర్శకులు అనిపించుకుంటున్న ఆ కంపెనీల అధిపతులు ప్రభుత్వం నుంచి ఇంతకు ముందే లబ్ది పొందారా అంటే అవుననే చెప్పాలి.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీపై ఉన్న వివాదాలు అన్ని ఇన్నీ కావు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మేఘా ఇంజనీరింగ్ కంపెనీకే పట్టి సీమ ప్రాజెక్ట్ కేటాయించగా, దీనిపై ఎన్నో వివాదాలు తలెత్తాయి. మరో కంపెనీ గ్రీన్కో ప్రాజెక్ట్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో ఈ సంస్థకు మేలు చేసేలా విద్యుత్ ప్రాజెక్ట్‌లు కేటాయించారనే విమర్శలతో పాటు ఈ కంపెనీ అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు సంస్థలు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ప్రాజెక్ట్‌లు దక్కించుకున్నవే. ప్రస్తుతం కొంత మొత్తం పీ-4 కింద సాయం చేసినందుకు వీళ్ళను మార్గదర్శకులుగా పిలుస్తామని చెప్పటం ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతుందో అర్ధం కావటం లేదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఇలా పీ-4 కింద సాయం చేసే కంపెనీలు రాష్ట్రంలో పొందిన కాంట్రాక్టులు, ప్రాజెక్ట్‌ల విలువ ఎంత, వీళ్ళు చేసిన సాయం ఎంత అన్నది ప్రభుత్వం బయటపెడుతుందో లేదో వేచిచూడాలి.
ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనం పొంది, అందులో నుంచి కొంత మొత్తాన్ని సాయం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలే ఇవన్నీ. ఇక్కడ ప్రభుత్వం కార్పొరేట్లకు పదిరూపాయల ప్రయోజనం కల్పిస్తే ఆ సంస్థలు ప్రజలకు ఇచ్చేది 5పైసల వాటా అనడాన్ని ఎవరూ కాదనలేరు. ఇదే అసలుసిసలైన పీ-4 ఫార్ములా వెనక ఉన్న అసలు కథ. ఇలా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన మిగతా కంపెనీలు పెద్దలు, పీ-4 మాటున కొంతైనా పేద ప్రజలకు సాయం చేయడానికి రావాలి. అప్పుడే చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.