
తెలంగాణ రాజకీయాలలో కవిత అప్పుడు ఇప్పుడు సంచలనమే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జాగృతి పేరుతో కవిత సాంస్కృతిక ఉద్యమాన్ని చేశారు. బతుకమ్మ పేరుతో ప్రజల్లోకి బలంగా వెళ్లారు. తన మాటల ద్వారా, చేతల ద్వారా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. విషయ పరిజ్ఞానం. విషయ వివరణ. సవాల్‌కు తగ్గ జవాబు ఇవ్వడంలో దిట్ట అనిపించుకున్నారు. ఇదంతా 2014 ముందు. 2018 ఎన్నికల తర్వాత కవిత ఆచరణ పార్టీ లైన్‌కు భిన్నంగా ఉందని రేఖా మాత్రంగా చర్చించుకున్న వారు కొందరు. ఆమె జైలుకు వెళ్లిన తర్వాత, ఆమె చుట్టూ జరిగిన చర్చ మరో రకం.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, స్వల్ప కాలం పాటు మౌనంగా ఉన్న కవిత. ఆ తర్వాత ఆమె మాట తీరు మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై, సమీక్షలు చేసుకుంటున్న తరుణమది. అప్పుడే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలు అడుగంటి పోయినై. ఆ సందర్భంలోనే కేసీఆర్ అనారోగ్యం పాలైయ్యారు.
పార్టీ లైన్‌కు భిన్నంగా కవిత స్వరం..
బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభకాలంలోనే కవిత అరెస్ట్ అయ్యారు. విడుదల అనంతరం పార్టీ లైన్‌కు భిన్నంగా ఆమె మాట్లాడుతూ వచ్చారు. సామాజిక తెలంగాణ నినాదమెత్తుకున్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. ఆ తర్వాత పార్టీని కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. చివరగా హరీష్ రావు, సంతోష్ రావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, “బీఆర్ఎస్ ఉంటే ఎంత? పోతే ఎంత?” అని కూడా అన్నారు. ఒకవైపు తన తండ్రి గురించి ఆవేదన చెందుతూనే, తన తండ్రి స్థాపించిన పార్టీ ఉనికిని ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు, తన బహిష్కరణ గురించి మీడియాతో మాట్లాడుతూ తాను ఒంటరి పోరాటం చేయబోతున్నాననే విషయాన్ని చెప్పారు.
ఇన్నాళ్లు లేఖల ద్వారా, కొన్ని వ్యాఖ్యల ద్వారా తన అభిప్రాయాలను చెప్తూ వచ్చిన కవిత నేరుగా తాను అనుకున్న వారిపై బాణాలు సంధించారు. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు.? తెలంగాణ రాజకీయాలలో మరో పార్టీ రాబోతున్నదా.? కేసీఆర్‌ను తట్టుకొని కవిత పార్టీ నిలబడగలదా.? ఈమెకు ఎవరి సహకారం ఎట్ల ఉండబోతున్నది.? ఇత్యాది విషయాల గురించిన చర్చ జనబాహూళ్యంలో విస్తృతంగా జరుగుతున్నది. మహారాష్ట్ర పరిణామాలే ఇక్కడా జరుగుతాయని కొందరు అనుకుంటున్నారు. తన గురించి ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి, కవిత పార్టీ అధిష్టానానికి చురుక పెట్టారని మరికొందరు భావిస్తున్నారు. ఎవరి ఆలోచనలు, ఎవరి విశ్లేషణలు ఎట్లా ఉన్నా, కవిత గతంలో బీజేపీ- బీఆర్ఎస్ బంధం గురించి చేసిన వ్యాఖ్యలే ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
కవిత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఏమిటి?
తన రాజకీయ కార్యాచరణ గురించి నిర్దిష్టంగా ఇట్లా ఉంటుందని కవిత చెప్పలేదు. ఇన్నాళ్లు కేసీఆర్ అండదండలతో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులలో ఉన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీనే ఆమెకు అధికారాన్ని కట్టబెట్టింది. కేసీఆర్ లేకుంటే కవిత లేదు. ఆమె రాజకీయమూ లేదు. తన తండ్రిని పొగుడుతూనే పార్టీని, నాయకులను ఇబ్బందులకు గురి చేసే వాగ్బాణాలను సంధిస్తూనే ఉన్నారు. పరోక్షంగా కేసీఆర్‌ను కూడా ఆమె ప్రశ్నిస్తున్నట్లుగానే, చాలా మంది భావిస్తున్నారు.
టీఆర్ఎస్ లేకుండా, ఆ పార్టీ మద్దతు లేకుండా జాగృతి సంస్థ నిలబడుతుందా? పెద్ద ప్రశ్నే ఇది. తన కుటుంబీకులతో పడని కారణంగానే, ఆమె ఇంతలా మాట్లాడున్నారు తప్పా మరోటి కాదని చాలా మంది అనుకుంటున్నారు. కేసీఆర్‌ను కాదని బీఆర్ఎస్ను మించిన, లేదా తెలంగాణ అస్తిత్వంతో మరో రాజకీయ వేదికను కవిత ఏర్పాటు చేసినా, అది మనుగడ కొనసాగిస్తుందానేది ప్రశ్నార్థకమే.
కవిత వ్యవహారాన్ని ఓ ప్రధాన రాజకీయ అంశంగా కాకుండా, కుటుంబ అంశంగానే సమాజం భావిస్తున్నది. కవిత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినా, బీసీల గురించి ప్రస్థావించినా తమ కోసమేనని, సమాజ హితమని ప్రధాన స్రవంతి, మీడియా, రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నట్టుగా లేదు.
పరిణామాలను గమనిస్తూ వచ్చిన కేసీఆర్..
ఇక కేసీఆర్, ఆయన మాట్లాడినా వార్తే. మౌనంగా ఉన్నా వార్తే. ఎన్నికల్లో తనను ఓడిస్తే ఇంట్లో ఉంటానని చెప్పారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కవిత విషయంలో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఆయన పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కొద్ది మాసాలుగా అన్ని పరిణామాలను గమనిస్తూ వచ్చారు. చివరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ చర్య ద్వారా తాను ఎవరినీ సహించబోరనే విషయాన్ని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి, పోయాయి. 2009 ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ఉండదన్నారు. కొందరు పార్టీని వదిలి వెళ్లారు. ఆ సందర్భంలో కేసీఆర్ ఒంటరైయ్యారనే చెప్పాలి. అయినా, ఆయన తన ఆవేదనను బయటికి వెల్లడి చేయలేదు. కాలం కోసం వేచి ఉన్నారు. ఆ తర్వాత తాను కొందరిని బయటకు పంపారు. కొందరు నాయకులు వారికి వారే వెళ్లి పోయారు. కేసీఆర్ తన లక్ష్యం వైపు సాగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తన కుటుంబం నుండే ఇప్పుడు ఓ సమస్య ఆయన ముందుకు వచ్చింది. ఇప్పటికిప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కవితను సస్పెండ్ చేయడం. ఎన్నికలకు ఇంకా వ్యవధి ఉన్నది కాబట్టి, వచ్చే మార్పును బట్టి ఆయన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ తన చర్యల ద్వారా పార్టీ నాయకత్వాన్ని, క్యాడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించినట్లే. ఆయన భవిష్యత్తు నిర్ణయం ఏంటనేది ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని స్థితి. కవిత తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరుకుంటారని చాలా మంది భావిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.