
సాటి మానవుల కోసం పరితపించేందుకు భారతీయులకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదు.
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ వద్ద జరిగిన పరిణామాలు, బొంబాయి హైకోర్టు తీర్పుకు మధ్య సంబంధం ఏంటి? దేశభక్తి ముసుగులో చలామణి అవుతున్న కొత్త తరహా హిందూత్వ బంధం.
దేశంలోని అనేక ప్రాంతాల్లో హిందూత్వ శక్తులు, పోలీసుల మధ్య ఏర్పడుతున్న అపవిత్ర బంధాన్ని వివరించే అనేక ఉదాహరణలున్నాయి. ప్రత్యేకించి ముస్లింలు లేదా క్రైస్తవుల గురించిన విషయాల్లో ఈ బంధం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ న్యాయస్థానాలే హిందూత్వ పరిభాషలో మాట్లాడితే ఆందోళన చెందకతప్పదు. అంటే మనం పీకల్లోతు మునిగిపోయామని దీని అర్థం.
తాజాగా జరిగిన రెండు పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకటి ముంబైలో జరిగింది. రెండోది ఢిల్లీలో జరిగింది. మొదటిది బొంబాయి హైకోర్టు చేసిన వ్యాఖ్య కాగా, రెండోది ఢిల్లీలోని జనసమ్మర్ధం ఎక్కవగా ఉండే నెహ్రూ ప్లేస్‌లో జరిగిన ఘటన. ఈ రెండింటినీ కలిపింది ఏంటి? ఎక్కడో దూరంగానే అయినా మన కళ్ల ముందున్న నైతిక సంక్షోభం. గాజాలో జరుగుతున్న నరమేధం పట్ల మనం ఎలా స్పందించాలన్న ప్రశ్నకు సంబంధించిన పరిణామాలు ఇవి.
బొంబాయిలో న్యాయస్థానం, ఢిల్లీలో నెహ్రూ ప్లేస్‌లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాయి. ఈ సమాధానాలే అటు బొంబాయిలోని న్యాయస్థానాన్ని, ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌ను కలుపుతున్నాయి.
‘అణచివేత ఎదుర్కొంటున్న ప్రజల పట్ల ప్రదర్శించే సానుభూతి- దేశభక్తి పరస్పరం విరుద్ధమైనవా?’
‘పాలస్తీనాలో జరుగుతున్న నరమేధానికి సంబంధించి భారతదేశంలో నిరసన ఎందుకు తెలపాలనుకుంటున్నారు? మనకున్న సమస్యలు చాలవా?’ ఇవేవో దారినబోయే దానయ్య ఆవేశంగ అన్న మాటలు కావు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముంబయి పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) బొంబాయి హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు స్పందన అది.
నిరసన తెలిపే హక్కు ఉందా లేదా అన్న చట్టపరమైన విషయాన్ని ప్రశ్నించకుండా పిటిషనర్లను హైకోర్టు మందలించింది. దేశంలో ఉన్న సంగతులు పట్టించుకోమని, దేశభక్తితో వ్యవహరించమని చెప్పింది. న్యాయ స్థానం అడగదల్చుకున్న ప్రశ్న ఏంటంటే భారతీయులకు, గాజాలో ఇజ్రాయెల్ ప్రాణాంతక దాడుల్లో కకావికలమవుతోన్న ప్రజలకూ మధ్య సంబంధం ఏంటని.
కోర్టుకు వేయాల్సిన ప్రశ్న ఏంటంటే అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజల గురించి సానుభూతి వ్యక్తం చేయటం, దేశభక్తి ప్రదర్శించటం రెండూ పరస్పరవిరుద్ధమైన అంశాలా? ఒక దేశం గురించి బాధ్యతాయుతంగా వ్యవహరించటం అంటే ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కళ్లు మూసుకుని ఉండాలా?
‘దేశ భక్తితో ఉండండి’ అంటే అర్థం ఏంటి? మన భావోద్వేగాలన్నీ ఆత్మానందానికి పరిమితం చేసుకోవాలా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చింతనాపరులు, తత్వవేత్తలు దేశభక్తిని ఈ విధంగా నిర్వచించిన దాఖలాలు లేవు. ఈ వైఖరి మనల్ని మనం ప్రపంచ పరిణామాల నుంచి వెలివేసుకోవడం కాదా? లేక పాలస్తీనా అన్న పదమే భారతజాతీయతకు సరిపడని పదమా?
ఈ వ్యాఖ్యలేమీ కోర్టు ఆదేశాల్లో భాగం కాదనీ, కేవలం అర్థోక్తితో చేసిన వ్యాఖ్యలేనని ఎవరైనా వాదింవచ్చు. ఇటువంటి వ్యాఖ్యల గురించే మనం ఎక్కువగా ఆందోళన చెందాలి. ఎవరు దేశభక్తులు, ఎవరు కాదని ఇట్టే తేల్చేసే చొరవ గురించి ఆందోళన చెందాలి. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, దేశభక్తితో ఉండటం అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధకు స్పందించకుండా ఉండటమేనా?
సీపీఎం మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ‘‘మన దేశంలో మోయలేనన్ని సమస్యలున్నాయి. ఇటువంటివన్నీ మీకెందుకు? మీకున్న హస్వ్ర దృష్టికి నేను చింతిస్తున్నాను. ఇక్కడేమి జరుగుతుందో పట్టించుకోకుండా గాజా గురించో, పాలస్తీనా గురించో ఆలోచిస్తున్నారు. మీ దేశం గురించి మీరు ఎదో ఒకటి చేయవచ్చు కదా? మీ దేశం గురించి చూడండి. దేశభక్తులుగా వ్యవహరించండి. మేము దేశభక్తులమే అని అంటుంటారు. కానీ ఇది దేశభక్తి కాదు. మీ దేశ ప్రజల గురించి దేశభక్తి ప్రదర్శించండి ముందు’’ అని న్యాయస్థానం ఉపదేశం చేసింది.
మురికికాలువలు, వ్యర్ధాలు, కాలుష్యం వంటి దేశంలో ఉన్న ఎన్నో సమస్యల గురించి కమ్యూనిస్టులు ఆందోళన చేయవచ్చని కోర్టు సూచించింది. గాజా వంటి సమస్యలు – న్యాయ స్థానం దృష్టిలో విదేశాంగ విధానానికి సంబంధించినవి – ప్రభుత్వం స్థాయిలో స్పందించాల్సిన సమస్యలే. కేవలం ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన విషయాల గురించి రాద్ధాంతం చేయవద్దని న్యాయస్ధానం ఉపదేశించింది.
రాజ్యాంగ స్పూర్తిని న్యాయస్థానాలు విస్మరించాయన్న విమర్శ అర్థరహితం కాదు. ఇతరు పట్ల సహానుభూతి ప్రదర్శించటానికి భారతీయులకు న్యాయస్థానం అనుమతి అవసరం లేదు. వాళ్లు ఇతర దేశాల్లో వెతలు పడుతున్న వాళ్లయినా సరే. వారి పట్ల సహానుభూతి ప్రదర్శించటానికి మనం వెనకాడవల్సిన అవసరం లేదు. టర్కీలో భూకంప బాధితులకు సహాయం అందించటానికి మనం చొరవ చూపలేదా?
సాటి మనిషిగా స్పందించే హక్కు కలిగి ఉన్నట్లే తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కునూ కలిగి ఉంటారు. ఈ హక్కులను ప్రజలు ప్రభుత్వం వద్ద తనఖా పెట్ట లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనా పరిణామాల పట్ల ప్రభుత్వం తీసుకుంటన్న వైఖరిని ప్రశ్నించే హక్కును ప్రజల నుంచి ఎవ్వరూ తీసుకెళ్లలేరు.
వీధులు, న్యాయస్థానాల మధ్య హద్దులు చెరిగిపోవటం ఆందోళనకరం
న్యాయస్థానం ముంబైలో వ్యక్తం చేసిన స్పందనే ఢిల్లీలో రోడ్ల మీద వ్యక్తమైంది. నెహ్రూ ప్లేసులో దాదాపు ముప్పై మంది పాలస్తీనా జెండాలు పట్టుకుని ఇజ్రాయెల్ ఘాతుకాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వాళ్లు అక్కడకు చేరుకున్నారో లేదో ఇరుగుపొరుగున ఉన్న దుకాణందారులు పోగై జెండాలు చించేశారు. ‘మన జాతీయ జెండా ఏది?’ అని నిలదీశారు.
‘మన జాతీయ జెండా ఏది?’ అని వీధుల్లోని దుకాణందారులు అడిగిన ప్రశ్నకూ, బొంబాయి హైకోర్టు ‘కాస్తయినా దేశభక్తి ప్రదర్శించండి, ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న వారి గురించి మీకెందుకు’ అంటూ వేసిన ప్రశ్నకూ మధ్య సామ్యం ఉంది.
కాకపోతే నెహ్రూ ప్లేస్‌లో దుకాణందారులు వ్యవహరించినట్లుగా న్యాయస్థానం వ్యవహరించలేదు. న్యాయస్థానంలో ‘భారత్ మాతా కి జై’, ‘జై శ్రీరాం’ అన్న నినాదాలు వినిపించలేదు. పాలస్తీనా జెండాలు చూడగానే హిందూత్వ నినాదాలు ఎందుకు గుర్తొచ్చాయో అక్కడి వ్యక్తులకు?
ముంబయి హైకోర్టు మురికికాల్వలు, కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యల గురించి పట్టించుకోవాలని సీపీఎంకు హితబోధ చేసింది. నెహ్రూ ప్లేస్‌లోని నిరసనకారులను బంగ్లాదేశ్‌లోని హిందువుల గురించి ఆలోచించాలని గుంపు డిమాండ్ చేసింది. ఈ రెండు ప్రతిపాదనల పట్లా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు.
న్యాయస్థానాలు, వీధుల మధ్య సరిహద్దు రేఖలు చెరిగిపోవటం ఆందోళనకరం. అంతకంటే ప్రమాదకరమైనది, తక్షణం అక్కడికక్కడే అప్పటికప్పుడే ఏర్పడుతున్న జాతీయతాభావన. భావోద్వేగపరమైన, విద్వేషపూరితమైన, తక్షణ జాతీయవాదస్పందన భవిష్యత్తులో ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. నెహ్రూ ప్లేస్‌లో గుమిగూడిన జనం ప్రణాళికాబద్దంగా పోగైనవారు కాదు. ఈ గుమిగూడిన వారికీ, ఆరెస్సెస్ లేదా బజరంగదళ్ నేపథ్యం ఉండి ఉండకపోవచ్చు.
అయినా పాలస్తీనా జెండాలు చూడగానే రెచ్చిపోయారు. గాజా పేరు ప్రస్తావన రాగానే న్యాయస్థానం చికాకుపడిరది. ఈ రెండు స్పందనల్లో ఏదీ వ్యూహాత్మకమైనది కాదు. ఆలోచించి చేసిన వ్యాఖ్య కాదు. కానీ ఈ రెండు తక్షణ స్పందనలు, ప్రతిస్పందనలూ సైద్ధాంతిక నేపథ్యం కలిగినవి.
ఇటువంటి తాత్కాలిక స్పందనలు మరోచోట కూడా కనిపిస్తాయి. లండన్, న్యూయార్క్‌ల్లో పాలస్తీనా జెండా పట్టుకున్నందుకో, అరాఫత్ ధరించే కియాఫీ ధరించినందుకు ఇజ్రాయెలీలు స్థానిక యువతపై దాడి చేశారు. భారతదేశంలో కూడా ఇటువంటి ప్రతికారేఛ్చతో కూడిన స్పందన వ్యక్తం చేసే వ్యక్తుల సంఖ్య, మోతాదు పెరుగుతోంది.
కీయాఫీ, బుర్ఖా, ముస్లింటోపీ, పచ్చ జెండా కనపడగానే కొందరికి ఒంటిమీద తేళ్లు పాకినట్లవుతుంది. నెహ్రూ ప్లేస్‌లో ఉన్న జనాన్ని ఎవ్వరూ ప్రేరేపించనవసరం లేదు. న్యాయ స్థానం మీ దేశభక్తి ఎక్కడా అని ప్రశ్నించినట్లు, పాలస్తీనా జెండాలు కనపడగానే జాతీయ జెండా ఎక్కడ అని నిలదీశారు.
దీన్ని మనం హిందూత్వ సద్యోజనిత స్పందన అని నామకరణం చేయవచ్చా? ఏదో ఒక మతానికి చెందిన బోధన వినగానే లేదా మరో దేశపు జెండా చూడగానే రెచ్చిపోవటం సహజమైన స్పందనగానే చూడవచ్చా? నెహ్రూ ప్లేస్‌లో పాలస్తీనా జెండాలు చూసి రెచ్చిపోతే, 2014లో పూనేలో మొహిసిన్ షేక్ వేషధారణ చూసి అతన్ని చంపటానికి ప్రయత్నం చేశారు. అలా వ్యవహరించినందుకు వాళ్లేదో క్షణికావేశంలో వ్యవహరించారని తలంచి న్యాయస్థానం హత్యాయత్నం చేసిన వారిపట్ల ఉదారంగా వ్యవహరించింది. ఇదేమీ వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నం కాదని సర్దిచెప్పింది.
విశాలమైన హిందూ జనాభాలో కుదించుకుపోతున్న నైతిక విలువలు..
ఈ విధమైన క్షణికావేశంతో కూడిన స్పందన 2014 తర్వాత కాలంలో హిందువుల్లో మరింతగా పెరిగింది. కొన్ని రకాలైన రంగులు, ధ్వనులు, బట్టలు, చివరకు భవన నిర్మాణాలు కూడా కొంతమందికి చికాకు కలిగిస్తున్నాయి. కంపరం కలిగిస్తున్నాయి. ఇటువంటి వాటికి స్పందించే వారంతా తమ స్పందనను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు.
ఇటువంటి పరిణామాలు దేశంలోని విశాలమైన హిందూ జనబాహుళ్యంలో నైతిక విలువలు కుదించుకుపోతున్న వాస్తవాన్ని ముందుకు తెస్తున్నాయి. ఈ పరిస్థితి ఇతరులకు ఏమో కానీ ఆ రకంగా సంకుచిత మనస్కులవుతున్న వారికి మాత్రం నష్టదాయకమే. ఎందుకంటే మనిషన్నాక అతను స్పందించే గుణాన్ని బట్టే అతని సున్నితత్వాన్ని అంచనా వేయగలం. సహృదయతను అర్థం చేసుకోగలం.
విశ్వంలోని ప్రాణకోటిలో మిగిలిన జంతువులకూ మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణం ఏంటి? మనిషన్న వాడు తనకు కలిగిన బాధకు మాత్రమే కాక ఇతరుల బాధలకు కూడా స్పందించే గుణాన్ని కలిగి ఉంటాడు. వియత్నాంలో నాఫాం బాంబుల దాడి నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఒళ్లంతా కాల్చుకుంటూ పరిగెత్తుతున్న బాలిక ఫోటో చూడగానే హృదయాల్ని కదిలించి వేస్తుంది. అక్కడ చూసేవాళ్లకు అక్కడ పాప మాత్రమే కనిపించింది తప్ప వియత్నాంకు చెందిన పాపా లేక మరో దేశానికి చెందిన పాపా అన్నది కనిపించలేదు. శరీర పరిధులను అధిగమించి సార్వత్రిక స్వభావాలను సంతరించుకోవటంలోనే మానవ ధర్మాల గొప్పదనం దాగి ఉంది.
మనకు రాంధారి సింగ్ దినకర్ గేయాలే కాదు. మొహమౌద్ దార్విష్ కవిత్యం కూడా హృదయాలకు హత్తుకుంటుంది.
కానీ ప్రస్తుతం, భారతదేశంలో మెజారిటీ ప్రజల్లో ఇటువంటి స్పందన కరువవుతోంది. నకనకలాడుతున్న కడుపులు, బాంబుదాడులకు ధ్వంసమవుతున్న నగరాలు ఇవేవీ వీళ్ల మనసులను కదిలించలేకపోతున్నాయి. స్పందించకపోయినా పర్లేదు కానీ నవుకుంటున్నారు. అటువంటి నవ్వులు చూసిన వారికి భయం కలగకపోతే వాడు మనిషి ఎలా అవుతాడు?
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.