
మానవ సమాజం భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిణామం చెందే క్రమంలో జాతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ కాలంలోనే యూరోపియన్ దేశాలు మతాన్ని రాజ్యం నుండి వేరు చేయటానికి పోరాటాలు కూడా నడిపాయి.
భూస్వామ్య వ్యవస్థ పరాకాష్టకు చేరుకున్న సమయంలో వివిధ దేశాల్లో రాజులు, చక్రవర్తులు రాజే దైవాంశ సంభూతుడు అన్న భ్రమ వ్యాపింపచేయటం ద్వారా ప్రజలను గుప్పెట్లో పెట్టుకున్నారు. భూస్వామ్య వ్యవస్థపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాధించిన విజయం ఈ భావనకు స్వస్తి చెప్పింది. దీంతో పాటు రాజ్యానికి, మతానికి మధ్య పెనవేసుకుని ఉన్న బంధాన్ని వేరు చేసింది. మతంతో సంబంధం లేని అస్తిత్వాన్ని రాజ్యానికి తెచ్చిపెట్టింది పెట్టుబడిదారీ వ్యవస్థ.
1648లో వెస్ట్ ఫాలియాలో జరిగిన సంధితో రాజ్యాల సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు అన్ని దేశాలు అంగీకరించాయి. దీని పర్యవసానమే వివిధ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను సమన్వయం చేసేందుకు ఉనికిలోకి వచ్చిన అంతర్జాతీయ న్యాయసూత్రాలు. చట్టాలు. వ్యవస్థలు.
రెండో ప్రపంచ యుద్ధంతో ఫాసిజం పతనం కావటం, వలస దేశాల విముక్తి ఉద్యమంలో వచ్చిన మార్పులతో వివిధ దేశాల్లో ఉప్పొంగిన విముక్తి ఉద్యమాలు ఆయా దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్య్రం గురించి ఎన్నో నిర్వచనాలిచ్చాయి. ఆయా దేశాలు సార్వభౌమత్వానికి ఇచ్చిన నిర్వచనానికి కావల్సిన తాత్విక భూమికను, ఆయా దేశాల్లో దీర్ఘకాలం సాగిన విముక్తి ఉద్యమాలు, వలస వ్యతిరేక ఉద్యమాలే సమకూర్చాయి. ఆ విధంగా సుదీర్ఘకాలం స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించి రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.
భారతీయత భావన – దాని పరిణామం..
బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా అశేష భారత ప్రజానీకం స్వాతంత్ర్యం కోసం సాగించిన ప్రజా పోరాటంలోనే భారతీయత భావనకు పునాదులు పడ్డాయి.
భారతీయత అంటే ఏమిటి? ఈ భావనకు మరింత సంక్లిష్టమైన బహుళ దృక్కోణాలున్నాయన్న వాస్తవాన్ని గుర్తిస్తూ సంక్షిప్తంగా చెప్పుకుంటే, దేశంలో ఉన్న వైవిధ్యభరిత అస్తిత్వాలను దీర్ఘకాలం మన్నికైన చిక్కని ఐక్యత దిశగా మమేకం చేయటమే.
కొలంబియా విశవిద్యాలయం, న్యూయార్క్‌లోని హెమేన్ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్ 2010లో భారతదేశంలో రాజకీయాలు, రాజకీయ ఆర్థిక వ్యవస్థ మధ్య ఉన్న సంబంధం గురించి ఓ అంతర్జాతీయ సెమినార్‌ను నిర్వహించింది. ఆ సెమినార్లో పలువురు వక్తలు ప్రవేశపెట్టిన పత్రాలను తాజాపర్చి వెలువరించిన సంకలనానికి ప్రముఖ రాజనీతి తత్వవేత్త అకీల్ బిల్గ్రామి ముందుమాట రాశారు.
నేను ప్రతిపాదించిన ‘భారతీయత భావన’గురించి బిల్గ్రామి చర్చిస్తూ (భారతీయత భావన) వెస్ట్‌ఫాలియా ఒప్పందాన్ని, తదనంతర పర్యవసానాలను పూర్తిగా తిరస్కరించిన ఓ నూతన (ఆదర్శవంతమైన) దృక్పథంగా భావించవచ్చు. భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థకు పరిణామం చెందుతున్న సంధికాలంలో, నూతన తరహా రాజ్యానికి ఆమోదయోగ్యత సంపాదించవల్సి వచ్చింది. అటువంటి నూతన రాజ్యం పాత కాలపు తరహాలో దైవాంశ సంభూతమై ఉండకూడదు. కొత్త రాజ్యాధికారానికి కొత్త తరహా పునాదులపై మాత్రమే ఇటువంటి రాజ్యాలు తమ మనుగడను కొనసాగించుకోగలుగుతాయి. ఆ ప్రాతిపదిక పౌరుడు తప్ప మరేమీ కాదు.
పౌరుల మధ్య ఉన్న మానసిక సాన్నిహిత్యం ఆధారంగా ఏర్పడే జాతి అన్న భావన. ఈ భావననే జాతీయత అంటాము. ఈ భావన ప్రజల మధ్య నుండి పుట్టుకురావల్సిందే. ఇటువంటి భావనను పుట్టించటానికి యూరోపియన్ దేశాలన్నీ అనుసరించిన వ్యూహం ఒక్కటే. దేశీయంగానో దేశాంతరంగానో తమకంటూ ఓ ఊహాజనిత శతృవును సృష్టించటం.(ఐరిష్ ప్రజలు, యూదులు మచ్చుకు ఓ ఉదాహరణ). ఈ విధంగా సృష్టించిన ఓ శతృవును ఆ ప్రజలు ద్వేషించేలా చేయాలి. “ఇతరులు” అన్న తరగతిని లోబర్చుకునేలా చేయాలి. ఈ రకమైన భావనను సృష్టించటమే మెజారిటేరియనిజం” అని వ్యాఖ్యానించారు.(సోషల్ సైంటిస్ట్, జనవరి-ఫిబ్రవరి 2011)
ఆధునిక లౌకిక ప్రజాతంత్ర భారతాన్ని ఆరెస్సెస్/బీజేపీలు హిందూరాష్ట్రగా మలచబూనుకోవటం అంటే, దేశంలో మతపరంగా అల్పసంఖ్యాకులైన వారిని లొంగదీసుకుని వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా పక్కకు నెట్టేయటానికి గాను ఓ పథకం ప్రకారం, అధిక సంఖ్యాకులైన మతస్తుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టం. అంటే పాతకాలపు వెస్ట్ ఫాలియా ఒప్పందం నాటి దురహంకారపూరితమైన జాతీయతను పునర్నిర్మించే ప్రయత్నమే తప్ప మరోటి కాదు.
భారతదేశంలో హిందూమతోన్మాదాన్ని రేకెత్తించటం, దేశంలో అల్పసంఖ్యాకులైన ముస్లిం మతస్తుల్లో భయభ్రాంతులను వ్యాపింపచేయటం రూపంలో ఈ ప్రయోగం జరుగుతోంది.
నిజానికి ఈ బీజేపీ/ఆరెస్సెస్ వెస్ట్‌ఫాలియా తరహా జాతి దురహంకారపూరితమైన జాతీయతను భారతీయ ప్రత్యేక పరిస్థితులకు వర్తింపచేయటానికి పూనుకుంటున్నాయి. భారత స్వాతంత్రోద్యమం సమ్మిళిత ప్రజాతంత్ర జాతీయత భావనను ముందుకు తెచ్చేంత వరకూ, ఈ తరహా వెస్ట్‌ఫాలియన్ జాతి దురహంకారపూరిత జాతీయవాదమే చెలామణిలో ఉంది. ఈ తరహా జాతీయవాదం – దురహంకారం, అసహనపూరిత ఉన్నత్త జాతీయవాదం- భారత జాతీయోద్యమం ముందుకు తెచ్చిన భారతీయత భావనకు పూర్తి విరుద్ధమైనది. జాతీయోద్యమంలో రూపొందిన భారతీయత భావన ఓ నూతన తరహా రాజకీయ మనస్తత్వాన్ని నిర్మించింది.
ఆరెస్సెస్/బీజేపీలకు ఈ భారతీయత భావన కేవలం ఓ అధిభౌతిక భావనే. ఆధునిక భారతీయత భావనకు ఊపిరి పోసిన విశాల ప్రజా భాగస్వామ్యంతో సాగిన జాతీయోద్యమాన్ని తృణీకరించి హిందూ జాతీయతే సహజమైన వాస్తవికతగా పునరుద్ఘాటిస్తున్నాయి ఆరెస్సెస్/బీజేపీలు.
ఈ జాతీయోద్యమమే వెస్ట్‌ఫాలియన్ తరహా జాతీయత భావన స్థానంలో భారతీయ జాతీయ భావనను తెరమీదకు తెచ్చింది. వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలోనే భారతీయత భావన (సమ్మిళిత జాతీయవాదం) వేళ్లూనుకున్నది. ఈ విషయాన్ని వక్కాణిస్తూ అకీల్ బిల్ గ్రామీ “భారత జాతీయోద్యమపు చివరి మూడు దశాబ్దాల్లో విశాల జనబాహుళ్యం ఉద్యమ పథంలోకి వచ్చింది. ఈ మూడు దశాబ్దాల్లో ప్రజలభాగస్వామ్యం ఉద్ధృతం అయ్యింది. సమ్మిళిత ప్రత్యామ్నాయ జాతీయత భావన ఈ ప్రజానీకాన్ని ఉత్సాహపర్చకపోతే ఈ స్థాయి భాగస్వామ్యం సాధ్యమయ్యేది కాదు” అన్నారు. (సోషల్ సైంటిస్ట్, నవంబరు 1-2, 2011)
భాష, మతం, సంస్కృతి, జాతులపరమైన భారత దేశపు వైవిధ్యం ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లోని వైవిధ్యం కంటే విస్తారమైనది. వైవిధ్యమైనది. లోతైనది.
అధికారికంగానే దేశంలో 1618 భాషలు, 6400 కులాలు, ఆరు ప్రధానమైన మతాలు ఉన్నాయి. మానవ పరిణామ క్రమంలో నిర్ధారించబడిన ఆరు రకాల మతాలకు భారతదేశం ఆలవాలమైందని చాలా కాలం క్రితమే నమోదైంది. ఈ ఆరు ప్రధాన మతాల్లో నాలుగు మతాలు ఈ మట్టిలో పుట్టినవే. ఇన్ని వైవిధ్యాలున్నా ఒకే రాజకీయ యూనిట్‌గా భారతదేశ పరిపాలన సాగుతోంది.
భారత వైవిధ్యానికి మరో ఉదాహరణ ఏమిటంటే, దేశంలోని వివిధ ప్రాంతాలు 29 రకాల పండగలను ప్రధానమైన పండగలుగా జరుపుకుంటున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని ధార్మిక సెలవుదినాలు భారతదేశంలో ఉన్నాయి.
బ్రిటిష్ పాలన కాలంలోనే ఈ వైవిధ్యభరితమైన భారతదేశం పరిపాలనపరంగా ఏకఖండంగా అవతరించిందని వాదించేవాళ్లు అదే బ్రిటిష్ పాలకుల కారణంగానే దేశం మూడు ముక్కలైందనీ, ఆ క్రమంలో లక్షలాదిమంది అశువులుబాసారని మర్చిపోతున్నారు.
బ్రిటిష్ వలసలుగా ఉన్న పాలస్తీనా, సైప్రస్, ఆఫ్రికా దేశాలన్నీ వలస పాలన నాటి గాయాలను నేటికీ మాన్పుకోలేకపోతున్నాయి. బ్రిటిష్ పాలకులు వదిలిన వలసవాద వారసత్వం అది. అఖండ భారత ప్రజల పోరాటమే ఈ వైవిధ్యాలన్నింటినీ ఏకతాటిమీదకు తీసుకొచ్చి 660 సంస్థానాలను సైతం లొంగదీసుకునేలా చేసింది. అఖండ భారత అస్తిత్వానికి, చైతన్యానికి పునాదులు వేసింది. భిన్న దృక్ఫథాల మధ్య ఘర్షణ భారతీయత భావన విశాల భారత ప్రజానీకం సాగించిన స్వాతంత్రోద్యమ పర్యవసానం.
స్వతంత్ర భారతదేశపు స్వభావం ఎలా ఉండాలి అన్న అంశంపై 1920 దశకం నుండీ మూడు భిన్న దృక్ఫధాల మధ్య భావజాల రంగంలో సాగిన పోరాట ఫలం. స్వాతంత్య్రపోరాటంలో అగ్రభాగాన నడిచిన కాంగ్రెస్ భారత దేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చూడాలని ఆకాంక్షించింది. ఈ లక్ష్యాన్ని స్వాగతిస్తూనే ఈ రాజకీయ స్వాతంత్ర్యాన్ని ప్రతి భారతీయుడికి ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యంగా మల్చాలని, తద్వారా స్వతంత్ర భారతదేశాన్ని సోషలిస్టు భారతంగా మార్చాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
ఈ రెండు దృక్ఫధాలకూ పూర్తి వ్యతిరేకమైనది మూడో దృక్ఫథం. స్వతంత్ర భారతదేశం మెజారిటీ మతాధారిత దేశంగా ఉండాలన్నది అవగాహన. ఈ అవగాహన అటు ఆరెస్సెస్ ద్వారానూ, ఇటు ముస్లిం లీగ్ ద్వారాను ముందుకు వచ్చింది.
ఆరెస్సెస్ హిందూరాష్ట్ర వాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తూ జరిగిన దేశవిభజన ద్వారా ముస్లిం లీగ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. దేశవిభజన వ్యూహాన్ని రూపొందించి, సమర్ధించి అమల్లోకి తెచ్చింది బ్రిటిష్ వలస పాలకులు. ఈ కుట్ర పర్యవసానాలు నేటికీ దేశాన్ని వేధిస్తూనే ఉన్నాయి.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతోంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.