
మే 9న తెల్లారేసరికి కేంద్ర ప్రభుత్వం the wire.in పాఠకులు చదవడానికి వీలులేకుండా యాక్సెస్‌ను నిషేధించింది. దీనిపై స్పందించిన the wire.in ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అయితే దేశానికి వాస్తవాలు యధాతథంగా తెలియజేయాల్సిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను అడ్డుపెట్టుకొని the wire.in వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా పాఠకులకు చేరుకోకుండా నిషేధించింది. తర్వాత 9వ తేదీ సాయంత్రం the wire.in వెబ్సైట్ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగిందన్నదే దేశంలో నిష్పాక్షిక మీడియా ఎదుర్కొంటున్న సమస్యలకు దర్పణం పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 25 మంది భారతీయ పర్యాటకులను, ఒక పర్యాటక సహాయకుడిని కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో గత మూడు వారాలుగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. కేంద్ర ప్రభుత్వం పలు దఫాల సంప్రదింపులు, అఖిలపక్ష సమావేశం, త్రివిద దళాధిపతులతో భారతీయ సైన్యం సన్నద్ధత గురించి సమీక్షలు జరిపిన తర్వాత మే 7 తేదీ వేకువ జామున పాక్- పాక్ ఆక్రమిత భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడులలో శిథిలమైన ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, స్థావరాలకు సంబంధించిన ఛాయా చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ దాడులలో భారతదేశం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ అమెరికా కేంద్రంగా నడిచే సీఎన్ఎన్ టీవీ ఛానల్ మరో వార్తను ప్రసారం చేసింది. ఆ వార్త ప్రకారం భారతదేశం ఏడవ తేదీ వేకువ జామున ప్రయోగించిన క్షిపణులను మోసుకెళ్తున్న రాఫెల్ యుద్ధ విమానాన్ని పాక్ సేనలు నేలకూల్చాయన్నది సీఎన్ఎన్ కథనం. ఇదే కథనాన్ని the wire.in కూడా పునఃప్రచురించింది. ఈ వార్త కారణంగా the wire.in వెబ్‌సైట్‌ను నిషేధిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం the wire.in సంపాదక బృందానికి తెలియజేసింది. తొమ్మిదవ తేదీ సీఎన్ఎన్ ఈ కథనాన్ని తన వెబ్సైట్ నుంచి తొలగించింది. తదనుగుణంగా the wire.in కూడా ఈ కథనాన్ని వెబ్సైట్ నుంచి ఉపసంహరించింది.
సీఎన్ఎన్ కథనం వివరాలు లోకానికి తెలియకూడదన్న లక్ష్యంతో the wire.inను పాఠకులకు చేరనీయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కనీసం ఈ వార్తను తొలిగించేంత వరకు ఆంక్షలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులు పత్రికా స్వేచ్ఛా- స్వాతంత్య్రాలకు సంబంధించిన ప్రమాణాల రీత్యా ద వైర్ సంపాదక మండలికి అంగీకారం కాకపోయినా అమలు చేసింది. ఆ తర్వాతనే మే 9న ఉదయం నుంచి పాఠకులకు నిలిచిపోయిన యాక్సెస్ సాయంత్రం పునరుద్ధరించబడింది. ఈ మేరకు మే 9 రాత్రి 10:30కు ద వైర్ సంపాదక మండలి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ సమయంలో ఆయుధాలు యుద్ధ సామాగ్రి తయారీ కంపెనీల సామర్ధ్యాలు, వాటి మార్కెట్ షేర్లు సంగతి ఎలా ఉన్నా ఒకసారి కదన రంగం అంచున నిలిచిన తర్వాత దేశ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడడంతో పాటు దేశ ప్రజానికాన్నీ కాపాడడం కూడా ప్రభుత్వాల బాధ్యత. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ బాధ్యతల నిర్వహణలో సహకరించేందుకు వీలుగా the wire.in తన కథనాన్ని ఉపసంహరించుకున్నది. ఏదిఏమైనా ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా the wire.in పాఠకులకు చేరనీయకుండా యాక్సెస్ నిరోధిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయనున్నట్లు ద వైర్ సంపాదక మండలి వెల్లడించింది.
రాఫెల్ మార్కెట్ క్రెడిబులిటి వర్సెస్ భారత జాతీయ భద్రత..
ఫోర్స్ మ్యాగజైన్ ప్రధానంగా దేశవిదేశాలలో రక్షణ రంగానికి సంబంధించిన వార్తలు, కథనాలు పాఠకులకు అందిస్తుంది. ఆ పత్రిక సంపాదకులు ప్రవీణ్ సాహ్నీ కరణ్ థాపర్‌తో మాట్లాడుతూ సీఎన్ఎన్ కథనాన్ని కూడా ప్రస్తావించారు. దాంతో పాటు ఈ వార్తా ప్రచురించిన తర్వాత అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో రాఫెల్ కంపెనీ షేర్ల ధర పడిపోయిందని కూడా ఆయన పేర్కొన్నారు. 2018 నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు దేశ రాజకీయ రంగాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రముఖ పౌరమేధావి ప్రశాంత్ భూషణ్‌లు ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సీబీఐ అప్పటి డైరెక్టర్‌కు ఫిర్యాదు కూడా అందజేశారు. అప్పట్లో మీడియాల్లో వచ్చిన వార్తల ప్రకారం అప్పటి సీబీఐ డైరెక్టర్ ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారని బయటకు తెలియడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా సీబీఐ కార్యాలయాన్నే ముట్టడించి, సీబీఐ డైరెక్టర్‌ను రాజీనామా చేయించి, తాత్కాలిక డైరెక్టర్‌ను నియమించిన సంగతి కూడా పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరింత మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడం మోడీ రెండవసారి ప్రధాని కావడంతో రాఫెల్ వివాదం అటకెక్కింది. ఈ లోగా రాఫెల్‌తో భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన పత్రాలు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చోరీకి గురైనట్టు కూడా వార్తలు వచ్చాయి.
అయితే భారత్- పాకిస్తాన్ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత దేశం ఇజ్రాయిల్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగిస్తే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వార్తా కథనాల ప్రకారం పాకిస్తాన్ చైనా, టర్కీల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ సామాగ్రీ, ప్రావిణ్యాలను ఉపయోగిస్తోంది. వెబ్సైట్ నుంచి తొలగించిన సీఎన్ఎన్ కథనం ప్రకారం చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారత దేశం ప్రయోగించిన రాఫెల్ యుద్ద విమానాన్ని పాకిస్తాన్ నేలకూల్చింది. దీంతో అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో రాఫెల్ సామార్ధ్యం కంటే చైనా యుద్ద విమానాల సామార్థ్యం మెరుగైనదనే చర్చ మొదలైందని ఫోర్స్ పత్రికా సంపాదకులు ప్రవీణ్ సాహ్నీ అభిప్రాయపడ్డారు.
పౌర సమాజం- ప్రముఖుల స్పందన..
the wire.in పాఠకులకు చేరనీయకుండా నియంత్రణలు విధించడంపై పలువురు ప్రముఖులు, పలు పార్టీలు స్పందించాయి. కీలకమైన సంక్షోభిత సమయాలలో మీడియా గొంతునొక్కడం ప్రజాస్వామ్యానికి క్షేమదాయకం కాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీపీఎం ఓ ప్రకటనలో ఆపరేషన్ సింధూర్ గురించి దేశవ్యాప్తంగా భయాందోళనలు, అపోహలు కలిగించే వార్తా కథనాలు ప్రసారమవుతున్న ప్రస్తుత సమయంలో నిష్పాక్షిక వాస్తవాలను పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్న ద వైర్లాంటి ప్రామాణిక వార్తా సంస్థలను పాఠకుల దరిచేరనీయకపోవడం పత్రికా స్వేచ్ఛకు విఘాతమని తెలిపింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విడుదల చేసిన స్పందనలో పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో భావావేశాలు రెచ్చగొట్టేందుకు ప్రభుత్వ స్వాధీనంలోని దూరదర్శన్‌తో సహా అన్నీ ప్రసారమధ్యమాలు పోటీ పడుతున్నాయని, ఈ పోటీలలో భాగంగా కొన్ని సందర్భాలలో అపోహలు- అవాస్తవాలు కూడా వార్తలుగా చలామణి అవుతున్నాయని ద వైర్లాంటి అంతర్జాతీయ గుర్తింపు గౌరవం కలిగిన వార్తా సంస్థల నోరునొక్కడానికి ప్రయత్నించే బదులు అపోహలు- అవాస్తవాల ప్రసారాలను నియంత్రించి ప్రజలు భయాందోళనకు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.


ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రేరేపిత భావోద్వేగాలే వార్తలుగా కొందరు చలమణి చేస్తున్నారని అమర్ అన్నారు. వందల సంఖ్యలో టీవీ ఛానళ్లు, వేల సంఖ్య యూట్యూబ్ ఛానల్లు, లక్షల సంఖ్యలో సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ క్రతువులో భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. ఇటువంటి వార్తలు, కథనాలకు భిన్నంగా దౌత్య, యుద్ధ, జాతీయ భద్రతా విషయంలో జాతీయ- అంతర్జాతీయ నిపుణుల సహకారంతో కేవలం వాస్తవాలు, వాస్తవాధిరత విశ్లేణలు మాత్రమే పాఠకులకు చేరవేస్తున్న the wire.inను లక్ష్యంగా చేసుకోవటం గర్హనీయమని పేర్కొన్నారు.

the wire.in వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడంపై ప్రెస్ క్లబ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఇండియా వుమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ అసోసియేషన్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఇండియా జర్నలిస్ట్స్ యూనియన్, వర్కింగ్ న్యూస్ కెమరామ్యాన్స్ అసోసియేషన్స్ సంతకాలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది. ఒక వేళ భారత ప్రభుత్వం నిజంగా ఈ నిషేధాన్ని ఆదేశించి ఉంటే, ఇది భారతదేశ పత్రికా స్వేచ్ఛకు తీవ్రమైన వ్యతిరేక చర్య అవుతుందని తెలిపింది. ద వైర్లాంటి స్వతంత్ర వార్తా మాధ్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యనైనా తాము వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నది. దేశంలో ద వైర్‌తో పాటు వివిధ వార్తా సంస్థలను బ్లాక్ చేయడాన్ని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.
స్వతంత్ర డిజిటల్ వార్తా సంస్థ scroll.in ప్రచురించిన కథనంలో పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో ద వైర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు మక్తూబ్ మీడియా, ద కశ్మీరియత్, ఫ్రీ ప్రెస్ కశ్మీర్, ముస్లిం అనే హ్యాండిల్స్‌తో ఉన్న వెబ్సైట్ హ్యాండిల్స్లను కూడా బ్లాక్ చేసింది. వీటిలో ముస్లిం అనే పేరుతో ఉన్న వెబ్సైట్ అమెరికా కేంద్రం నుంచి నడుస్తోంది. ట్విట్టర్(ఎక్స్), ఇన్‌స్టాగ్రాంలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందల సంఖ్యలో వార్తలను అందించే వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టుగా తెలిపాయి. ఈ పరిణామాల నడుమ డీజీపబ్, స్వాతంత్ర వార్తా సంస్థలు, విలేకరులతో కూడిన సంఘం the wire.inను బ్లాక్ చేయడాన్ని పత్రికా స్వాతంత్య్రంపై జరుగుతున్న దాడిగా వర్ణించింది. దేశం సంక్లిష్ట సమయంలో ఉందని ఇటువంటి సందర్భంలో స్వతంత్ర- హేతుబద్ధంగా ఆలోచనలను అడ్డుకోవడం సరికాదని, అత్యవసర పరిస్థితి యుద్ధం తెచ్చిపెడుతున్న భయోత్పాతం స్వతంత్ర జర్నలిజం నోరునొక్కడం కారణాలు కాకోడదని అభిప్రాయపడింది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో వార్తా సంస్థలు, విలేకరులు నిర్వహిస్తున్న వెబ్సైట్లను ఏకపక్షంగా మూసివేయడం, బ్లాక్ చేయడం, యాక్సెస్ నియంత్రించడం తమకు ఆమోదనియం కాదని, అటువంటిదేదైనా చేయాల్సి వస్తే చట్టసహజ న్యాయ సూత్రాల ప్రకారం వ్యవహరించాలని అభిప్రాయపడింది.

మరోవైపు ప్రపంచ ప్రభుత్వాల- వ్యవహారాలు అనే శిర్షికతో ట్విట్టర్ నడుపుతున్న తన పేజీలో భారత ప్రభుత్వం ఎనిమిది వేల ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయమని కోరిందని, ఈ విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటించని పక్షంలో ఆ కంపెనీ, ఆ కంపెనీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించినట్టుగా ఆ సంస్థ తెలిపింది. ఈ లేఖకు స్పందనగా ఎలన్ మాస్క్ నాయకత్వంలో ఉన్న కంపెనీ ఎంపిక చేసిన వైబ్సైట్లు సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో మాత్రమే వీక్షకులకు అందుబాటులో లేకుండా చూస్తామని, భారత ప్రభుత్వం హెచ్చరికలు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.