
ఆపరేషన్ సింధూర్ మొదలవగానే భారతదేశపు టెలివిజన్ ఛానళ్లు అనూహ్యమైన స్థాయిలో ప్రచార యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధంలో పనిచేసే సైన్యం రోజువారి టీవీ చర్చలలో కనిపించే రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులు నోరు వేసుకుని కేకలు వేసే విశ్లేషకులు కాదు. వారి స్థానంలో తమకు తాముగా రక్షణ రంగా నిపుణులుగా భద్రతా వ్యవహారాల విశ్లేషకులుగా చెప్పుకుంటున్న వాళ్లు, పదవీ విరమణ చేసిన సైనిక అధికారులు తెర మీదకు వచ్చారు.
ఈ స్వయం ప్రకటిత నిపుణులు, విశ్లేషకులు, అనుభవజ్ఞులు జరిపిన చర్చల్లో దేశానికి కొత్తగా తెలిసిన విషయాలు ఏమీ లేవు. పైగా అర్థంపర్థం లేని చర్చలు ఆకాశాన్ని అంటాయి. నాతో సహా చాలా మంది పదవీ విరమణ చేసిన చాలా కాలం తర్వాత టీవీ స్టూడియోల నుంచి పిలుపులు అందుకొని వ్యాఖ్యాతల ముందు ప్రత్యక్షమయ్యారు.
అప్పటివరకు అల్మారాలలో అణిగిమణిగి ఉన్న మూడు ముక్కల సూట్లు దుమ్ము దులుపుకొని బయటకు వచ్చాయి. మర్యాదతో కూడిన ప్రవర్తన కాస్త టీవీ వ్యాఖ్యాతల- పానెల్ సభ్యుల కేకలు, అరుపుల మధ్య మర్యాదను విస్మరించాయి. ఈ వ్యాఖ్యాతలందరూ ఇచ్చే పిలుపులు ఏంటంటే, పాకిస్తాన్‌ను నాశనం చేయండి, ఆక్రమిత కశ్మీర్‌ని వెనక్కి తీసుకోండి వంటి భీకరింపులు. మరి కొంతమంది మరొకడుగు ముందుకేసి శత్రుదేశం సైన్యాధిపతులందరూ భయంతో బంకర్లలో దాక్కున్నారని కూడా చెప్పారు. ఇంకొంతమంది పాకిస్తాన్‌లోని ప్రముఖులందరూ తమ కుటుంబాలను ప్రత్యేక విమానాలు ఎక్కించి ఇతర దేశాలకు సాగనంపారని కూడా ధ్రువీకరించారు. ఈ ధ్రువీకరణకు సంబంధించిన ఆధారమేమిటో ఎవరికి తెలియదు.
టీవీ స్టూడియోలో ర్యాంకులు వేసిన వారందరికీ గౌరవ హోదాలు దక్కకపోవచ్చు కాని టీవీ ఛానళ్లకు అవసరమైన టీఆర్పీ కమాండర్ ఇన్ చీఫ్ అన్న బిరుదులు అయితే దక్కుతాయి.
ఒకానొక టీవీ స్టూడియోలో జరిగిన చర్చల్లో పాల్గొన్న మేజర్ హోదాలో రిటైర్ అధికారి ఒకరు పాకిస్తాన్‌కు చెందిన సైన్యాధికారులపై ప్రయోగించిన దుర్భాషలు, పడికట్టు మాటలు చివరకు బ్రహ్మోస్ క్షిపణులను సైతం సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. నిమ్మకాయలు సైతం నిలబడి పోయే అంత పెద్ద మీసాలు ఉన్న మాజీ సైనిక అధికారి మరొకరు కాల్పుల విరమణను అంగీకరించినందుకు దేశ రాజకీయ నాయకత్వం మొత్తాన్ని దుయ్యబట్టారు. ప్రపంచ భౌగోళిక చిత్రపటం నుంచి పాకిస్తాన్‌ను తుడిచేయాలని రంకెలు వేశారు. ఈ వార్తలు విన్న తర్వాత మొట్టమొదటి ప్రపంచ భౌగోళిక చిత్రపటాన్ని తయారు చేసిన మెర్కాటర్ కూడా సమాధిలో నవ్వుకుంటూ పొర్లి ఉంటాడు.
మధ్యమధ్యలో వార్త ఛానళ్ళు ప్రజలకు వార్తలు కూడా చేరవేశాయి. అందులో ఒక వార్తా ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చారు అని. బహుశా ప్రధానమంత్రి రోజు కార్యాలయానికి వస్తారని ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ అయి ఉండొచ్చు. మరి కొన్ని చానళ్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అందరూ యూనిఫారం వేసుకొని యుద్ధ రంగంలో దిగటానికి సన్నద్ధులై ఉన్నారని చెప్పింది.
పరిస్థితులను మరి ఎక్కువగా ఊహించుకుంటున్నామాని ఒక టీవీ ఛానల్ స్టూడియోలో జరిగిన చర్చలో నేను ప్రశ్నించగానే నా మైకు ఆపేశారు.
మరో హిందీ ఛానల్ పహల్గాం ఘటన అనంతర పరిణామాల కవరేజ్‌ని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఆ ఛానల్లో స్టార్ యాంకర్ స్టూడియోలోనే యుద్ధ సన్నివేశాన్ని రూపొందించి ప్రసారం చేశారు. రక్షణారంగ నిపుణులుగా అవతారం ఎత్తిన కొందరు వ్యాఖ్యాతలు, జూనియర్ కమాండ్ కోర్స్‌కు హాజరయ్యే యువ కెప్టెన్లను అనుకరిస్తూ తమకు తోచిన వ్యూహాత్మక యుద్ధ తంత్ర ప్రతిపాదనలపై చర్చకు దిగారు. ఆధునిక యుద్ధ తంత్రం ఫ్రెష్ అన్న యుద్ధ కాలం నాటి వ్యూహాలను ఆచరణలను అధిగమించి ముందుకు చాలా దూరం వెళ్ళింది అన్న వాస్తవాన్ని గుర్తించటానికి ఈ కృత్రిమ యుద్ధ వ్యూహాన్ని నిపుణులు ఎవరు సిధ్ధంగా లేరు. ఇక్కడ వారికి కావాల్సింది విశ్లేషణ కాదు ప్రదర్శన.
అదృష్టం కొద్ది నాకు ఈ చర్చల నుంచి విరామం దొరికింది. నా అనుభవాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తిగా ఉన్న మరొక ఛానల్ ఇదే సమయంలో నన్ను చర్చలకు ఆహ్వానించింది. ఆ టీవీ స్టూడియోలో యాంకర్‌గా ఉన్న వ్యక్తి సైనిక జనరల్ అవతారమెత్తి మొత్తం సైనిక ఘర్షణను భారతదేశం విజయం సాధించేంతవరకు దశలవారీగా చేపట్టాల్సిన చర్యలు పాటించాల్సిన యుద్ధ వ్యూహం ప్రయోగించాల్సిన సాయుధ సంపత్తి వంటివన్నీ వివరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టీవీ ఛానల్ వార్ రూమ్‌లలో ర్యాంకులు వేస్తున్న కృత్రిమ యుద్ధ తంత్ర నిపుణులు ఎవరు కూడా మే ఏడవ తేదీ వేకువజామున భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య గురించి కనీసం ఊహించను కూడా ఊహించలేకపోయారు.
సౌండ్ బాక్స్‌లు బద్దలయ్యేలా రంకెలు వేసిన అన్ని టీవీ ఛానల్లో ఉమ్మడిగా కనిపించే అంశం ఒక్కటే. వాళ్లలో ఏ ఒక్కరికి ప్రసారం చేసే విషయాలను పునర్నిర్ధారించుకుందామనే కనీస ప్రయత్నం లేకపోవడం ఈ ఉమ్మడి లక్షణం. కకావికలమవుతున్న పాకిస్తానీ సైన్యాలు, భారత్ సేనల హస్తగతమవుతున్న పాకిస్తానీ నగరాలు, పేలిపోయిన నవకాశ్రయాలు వంటి వార్తలన్నీ కేవలం పేరు చెప్పటానికి సిద్ధం కాని అధికారులు ఇచ్చిన సమాచారంగా చలామణి చేసుకుంటూ వచ్చారు. మరొక ఛానల్ అయితే మరో అడుగు ముందుకు వేసి భారత సైన్యాలు పాకిస్తాన్ భూభాగంలో ప్రవేశించాయని ధ్రువీకరించింది. ఎటు నుంచి ప్రవేశించారో మాత్రం చెప్పలేదు.
ఈ టీవీ ఛానళ్ల చర్చల్లో భారత సైనిక రహస్యాలను అనూహ్యంగా భద్రపరిచారు. విలేకరులందరూ రణక్షేత్రం నుంచి వార్తల అందించాలని ఆదేశించారు. అదే సమయంలో సదరు విలేకరులు ఆ రణక్షేత్రంలో ఎక్కడున్నారో చెప్పకూడదని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒక టీవీ వ్యాఖ్యాత తమ విలేకరి గురించి ప్రస్తావిస్తూ నీలేష్ బారుమరకు దగ్గరలో ఉన్న ప్రాంతం నుంచి వార్తలు అందిస్తున్నారు. మీరేం చూశారో చెప్పండి, మీరు ఎక్కడున్నారో మాత్రం చెప్పొద్దని అడిగారు. మధ్య మధ్యలో నాటకీయ ప్రభావం కోసం విమానాల మూతలు సైరన్లను కూడా టీవీ స్టూడియోలో వినిపించారు. గందరగోళాన్ని కూడా సృష్టించారు. చివరకు ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఈ రకమైన వార్తా కథనాల ప్రసారాన్ని నిలువరించాల్సి వచ్చింది.
మీడియా ఒక విషయాన్ని మాత్రం యధాతథంగా ప్రజెంట్ చేసింది. అదే ప్రజలలో నెలకొన్న ఉద్విజ్ఞత, భయాందోళనలు. ఈ భయాందోళనలు సరిహద్దులు ఇరువైపులా సమానంగానే విస్తరించి ఉన్నాయి. పాకిస్తాన్ భూమండలం నుంచి మాయమవుతోందని సీమాంతర వీక్షకుల కోసం చెప్తే, భారతీయ వీక్షకుల కోసం భారతదేశంలోని అనేక నగరాలు పాక్ వైమానిక దాడులకు గురవుతున్నాయని నగరోత సైనిక స్థావరం పై ఆత్మహుతి దళాలు దాడి చేశాయని చెప్తూ సరిహద్దులకు ఇరువైపులా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడానికి భారతీయ టీవీ ఛానళ్లు శాయాశక్తుల ప్రయత్నం చేశాయి.
ఈ నాలుగు రోజులు టీవీ ఛానళ్లు కలిగించిన వినోదం మాత్రం అపరిమితమైన అవధులు లేని వినోదం. చాలాకాలం టీవీకి దూరంగా ఉన్న నేను కూడా టీవీ ఆన్ చేయడానికి ఉబలాటపడ్డాను. వాళ్ళు ఏదో చెప్తే నేనేదో కొత్తగా తెలుసుకుందామని మాత్రం కాదు. మనసారా నవ్వుకోడానికి మాత్రమే. ఆపరేషన్ సింధూర్ కవరేజీ 2025లో అత్యంత జయప్రదంగా సాగిన కామెడీ సిరీస్ అని చెప్పొచ్చు.
ప్రస్తుతం కాల్పుల విరమణ ప్రకటించడంతో ఈ ఛానెళ్లలలో జరిగే చర్చలన్నింటికీ తెరపడింది. అంటే మీడియా తమ రోజువారి రాజకీయ కక్ష సాధింపు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, గదిలో పైకప్పు లేచిపోయేంత స్థాయిలో వాదోపవాదాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
అప్పటివరకు టీవీలు సాగించే యుద్ధ విన్యాసాల నుంచి బతికి బట్ట కట్టిన మనం చాపల సర్దుకుని టీవీ స్క్రీన్లపై రాబోయే కాలంలో జరగబోయే యుద్ధ విన్యాసాల కోసం ఎదురుచూస్తూ కూర్చుందాం.
సంజీవ్ కృష్ణ సూద్
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత సరిహద్దు భద్రతా దళాల అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.