
భారీ ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు కేంద్రమైన మోడీ మీడియా ఆర్భాటానికి కాలం చెల్లినట్లనిపిస్తోంది.
మోడీ, ట్రంప్‌లు వ్యవహార శైలి చూస్తే ఇద్దరు ఇద్దరే. మాటల మరాఠీలు. నాయకులు తమదైన వ్యాఖ్యానాన్ని రూపొందించటం, ప్రజలవద్దకు తీసుకెళ్లటం, వాళ్లను నమ్మించటంలో సిద్ధహస్తులన్న విషయం స్పష్టమవుతుంది. కాకపోతే ఈ ప్రయత్నంలో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేయటం వల్లనే వాస్తవాలు ప్రజల దృష్టికి రాకుండా పోతున్నాయి.
ట్రంప్ మొదటి దఫా అధ్యక్ష పదవీ కాలంలో అధ్యక్షభవనం కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించిన మిఖాయెల్ వూల్ప్ ‘ఫైర్ అండ్ ఫ్యూరి’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ మార్చి 10న ఓ ఆడియో కార్యక్రమం(పోడ్ కాస్ట్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ తన తొలి మొదటి అధ్యక్ష పదవీ కాలంలో పతాక శీర్షికలకు ఎలా ఎక్కారో వివరించారు. నిజం చెప్పాలంటే మోడీ, ట్రంప్‌లు ఇద్దరూ మాటల మరాఠీలే. ఈ మాటల విన్యాసాల వెనక రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్న విషయాన్ని కప్పిపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ గత దశాబ్దకాలంలో స్తబ్ధతకు, దౌత్యపరంగా ఒంటరిపాటుకూ, సామాజిక అశాంతికీ లోనైంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు విప్లవాత్మక పరిష్కారాలు చూపిస్తామని అధికారానికి వచ్చిన మోడీ ప్రభుత్వం గత పదేళ్లల్లో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను మరింత అగాథంలోకి నెట్టేశాయి.
నిరుద్యోగం 8.1 శాతానికి చేరింది. యువతకు ఉపాధి అవకాశాలు కరువవటంతో వయోజనుల్లో నిరుద్యోగం పది రెట్లు పెరిగింది. దేశంలో అత్యధిక శ్రామిక జనావళికి పని కల్పిస్తున్న వ్యవసాయరంగం తన సామర్ధ్యానికి తగినట్లుగా ఉత్పత్తి చేయలేకపోతోంది. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది సూచిస్తోంది. కార్పొరేట్ లాభాలు ఆకాశాన్నంటుతుంటే నిజవేతనాలు పాతాళానికి జారిపోతున్నాయి.
మోడీ 2016లో దేశానికి ఇచ్చిన నోట్ల రద్దు వంటి షాక్ ట్రీట్మెంట్లతో పరిస్థితి మరింత దిగజారింది. నోట్ల రద్దు, అస్తవ్యస్తంగా మొదలైన జీఎస్టీలు కలిసి దేశంలో చిన్నమధ్యతరహా వ్యాపారులను దివాళాతీయించాయి. రైతాంగం దివాళా తీసింది. రిజర్వు బ్యాంకు నిర్దేశిత స్థాయిని మించి ధరలు రెక్కలు లేకుండానే ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నానాటికీ కొత్త లోతులు చూస్తోంది.
విదేశీ మదుపుదారులు భారతీయ మార్కెట్ల నుండి చెప్పా పెట్టకుండా వాకౌట్ చేస్తున్నారు. ఎందుకు ఏమిటి, ఎలా వాళ్లను ఆపాలి అన్న విషయాలు పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం నిరంతరం పతాక శీర్షికల్లో కనిపించటానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక సమస్య వేళ్లకు పట్టిన చెదలు వదిలించటానికి ప్రయత్నించకుండా కృత్రిమ చెట్లు నాటి వనమంతా రంగులమయమని చూపించటానికి కష్టపడుతుంది.
మోడీ ప్రభుత్వం ఎన్నో వాగ్ధానాలను గాలికొదిలింది. ఫలితంగా ప్రజల్లో నిస్తేజం పేరుకుపోయింది. 2022 నాటికి వంద స్మార్ట్ నగరాలు నిర్మించాలన్న లక్ష్యం ఎండమావిగానే మిగిలింది. ప్రయత్నాలు ఇంకా ప్రణాళికలు రూపొందించే పనిలో కాగితాలు దాటి కార్యాచరణ దశకు చేరలేదు. అందమైన నగరాలు నిర్మాణానికి నిధులు లేవు. లే అవుట్లు అంతకన్నా సిద్ధం కాలేదు. 2019 నాటికి ప్రయాణం ప్రారంభించాల్సిన బుల్లెట్ రైలు ఇంకా పట్టాలెక్కలేనే లేదు. 2022 నాటికి ఇంటింటికీ కరెంట్ సరఫరా అన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు షరామామూలుగానే ఉన్నాయి. ఇంకా గంగా నదిని శుభ్రం చేయటం సాగుతూనే ఉంది. కాలుష్యం మాత్రం తగ్గటం లేదు.
అయినా, సంగం(త్రివేణీ సంగమం) వద్ద నీరు ఎంత పరిశుభ్రంగా ఉందో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఇటువంటి పరిస్థితులు గమనించినప్పుడు కేవలం పాలకులు వాస్తవిక సమస్యలు గాలికొదిలి పతాక శీర్షికలకే పరిమితమై పత్రికల్లో ఫోటోలతో సంబరాలు చేసుకుంటుంటే దేశంలో అన్ని వ్యవస్థలూ అథఃపాతాళానికి చేరతాయి. అది అమెరికా అయినా. భారతదేశమైనా. అందుకే నిన్న మొన్నటి వరకూ మోడీని పరమాత్మ స్వరూపంగా భావించిన భక్తులు సైతం ఈ వైఫల్యాల సెగ వాళ్ల కుటుంబాల వరకూ వచ్చేసరికి ప్రశ్నించక తప్పటం లేదు.
సామాజిక రాజకీయ రంగాల్లో మోడీ నమూనా పాలన ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తోంది. నిరసన స్వరాల గొంతు నులమటానికి దేశ ద్రోహం కేసులు నమోదు కావటం ఈ కాలంలో పెరిగింది. 2010 తర్వాత అరస్టయి దర్యాప్తు ఎదుర్కొంటున్న 11,000 మందిని 2014 తర్వాత దేశ ద్రోహపు చట్టం కింద నిందితులుగా పరిగణించటం మొదలైంది. నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపటం ఎంత వేగంగా పెరిగిందో ప్రభుత్వ విచక్షణాపూరిత చర్యలపై పార్లమెంట్ పర్యవేక్షణ అంతే వేగంగా తగ్గిపోయింది. ఎన్నో బిల్లులు పార్లమెంట్లో చర్చలకు నోచుకోకుండానే చట్టాలుగా అవతారమెత్తాయి. మోడీ నేతృత్వంలోని భారతదేశం కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయంగా కళంకితమయ్యాయి. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు, మానవహక్కుల విషయంలో మోడీకి అత్యంత సన్నిహితులైన మిత్రదేశాలే భారతదేశంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. ప్రత్యేకించి కశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు, పౌరసత్వ సవరణ చట్టాలు మోడీ పాలనలో మైనారిటీల పట్ల ఎంత వైమనస్యంతో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ఉదాహరణలుగా నిలుస్తాయి.
ఈ కాలంలో మోడీ ప్రజాదరణ తగ్గింది. 2024 లోక్‌సభ ఎన్నికలే దీనికి నిదర్శనం. పతనమవుతున్న ప్రజాదరణను నిలబెట్టుకోవడానికి బిజెపి ప్రభుత్వం నానాటికీ హిందూత్వ వాదాన్ని నెత్తుకెత్తుకొంటోంది. ఫలితంగా దేశంలో మతపరమైన వివక్ష, అల్పసంఖ్యాక తరగతుల అణచివేత, ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారం, దాడులు ఉధృతమయ్యాయి. ముల్లు ఆకు మీద పడ్డా, ఆకు ముల్లు మీద పడ్డా నష్టం ఆకుకే అన్నట్లు దేశంలో ఎక్కడ ఏమి జరిగినా కూలిపోతున్న ముస్లింల నివాసాలు, మూకదాడుల్లో ఆవిరతువున్న మైనారిటీల మాన ప్రాణాలు మోడీ కనుసన్నల్లో దేశంలో పేట్రేగుతున్న మతోన్మాద ధోరణులకు నిలువుటద్దాలు.
స్వతంత్ర పాత్రికేయ మాధ్యమాలు, సోషల్ మీడియాల ప్రాధాన్యత పెరుగుతున్న ఈ కాలంలో మోడీ ఆశించిన స్థాయిలో పతాక శీర్షికల్లో స్థానం దక్కటం లేదు. సాంప్రదాయక మీడియా ప్రజల్లో ఆదరాభిమానాలు కోల్పోయింది. దాంతో ఆయా పత్రికల్లో మోడీ ప్రభుత్వ విధానాలు ఎంత స్థానాన్ని ఆక్రమించినా అవి ప్రచార ప్రకటనల స్థాయిని మించి ఉండటం లేదు.
భారీ వాగ్దానాలు, రంగు రంగుల పతాక శీర్షికలు మోడీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. దేశీయంగా ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యలు, అంతర్జాతీయంగా దౌత్య సవాళ్లు ఎదుర్కోవటంలో ఘోరంగా విఫలమైన మోడీ ప్రభుత్వం దేశాన్ని ఈ సమస్యల నుండి దృష్టి మళ్లించటానికి బిజెపి ప్రభుత్వం మరింత ఘాటైన హిందూత్వను నెత్తికెత్తుకున్నది. దీంతో బిజెపి తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహం బిజెపికి దన్నుగా నిలిచి మౌలిక హిందూత్వ శక్తుల మద్దతు పొందుతుందేమో కానీ రోజువారీ జీవితంలో శ్రమనే నమ్ముకున్న కోట్లాదిమందిని ఈ మూఢత్వం దూరం చేసుకుంటుంది.
దేశం ఈ క్లిష్ట పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వ పాలన కబంధ హస్తాల్లో దేశంలోని 140 కోట్ల ప్రజల ధన, మాన, ప్రాణాలు చిక్కుబడిపోయాయి. ఈ ప్రభుత్వం అధికారానికి అతుక్కుపోయి ఉండటానికి అక్కరకొస్తున్న ఏకైక సాధనం మతోన్మాదం. హిందూత్వం.
సీమా చిస్తి
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.