
భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటన పై ది వైర్ ఎడిటర్ ఏం కే వేణు విశ్లేషణ
అగ్రదేశం అమెరికా అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను రూపొందిస్తుంది. ఇందులో బేషరతుగా భాగస్వామి అవుతామని భారత విదేశాంగమంత్రి జయశంకర్ ప్రకటించారు. వాణిజ్య యుద్ధంలో కరెన్సీ కీలకమైన ఆయుధమని జయశంకర్‌కు తెలుసు. అయినా కూడా ఇలా ప్రకటించడం ఘోరమైన తప్పిదం.
2025 మార్చి 7న ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో భారతీయ సంతతికి చెందిన వారితో సమావేశం జరిగింది. సమావేశంలో జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోని జయశంకర్ ట్విట్టర్(ఎక్స్)ఖాతాలో పంచుకున్నారు.
అంతర్జాతీయంగా వాణిజ్యంలో బహుళ కరెన్సీలు ఉండాలన్న విషయంపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని జయశంకర్ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా భారతదేశం అమెరికా ప్రతిపాదించిన అంతర్జాతీయ ద్రవ్య చట్రంలో భాగస్వామి అవుతుందని తేల్చి చెప్పారు. ట్రంప్ 2.0 హయాంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఎంత గందరగోళంగా ఉన్నాయో చూస్తున్నప్పుడు, కనీసం ట్రంప్ 2.0 నేతృత్వంలోని అమెరికా రూపొందిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య చట్రం గురించిన రూపురేఖలు గురించి భారత విదేశాంగ మంత్రికి ఏమైనా అవగాహన ఉందాన్న ప్రశ్న ఈ ప్రకటనలు చూసిన తర్వాత తలెత్తుతోంది.
రెండు దేశాల మధ్య దిగుమతి సుంకాల గురించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఇటువంటి ప్రకటన చేయటం అమెరికా ముందు సాగిలపడటం తప్ప మరోటి కాదు. చివరకు అమెరికా అంతరంగంలో ఏముందో తెలుసుకోవటం జయశంకర్‌కు కాదు కదా ఆయనకు బాస్‌గా ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపుడికి కూడా తెలీదు. ఈ సుంకాలపై చర్చలు ఏ ఒడ్డుకు చేరతాయో తెలీని పరిస్థితి. ఏ చిన్న స్థాయి దౌత్య అధికారి అయినా అంతర్జాతీయ వాణిజ్యంలో కరెన్సీ కీలకమైన బేరసారాల సాధనంగా ఉంటుందన్న విషయాన్ని అంగీకరిస్తారు. అయినా ఈ విషయంలో జయశంకర్ అమెరికాతో జరిగే వాణిజ్య చర్చల్లో ఏ మాత్రం పట్టుబడకుండా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధపడటం ఆశ్చర్యకరం.
చైనా, జపాన్, బ్రెజిల్ వంటి దేశాలు కూడా కరెన్సీ విషయంలో అమెరికాకు అనుకూలంగా సర్దుబాట్లు చేసుకోవాలని కోరనున్నట్లు సూచనలున్నాయి. బహుశా భారతదేశం కూడా ఈ సర్దుబాట్ల లక్ష్యంగా ఉంటుందేమో ఎవరికి తెలుసు? 1985 నాటి ప్లాజా ఒప్పందం పునరావృతమవుతుందేమో ఎవరికి తెలుసు? ఆ ఒప్పందం ప్రకారం అమెరికాకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్న జర్మనీ, జపాన్ దేశాల కరెన్సీ విలువను పెంచుకున్నాయి. 1980 దశకం నాటికి జపాన్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్ర ఉత్పత్తులు వంటి ఎగుమతుల్లో అమెరికాను మించిపోయింది. 1985 నాటికి ప్లాజా ఒప్పందం ద్వారా జపాన్ కరెన్సీ విలువ పెరగటంలో ఎగుమతులు ఖరీదు పెరిగింది.
అదృష్టం ఏమిటంటే, 1980 దశకంలో జపాన్ ఉన్నంత బలహీనంగా 2025లో చైనా లేదు. అమెరికా ఏకపక్షంగా షరతులు విధిస్తూ ఉంటే చైనా చూస్తూ ఊరుకుంటుందనుకోవటం భ్రమ మాత్రమే అవుతుంది. ఇప్పటికే చైనా ఏ రకమైన యుద్ధానికైనా సిద్ధంగా ఉందనీ, అది వాణిజ్య యుద్ధం కావచ్చు, మరేదైనా కావచ్చని ఆ దేశ విదేశాంగమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుసకోవాలి. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి ఈ విధంగా ప్రకటించటం ఘోరతప్పిదం.
కాస్తంత మతిమరుపు పోగొట్టుకోవడానికి 2020లో ట్రంప్ అధ్యక్షునిగా దిగిపోయేటపుడు తీసుకున్న నిర్ణయాలను జయశంకర్ గుర్తు చేసుకోవాల్సింది. అమెరికాకు మిత్రులుగా ఉన్న తైవాన్, దక్షిణ కొరియాలతో పాటు భారతదేశం కూడా కరెన్సీ విలువ విషయంలో తొండి చేస్తుందని ఆరోపించారు. భారతదేశపు కరెన్సీ విలువ విధానాన్ని ఓ కంట కనిపెట్టాలని కూడా హెచ్చరించారు.
దిగుమతి సుంకాల విషయంలో మీరెంతంటే నేనూ అంతేనని ట్రంప్ అంటున్నారు. ఇటువంటి సందర్భంలో తిరిగి తన 2020 నాటి విధానాలు తెరమీదకు తేవడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాణిజ్య భాగస్వామి తన కరెన్సీ విలువను పెంచేలా ఒత్తిడి చేస్తే ఎగుమతులపై ఎటువంటి ప్రభావం ఉంటుందో దిగుమతి సుంకాలు పెంచినా అదేతరహా ప్రభావం ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాల ప్రతినిధిగా ఉన్న జయశంకర్ ఈ ప్రకటన చేయటం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో బహుళ కరెన్సీలు ఉండాలన్న విషయంపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని జయశంకర్ ఈ ప్రకటన ద్వారా చెప్పదల్చుకున్నట్లుంది.
అంతర్జాతీయ వాణిజ్యంతో సహా అనేక విషయాల్లో ట్రంప్ దూకుడుకు కళ్లెం వేయటానికైనా భారతదేశం ముందుకు కదలాల్సింది. ఇందులో భాగంగా బ్రిక్స్ భాగస్వాములందరినీ ఒకే తాటిమీదికి తెచ్చి అమెరికా మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేసి ఉండాల్సింది. దౌత్యపరిణతి అంటే ఇలా ఉండాలి. ఓవైపు ట్రంప్ రష్యా గురించి హద్దేలేకుండా పొగుడుతున్నారు. మరోవైపు రష్యా మాత్రం భారత విదేశాంగ మంత్రి తోసిపుచ్చిన బ్రిక్స్ దేశాల గురించి మాట్లాడుతున్న దానిని గమనించాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే బ్రిక్స్ దేశాలతో పాటు అనేక దేశాలు తమ విదేశీ నిల్వలను డాలర్ నిల్వల బదులు బంగారం నిల్వలుగా మార్చుకుంటున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాకు చెందిన డాలర్ నిల్వలను వినియోగంలోకి రాకుండా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్న అనేక దేశాలు డాలర్ వాడకాన్ని తగ్గించాయి. నిన్న మొన్నటి వరకు డాలర్ రిజర్వులు పెంచుకోవడానికి తహతహలాడిన దేశాలు ఇప్పుడు బంగారం నిల్వలు పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నాయి. భారతదేశం కూడా రష్యా నుండి పెద్దఎత్తున కొనుగోలు చేసిన చమురుకు రూపాయల్లోనే చెల్లింపులు చేసింది. అమెరికా ఆంక్షలు లేకపోతే అంతర్జాతీయ వాణిజ్యం బహుళ కరెన్సీల దిశగా మళ్లేదే కాదు. ఈ విషయాన్ని ట్రంప్ అర్ధం చేసుకోవటం లేదు.
అమెరికా తీనుకున్న నిర్ణయం కారణంగా వంద దేశాలు ఏదో ఒక మేరకు ఆంక్షల బారినపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ డాలరేతర కరెన్సీ వైపు మొగ్గు చూపటానికి అమెరికా విధానాలే కారణం. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్యంలో ఆయా దేశాల కరెన్సీల ఆధారంగా జరగాలన్న ఒప్పందంపై భారతదేశం కూడా సంతకం చేసింది. బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామన్నది ట్రంప్ బెదిరింపే తప్ప ఆచరణలో సాధ్యం కాదు. భారతదేశం, చైనాల నుంచి వచ్చే దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించటం అంటే అమెరికాలో ధరల పెరుగుదలతో జనాలని రోడ్లపాలుచేయటమే అవుతుంది. ఈ విషయం ట్రంప్‌కు బాగా తెలుసు.
కెనడా, మెక్సికోల నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించాలనే నిర్ణయాన్ని మరో నెలరోజుల పాటు వాయిదా వేసుకున్న విషయాన్ని గుర్తించాలి. అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టాలన్న తపనతో ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ఫలితంగా స్టాక్మార్కెట్లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతున్న సంగతిని కూడా గమనించారు. దీని పర్యవసనంగా ట్రంప్ ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక వాణిజ్య విషయాల్లో ఇలాంటి పనులు చేయటానికి జనం ఓట్లు వేయలేదనే విషయాన్ని ట్రంప్ గ్రహించటం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి అమెరికా శరణువేడుతున్నట్లు భారత అంతర్జాతీయ వాణిజ్య, కరెన్సీ విలువలన్నీ డాలర్ పరం చేయనున్నట్లు ప్రకటించటం పిచ్చి ప్రేలాపన అవుతుంది. అమెరికా నిర్మించదల్చుకున్న అంతర్జాతీయ ద్రవ్య చట్రంలో దాని లోపాలు దానికున్నాయి. 2008 నాటికి 800 బిలియన్ డాలర్లుగా ఉన్న లోటు ప్రపంచ ద్రవ్య పెట్టుబడి సంక్షోభానంతరం అమలు చేసిన ఉద్దీపన పథకాల పుణ్యమా అంటూ ఐదు లక్షల కోట్ల డాలర్లు, కోవిడ్ అనంతరం ఉద్దీపనల పర్యవసానంగా తొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అయినా పెరుగుతున్న లోటుకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కదలిక లేదన్న వాస్తవాన్ని పలువురు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ చర్యలే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలరు విలువ తగ్గించి ఓ గాలిబుడగను సృష్టించాయి.
ప్రస్తుతం డాలరు అంత సరైన దారిలో లేదు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీల స్టాక్ విలువలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కేవలం ఓ డజను కంపెనీలే మొత్తం స్టాక్ మార్కెట్ కాపిటలైజేషన్లో మూడో వంతు ఆక్రమిస్తున్నాయి. ఈ ధోరణి అత్యంత ఆందోళనకరమైంది. చైనా అంతకన్నా చౌకైన కృత్రిమ మేధ సాధనం డీప్‌సీక్‌ను మార్కెట్లోకి దించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఆధునిక సాంకేతిక రంగంలో చైనా ఇటువంటి పలు ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఫలితంగా ఇప్పటివరకూ కొనసాగుతున్న అమెరికా ఆధిపత్యానికి సవాలు ఎదురుకానుంది.
ట్రంప్ విధానాలు తాత్కాలికంగా అంతర్జాతీయ పెట్టుబడులను అమెరికా స్థావరానికి మళ్లిస్తే మళ్లించవచ్చేమో కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాదులు బలహీనపడుతున్నాయన్న వాస్తవాన్ని ఇది దాయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశం తన విలువైన ఆర్థిక వనరులు, విదేశీ నిల్వలు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని బహుళ కరెన్సీల్లో చేయటం తక్షణ అసవరం. జయశంకర్ ప్రకటన ఈ వాస్తవికతకు భిన్నంగా ఉంది.
ఎం కె వేణు
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.