
దేశం హిందూ పాకిస్తాన్‌గా మార్చె దిశగా అడుగులు
భారతీయుల్లో ఎక్కువ సంఖ్యాకులు మాంసాహారులేనని సంఘపరివారానికి తెలియదని తేలింది.
హిందూ పాకిస్తాన్‌గా మారిపోవాలని మనం మొండిగా నిర్ణయించకున్నాక నిజమైన పాకిస్తాన్లో అసంఖ్యాక ముస్లింల హత్యలకు దారితీసిన షియా- సున్నీ విభజన లేకుండా ఉంటే ఎట్లా? విద్వేషం అనేది ఒక దేశం ఒక మతం డిమాండ్‌కు మూలస్థంభంగా ఉన్నప్పుడు, ఒక మతానికి సమూహానికి ఈ విద్వేషం పరిమితం కాకుండా చూసేందుకు “జిన్నా” భూతం అంతటా తప్పకుండా తిరుగుతుంటుంది కదా!
ఎవరయితే విభేదిస్తారో, కలుషితం చేస్తారో విజయం సాధించిన దైవదత్తమైనటువంటి సమూహంలో వారిని కూడా ఈ విద్వేషం శుద్ధి చేసి వారిని మరింత స్వచ్ఛం(పాక్)గా చేయడానికి, నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది.
ప్రార్థన చేసుకుంటున్న షియా సమూహాలని పీల్చేసే ఉన్మాదం లేకుండా పాకిస్తాన్లో ఒక వారం గడపడం కష్టం.
అయితే హిందూస్తాన్లో ఇంకా అంతలా తీవ్రతరం కాలేదు. ఎందుకంటే చంపాలనే కసి అంతా ముస్లింలపై కేంద్రీకరించబడి ఉంది. ఒక ప్రాణాంతకమైన ఉదయాన ఆరోజు ఎటువంటిదో సూచనలు కనబడవచ్చు. మాంసాహార భోజనం లేకుండా చేయడానికి సంఘపరివారం వదలకుండా జరుపుతున్న ప్రచారం అటువంటి వాటిలో ఒకటి.
భారతీయులలో ఎక్కుమంది మాంసాహారులే..
ఢిల్లోని చిత్తరంజన్ పార్క్ చేపల మార్కెట్టుకు ఇటీవల వచ్చిన బెదిరింపులు బెంగాల్ నుంచి అండమాన్ దాకా ప్రమాద ఘంటికలు మోగించాయి.
స్వాభిమానం గల ఏ బెంగాలీ కూడా తన చేపలు ఆగిపోవడాన్ని గానీ, అవమానించబడటాన్ని గానీ, చుట్టుపక్కల గుళ్ల పరిసరాలను కాలుష్యానికి వాటిని కారణంగా చూపడానికి గానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడు. 98.55% బెంగాలీలు మాంసాహారులని గణాంకాలు చెబుతున్నాయి. వారికి చాలా ఇష్టమైన మాంసాహారం చేప అని వేరే చెప్పనక్కర లేదు. అనేక రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ శాతం మాంసాహారులున్నారు.
మొత్తం భారతీయుల్లో ఎక్కువ శాతం మాంసాహారులేనని సంఘపరివారానికి తెలియకపోవచ్చు. సంఘపరివార కేంద్రమూ దాని నాయకత్వం చారిత్రకంగా శాఖాహార కులాల నుంచే వచ్చింది. వారి ఆహారాన్ని పరిస్థితులు నిర్ణయించాయి. మతపరంగా గాని సామాజికంగా గాని ఆధిక్యత చాటడానికి ఇందులో ఏం లేదు.
ఈ కులాల్లో కొన్ని పవిత్ర గ్రంథాలు రాయటం వల్ల మాంసానికి చేపకు దూరంగా ఉండాలనే పక్షపాతం వీరికి ఉంది. కానీ అవే పుస్తకాలు భిన్నంగా కూడా రచించబడ్డాయి. కానీ ఈ మత వ్యాఖ్యాతల వారసులు వాటిని పట్టించుకున్నదెన్నడూ లేదు. ఇక వ్యాపరస్తుల మాటకు వస్తే, వాళ్లు ఒక చోట నుండి మరొక చోటుకు తిరుగుతుంటారు. కాబట్టి దూర ప్రాంతాల్లో కూరగాయలకు పరిమితం కావడం ఎప్పుడైనా సురక్షితమే. ఎందుకంటే చేప, మాంసాన్ని సరిగ్గా వండకపోతే సాల్మోనెల్లా, కాంపిలో బాక్టర్, ఇ- కొలి, లిఫ్టిరియా వంటి బాక్టీరియా ఉండి ఆహారం ద్వారా రోగాలు రావచ్చు. కేవలం వారి వ్యాపార అవసరం, అది కాస్త తర్వాత ఒక గొప్ప లక్షణంగా మార్చబడింది. వారి దురాశ, లాభార్జన కారణంగా చారిత్రకంగానే ద్వేషించబడిన ఈ బృందాలు పురోహిత వర్గపు ఆహారంతో తమను కలుపుకోవటంతో మంచి మార్కులను కొట్టేశారు. మత కార్యకలాపాలు, ఆలయాలు నిర్మించడానికి వాటి విరాళాలు ఇవ్వడంతో ఈ బంధం మరింత బలోపేతం అయ్యింది.
హిందూమత సంఘాలు ఏర్పడినప్పుడు ఈ చారిత్రక కలయికతో మాంసాహారం పట్ల వ్యతిరేకత కూడా కొనసాగింది. వారి కేంద్ర నాయకత్వం ఇప్పటికీ కచ్చితమైన శాఖహారులైన ఉన్నత సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఈ సంఘాల ప్రముఖ నాయకుల పేర్లు చూస్తే అటువంటి కులాలు ఎంత అసమాన నిష్పత్తిలో ఉంటున్నాయో కొట్టొచ్చినట్లు కనడుతుంది.
ఇప్పుడు వాస్తవాలు పరిశీలిద్దాం..
భారతదేశంలో కేవలం ఐదు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో శాఖాహార జనాభా ఎక్కువగా ఉంది. 2018లో భారత రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన సర్వే ప్రకారం రాజస్థాన్(74.9%) హర్యానా(69.29%) పంజాబ్(66.75%) గుజరాత్(60.95%) మధ్యప్రదేశ్(50.6%) రాష్ట్రాల్లో మాంసాహారుల కంటే శాఖాహారులు ఎక్కువ ఉన్నారు. ఈ రాష్ట్రాల తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్(47.1%) మహారాష్ట్ర(40.2%), ఢిల్లీ(39.5%), ఉత్తరాఖండ్(27.3%) కర్నాటక(21.1%), అస్సాం(20.6%) ఉన్నాయి. మిగితా రాష్ట్రాలలో 95- 99% జనం మాంసాహారులుగా ఉన్నారు.
ఈ గణంకాలను పరిశీలించినప్పుడు భారతదేశ జనాభాలో 65- 75% ప్రజలు మాంసాహారులు. 2022- 23 గృహ వినిమయ ఖర్చు సర్వేలో అంశాలు ఎంపిక చేసుకుని ఆలస్యం చేసి 2024 ఎన్నికల ముందు విడుదల చేశారు. అయినా ఈ నివేదిక సంఘపరివారం కోరుకున్నట్టు రాలేదు. 2011-12తో పోలిస్తే 2022-23లో ఒక కుటుంబం తృణధాన్యాలపై చేసే ఖర్చు 37.42% నుంచి 20.32% తగ్గింది(ఉచిత రేషనుకు ధన్యవాదాలు) మాంసం, చేపలు, గుడ్లపై చేసే ఖర్చు 5.59% నుంచి (1999- 2000లో) 2022- 23 నాటికి 10.59%నికి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో ఒక నగరం తర్వాత మరొక నగరంలో మాంసాహారంపై చట్టాలు చేస్తూ నిషేధాలు విధించబడుతున్నాయి.
నిజానికి 2005- 2006 మళ్లీ 2015- 16లోను జరిగిన రెండు విడతల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం విశ్లేషిస్తే ఈ దశాబ్ద కాలంలో శాఖాహారుల సంఖ్య తగ్గుతున్నది. ఈ సర్కారి లెక్కలు మనం తిరస్కరించదలిస్తే భయపెట్టి అసహ్యించుకునే “సోరోస్” ప్రాంతానికి బయట మనం అమెరికన్ ప్యూ కేంద్రం నిర్వహించిన సర్వేను తీసుకోవచ్చు.
వారు సర్వే చేసిన వారిలో కేవలం 40 శాతం మంది మాత్రమే శాఖాహారులు. వీరిలో ఎక్కువమంది మాంసాహారుల ఇంట్లో భోజనం చేయరు. అయినా కాని ఎక్కువ శాతం మాంసాహారులే. మాంసాహారం అలవాట్లు ఉన్నవాళ్ళని చిన్న చూపు చూడటం ఆందోళనకరం. ఈ మధ్యకాలంలో సన్నిహిత మిత్రులు, స్కూలు- కాలేజీ సహధ్యాయులు అతని/ఆమె భోజనం బల్ల నుంచి లేచిపోవడం చూస్తే అత్యంత బాధాకరం. విడిగా బల్లలు, భోజనశాలలు, హాస్టళ్లు, ఇళ్లు కోరుకోవడం షియాలను వెలివేసిన చరిత్ర భారతదేశంలో కూడా మొదలవుతోందా అన్న అనుమానాలు కలిగిస్తోంది.
గుజరాత్లో ప్రత్యేకించి 40% ప్రజలు మాంసాహారులుగా ఉన్న రాష్ట్రంలోని పెద్ద నగరాలన్నింటిలో మాంసాహారం తినడం/అమ్మడం అనేక సంవత్సరాలుగా నిషేధించబడింది. హిందువుల పవిత్ర ప్రదేశాలన్నింటిలో చాల పాతకాలం నుంచే చేపలు- మాంసంపై నిషేధం కచ్చితంగా అమలు చేయబడుతుంది. ఆలయాల చుట్టు పక్కల నిషేధం కొంత వరకూ ఆర్థంచేసుకోవచ్చు. కానీ ఒక నగరం తర్వాత మరోక నగరంలో మాంసాహారంపై నిషధాజ్ఞాలు- చట్టాలు రుద్దడం నిజంగా ప్రమాదకరం.
1956 నుంచి హరిద్వార్ పూర్తిగా శాఖాహర నగరంగా మారిపోయింది. తర్వాత రిషికేష్, వారణాసి, బృందావనం, చిత్రకూటం, అయోధ్య, మీరట్‌లలో మొత్తం నగరంలో లేదా కొంత భాగంలో కానీ మాంసం, చేపలను నిషేధించారు. ముస్లింల పవిత్ర స్థానం దియోబంద్ లో ఇప్పుడు శాఖాహారం మాత్రమే దొరుకుతుంది. చివరికి బారాబంకి జిల్లాలోని చిన్న పట్టణం దేవా షరీఫ్‌లో కూడా శాఖాహారం మాత్రమే లభిస్తుంది.
సంఘపరివారం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, స్థానిక సంస్థలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం నుంచి కోడి గుడ్లను తీసేశారు. పౌష్టికాహారం లోపమున్న పిల్లలకు గుడ్లు ఎక్కువగా పోషకాలు అందిస్తాయని, డాక్టర్లు ఖచ్చితంగా చెప్పే సలహాకు ఇది విరుద్ధం. ఒక్క గీతతో లక్షల మంది ప్రజల జీవనోపాధి మూసేస్తారు. ఎవరి ఆహారాన్ని వారు ఎంపిక చేసుకునే ప్రజాస్వామ్య హక్కును రాజ్యాంగం పౌరులకు కల్పించింది. అయినా కానీ కింది కోర్టులు రానురాను బహిరంగంగా ఏకపక్షంగా మారి ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయి.
చివరికి సుప్రీంకోర్టు కూడా లక్ష్యద్వీపాల్లో విద్యార్థులకు మధ్యాహన్న భోజనంలో కోడి మాంసం, గుడ్లు నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అది చట్టబద్ధమేనని చెప్పింది. 2004లో ఇదే కోర్టు గుడ్ల అమ్మకంపై హరిద్వార్ మున్సిపాలిటి విధించిన నిషేధం పూర్తిగా చట్టబద్ధమైందని ప్రకటించింది. అది ఏ రకమైన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదని ఫిర్యాదుదారుకి వివరణ ఇచ్చింది.
ఆవుమాంసం పేరుతో ఇతరులిని చంపి వేస్తే మనం నిరసన తెలపలేదు. ఇప్పుడు వాళ్లు మన గుడ్లు, చేపలు, మటన్ల వెనకపడ్డారు. మన రాజ్యాంగ బద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి మేల్కొవల్సిన కాలం వచ్చింది. లేదంటే ఖచ్చితంగా అసహనంతో కూడిన హిందూ పాకిస్తాన్ త్వరలోనే మనకు వస్తుంది.
అనువాదం: దేవి
(జవహర్ సర్కార్ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు- పూర్వ ప్రసారభారతి సీఈఓ, భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.