
The RTI Act demanding it - the Privacy Act refusing
సమాచార హక్కు చట్టం- 2005 గురించి చెపుతూ అది ఎంతో ఉపయోగకరమైనదని, దానిని ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. చాలా అధ్భుతమైన, గొప్ప విషయం చెప్పారు. అయితే సమాచార కమిషనర్‌గా అయిదేళ్ల పాటు నేను పనిచేశాను. ఆర్టీఐ చట్టం కింద వేలాది తీర్పులను వెలువరించాను. ప్రభుత్వాధికారులు ఎన్నో చిన్నచిన్నఅంశాల మీద దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చేవారు. పైస్థాయి అధికారుల వద్దన్నపుడు రెండో సారి అప్పీలుకు సమాచార కమిషనర్ ముందు ప్రతిఘటన కనపడుతూ ఉండేది. చాలా సానుకూల సందర్భాలలో దరఖాస్తుదారులకు సమాచారాన్ని అందించవచ్చని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వనందుకు దాదాపు కోటి రూపాయల వరకు జరిమానాలు కూడా విధించారు.
“కేంద్రమంత్రి వైష్ణవ్ వ్యక్తిగత సమాచారాన్ని ఆపేస్తామని అనుకోకండి. ఆ నిషేధాలేమీ లేవు” అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏప్రియల్ 10న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌కి రాసిన లేఖలో తెలిపారు. అయితే, ప్రజల వ్యక్తిగత సమాచారం లేదా అధికారుల సమాచారంతో సంబంధం ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం నిధుల కేటాయింపు వంటి పథకాలపై సమాచారాన్ని ఇవ్వకుండా నిరాకరిస్తుంది. దీనికోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా ఆర్టీఐ చట్టానికి చేసిన సవరణ ద్వారా పార్లమెంట్ శాసనం తయారు చేసింది. ఇది అనుమానం కాదు. పచ్చినిజం. ఈ చట్టానికి వ్యతిరేకంగా వివిధ పార్టీల నాయకులు, ప్రధాన ప్రతిపక్షాలు కావలిసినంతగా నిరసన తెలపలేదు. దీంతో చాలా వరకు పౌరసమాజంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అంతేకాకుండా, ఇక ఆర్టీఐ కథ అయిపోయినట్టే అనే భయాలు కూడా వ్యక్తమయ్యాయి. పౌరసమాజమే రాజ్యాంగాన్ని, ఆర్టీఐని రక్షించుకోవాలి. దీని కోసం పోరాడాలి. ప్రతిఘటించాలి. ప్రశ్నించాలి. ఆర్టీఐ ద్వారా పారదర్శకంగా ఉంటూ ప్రభుత్వాధికారులు చట్టానికి లోబడే పనిచేయాలని డిమాండ్ చేయాలి.
ఈ రెండు చట్టాల మధ్య ఇదే గతి..
డేటా చట్టం త్వరలో అమలులోకి వస్తుందని అధికారికంగా కేంద్రమంత్రి వైష్ణవ్‌తో పాటు పలువురు పేర్కొన్నారు. ఉభయ సభలు ఆమోదించాయి కాబట్టి డీపీడీపీ నియమాలు ప్రకటించిన వెంటనే అమలులోకి వస్తుంది. దీని మీద రాష్ట్రపతి కూడా సంతకం చేశారు. దీనికి సంబంధించిన నియమనిబంధనలను కూడా తయారు చేశారు. అయితే, ఇది సమాచార హక్కు చట్టానికి తీవ్ర అటంకంగా తయారైంది. దీని వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆర్టీఐ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ హక్కుల పరిరక్షకుల నుంచి పారదర్శకత కోసం పోరాడే సంస్థల వరకు వివిధ పౌరసమాజ వర్గాలు ఈ సవరణపై సంవత్సరాలుగా హెచ్చరికలు చేస్తూనే వచ్చాయి.
2024 ఎన్నికలలో చాలా మంది ఎంపీలు రాజ్యాంగాన్ని, ఆర్టీఐని రక్షిస్తారని అనుకున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు కనుక రాజ్యాంగానికి, ఆర్టీఐ వంటి వాటికి ఢోకా లేదనుకున్నాం. కానీ ఒక వైపు టీడీపీ, దాని మిత్ర పక్షం జనసేన మరోవైపు నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ తమ బాధ్యతను విస్మరించాయి. ఈ పార్టీల మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. 120కి పైగా విపక్ష ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు ఈ సవరణను రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉత్తరం కూడా రాశారు. అయితే, మంత్రి అశ్వినీ వైష్ణవ్ తమ సవరణను సమర్థించుకుంటూ రాసిన లేఖలో 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన గోప్యతా హక్కు తీర్పు ప్రకారమే చట్టం చేస్తున్నామన్నారు. ఆ తీర్పులో వ్యక్తిగత సమాచారం గోప్యతా హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమని మంత్రి సమర్ధించుకున్నారు. “సమాచార హక్కుకు గోప్యతా హక్కు చట్టాలకు మధ్య సమన్వయం అవసరం” అని వైష్ణవ్ పేర్కొన్నారు.
మంత్రికి అంజలి జవాబు..
అయితే, సమస్య అంతా ఈ సమన్వంతోనే ఏర్పడింది. వారి నిమయనిబంధనలు ఆర్టీఐకి వ్యతిరేకమైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సమాచార హక్కు చట్టంలోనే ఈ సమతుల్యత ఇప్పటికే ఉందని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్తలు వివరిస్తున్నారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(j)లో వ్యక్తిగత సమాచారానికి మినహాయింపు ఇచ్చే సెక్షన్ సరిపోతుంది. అందులో ఈ రెండు హక్కులకు మధ్య సమతుల్యత కలిగి ఉందని, ఆ సమాచారం కోసం దురుద్దేశంతో ప్రయత్నించేలా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నామని నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్(ఎన్సీపీఆర్ఐ) సంయుక్త సమన్వయకర్త అంజలి భారద్వాజ్ వివరంగా తెలిపారు. 2005లో చట్టం అమలులోకి రానివరకు గోప్యతా హక్కు, సమాచార హక్కు మధ్య సమతుల్యతను సాధించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె అన్నారు.
మంత్రి అశ్విని వైష్ణవ్ తన లేఖలో “అధికార దుర్వినియోగం, అవినీతిని బయటపెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని ప్రజలు పొందే హక్కును తీవ్రంగా పరిమితం చేస్తాయి’’ అన్నారు. డీపీడీపీ చట్టంలో మరో సవరణ ప్రకారం “పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు ఇవ్వలేని సమాచారం ప్రజలకు కూడా ఇవ్వలేం” అనే నిబంధనను తొలగించారు. దీనిపై కూడా వైష్ణవ్ స్పందించలేదని భారద్వాజ్ అన్నారు. వైద్యానికి సంబంధించిన సమాచారం మాత్రం అందుబాటులో ఉంటుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. “చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలను నివారించడానికి” ఈ సవరణలు చేశామని పేర్కొన్నారు.
ఈ సంఘర్షణ కనపడడం లేదా..!
సమాచార హక్కు(ఆర్టీఐ)చట్టం, డేటా రక్షణ చట్టాల మధ్య వైరుధ్యం ఉంది. అంతేకాకుండా వీటి మధ్య తీవ్రమైన సంఘర్షణ ఉంది. ఆ చట్టాన్ని చూపించి ఈ చట్టాన్ని కొట్టి పారేసేందుకు ఉపయోగిస్తారు. దుర్వినియోగం చేస్తారు. ఆర్టీఐ చట్టం ప్రజలకు సమాచారాన్ని బహిర్గతం చేయాలనే హక్కును కల్పిస్తుంది, అయితే డేటా రక్షణ చట్టం వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తుందని అంటున్నారు. ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఎందుకంటే ఆర్టీఐ చట్టం కింద కోరిన సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు, ఇది వ్యక్తిగత డేటా రక్షణను వద్దనవచ్చు. ఒకవేళ పొరబాటుగా సమాచారం ఇస్తే కోట్ల రూపాయల విలువైన జరిమానాను విధించే అధికారాన్ని ప్రభుత్వానికి పార్లమెంట్ ద్వారా అందించబడింది.
ఆర్టీఐ చట్టానికి డేటా రక్షణ చట్టాల మధ్య సమతుల్యతను ఎవరు కనిపెడతారన్నది చాలా ముఖ్యం. ఆర్టీఐ చట్టం పారదర్శకతను ప్రోత్సహించడమే కాకుండా, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే హక్కును కూడా గౌరవించాల్సిందే. ఈ రెండు చట్టాల మధ్య సమతుల్యతను కనుగొనడానికి, ఆర్టీఐ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించడం లేదా కొత్త నిబంధనలను జోడించడం ద్వారా సాధ్యం లేదని ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు. రాబోయే రోజుల్లో డేటా చట్టం కింద కొందరు కమిషనర్లు వస్తారు. అప్పుడు లేని ఆర్టీఐ కమిషనర్ చట్టం చట్టబండులైపోతే రాబోయే డేటా చట్టం కింద వచ్చే కమిషనర్ ఏం చేస్తారు. ఇద్దరికి ఇద్దరు కేంద్ర మంత్రుల కిందే అధికారులుగా పనిచేస్తారా?