
భారతదేశ విద్యావ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్య నాణ్యత ప్రమాణాలు చాలా బలహీనంగా ఉన్నాయనటంలో సందేహం లేదు. పిల్లల వయస్సు, చదివే తరగతుల ఆధారంగా పరిశీలించినప్పుడు వారిలో నేర్చుకునే సామర్థ్యం, ఫలితాలు ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నాయని అనేక సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రాథమిక అక్షరాస్యత, లెక్కలు, విమర్శనాత్మక ఆలోచన, భావాలను వెల్లడించే సామర్థ్యం మొదలైన అన్ని విషయాలకు ఇది వర్తిస్తుంది. విద్య నాణ్యతను మెరుగుపరిచే దిశగా జోక్యం చేసుకోవడం అంటే కేవలం ‘అభ్యాస ఫలితాలపై’ దృష్టి పెట్టడానికి మాత్రం పరిమితం చేయబడుతుంది. పిల్లల జీవితంలో, సమాజంలో రాణించటానికి కూడా విద్య, ముఖ్యంగా పాఠశాల విద్య ఎటువంటి పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవడంలో ఉన్న తీవ్రమైన పరిమితులను ఇది ప్రతిబింబిస్తుంది.
పిల్లలకు చదవటం, వ్రాయడం నేర్పించడంతో పాటు, పైచదువులకు లేదా ఉపాధి కోసం వారిని సిద్ధం చేయడంలో కూడా పాఠశాల విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కోవిడ్-19 కారణంగా భారతదేశం అంతటా సుదీర్ఘ కాలం పాఠశాలలు మూసివేసిన సమయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది. పాఠశాలలు పిల్లలను బాలకార్మికులుగా మారకుండా దోహదపడతాయి. వారిని కష్టాలకు దూరంగా ఉంచుతాయి.
ఇక బాలికల విషయానికి వస్తే, వారికి బాల్య వివాహం అనే ఒత్తిడిని వాయిదా వేయడానికి సహాయపడటంతో పాటు పాఠశాలల ద్వారా వారు చైతన్యం, స్వేచ్ఛను పొందుతారు. మధ్యాహ్నం భోజన పథకానికి ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా మంది పిల్లలకు పాఠశాల అంటే సరైన భోజనం అందించే కేంద్రం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అల్పాహారం కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పిల్లలు(మధ్యాహ్న భోజన పథకం 8వ తరగతి వరకు చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది) తరచుగా రోజంతా ఏమీ తినకుండానే ఉండటం లేదా మార్కెట్లో లభించే కొన్ని అనారోగ్యకరమైన చౌకరకం చిరుతిండిపైన ఆధారపడటం (సాధారణంగా బిస్కెట్లు లేదా చేగోడిల లాంటివి) మనం గమనించవచ్చు.
పిల్లలకు వారు విభిన్న కులాలు, మతాలకు చెందిన వారితో కలిసిమెలిసి ఉండటానికి, మాట్లాడటానికి, ఆడుకోవటానికి, తమ గురించి ఆలోచించుకోవటానికి, మంచి భవిష్యత్తు గురించి కలలు కనటానికి పాఠశాల అవకాశం కల్పిస్తుంది.
పాఠశాలల ద్వారా పిల్లలకు కొత్త వాతావరణం, విలువలు పట్టుబడతాయి. తమ గ్రామాలను దాటి బయట జరుగుతున్న విషయాలను తెలుసుకుంటారు. ఫలితంగా మంచి భవిష్యత్తు కోసం కలలు, ఆకాంక్షలు వారిలో ఏర్పడతాయి. దీంతో పాటు, పాఠశాలలు వారికి జ్ఞానాన్ని, నైపుణ్యాలను, అలాగే క్రమశిక్షణను, నేర్చుకోవటంలో(అభ్యసించటంలో) ఆనందాన్ని అందిస్తాయి. భారతదేశంలో పాఠశాలలు ప్రస్తుతం ఆ విధంగా లేనప్పటికీ, దేశంలోని ప్రతి బిడ్డకు ఇవన్నీ అందించే అవకాశం ఉంది.
భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలకు పేద, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎక్కువగా వెళతారు. ఉన్నతవర్గంతో పాటు మధ్యతరగతి కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకపోవటంతో తరాల మధ్య అసమానతలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. అయినప్పటికీ, పాఠశాల విద్య అనేది పిల్లల మధ్య కులం, లింగం, పేదరికంలాంటి సంకెళ్ళను తెంచగలిగే ఏకైక మార్గంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు పిల్లలు నేర్చుకోవడం లేదనే ఆందోళన ఉన్నప్పటికీ, విద్య అందించే సమానత్వ అంశాలపైన తగినంత శ్రద్ధ చూపడం లేదు. ఏ కాలంలోనైనా ఉపాధ్యాయులు, తరగతి గదులు లేదా ఇతర మౌలిక సదుపాయాల కొరత మొదలైనవి ‘అభ్యాస(నేర్చుకోవటం) సంక్షోభం’ కిందికి రావు. ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్ధిక నిచ్చెన మెట్ల వ్యవస్థలో పిల్లల స్థానాన్ని బట్టి వారి నిస్సహాయస్థితిని పూర్తిగా విస్మరించడం కూడా జరుగుతోంది. ప్రస్తుత వ్యవస్థ ఎలాంటిదంటే పిల్లలు తమను తాము పూర్తిగా బలహీనులుగా భావిస్తారు. వారి ‘వైఫల్యానికి’ అందరిచేత నిందించబడతారు.
‘నో డెటెన్షన్’ (నిర్బంధం వద్దు)
కుటుంబంలో మొదటి తరం అక్షరాస్యులుగా ఉన్న పిల్లలు అధికారిక విద్యావ్యవస్థలో ఎదుర్కొంటున్న ప్రతికూలతలను గమనించిన ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో ‘నో-డిటెన్షన్’ నిబంధనను చేర్చింది.
ప్రాథమికంగా, ఈ చట్టంలోని సెక్షన్ 16 ఈ విధంగా పేర్కొంది, ‘ఒక పాఠశాలలో ప్రవేశించిన ఏ విద్యార్థినైనా, ఉత్తీర్ణులు(పాస్) కాలేదని అదే తరగతిలో ఉంచకూడదు. లేదా ప్రాథమిక విద్య(తరగతులు 1 నుంచి 8) పూర్తయ్యే వరకు పాఠశాల నుంచి బహిష్కరించకూడదు’ అంటే ఏ కారణం చేత కూడా విద్యార్థిని అదే తరగతిలో ఉంచకూడదు. ఆటోమేటిక్గా తరువాతి తరగతికి అప్ గ్రేడ్ చేయబడతారు. నో-డిటెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకునేందుకు వీలుగా ఆర్టిఇ చట్టం 2019లో సవరించబడింది.
2019 సవరణ ప్రకారం ఐదవ/ఎనిమిదవ తరగతులలో ముగింపు పరీక్షలో తప్పిన విద్యార్థులను డీటెయిన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. వారికి రెండు నెలల తరువాత తిరిగి పరీక్ష రాయటానికి అనుమతిస్తారు. అప్పటి నుంచి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కొత్త విధానాన్ని అమలు చేశాయి. డిసెంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం, తమ ఆధ్వర్యంలో నిర్వహించబడే పాఠశాలల్లో నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. వీటిలో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ పాఠశాలలు ఉన్నాయి. ఇది సుమారు 3,000 కేంద్రీయ పాఠశాలలను ప్రభావితం చేసింది.
నో-డిటెన్షన్ విధానం వల్ల పిల్లల అభ్యాసన స్థాయి, ఫలితాలు చాలా బలహీనంగా ఉండటానికి దోహదం చేసిందనే నింద ఏర్పడింది. విద్యార్థులకు పరీక్షలు లేకపోవటంతో వారి అవగాహనా స్థాయిని సరిగ్గా అంచనా వేయటం కుదరదు. వారు సరైన అర్హత లేనప్పటికీ తర్వాతి క్లాసుకు ప్రమోషన్ పొందుతున్నారు. నో-డిటెన్షన్ వల్ల దేశంలోని అనేక పాఠశాలల్లో ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. నో-డిటెన్షన్ విధానాన్ని ప్రారంభించినప్పుడు దాని అసలు ఉద్దేశ్యం అది కాదు. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో అంచనా వేయకూడదు అనేది కూడా దాని లక్ష్యం కాదు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న అంశాలను విద్యార్థులు ఏ స్థాయిలో అర్ధం చేసుకుంటున్నారు. వాటికి ఎలా స్పందిస్తున్నారో తెలుసుకునేందుకు, వారిని మదింపు చేసేందుకు పరీక్షలు, టెస్టులు మొదలైనవి ఒక ముఖ్యమైన మార్గం.
పిల్లలు అనవసరమైన ఒత్తిడిని అనుభవించకుండా చూసుకోవడం, అలాగే వారు పాఠశాల నుంచి మధ్యలోనే మానేయకుండా చూడడం నో-డిటెన్షన్ విధానం వెనుక ఉన్న ప్రధానమైన ఆలోచనగా చెప్పాలి. నిర్బంధం వల్ల విద్యార్థులు అవమానం, అవహేళనకు గురవుతారు. దీని వల్ల మొత్తానికే చదువుకు దూరమవుతారు. డిటెన్షన్ వల్ల విద్యార్థులు పట్టుదలగా నేర్చుకోవటం, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవటం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది.
నో-డిటెన్షన్ పాలసీ రూపంలో పిల్లలను బలిపశువులను చేసే కంటే, ఇంతకుమించి మెరుగ్గా ఏం చేస్తే ప్రతి బిడ్డ సరిగ్గా నేర్చుకుంటున్నారని నిర్ధారించడానికి, జవాబుదారీతనం తీసుకోవటానికి వీలవుతుందో చూడాలి. వివిధ కారణాలరీత్యా కొంతమంది పిల్లలు ఎక్కువ సహాయం లేకుండానే నేర్చుకుంటారు. కానీ వ్యవస్థలో బలహీనమైన వారిని అక్కున చేర్చుకునేందుకు అవసరమైన ఖచ్చితమైన విధానాలను రూపొందించాలి. ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి ఏమి చెయ్యాలి అనేది ఉపాధ్యాయుల పని. వారు ఆ పాత్రను పోషించడానికి అవసరమయ్యే అన్ని రకాల మద్దతును, మౌలిక వసతులను అందించటం వ్యవస్థ బాధ్యత. వ్యవస్థలోనే ఇన్ని భారీ అంతరాలు ఉన్నప్పుడు, వైఫల్యానికి పిల్లలను మాత్రమే బాధ్యులను చేయటం న్యాయమా?
పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడం, అవసరాలకు సరిపడా ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు పిల్లల జీవితాలను సున్నితంగా తీర్చిదిద్దే విధంగా బోధనా- అభ్యాస వాతావరణం ఉండేలాగా దృష్టి పెట్టాలి. ప్రతి బిడ్డ తాను గౌరవం, శ్రద్ధ పొందుతున్నానని భావించే విధంగా వ్యవస్థను తయారుచేయటం, పిల్లల స్వేచ్ఛను విస్తరించే ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్మించడం నేడు ఉన్న పెద్ద సవాలు.
దీపా సిన్హా (వ్యాస రచయిత అభివృద్ధి ఆర్థికవేత్త)
అనువాదం: పద్మశ్రీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.