
భారత్ పాకిస్తాన్ల మధ్య సైనిక చర్యలు నిలుపుదల చేసి, దాదాపు మూడు రోజులు అవుతుంది. ఈ మూడు రోజులలో పాకిస్తాన్ వ్యతిరేకత తలకెక్కించుకున్న కొందరు వేస్తున్న వీరంగం దేశానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది. నిజానికి చర్చించాల్సిన ఘటనలు వందల సంఖ్యలోనే ఉన్న స్థలభావం రీత్యా ఇక్కడ రెండు ఘటనలకు మాత్రమే పరిమితమవుతున్నాము.
మొదటిది కరాచీ బేకరి ఉదంతం, రెండవది భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ట్రోలింగ్ ఉదంతం. కరాచీ బేకరీల దుకాణాలపై విశాఖపట్నంలోనూ హైదరాబాద్ శివార్లలోనూ దాడులు జరిగాయి. శంషాబాద్‌లోని కరాచీ బేకరీ దుకాణంపై బీజేపీ అనుబంధ సంఘాలుగా చెప్పుకుంటున్న వారు దాడి చేసి బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా కరాచీ అనే పేరును తీసివేయాలని దాడికి పాల్పడిన దుండగులు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. ఈ వార్త వైరల్కాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కరాచీ బేకరీ దుకాణాలకు భద్రత కలిపించే విషయంలో రాష్ట్ర డీజీపీ జితేంద్రకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే అయినప్పటికీ కరాచీ బేకరీ ఘటనపై నోరుమెదపకపోవడం గమనించాల్సిన విషయం. దుకాణం యజమానులు తమకు, పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదని మొత్తుకుంటున్నా దుండగలు తమ విధ్వంసక చర్యలను మాత్రం ఆపలేదు. కారణం కరాచీ అనగానే పాకిస్తాన్ అని. ఈ పేరు పెట్టుకున్న కంపెనీ యజమానులు పాకిస్తానీయులనే అపోహ మాత్రమే.
ఈ రెండు ఘటనల వెనుక ఉన్న కారణం ఒక్కటే పాకిస్తాన్ వ్యతిరేకత, కశ్మీరీల పట్ల వ్యతిరేకత. కరాచీ బేకరీని పాకిస్తాన్‌కు ప్రతినిధిగాను, విక్రమ్ మిస్రీని దేశద్రోహిగాను అపార్ధం చేసుకోవడంలోనే ఈ ముష్కరమూకల కార్యాచరణకు పునాదులు ఉన్నాయి. చరిత్ర అధ్యయనం పట్ల సంఘపరివారం, బీజేపీ శ్రేణుల్లో ఉన్న సార్వత్రిక విముఖత కారణంగానే కరాచీ బేకరి అంటే పాకిస్తాన్ ప్రతినిధి అనే అవగాహనకు ఆలోచనలు కుదించుకుపోయాయి. నిజంగా కరాచీ అని పేరుపెట్టుకున్నంత మాత్రాన ఆ సంస్థ ముస్లింలదేనా? అందులోనూ పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలదేనా? అనే ప్రశ్నలు వేసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, వివరాలు వెల్లడవుతున్నాయి.
కరాచీ బేకరీ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు బేకరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ. దాని యజమాని ఖాన్ చంద్ రామ్నాని. ఈయన అవిభక్త భారత్‌లో అంటే స్వాతంత్య్ర పూర్వపు భారతదేశంలో అందరిలాగే నిఖార్సైన భారతీయుడు. ఆయన జన్మస్థలం అప్పటి కరాచీ, ఇప్పడు ఇదే నగరం పాకిస్తాన్‌లోని ఒక ముఖ్యమైన సింధ్ రాష్ట్ర రాజధాని. భారత్ నుంచి పాకిస్తాన్ వేరుబడిన తర్వాత 1947 నుంచి 1959 వరకు కరాచీ పాకిస్తాన్‌కు దేశరాజధానిగా ఉంది. దేశ విభజన సమయంలో ఉమ్మడి పంజాబ్ నుంచి భారత దేశానికి వలస వచ్చిన లక్షలాది మంది భారతీయులలో, ముస్లిమేతరులలో ఖాన్చంద్ రామ్నాని కూడా ఒకరు. ఈయన సింధ్ రాష్ట్రంలోని కరాచీ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన హిందూ కుటుంబానికి చెందిన వారు. తమ చారిత్రక వారసత్వానికి గుర్తుగా తాను 1960 దశకంలో ప్రారంభించిన బేకరీ వ్యాపారానికి కరాచీ బేకరీ అని పేరు పెట్టుకున్నారు. మొదట్లో ఇది మొజంజాహీ మార్కెట్లో సీనా బేకరీ పక్కన ప్రారంభమైన చిన్న దుకాణం, నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలోను తనదైన ముద్ర వేసింది.
హైదరాబాద్‌లో ప్రతి టీ కొట్టులోనూ దొరికే ఉస్మానియా బిస్కెట్లు మొట్టమొదటిగా తయారు చేసింది ఖాన్చంద్ రామ్నాని అంటే ఆశ్చర్యపడక తప్పదు. సింధ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సింధీ వ్యాపార కుంటుంబానికి చెందిన ఖాన్చంద్ రామ్నాని తొలినాళ్లలో అనేక వృత్తులు చేసిన తర్వాత 1960లో బేకరీ రంగంలో ప్రవేశించారు. ఈ రంగంలో కూడా మొదట కొంతకాలం రిటైల్ వ్యాపారిగా ఉన్నారు. బేకరీ ఉత్పత్తుల తయారీలో తనకున్న అనుభవం, ఆసక్తిని ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, ఫ్రూట్ బిస్కెట్లు, డ్రై ఫ్రూట్ బిస్కెట్లు, దిల్ఖుష్, ఫ్లమ్కేక్, మ్యాక్రాన్స్ వంటి పలు సృజనాత్మక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. 2000 సంవత్సరం తర్వాత మారుతున్న వినియోగదారుల ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని రామ్నాని వారసులు ఓట్మీల్, రాగి ఉత్పత్తులు, చక్కెరలేని బిస్కెట్లు, చక్కెరలేని బేకరీ ఉత్పత్తులు వంటివి మార్కెట్‌కు పరిచయం చేశారు. ప్రస్తుతం రాజేశ్ రామ్నాని, హరీష్ రామ్నాని, విజయ్ రామ్నాని కరాచీ బేకరీని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. ప్రస్తుతం కరాచీ బేకరీ హైదరాబాద్ దక్కనీ సంస్కృతిలో అంతర్భాగంగా మారింది.
ఇటువంటి విశిష్టమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన కరాచీ బేకరీపై సంఘ్ పరివారం దాడులు ఇప్పటివి కావు. 2019లో ఉగ్రవాదులు పుల్వామాలో సైనిక వాహన సముదాయంపైన జరిపిన దాడుల నేపథ్యంలో బెంగళూరులోని కరాచీ బేకరీ దుకాణంపై స్థానిక బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. అంతకంటే ముందు 2008లో ఉగ్రవాదులు ముంబై నగరంపై దాడి చేసినప్పుడు కూడా ముంబైలో శివసేన శ్రేణులు, 2020లో మహారాష్ట్ర నవనిర్మాణ శ్రేణులు కరాచీ బేకరీ మీద దాడి చేశాయి. ఈ మౌలిక వాస్తవాలను విస్మరించి కరాచీ పేరు ఉన్నంత మాత్రానా వారంతా పాకిస్తాన్ అనుయాయులుగా భావించే స్థాయికి చేరుకోవడం సాధారణ ప్రజలలో కూడా మతన్మోద భావాలు ఏ స్థాయికి చొప్పించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశం.
ఇక రెండవ ఉదంతం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ట్విట్టర్ ఖాతాకు తాళం వేయాల్సిన పరిస్థితి. శనివారం సాయంత్రం 5 నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య భూతలంలోనూ గగనతలంలోనూ కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తర్వాత ఆదివారం తెల్లారేసరికి విక్రమ్ మిస్రీ ట్విట్టర్ ఖాతా బూతులతో నిండిపోయింది. ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీయే తీసుకున్నట్టు, అందువల్ల ఆయన ద్రోహి అని ట్విట్టర్ ఖాతాలలో ఉన్న కొందరు ఐటీ జనరేషన్ మతోద్రేకులు విక్రమ్ మిస్రీ ట్విట్టర్ ఖాతా టైమ్‌లైన్‌లో వందల సంఖ్యలో దారుణంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కొన్ని పోస్టులలో ఉన్న విమర్శలు వ్యవహారపరమైన భిన్నాభిప్రాయాలను వ్యక్తిగత ద్వేషం స్థాయికి తీసుకెళ్లిన తీరు ఆందోళనకరంగా ఉంది. అంతకంటే ఆందోళనకరమైన విషయమేంటంటే ఈ దాడిని ఖండించేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ, విదేశాంగ మంత్రి కానీ, బీజేపీ నాయకత్వం కానీ ముందుకు రాకపోవడం.
సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమై పరస్పర కాల్పుల వరకు వెళ్లిన నాలుగు రోజుల పాటు రక్షణశాఖ తరఫున విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏకైక ప్రభుత్వ ప్రతినిధి విక్రమ్ మిస్రీ. ఒక దశలో మే 7వ తేదీ వేకువ జామున భారత సైన్యం సాగించిన మెరుపుదాడులలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్యమైన నాయకుడు అబ్దుల్ రౌఫ్ అజాద్ చనిపోయాడని బీజేపీ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ “ఈ విషయంపై ఇంకా సమాచారం రాలేదు” అని సున్నితంగా బీజేపీ చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారమని చెప్పకనే చెప్పారు. మే 10వ తేదీ సాయంత్రం నుంచి అమలులో ఉన్న కాల్పుల విరమణ తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చిన సోషల్ మీడియా పోస్టులలో ప్రత్యేకించి ట్విట్టర్ పోస్టులలో విక్రమ్ మిస్రీ దేశద్రోహి అని, తన కూతురును విదేశాలకు పంపించి తాను పాకిస్తాన్ ముందు సాగిలపడుతున్నాడని, వెన్నుపూసలేని వాడని, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు ప్రాధేయపడ్డాడని విచ్చలవిడిగా డిజిటల్ దాడి(ట్రోలింగ్) జరగటంతో విధిలేని పరిస్థితుల్లో విక్రమ్ మిస్రీ తన సోషల్ మీడియా ఖాతాలు ఇతరులకు అందుబాటులో లేకుండా తాళం వేసుకున్నారు. మరికొంతమంది విక్రమ్ మిస్రీ కుటుంబసభ్యుల ఫొటోలు కూడా డిజిటల్ స్పేస్ నుంచి తవ్వి తీసి మరీ తిట్లపురాణం ఎత్తుకున్నారు.
ఇవి సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను దేశంలోపలికి తెచ్చి ఇరుగుపొరుగున ఉన్న ప్రజల మధ్య అనుమానాలు, అపోహలు, దురభిప్రాయాలు కలిగించేందుకు తద్వారా ఎక్కడిక్కడ ప్రజల్లో శాశ్వతమైన శత్రుభావాన్ని పెంచిపోషించేందుకు సంఘ్ పరివారం కేంద్ర ప్రభుత్వం ప్రాపకంతో సాగిస్తున్న దాడులు ఇవి. దేశసరిహద్దుల లోపలే ప్రజలను చీల్చేందుకు విషబీజాలు నాటుతున్న సోషల్ మీడియా వారియర్ల గురించి, సరిహద్దులలో సైనికులు సాగించిన భౌతిక యుద్ధం కంటే ఎక్కువ స్థాయిలో సరిహద్దుల లోపల టీవీ స్టూడియోలలోనూ డిజిటల్ స్పేస్‌లోనూ కొందరు సాగిస్తున్న భావోద్వేగ వికృత యుద్ధం దాని వల్ల జరుగుతున్న నష్టం గురించి సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ జాతీనుద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవడం గమనిస్తే డిజిటల్ స్పేష్లో జరుగుతున్న ఈ దాడుల వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు, ప్రోత్సాహం ఉన్నదని స్పష్టం అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.