
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా ఉండటం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ ఎనిమిదో తేదీన వెలువరించిన తీర్పులో రాష్ట్రానికి పలు సూచనలు కూడా చేసింది. గవర్నర్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని శాసనసభ రెండో సారి బిల్లులు ఆమోదించిన తర్వాత వాటిని గవర్నర్ ఆమోదించినట్టుగానే పరిగణించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి అంశాలపైనే పంజాబ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్కు మధ్య ఉన్న వివాదాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ అప్పటివరకూ పెండింగ్లో పెట్టిన బిల్లులను రాష్ట్రపతికి పంపటంలో అర్థం లేదని, గవర్నర్ ఉద్దేశ్యాలు ప్రశ్నార్థకమవుతున్నాయని జస్టిస్ పర్దీవాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసం వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం గవర్నర్లకు వీటో అధికారాలు కట్టబెట్టలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్దీవాలా అన్నారు. ”ఒక సారి శాసనసభ బిల్లులు ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం గవర్నర్లకు మూడే ప్రత్యామ్నాయాలున్నాయి. ఆమోదించటం, తిరస్కరించటం, లేదా రాష్ట్రపతికి పంపటం మాత్రమే ఆ ఆధికారాలు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. మొదటిసారి ఆమోదించిన బిల్లులను మాత్రమే రాష్ట్రపతికి సలహా సంప్రదింపుల కోసం పంపవచ్చని తెలిపింది. రెండో సారి కూడా శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే వాటిని రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్కు లేదని సుప్రీం కోర్టు వెల్లడించింది.
”శాసనసభ రెండో దఫా బిల్లులను ఆమోదించి గవర్నర్ పంపిన తర్వాత వాటిని పరిశీలన నిమిత్తం రాష్ట్రపతికి పంపేందుకు గవర్నర్కు అధికారం ఉండదు. మొదటి దఫా ఆమోదించిన బిల్లుకంటే రెండో సారి ఆమోదించిన బిల్లు భిన్నమైనప్పుడు మాత్రమే అటువంటి అవకాశం ఉంటుంది” అని తీర్పులోని భాగాన్ని జస్టిస్ పర్దీవాలా కోర్టులో చదివి వినిపించారు.
శాసనసభకు పంపటమే మార్గం..
రాజ్యాంగంలోని అధికరణ 200లో మొదటి భాగం ద్వారా గవర్నర్లకు సంక్రమించిన అధికారం స్వతంత్రమైనది కాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికరణ 200లోని ప్రధాన వ్యాఖ్యానంతో మాత్రమే కలిపి చదవాలి తప్ప దేనికి దానికి విడిగా వర్తింపచేసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఒకసారి సదరు బిల్లులు ఆమోదించటం లేదని చెప్పిన తర్వాత వాటిని పునఃపరిశీలన కోసం శాసనసభకు పంపాల్సిందేనని, శాశ్వతంగా తన వద్ద నిల్వపెట్టుకునేందుకు వీల్లేదని తెలిపింది.
ఈ కేసులో వాదనలు వినిపిస్తూ భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ ఈ బిల్లులను ఆమోదించటం లేదని చెప్పిన తర్వాత వాటిని పునరామోదించేందుకు సభకు అధికారం లేదంటూ చేసిన వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
స్పష్టమైన కాలపరిమితి..
భారత సమాఖ్య వ్యవస్థ స్పూర్తిని, రాజ్యాంగంలోని 200వ అధికరణ ఆదేశాలను దృష్టిలోకి తీసుకుని ఈ క్రింద ప్రస్తావించిన విధంగా నిర్దిష్ట కాలపరిమితిని ఖరారు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొన్నది.
- ఒక వేళ గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా ఉన్నా లేక క్యాబినెట్ సలహా సంప్రదింపులతో పరిశీలన నిమిత్తం రాష్ట్రపతికి పంపాలనుకున్నా నెలరోజుల్లోపే ఈ విషయాన్ని తేల్చి చెప్పాలి.
- ఒకవేళ సభ ఆమోదం పొందిన బిల్లులను క్యాబినెట్ అభిప్రాయానికి భిన్నంగా తిరస్కరించాలనుకున్నప్పుడు మూడునెలల్లో బిల్లులను తన అభిప్రాయం, లేదా అభ్యంతరాలతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి.
- ఒకవేళ రాష్ట్ర మంత్రిమండలి అభిప్రాయాలకు భిన్నంగా బిల్లును రాష్ట్రపతికి పంపాలనుకున్నా మూడు నెలల్లో పంపాలి.
- ఒకవేళ సభ రెండోసారి కూడా అదే బిల్లును ఆమోదించి పంపితే దానిపై ఏమైనా అభ్యంతరాలున్నా నెలరోజుల్లో అభ్యంతరాలు ఖరారు చేసుకుని బిల్లును ఆమోదించాలి.
అయితే, నిర్ణీత కాలపరిమితిలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగా స్పందించకపోతే గవర్నర్ చర్యలు న్యాయ సమీక్షకు నివేదించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సూచనలు- ఆదేశాలు..
రాజ్యాంగంలోని 200వ అధికరాణాన్ని అమలు చేసేటప్పుడు సాధారణంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సలహా సంప్రదింపుల మేరకు వ్యవహరించాలి. ఈ విషయాలపై గవర్నర్కు విచక్షణాధికారాలు ఏమీ లేవు. నిస్సందేహంగా రాష్ట్ర ప్రభుత్వ సలహా సంప్రదింపుల మేరకు మాత్రమే వ్యవహరించాలి. బిల్లు రెండో సారి సభామోదం పొంది వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించటం మినహా గవర్నర్కు మరో ప్రత్యామ్నాయ లేదు. కేవలం శాససభ చేసే బిల్లులు హైకోర్టు లేదా సుప్రీం కోర్టు అధికారాలను సవాలు చేసేవిగా ఉన్నప్పుడు మాత్రమే గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు.
”2023 తర్వాత శాసనసభ బిల్లులను రెండోసారి ఆమోదించిన తర్వాత కూడా వాటిని పరిశీల కోసం రాష్ట్రపతికి పంపటం రాజ్యాంగ విరుద్ధం” అని పై విశ్లేషణ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సదరు బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది నిరుపయోగమవుతుందని కూడా తేల్చి చెప్పింది.
”సుదీర్ఘకాలం బిల్లులపై తన అభ్యంతరాలు చెప్పకపోగా, పంజాబ్ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించి నాలుగైదేళ్ల తర్వాత బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపటం అంటే గవర్నర్కు రాజ్యాంగం పట్ల కానీ సుప్రీం కోర్టు పట్ల కానీ వీసమెత్తు గౌరవం లేదు” అని తెలుస్తోందని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ చర్యలను గమనించినప్పుడు గవర్నర్ తన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలను నెరవేర్చటానికి బదులు రాజ్యాంగేతర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనే అభిప్రాయం కలిగించేలా గవర్నర్ చర్యలున్నాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని 142వ అధికరణం ద్వారా ఇప్పటి వరకూ తమిళనాడు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదం పొందిన బిల్లులుగా పరిగణించాలని తీర్పునిస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.