
ఇంట గెలిచి రచ్చ గెలాలన్నది నానుడి. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి చూస్తే పార్టీలోనే గందరగోళం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా అన్ని విషయాలలో ప్రజలలోకి దూకుడుగా వెళ్లాల్సిన ఆ పార్టీలో అలాంటిది ఏమి కనిపించడంలేదు. అధికారం ఉన్నన్నినాళ్లు మేము ధీరులం శూరులం అంటూ మీడియా ముందు వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ, ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు సరికదా కనీసం వారి గొంతు కూడా వినిపించడం లేదు. అప్పట్లో హడావుడి చేసిన ఆ నేతలు ఇప్పుడు సొంత వ్యాపారాలలో బిజీ అయ్యారు. కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకే కాకుండా తమ నియోజక వర్గాలకు కూడా దూరంగానే వుంటున్నారు.
పార్టీ అధికారంలో వున్నప్పుడు కాదు. ఇప్పుడే పార్టీని మళ్లీ నిలబెట్టడానికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులలో తిరిగి ఉత్తేజం నింపడానికి కృషి చేయాలి. కానీ ప్రస్తుత వైసీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ అధినేత ఎక్కువగా బెంగుళూరుకు పరిమితమవుతుంటే మేమేమి తక్కువ తినలేదన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. అధినేత ఏ సమావేశమో పెట్టి, రమ్మని పిలిస్తే కానీ తాము వైసీపీలో ఉన్నామని, ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై గళం ఎత్తాలని కనీస స్పృహను ఎప్పుడో కోల్పోయారనిపిస్తోంది.
పది నెలలు అవుతున్నా పోరుబాట పట్టరా?
”పార్టీ అధినేత జగన్ వైఖరి మారాలి. కూటమి ప్రభుత్వంపై దూకుడు పెంచాలి. పార్టీని వదిలేసి బెంగళూరులోనో మరెక్కడో కూర్చుంటే సరిపోదు. ఓటమి ఎఫెక్ట్ నుంచి బయటపడి ప్రజలలోకి వెళ్లాలి” ఇది ఇప్పటి వరకు జగన్‌ను ఉద్దేశించి అందరూ చేస్తున్న విమర్శలు. అయితే, జగన్‌లో కదలిక వచ్చింది. కానీ మిగిలిన నేతలలో అది కనిపించడం లేదు. జగన్ ఇటీవల పార్టీ నేతలను పిలిచి సమావేశాలు పెట్టి, క్లాస్ తీసుకుంటున్నా నేతలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం తమ రోజులు బాగాలేవని, ఏ కేసులో తమకు జైలు నుంచి పిలుపు వస్తుందో అనే భయం ఆయా నేతలలో కనిపిస్తోంది. దాంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ధ్యాసను వదిలేశారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వం తానై వ్యవహరించిన సజ్జల రామకృష్టారెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఆ అంటే చాలు తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబును తిట్ల పురాణంతో ఒక ఆట ఆడుకున్న కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, ఉత్తరాంధ్ర నేతలూ సైలెంటై పోయారు. ప్రస్తుతమంటే కొడాలి నాని అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
ఇప్పుడు మినహాయింపు గడిచిన పది నెలలుగా ఆయన గొంతు పెద్దగా వినిపించింది లేదు. ఇక పేర్ని నాని మీడియా ముందుకు వస్తున్నా, తనపై , భార్యపై పెట్టిన బియ్యం గోడౌన్ల కేసు పైనే మాట్లాడటం సరిపోతోంది. రోజా అయితే ఒకటి రెండు సందర్భాలలో నోరు విప్పారే కానీ ఇంతకుముందున్న దూకుడు లేదు. అంబటి రాంబాబు పోలవరం ఇష్యూ వచ్చినప్పుడు, పోసానిపై కేసుల విషయంలో కొద్దిగా నోరు విప్పినా, వీరంతా ప్రెస్ మీట్లకే పరిమితమవడం కనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్‌ను మినహాయిస్తే ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలను లేవనెత్తే అవకాశం కూడా జగన్ వారికి ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కోసం పోరుతో అసెంబ్లీని బాయ్ కట్ చేస్తూ వస్తున్నారేగాని, తమను ప్రజలు గెలిపించారు. కనీసం తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలనైనా పట్టించుకుందామనే పరిస్థితే కనిపించడం లేదు.
ప్రజాక్షేత్రంలో కనిపించేదెన్నడు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలు అయింది. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు ఒకటి రెండు హామీలు తప్ప ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదు. రాష్ట్ర ఖజానా ఖాళీగా వుందని, దానికి జగన్ ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆరోపిస్తూ సాగదీస్తూ వస్తున్నారు. కీలకమైన తల్లికి వందనం, మహిళలకు ఫ్రీబస్సు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా లాంటి ఎన్నో హామీలను ఇంకా అమలు చేయకుండా విపక్షానికి మంచి అస్త్రాన్నే కూటమి ప్రభుత్వం అందించింది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. తొలి ఆరునెలలో తాము విమర్శించినా, ప్రజలేమంటారోనని వైసీపీ అనుకోవచ్చు. పాలన పది నెలలు దాటినా ఇంకా వైసీపీ పాలన ప్రభావమే అంటూ అధికార పక్ష నేతలే విమర్శిస్తున్నా, గట్టిగా కౌంటర్ ఇవ్వలేక పోతున్నారు. యువత కోసం పోరాటం అంటూ జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించినా వాయిదాలతో సరిపోయింది.
పార్టీ పటిష్టతకు కరువైన కార్యాచరణ..
అధికారంలో వున్నా లేకున్నా పార్టీని కింది స్థాయి నుంచి బలంగా వుంచుకోవడం, కార్యకర్తలకు భరోసా కల్పించడం పార్టీ నేతల పరంగా చేయాల్సిన పరిస్థితి. అధికారం ఉన్నప్పుడే కార్యకర్తలను పట్టించు కోలేదు. ఇప్పుడు రమ్మంటే రావడానికి వారు సిద్దంగా వుంటారా? వారిలో మనోధైర్యం పెంచాలి. మళ్లీ ఎన్నికలు వస్తేనే వారి దగ్గరకు వస్తామంటే ఎలా? పార్టీ సభ్యత్వాన్ని మొదలు పెట్టాలి. కింది స్ధాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకునే పని జరగాలి. ఇటువంటివి ఏవీ కనిపించడం లేదు. వైసీపీ ఓడిపోయింది, కేవలం పదకొండు సీట్లకే పరిమితమై వుండవచ్చు. కానీ ఎన్నికల్లో 43 శాతం ఓటింగ్ సంపాదించిందనే విషయాన్ని ఎవరూ మర్చి పోకూడదు.
రెండు నెలల క్రితం పార్టీ అధినేత జగన్ తనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారు. ”అధికారంలో వున్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు. అది తప్పే, ఇక ముందు అలా జరగదు. పార్టీలో శ్రమించి పనిచేసే వారికే పదవులు” అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ప్రతి నెలా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో నిద్ర చేస్తా అంటూ గంభీరంగా ప్రకటించారు. కానీ కార్యాచరణ లేదు. మీడియా ప్రతినిధులు ఆ విషయం గుర్తు చేసినా తొందరెందుకనే సమాధానం జగన్ నుంచి వచ్చింది. పార్టీ పెద్ద సంగతి సరే, మధ్యలో పెత్తనం చెలాయించే నేతలు మారితే కదా క్రింది స్ధాయి నుంచి కదలిక వచ్చేది. ముందుగా అధినేత జగన్ తాను మారడమే కాదు. తన కోటరీ తీరునూ మారేలా చేయాలి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి.
మెల్లమెల్లగా జారుకుంటున్న నేతలు..
అధికారం వున్నప్పుడు అనుభవించిన నేతలు, పార్టీ ఓటమి పాలయిన వెంటనే మరోపార్టీ వైపు జారుకుంటున్నారు. ఇప్పటికే వీలుదొరికిన నేతలు తమదారి తాము చూసుకున్నారు. వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరి కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. పార్టీ వీడిన వారి లిస్ట్ కూడా చాంతాడంత తయారయింది. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, బాలినేని, సామినేని ఉదయభాను, గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు.
పదవి వున్నా రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు
మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. ఇక పార్టీకి సర్వం తానే అని నమ్మిన ఎంపీ విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజ్యసభ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు.
విజయసాయిరెడ్డి రాజీనామా సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం పార్టీని కోటరీ చెడగొడుతోందని, చెప్పడాన్ని ఆందరూ సీరియస్‌గా తీసుకోవాలి. కొందరి మాటలకే ప్రాధాన్యం ఇస్తూ అసలేం జరుగుతోందో చూసుకునే పరిస్థితిలో అధినేత జగన్ లేరంటే పరిణామాలు ఎలా వుండబోతున్నాయో తెలుసుకోవచ్చు. ఇక విజయసాయిరెడ్డి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దానిని ఖండించినా, పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా వుంటున్నారు.
పరామర్శలకే పరిమితం
రాష్ట్రంలో సమస్యలపై పార్టీ పరంగా పోరాటానికి కార్యాచరణ చేపట్టకుండా కేవలం ఏదైనా ఘనట జరిగినప్పుడో, నేతలు జైలు కెళ్లినప్పుడో పరామర్శలకే జగన్ పరిమితమవుతున్నారు. జగన్ వస్తున్నాడంటే అక్కడికి వాలిపోయి హడావుడి చేసే నేతలు కూడా ఆ తరువాత మాయమై పోతున్నారు. తిరుపతి తొక్కిసలాట మొదలుకొని, పార్టీ కార్యకర్తల మరణం దాకా అదే జరుగుతోంది. అప్పుడప్పుడు జగన్ సమావేశాలు నిర్వహించి విలువలు, విశ్వసనీయత అంటూ పదేపదే చెప్పినా ప్రయోజనం వుండదు. ఇంకో నాలుగేళ్ల పాటు అధినేత తమ పార్టీని కాపాడుకోవాలి.
తెలుగుదేశం, బీజేపీ లాంటి పార్టీలను చూసి వైసీపీ నేర్చుకోవాల్సిందే. అధికారం వున్నా లేకున్నా పార్టీ బలోపేతంగా, క్రింద స్థాయి కార్యకర్తలు చేజారిపోకుండా ఆ పార్టీలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటాయి. ప్రజలలో ఎప్పుడూ మమేకమై సమస్యలపై పోరాటం చేస్తుంటేనే ఏ పార్టీకైనా భవిష్యత్ ఉంటుంది. మరి ”మా నేత మారాలి, మా నేత మారాలి” అంటూ జగన్నే దోషిగా నిలబెడుతున్న వైసీపీ నేతలు నిజంగా మారాల్సింది తామేనన్న సత్యం గ్రహిస్తారో లేదో చూడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.