
ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెట్ జర్నలిజంపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు.
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ది వైర్ తరఫున రిట్‌పిటిషన్ దాఖలు చేయబడింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
న్యూఢిల్లీ: భారత్- పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వార్తా కథనాలను ది వైర్ ప్రచురించింది.
ఈ వార్తా కథనాల వల్ల దేశ సౌర్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిందనే ఆరోపణలతో, భారతీయ న్యాయసంహిత సెక్షన్ 152 కింద అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు స్పందించింది. ఎటువంటి బలవంతపు అరెస్టులకు పాల్పడరాదని పోలీసులకు ఆదేశించింది.
ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెట్ జర్నలిజంపై అస్సాంలో కేసు నమోదు అయ్యింది.
స్థానిక బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ది వైర్ సంపాదకుల తరఫున రిట్‌పిటిషన్ దాఖలు చేయబడింది.
న్యాయవాది స్తుతి రాయ్ తయారు చేసిన ఈ రిట్పిటిషన్ను, అడ్వకేట్ ఆన్ రికార్డ్ భారత్ గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 152, 197(1)(డీ), 353(1)(బీ)ల కింద చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యాబాగ్చీల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
సెక్షన్- 152 గురించి..
భారతదేశపు సార్వభౌమత్వం, సమగ్రత- సమైఖ్యతలకు ప్రమాదం తెచ్చిపెట్టే చర్యల గురించి భారతీయ న్యాయసంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్ 152లో వివరంగా ప్రస్థావించబడింది.
“ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ, తెలిసి కానీ, రాతపూర్వకంగా కానీ, మాటల ద్వారా లేదా గుర్తుల ద్వారా, బహిరంగ వ్యక్తీకరణ లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదా, ఆర్థిక మార్గాల ద్వారా మరే విధంగానైనా ఉద్రేకపరచడం లేదా ఉద్రేకపరిచే ప్రయత్నం చేయడం. వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక చర్యలకు పాల్పడడం. వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన భావనలను ప్రోత్సహించడం. భారతదేశపు సార్వభౌమ లేదా ఐక్యత- సమగ్రతకు ముప్పు తెచ్చిపెట్టే చర్యలకు పాల్పడడం. లేదా అటువంటి చర్యలలో భాగస్వాములైతే వారికి జీవితఖైదు లేదా 7 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు జరిమానా విధించ వచ్చ”ని సెక్షన్- 152 తెలియజేస్తుంది.
న్యాయస్థానంలో ది వైర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంక్షిప్త వాదనలను విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
దీంతో పాటు బీఎన్ఎస్లోని సెక్షన్ 152ను సవాలు చేస్తూ, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జీ వోంబాత్కరే దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేయనున్నట్లుగా తెలియజేసింది.
ది వైర్ దాఖలు చేసిన రిట్పిటిషన్పై కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. మీడియాలో పనిచేసే వ్యక్తులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదని అభ్యంతరం తెలిపారు.
భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కు- శాంతిభద్రతల మధ్య సమన్వయం కోసం మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం పేర్కొన్నది.
ఈ కేసు ది వైర్లో ప్రచురితమైన వ్యాసాల గురించి మాత్రమే అయినందున, ఆరోపితులను పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ నిత్యా రామకృష్ణన్ ది వైర్ తరఫున వాదించారు. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 152లో ప్రస్థావించిన నేరాలు స్పష్టంగా లేవని అన్నారు.
అంతేకాకుండా, “ఉరామరికగా ఉన్న ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం మొదలు పెడితే, వార్తలు జనానికి అందించాల్సిన మీడియా తీవ్రమైన ప్రమాదానికి గురవుతుంద”ని ఆందోళన వ్యక్తం చేశారు.
దీని మీద సుప్రీంకోర్టు స్పందిస్తూ, క్రిమినల్ చట్టాలలో ఏ అంశాన్నైనా దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని తెలియజేసింది. దుర్వినియోగం అవుతుందనే కారణంతో చట్టంలో ఏదో ఒక భాగాన్ని రాజ్యాంగ విరుద్దమని ప్రకటించవచ్చా అంటూ ధర్మాసనం అడిగింది.
దీనికి సమాధానంగా ది వైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది ఈ సెక్షన్లో “జాతీయ సౌర్వభౌమాధికారానికి ప్రమాదం తెచ్చిపెట్టే చర్యలు” అని మాత్రమే ప్రస్థావించారని, ఇంత గందరగోళంగా, తేలికగా దుర్వినియోగానికి గురయ్యే విధంగా ఉన్న చట్టంలోని భాగాలను న్యాయస్థానం రాజ్యాంగం విరుద్ధమని ప్రకటించవచ్చని వివరించారు.
సెక్షన్ 152లో సార్వభౌమత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టే చర్యల గురించిన వివరణలు ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ” సౌర్వభౌమత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టే చర్యలను గుండుగుత్తగా ఎలా నిర్వచించాలి? కొందరు రాజకీయ భేదాభిప్రాయాలు, అసమ్మతులు కూడా సార్వభౌమత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టే చర్యలని వాదించవచ్చు కదా? సార్వభౌమత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టే చర్యలను నిర్వచించి నిర్దేశించమని చట్టసభలను ఆదేశించటం మరింత ప్రమాదకరం”అని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ సెక్షన్‌కు సంబంధించి సొలిసిటర్ జనరల్‌ను సుప్రీంకోర్టు వివరణ అడిగినా, ఈ సెక్షన్‌ను తీవ్రంగా విచక్షణారహితంగా దుర్వినియోగం చేసేందుకు అవకాశాలున్నాయని నిత్య రామకృష్ణన్ గుర్తు చేశారు. రాసిన వార్తలపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయడమంటే, మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే అవుతుందన్నారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని నిత్య రామకృష్ణన్ పేర్కొన్నారు.
ఆగస్టు 8వ తేదీ మరో కేసులో జరిగిన వాదనలలో భాగంగా భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 152 రాజ్యాంగబద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పూర్వపు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 124(ఏ) స్థానంలో భారతీయ న్యాయసంహితలో సెక్షన్ 152ను చేర్చారు. 124(ఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉన్నాయి.
2022 జూలైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇండియన్ పీనల్ కోడ్‌లోని దేశద్రోహం ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ 124(ఏ) అమలుపై నిరవధికంగా స్టే ఇచ్చింది. కేంద్రప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేయరాదని ఆదేశించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.