
న్యూఢిల్లీ: జులై 15న ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్లో ఉన్న ప్రధానమంత్రుల మ్యూజియంలో ఒక విచిత్రమైన సమావేశం జరిగింది. అనూహ్య ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా, “భారత తొలి బీజేపీ ప్రధాని”గా రాజకీయ వర్గాల్లో పేరుపడ్డ పీవీ నరసింహారావు జీవితం, వారసత్వంపై చర్చించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎంచుకున్నారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకోవడంలో ఆయన ప్రస్థానమే ఒక నిలువుటద్దం.
చంద్రబాబు ప్రసంగం సాగుతున్న కొద్దీ, ఆ నివాళి నిజానికి పీవీకి అర్పించింది కాదని స్పష్టమైంది. అది పీవీ పేరు చెప్పి, మోదీ భజన చేసిన ఒక రాజకీయ ప్రదర్శన. పీవీ జ్ఞాపకాలను అడ్డుపెట్టుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్తుతించడానికి చంద్రబాబు ఆ సభను వేదికగా మార్చుకున్నారు.
ఈ ప్రదర్శన, పీవీ గొప్పతనం కంటే ఎక్కువగా ఎన్డీయే కూటమిలో నాయుడి బలహీనమైన స్థానాన్ని, దేశంలో మారుతున్న సిద్ధాంతాలను, రాజకీయ సమీకరణాలను బయటపెట్టింది.
ఈ కార్యక్రమం మొదలైన తీరులోనే దాని అసలు రంగు బయటపడింది. కార్యక్రమ నిర్వాహకుడు, మోదీ వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా, గతంలో జరిగిన ఉపన్యాసాల గురించి చెబుతూ, కాంగ్రెసేతర ప్రధానులైన వాజపేయి, మొరార్జీ దేశాయ్ వంటివారి పేర్ల ముందు గౌరవసూచకంగా ‘శ్రీ’ అని వాడారు. కానీ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల పేర్లను మాత్రం మామూలుగా ప్రస్తావించారు. ఇది పొరపాటుగా జరిగింది కాదు. దేశ చరిత్రను భద్రపరచాల్సిన సంస్థలోనే గౌరవ ప్రపత్తులను ఎలా తిరగరాస్తున్నారో చెప్పడానికి ఇదొక సంకేతం.
చరిత్రను చెరిపేసిన వైనం..
వేదికపైకి వచ్చిన చంద్రబాబు, పేరుకు మాత్రమే పీవీని “గొప్ప రాజనీతిజ్ఞుడు” అని ప్రస్తావించి, వెంటనే అసలు విషయానికి వచ్చేశారు. “గత యాభై ఏళ్లుగా రాజకీయాల్లో అన్నీ చూశాను” అంటూ, గత పదేళ్ల మోదీ పాలనే భారత ప్రస్థానంలో శిఖరాగ్రమని అభివర్ణించారు. ఈ క్రమంలో వాజపేయి, మోదీ పాలనల మధ్య ఉన్న పదేళ్ల యూపీఏ పాలనను పూర్తిగా విస్మరించారు. పీవీతో కలిసి సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ శకానికి(Manmohan Singh era) ఆయన ప్రసంగంలో చోటే లేకుండా పోయింది.
అంతేకాదు, “ప్రపంచంలో ఆదాయ సమానత్వంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు చెప్పింది” అంటూ ఒక పాత, అవాస్తవ ప్రచారాన్ని(False propaganda) మళ్లీ తెరపైకి తెచ్చారు. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా “సూపర్ సిక్స్” హామీలు చాలా వరకు నెరవేరని తరుణంలో ఇలాంటి అవాస్తవాలతో ప్రజల దృష్టి మళ్లించే(Distracting) ప్రయత్నం చేశారని విమర్శకులు అంటున్నారు.
చరిత్రలోని వైరుధ్యం..
మోదీని పొగడటానికి చంద్రబాబు సాక్షాత్తూ పీవీనే వేదికగా చేసుకోవడం అతిపెద్ద వైరుధ్యం. ఎందుకంటే, ఒకప్పుడు పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టిన ఉద్యమం నుంచే చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది. 1970లలో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన భూగరిష్ట పరిమితుల చట్టం, ముల్కీ నిబంధనలు రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్‌కు దూరం చేశాయి.
ఈ అసంతృప్తే, చంద్రబాబు మామగారైన ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్రతిహత ఎదుగుదలకు కారణమైంది. పీవీ విధానాల వల్ల కాంగ్రెస్‌పై కమ్మ సామాజికవర్గంలో ఏర్పడిన వ్యతిరేకత పునాదుల మీదే చంద్రబాబు తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అలాంటిది, ఇవాళ ఆయనే పీవీని ఒక ఆరాధ్యుడిగా చూపించడం వింతల్లోకెల్లా వింత.
పీవీని ఒక నిష్కళంక(Immaculate) నాయకుడిగా చంద్రబాబు చిత్రీకరిస్తున్న తరుణంలో, పీవీ అధికార పీఠాన్ని అధిరోహించిన తీరులోని చీకటి వాస్తవాలను ఆయన పూర్తిగా విస్మరించడం మరింత స్పష్టంగా కనిపించింది.
దివంగత పౌరహక్కుల ఉద్యమకారుడు కె బాలగోపాల్, 1991లో రాసిన ‘నంద్యాల.. మరో మేహం’ అనే సంచలనాత్మక వ్యాసంలో, పీవీ ఏకగ్రీవ ఎన్నికకు దారితీసిన కిరాతకమైన “గ్యాంగ్స్టరిజం”, “పెత్తందారీ” వ్యూహాలను(strategies) ఆధారాలతో సహా వివరించారు. ప్రత్యర్థి అభ్యర్థులను అపహరించడం, కాంగ్రెస్ అధిష్టానం అండతోనే సాగిన బెదిరింపుల పర్వం గురించి ఆయన అందులో రాశారు. పీవీని ఒక మహనీయుడిగా కీర్తిస్తున్న చంద్రబాబు, సహజంగానే చరిత్రలోని ఈ చీకటి కోణాన్ని(Dark side) పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు.
కాషాయ కూటమిలో చేరడానికి చెల్లించిన మూల్యం?
చంద్రబాబు ప్రసంగం ఎన్డీయే భాగస్వాముల హిందుత్వ ఎజెండాకు తగ్గట్టుగానే సాగింది. పీవీకి 17 భాషలు వచ్చని చెబుతూ, “ఇప్పుడంతా హిందీ ఎందుకు నేర్చుకోవాలని మాట్లాడుతున్నారు?” అంటూ దక్షిణాది రాష్ట్రాల వైఖరికి వ్యతిరేకంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఇదే వారం ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలే రావడం గమనార్హం. మొదట, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందీని “పెద్దమ్మ”తో పోల్చారు. ఆ తర్వాత, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఒక జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ “హిందీ మన జాతీయ భాష” అని వాదించారు. అది పొరపాటని యాంకర్ సరిదిద్దినా, ఆయన తన మాటకే కట్టుబడ్డారు.
ఇదంతా కొత్త ఎన్డీయే కూటమిలో చేరడానికి చెల్లిస్తున్న మూల్యంగా కనిపిస్తోంది. 2019కి ముందు మోదీపై తీవ్ర విమర్శలు చేసి, “ఎన్డీయే తలుపులు ఆయనకు శాశ్వతంగా మూసుకుపోయాయి” అని అమిత్ షా చేత అనిపించుకున్న చంద్రబాబు, ఇప్పుడు పూర్తిగా లొంగిపోయారు. బీజేపీ ఆయుధంగా వాడుతున్న యోగా వంటి అంశాలను పొగడటం ద్వారా “మితవాద హిందుత్వ” వాదనకు ఊతమిస్తున్నారు. హిందుత్వ(Hindutva)తో పోరాడలేక, ఇప్పుడు దాని సామ్రాజ్య నిర్మాణానికి ఆయనే చురుకుగా సహాయం చేస్తున్నారు.
‘మంచి పిల్లి’ వెనుక నయా ఉదారవాదం
చంద్రబాబు తన ప్రసంగంలో “ప్రజా విధానం (Public Policy)” అనే పదాన్ని పదేపదే వాడారు. దీని వెనుక ఒక నిర్దిష్ట భావజాలం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం సేవలు అందించేది కాదు, ప్రైవేటు పెట్టుబడులకు ‘సౌకర్యాలు’ కల్పించేది మాత్రమేనని చెప్పడమే ఈ విధానం. అందుకే ఆయన హక్కులు, సామాజిక న్యాయం వంటి పదాల బదులు కార్పొరేట్ అనుకూల “సామర్థ్యం”, “భాగస్వామ్యం” వంటి పదాలను వాడుతున్నారు.
దీనికి పరాకాష్ట ఆయన ప్రతిపాదించిన పీ4 ప్రభుత్వ-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం) నమూనా. ఇది బాధ్యతను ప్రజలపైకి నెట్టే ఒక తెలివైన ఎత్తుగడ. ఇందులో ప్రభుత్వం, కార్పోరేట్లు వద్ద ఉన్న అధికారం ప్రజల వద్ద ఉండదు. పేరుకు మాత్రమే వారిని భాగస్వాములను చేసి, ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదొక మార్గం.
పీవీ తరచూ చెప్పే చైనా నేత డెంగ్ జియావోపింగ్ మాటలను చంద్రబాబు కూడా ఉటంకించారు. “పిల్లి నల్లదా తెల్లదా అన్నది ముఖ్యం కాదు, అది ఎలుకను పట్టుకుందా లేదా అన్నదే ముఖ్యం.” ఈ సూత్రం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు సిద్ధాంతం అనేది పిల్లి రంగు లాంటిది. అధికారం అనే ఎలుకను పట్టుకోవడమే ముఖ్యం. దానికి ఏ పిల్లి సహాయం చేస్తే, ఆ క్షణానికి అదే మంచి పిల్లి.
ముగింపు
చివరికి, ఈ సభ ఒక రాజకీయ గారడీలా మిగిలిపోయింది. ఒక కాంగ్రెస్ ప్రధాని గురించి ఏర్పాటు చేసిన సభలో, ఆయనకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి చెందిన నేత, ఇంకో కాంగ్రెస్ ప్రధాని వారసత్వాన్ని చెరిపేస్తూ, ఒక బీజేపీ ప్రధానిని ఆకాశానికెత్తడం చూస్తే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చనిపిస్తుంది.
ప్రముఖ హక్కుల నేత కె బాలగోపాల్ అన్నట్లు, చంద్రబాబు కేవలం కాలానికి ప్రతినిధి కాదు, కాలానికి అనుగుణంగా తనను తాను మలచుకోవడంలో ఆయన దిట్ట. నేటి కాలం మోదీ, బీజేపీ హిందుత్వ ఎజెండాలతో నడుస్తోంది. అంతిమంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా, చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రవాహంతో పాటే ప్రయాణించడానికి సిద్ధమయ్యారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.