
సంఘ్పరివారాన్ని సంతృప్తి పర్చాలంటే ముస్లింలు నిరంతరం త్యాగాలు చేస్తూనే ఉండాలి. సంఘ్‌పరివార్ కార్యకర్తలు సత్ప్రవర్తనకు నిలువుటద్దాలని మోహన్ భాగవత్ చెప్తున్నారు. వీరికి ప్రపంచమంతటి పట్లా కారుణ్యం ఉంటుందని అంటున్నారు. సంఘ్ నిర్మించుకుంటున్న ఇటువంటి వ్యక్తిత్వం భారతీయ ముస్లింల త్యాగాల పునాదులపైన మాత్రమే.
బయటికి చెప్పే విషయాలను యథాతథంగా స్వీకరించటం, విశ్వసించటం రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరం. లోతుగా తొంగి చూడాలి. తరచి చూడాలి. ఏనుగుకు తినే దంతాలు కనపడవు, కనిపించే దంతాలు తినటానికి అక్కరకు రావు అన్నట్లు ఉంటాయి లోతైన వివరాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ మూడు రోజుల పాటు నిర్వహించిన ఉపన్యాస మాల ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఓ సందర్భం.
మోహన్ భాగవత్ తన ఉపన్యాసాల్లో ప్రయోగించిన తర్కం, ప్రస్తావించిన ఉదాహరణలు పైకి చూస్తే అత్యంత ప్రజాతంత్ర స్వభావం కలిగినవిగా కనిపిస్తున్నాయి. ఆయన ఏకీరణ గురించి మాట్లాడలేదు. ఏకత్వం గురించి మాట్లాడారు. మత విశ్వాసాల విషయంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉన్నదని చెప్పారు. ప్రపంచ శాంతి గురించి మాట్లాడారు. వైవిధ్యం ప్రపంచాన్ని మరింత సుందరంగా మారుస్తుందని చెప్పారు. అందరూ ఒకటే(సమానమే). ఎవరికి వారే అని అద్భుతంగా వర్ణించారు. ఆయన గాంధీ, ఠాగూర్, వివేకానంద, రామకృష్ణ పరమహంసలను ప్రస్తావించారు. సావర్కార్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. శాంతియుత సహజీవనం సాధించేందుకు భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని ఆరెస్సెస్ ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు. చివరికి ఎవరైనా సరే తమ స్వధర్మాన్ని పాటించవచ్చని చెప్తూనే, ఇతర మతాలను పాటించేవారిని గౌరవించాలని కూడా పిలుపునిచ్చారు.
ఇటువంటి సార్వత్రిక విలువల విషయంలో ఎవరైనా ఎవరితోనైనా ఎందుకు ఘర్షణ పడతారు? ఆయన మాటల్లో అస్పష్టత లేదు. ‘‘వేర్వేరు మత విశ్వాసాలు పాటిస్తున్నా మనం అంతా ఒక్కటే. సారాంశం ఒక్కటే. ఎవరు ఏ దారిలో ప్రయాణిస్తున్నారన్న విషయం మీద ఘర్షణలు వద్దు’’ అని వక్కాణించారు. ఇదే ఆరెస్సెస్ అవగాహన అయితే మరి ఆరెస్సెస్‌తో మనకు పేచీ ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మరింత తరచి చూడాలి.
మాటలకు, చేతలకూ మధ్య వ్యత్యాసమే మనమేమిటో మనమెవరో తెలియచేస్తుంది. ఆలోచించే వారికి ఎవరికైనా తలెత్తే ప్రశ్న ఒక్కటే: ‘‘ఆరెస్సెస్ ఆదర్శాలు అంత ఉన్నతమైనవైనప్పుడు, ఇవన్నీ ఇపుడున్న రాజ్యాంగం ద్వారానే సాధించుకోవచ్చు కదా, హిందూరాష్ట్ర నిర్మాణం అవసరం ఏంటి?
ఆరెస్సెస్ హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం పని చేస్తుందని విస్పష్టంగా ప్రకటించారు. తాము నిర్మించే హిందూరాష్ట్రలో ముస్లింలు, క్రైస్తవులు, ఇతర అల్పసంఖ్యాకులైన మతస్తులు తమతమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా పాటించవచ్చని కూడా సెలవిచ్చారు. ‘‘ఎవరినీ వెలి వేసేది లేదు’’అని కూడా భరోసా ఇచ్చారు. అంటే ఆరెస్సెస్ ఔదార్యం గురించి ఇతర మతస్తులు విశ్వసించాలా? ఆరెస్సెస్‌పై విశ్వాసంతో ప్రస్తుతం రాజ్యాంగం కల్పిస్తున్న సమానత్వపు హక్కులు, అవకాశాలు వదులుకోవాలా? మోహన్ భాగవత్ సందేశంలో ఉన్నది ఔదార్యం, సత్ప్రవర్తన తప్ప హక్కులు, న్యాయం కాదు. చివరకు దేశమంతా ఆరెస్సెస్గా మారాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశంలో ఏదో ఒక మోతాదు మాత్రమే సంఘ్ శిబిరంలో చేరింది. ఇటువంటప్పుడే అల్పసంఖ్యాకుల మౌలిక హక్కులపై జరుగుతున్న దాడుల గురించి విమర్శకులు, రాజకీయ ప్రత్యర్ధులు ఇంత స్థాయిలో ఆందోళన చెందుతున్నప్పుడు దేశమంతా సంఘ్మయం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది?
11 ఏళ్ల హిందూత్వ పరిపాలన తర్వాత దేశ రాజకీయ రంగంలో ముస్లింల గొంతు చిక్కిపోయింది. 2024 తర్వాత ఏర్పడిన కేంద్ర మంత్రివర్గంలో ఒక్కరు కూడా ముస్లింలు లేరు. కేంద్ర క్యాబినెట్లో ఒక్క ముస్లిం కూడా లేని సందర్భం స్వాతంత్య్రానంతరం ఇదొక్కటే. దేశాన్ని విశ్వగురువుగా మారుస్తామని శపథాలు చేస్తున్న వారు ఒక్కసారి దేశంలో బిక్కుబిక్కుమంటున్న ముస్లిం మనోగతాన్ని వింటే అహ్మద్ ఫరాజ్ రాసిన బస్తీల్లో దీపపు కాంతులతో ఆకాశం నుంచి తారలను నేలమీదకు దించే మహానుభావులారా/నా ఇంట్లో కొండెక్కుతున్న కొవ్వొత్తిని చూడండనే కవిత స్పష్టంగా వినిపిస్తుంది.
చరిత్ర- భేషజం..
దేశంపైకి దండెత్తిన వాళ్ల పేర్లు తొలగించేవారిని సమర్ధిస్తున్నపుడు. తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని భాగవత్ అన్నారు. ‘‘దండెత్తిన వాళ్ల పేర్లు చరిత్రలో ఎక్కడా కనిపించకూడదు. స్వాతంత్య్ర సమరయోధులయిన అష్ఫాఖుల్లా ఖాన్, అబ్దుల్ హమీద్‌ల పేర్లు మినహాయింపు’’అని వివరణ కూడా ఇచ్చారు మోహన్ భాగవత్. దీని అర్థం ఏంటి? ఎవరు మంచి ముస్లింలు, ఎవరు అంగీకారయోగ్యమైన ముస్లింలు అన్న విషయాన్ని ఆరెస్సెస్ నిర్ధారిస్తుంది.
సామాజిక రాజకీయ పరిస్థితులు, నేపథ్యాలపై ఆధారపడి ఏ ముస్లింలు దేశంలో పౌరులుగా ఉండటానికి అర్హులు, ఎవరు పాకిస్తాన్‌కు వెళ్లాలి అన్నది కూడా ఆరెస్సెస్ నిర్ణయిస్తుంది. కల్నల్ సోఫియా ఖురేషికి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే(ఆపరేషన్ సిందూర్ సమయంలో) సైనికపరంగా జరిగిన లోపాలను చాపకిందకు నెట్టడానికి ఆమె ఉపయోగపడింది. కానీ, అర్థవంతమైన ప్రశ్నలు అడిగిన ఆలీ ఖాన్ మెహమూదాబాద్ను మాత్రం వేటాడుతారు.
ప్రపంచ శాంతిని కాంక్షించే పెద్ద మనసుల్లో ముస్లింలపట్ల ఈ రకమైన షరతులతో కూడిన ఔదార్యం ప్రదర్శిస్తూ కూడా, రెండో వైపున బెంజెమిన్ నెతన్యాహు పట్ల అపరిమితమైన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోవడానికి ప్రజలు జుట్టు పీక్కోవాలి. 21వ శతాబ్దం ఇప్పటి వరకూ చవిచూడని గాజా నరమేధానికి నెతన్యాహు కర్త, కర్మ, క్రియ అన్నది అందరికీ తెలిసిందే.
వేర్వేరు మత విశ్వాసాలు పాటించినప్పటికీ, భారతీయులందరూ ఒక ఉమ్మడి సామాజిక, సాంస్కృతిక మూలాలు కలిగి ఉన్నవారు. అయినా ఉమ్మడి స్వభావం కలిగిన వారే. హిందూత్వ రాష్ట్ర భావనను ప్రతిపాదించిన వినాయక దామోదర సావర్కార్ హిందూరాష్ట్రలో ఉమ్మడి సాంస్కృతిక మూలాలు కలిగిన క్రైస్తవులకు, ముస్లింలకు హిందువులతో సమానమైన హోదా కల్పించ నిరాకరించిన విషయాన్ని ప్రస్తుత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ప్రత్యేకంగా చెప్పకుండానే ఉపన్యాసమాల ముగించారు.
‘‘దేశంలో ధార్మికంగా, సాంస్కృతికంగా అల్పసంఖ్యాకులైన వారికి రక్షణ కల్పించలేము. అదే సమయంలో హిందువులతో సమానంగా క్రైస్తవులు, ముస్లింలు తమ ధార్మిక, సాంస్కృతిక, భాషాపరమైన హక్కులకు రక్షణ కావాలని దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదు’’ అంటూ క్రైస్తవులు, ముస్లింలు భారతదేశంలో నివసించేందుకు సావర్కార్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసే విధానాన్ని ముందే నిర్దేశించారు.
మితోన్మాదుల సహనశీలత ఎంత బలహీనమైనదంటే చివరకు మహాత్మా గాంధీని కూడా సహించలేకపోతోంది. గాంధీ అత్యుత్తమ స్వాతంత్య్ర సమర సేనాని. జవహర్లాల్ గురించి వారి ఆవేదన అందరికీ తెలిసిందే.
‘‘జర్మనీలో అత్యున్నత స్థాయిలో జాతీయవాదం వ్యక్తమైంది. మూలాల్లోనే వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్న జాతులన్నిటినీ కలిపి ఏకైక జాతిగా తీర్చిదిద్దటం అన్నది అసాధ్యం. హిందూస్తాన్ విషయంలో ఇది పెద్ద అనుభవం. మనం నేర్చుకోవాల్సిన విషయం’’ సావర్కార్ చేసిన ఈ వ్యాఖ్య గురించి ఆరెస్సెస్ పెద్దలు ఎవ్వరూ స్పందించటం లేదు. ఈ అవగాహనే అత్యంత సంక్లిష్టమైనదీ, సమస్యాత్మకమైనదీ.
ఆరెస్సెస్, విస్తారమైన సంఘపరివారం రాజ్యాంగం దేశంలో అందరికీ సమానత్వాన్ని గ్యారంటీ చేయటాన్ని సహించలేకపోతున్నాయి. వాళ్ల ఉద్దేశ్యంలో దేశంలోని అల్పసంఖ్యాకులు కేవలం అధిక సంఖ్యాకులైన హిందువుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి బతకాలి.
వ్యక్తిత్వ నిర్మాణ ఉద్యమం..
వ్యక్తిత్వ నిర్మాణం గురించి భాగవత్ విపరీతంగా వక్కాణించారు. ఆరెస్సెస్ కార్యకర్తలు ఎంత క్రమశిక్షణ కలిగినవారో మీరే చూడండని భాగవత్ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఆలోచన, వ్యవహారం, పెంచిన తీరు వంటి అంశాలపై ఆయన ఎంతగానో వక్కాణించారు. ఆయన స్వఛ్చత, సాధారణత్వం, మానవాళి పట్ల ప్రేమ ఆరెస్సెస్ ప్రత్యేకతలు అని చెప్తున్నారు.
నాగపూర్‌లోని రేషంబాగ్లో ఉన్న ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో ఆరెస్సెస్ కార్యకర్తలను చూడలేని వారికి తమతమ నివాస ప్రాంతాల్లో పని చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలను చూడవచ్చు. ఉదాహరణకు ప్రధాని నరేంద్ర మోడీనే చూద్దాం. సాటి భారతీయుల పట్ల విద్వేషభావన కల్పించటం మొదలు అబద్ధాలు, ఆశ్రితపెట్టుబడిదారీ విధానంతో అంటకాగటం, బాధ్యత, పారదర్శకత లేకపోవటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
‘‘ఆరెస్సెస్ కార్యకర్త ఎవరైనా హింసాత్మక చర్యల్లో పాల్గొనటం కానీ, దూకుడుగా వ్యవహరించటం కానీ చూశారా?’’ అన్నది మోహన్ భాగవత్ ప్రశ్న. ‘‘దేశంలో అత్యధిక మంది ప్రజానీకానికి, అత్యధిక మేలు చేయాలన్న దానితో మేము సంతృప్తి పడటం లేదు. మా కోరిక సర్వేభవంతు సుఖినహః’’అని కూడా ప్రకటించారు.
గాంధేయ సూత్రాలైన చైతన్యరహిత సంతోషం, నీతిబాహ్య వ్యాపారం, త్యాగాలతో సంబంధం లేని ధార్మికతల గురించి కూడా మోహన్ భావత్ ప్రస్తావించారు. కుటుంబ విలువలు, వ్యక్తిగత నిజాయితీ, సామాజిక ప్రవర్తన, సాంప్రదాయ వేషధారణల గురించి ఆయన దేశానికి హితోపదేశాలు చేశారు.
ఆరెస్సెస్ శిక్షణ పొందినవారంతా ఆర్ద్రతకు, శాంతికి రాయబారులుగా ఉన్నారా? ఆలి వర్సెస్ బజ్రంగ్ బలి, 80 శాతం వర్సెస్ 20 శాతం అంటూ ముఖ్యమంత్రులు నినాదాలు ఇవ్వలేమని చెప్పలేము.
కొడుకులను తుపాకితో కాల్చి చంపండి, రాముడి వారసులు- నీచుల వారసులు అంటూ మంత్రులు నినాదాలు ఇవ్వలేదని చెప్పలేము. అపహరణ, ఫేక్ ఎన్కౌంటర్లు, హత్యలతో తమ రాజకీయ జీవితాన్ని పెనవేసుకున్న నాయకుల గురించి కూడా పక్కనపెడదాం. ప్రతి ముస్లిం పర్వదినాన మసీదుల ముందు చేరి వచ్చిపోయే ముస్లింల గురించి హేయమైన వ్యాఖ్యలు చేసే దుండగుల గురించి కూడా పక్కన పెడదాం. ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఎవరిని ప్రేమించాలని నిర్ణయించే అగంతక దళాల గురించి కూడా పక్కన పెడదాం. బహిరంగ హత్యలకు పూనుకునే వాళ్లను, పట్టపగలు కుంటి సాకులతో ఒకే మతానికి చెందిన వారిని హత్యలు చేసేవారిని కూడా పక్కన పెడదాం. చివరకు ముస్లిం దుకాణదారుల నుండి కొనుగోళ్లు చేయవద్దని తీర్మానాలు చేసేవారిని అనుమతించరాదు. ఆశ్రిత పెట్టుబడిదారులు నీతి బాహ్యమైన వ్యాపార శైలి గురించి ఆలోచిస్తే వాల్ల బుర్రలు మూసేవాయలి.
సాంప్రదాయాన్ని కాపాడాలని కూడా మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. అంటే హిందువులు మార్కెట్ కూడళ్లు, విమానాశ్రయాలు, రైళ్లల్లో స్వేచ్ఛగా భజనలు చేసుకుంటూ వెళ్తున్నట్లు ముస్లింలు కూడా బహిరంగ ప్రదేశాల్లో తమ ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిస్తామా? ముస్లిం మహిళ సాంప్రదాయక దుస్తులు, బుర్ఖా ధరిస్తే ఇంత వీరంగం వేయటం ఎందుకు? శ్రావణ మాసంలో మాంసపు దుకాణాలు బలవంతంగా ఎందుకు మూసేయాలి? ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు అంటారా? సరే.
మరి మథుర, కాశీ దేవాలయాల విషయంలో రామ మందిర నిర్మాణం లాంటి ఉద్యమాలు ఎందుకు? మరో ఉద్రేక రక్తోన్మాదం ఎందుకు? ఈ మూడు ప్రాంతాలను ఖాళీ చేయటానికి ముస్లింలు పెద్ద మనసు ప్రదర్శించాలని మోహన్ భాగవత్ కాంక్షిస్తున్నారు. త్యాగం లేని మతం గురించి మోహన్ భాగవత్ ప్రస్తావించిన గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేసుకోండి.
సంఘ్‌ను సంతృప్తి- సంతోషపర్చడానికి ముస్లింలు నిరంతరం త్యాగం చేస్తూ ఉండాలి. యావత్ ప్రపంచానికి ఆర్ద్రత, నైతికత, క్రమశిక్షణ విషయంలో ఆరెస్సెస్ కార్యకర్తలే ఆదర్శమని భాగవత్ వక్కాణించారు. ముస్లింల త్యాగాలపైనే అటువంటి వ్యక్తిత్వం నిర్మితమవుతుంది. ఇక్కడ హిందువుల త్యాగాలతో పనిలేదు. హిందువులు త్యాగాలు చేయాల్సిన అవసరంకూడా లేదు. ఎందుకంటే వారిది దయా గుణం కదా. సంఘ్‌పరివార్ లెక్కలో వారి దయాగుణానికి పాత్రులు కావాలంటే మిగిలిన వారికి కొన్ని అర్హతులు ఉంటాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.