
ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ అధికారులు బయటపెట్టిన విషయాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టులో రాష్ట్ర సీఐడీ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ద్వారా రూ 3,356 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పారు. ఈ స్కాంలో అప్పటి అధికారపార్టీ నేతలు, ఎక్సైజ్ శాఖ అధికారులు, వ్యాపారవేత్తలు, షెల్ కంపెనీలు కలిసి భాగస్వాములుగా వ్యవహరించినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(APSBCL)ద్వారా జరిగిన మద్యం కొనుగోలు, సరఫరా ద్వార జరిగింది. మద్యం సరఫరా వ్యవస్థను తమ అదుపులోకి తీసుకుంటూ మాఫియాను నియంత్రిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, వాస్తవంగా ఈ స్కాంలో పారదర్శక ఈ-ప్రొక్యూర్మెంట్ విధానాలను వదిలేసి, మాన్యువల్ టెండర్లు ప్రవేశపెట్టినట్లు సీఐడీ(సీఐడీ) గుర్తించింది. దీంతో ముందుగానే నిర్ణయించిన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించే అవకాశం ఏర్పడింది.
డొల్ల కంపెనీలకు చెల్లింపులు..
డబ్బు, బంగారం, రియల్ ఎస్టేట్ రూపాల్లో లంచాలు ఇచ్చినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. మొత్తం 15 డిస్టిలరీల నుంచి లభించిన లాభాలను డొల్ల కంపెనీల ద్వారా చెల్లించినట్టు విచారణలో తేలింది.
ఈ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన షెల్ కంపెనీల్లో ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కృపాతి ఎంటర్ప్రైజెస్, టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్, సంహిత వేర్‌హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వసిష్ట వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశ్విన్ మోహన్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి.
డబ్బు దారి మళ్లింపు,ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించడం, అక్రమ లావాదేవీల కోసం ఈ కంపెనీలను వాడినట్లు సీఐడీ పేర్కొంది. కొన్ని కంపెనీలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేనట్టు, కార్యాలయాలు కూడా లేనట్టు గుర్తించారు. సీఐడీ తేల్చిన ఓ ముఖ్య అంశం ఏంటంటే, కొన్ని రవాణా కంపెనీలకు కేవలం ఒక వాహనం ఉంది.
అయినప్పటికీ, ఒక నెలలోనే లక్షల కేసుల మద్యం తరలించినట్టు చూపించారట. ఇది కేవలం కాగితాలపై మాత్రమే జరిగిన రవాణా అని విచారణలో బయటపడింది. ఇంతటి భారీ మొత్తంలో వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లిందన్నదే ప్రధాన ప్రశ్న. ఛార్జిషీట్ ప్రకారం, ఈ డబ్బులో చాలా భాగాన్ని 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఖర్చులకు వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు, ప్రచార ఖర్చులు, అభ్యర్థుల ట్రావెల్ లాజిస్టిక్స్ అన్ని ఈ డబ్బుతోనే నిర్వహించినట్లు చెబుతున్నారు.
ప్రధాన నిందితులుగా ప్రముఖులు..
చార్జిషీట్లో ప్రధాన నిందితులుగా పేర్కొన్న వారిలో ఏ1గా వ్యాపారవేత్త కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. స్కాం ప్రధాన నిర్వాహకుడిగా కేసిరెడ్డిని భావిస్తున్నారు. ఏ6 మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల శ్రీధర్ రెడ్డి, బినామీ లావాదేవీల్లో భాగస్వామిగా ఉన్నారు. ఏ7 ముప్పిడి అవినాష్ రెడ్డి ఉన్నారు. నగదు, బంగారం రవాణాలో అవినాష్ రెడ్డిని కీలక వ్యక్తిగా భావిస్తున్నారు.
ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా జరిగే ప్రతి మద్యం సరుకుకూ ఒక కమిషన్ లెక్క ఉండేది. ఇందులో వైసీపీ నేతలకు, మధ్యవర్తులకు, అధికారులు అందుకునే వాటాలు స్పష్టంగా నిర్ణయించబడ్డాయట. అంతర్గత మెమోలు, వాట్సాప్ సందేశాలు, అధికారులు కనిపెట్టారు. అక్రమంగా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టి దాచినట్టు సీఐడీ చెబుతోంది. హైదరాబాద్, విజయవాడలలో ఫ్లాట్ల కొనుగోళ్లు, బెంగళూరులో టెక్ స్టార్టప్ పెట్టుబడులు అక్రమ ఆదాయంతో జరిగినవే. ఆస్తులన్నీ డమ్మీ డైరెక్టర్లు, బంధువుల పేర్లపై రిజిస్టర్ చేశారు.
దర్యాప్తు మొత్తం డిజిటల్ ఆధారాలపై సాగింది. కాల్ రికార్డులు, మెసేజ్‌లు, బ్యాంక్ లావాదేవీలు, జీపీఎస్ డేటా అన్నింటినీ సేకరించి ఆధారంగా సీఐడీ చూపింది. ఎక్సైజ్ శాఖ, ఏపీఎస్‌బీసీఎల్ అధికారులు స్కాంలో పాలుపంచుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సీఐడీ చెబుతోంది. లైసెన్స్ గడువు ముగిసినా సరఫరా ఆమోదించిన సందర్భాలు, నకిలీ ట్రాన్స్పోర్ట్ చెల్లింపులు ఇవి ఆమోదించిన అధికారులపై కీలక ఆరోపణలుగా ఉన్నాయి.
ప్రస్తుతం 14 మంది నిందితులు జ్యుడీషియల్ కస్టడీ(Judicial custody)లో ఉన్నారు. మరికొందరు పరారీలో ఉండగా, వారి కోసం లుక్అవుట్ నోటీసులు(Lookout notices) జారీ అయ్యాయి. మొత్తం 30కి పైగా వ్యక్తులు, కంపెనీలపై ఆర్థిక దర్యాప్తు కొనసాగుతోంది. ఫెమా ఉల్లంఘనలు ఉన్నట్టు తెలిసిన నేపథ్యంలో, ఈడీ జోక్యం చేసుకోవాలని సీఐడీ సూచించింది. ఇప్పుడు రాజకీయంగా ఇది పెద్ద దుమారాన్ని లేపుతోంది. ఈ కేసు కోర్టులో రుజువైతే, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణా(Scam)లలో ఒకటిగా నిలవనుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.