
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్లోని ఒక ఇంట్లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవకారుల రాష్ట్ర కమిటీ సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో మొదటి రోజు దాడిచేసి, రాష్ట్ర కమిటీ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు(డీవీ), తరిమెల నాగిరెడ్డి(టీఎన్) తదితర నాయకులు ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి సమావేశానికి రాకపోవడం వల్ల అరెస్టు కాలేదు.
మద్రాసు సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన జరిగినప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రికాగా, జలగం వెంగళరావు హోంమంత్రిగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో స్వతంత్ర భారత చరిత్రలో, రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్రకేసును, కమ్యూనిస్టు నేతల మీద ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు హైదరాబాదు కుట్రకేసు, అయితే అది జనంలో నాగిరెడ్డి కుట్రకేసుగా బహుళ ప్రచారం పొందింది.
వీరిపై పెట్టబడిన కుట్ర కేసును డీవీ, టీఎన్లు స్వయంగా వాదించి సంచలనం సృష్టించారు. వీరు వాదనతో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, భారత విప్లవోద్యమంలోనూ చరిత్ర సృష్టించారు.
నాటి విప్లవకారులు నెలకొల్పిన విప్లవ సాంప్రదాయాల వెలుగులో డీవీ, టీఎన్లు నడిచారు. వారికి రీచ్ స్టాగ్ కుట్రకేసు ఎక్కువగా ప్రేరణ కలిగించింది. బల్గేరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జార్జ్ డిమిట్రావ్ బెర్లిన్లోని పార్లమెంటు భవనం రీచ్ స్థాగ్ని తగలబెట్టారు. ఈ కుట్రకేసులో తాను స్వయంగా కోర్టులో వాదించి నిర్దోషిగా బయటపడి సంచలనం సృష్టించారు.
మనదేశంలో బ్రిటిష్ వాళ్ళ చేత పెట్టబడిన మీరట్, కాన్పూర్ కుట్రకేసుల్లో, ముద్దాయిలు కోర్టులో తాము కమ్యూనిస్టులమని సగర్వంగా ప్రకటించుకున్నారు.
మద్రాసులో అరెస్టయిన వీరిపై పెట్టబడిన కుట్ర కేసును 1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనరిలో ఆమోదించిన “తక్షణ కార్యక్రమం” డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ‘తక్షణ కార్యక్రమం’ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి పన్నిన కుట్రగా ముద్ర వేయడానికి పూనుకుంది.
1970 జూన్లో ఈ కుట్ర కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగింది. కమ్యూనిస్టు విప్లవకారులు రూపొందించిన మౌలిక డాక్యుమెంటయిన ‘తక్షణ కార్యక్రమం’ను ఈ సందర్భంలో డీవీ, టీఎన్లు సొంతం చేసుకున్నారు. దాన్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. అంతేకాదు, ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసికూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవ సంప్రదాయాలకు పట్టం కట్టారు. అందరూ ఊహించినట్టుగానే హైదరాబాద్లోని సెషన్స్ కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి, 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు ఈ శిక్షలను ఖరారు చేసింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిషన్స్ పైన జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దీంతో ఈ కుట్ర కేసులో ఉన్న ముఖ్య నాయకులందరూ డీవీ, టీఎన్లతో సహా రహస్యజీవితానికి వెళ్లిపోయారు.
కామ్రేడ్స్ డీవీ, టీఎన్లు ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. “కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం- ఎత్తుగడలు” అన్న స్టేట్మెంట్ను కుట్రకేసులో ఉన్న అందరి తరఫున తయారుచేసి కేసు విచారణ సందర్భంగా డీవీ వివరించారు. ఈ ప్రకటన డీవీ స్టేట్మెంట్గా బహుళ ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టీఎన్ “తాకట్టులో భారతదేశం” పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన జాతీయ అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ పరిణామాలను ” తక్షణ కార్యక్రమంకు అన్వయించి రాసిన స్టేట్మెంట్ను టీఎన్ కోర్టులో రెండు గంటలపాటు ఎంతో శక్తివంతంగా వివరించారు.
డీవీ, టీఎన్లు కోర్టును తమ రాజకీయాల ప్రచార వేదికగా చేసుకున్న ఫలితంగా కోర్టులో చేసిన స్టేట్మెంట్లు కొత్త ఒరవడిని సృష్టించాయి. ఎందుకంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిస్టు విప్లవకార్లు రూపొందించిన “తక్షణ కార్యక్రమం” డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చటానికి కుట్ర పన్నారని కుట్రకేసు పెడితే, ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న డీవీ, టీఎన్లు తమ కోర్టు స్టేట్మెంట్ల ద్వారా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చటానికి ఒక సరైన విప్లవ వ్యూహం, ఎత్తుగడలను రూపొందించటం ద్వారా ప్రయత్నించామని ప్రకటించారు. వారు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్లలో విప్లవ కార్యాచరణకు ప్రత్యక్షంగా పిలుపు ఇవ్వకుండా భూస్వామ్య విధానం రద్దువుతుందని నినాదం ఇవ్వటం అంటే ప్రజలను మోసం చేయటమే అవుతుందని, సాయిధ పోరాటాలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో భూ సంస్కరణలు అమలు జరగటం అనేది అసంభవం, వర్గ పోరాటం, ప్రజల సాయుధ విప్లవం ద్వారా పాలకవర్గాన్ని కూలదోయటం తప్పనిసరిగా జరుగుతాయి. పట్టు విడుపుగల ఎత్తుగడలతో, రైతాంగ సాయుధ పోరాటం ప్రధాన పోరాటంగా వివిధ పోరాట రూపాలని అనుసరిస్తూ, భారత జనతా ప్రజాతంత్ర విప్లవం విజయం వైపుగా పురోగమిస్తున్నదని దృఢంగా విశ్వసిస్తున్నాము. జనతా ప్రజాతంత్ర రాజ్య స్థాపనకై రాజీలేని పోరాటమన్న మా విధానం సరైనదని ధ్రువపరుస్తుంది, కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం, “మా విప్లవ పంథా ” రివిజనిస్టుల పార్లమెంటరీ పంథాకు పూర్తిగా భిన్నమైనదని, మా పంథా గురించి మా తక్షణ కార్యక్రమములో ప్రకటించాం” గ్రామాలను విముక్తి చేసి పట్టణాలను చుట్టుముట్టి క్రమంగా పట్టణ ప్రాంతాలను విముక్తి చేయడం ఈ కార్యక్రమంలోని కీలక అంశం” అని కూడా ప్రకటించారు.
ఆ విధంగా ఈ రాజ్యాన్ని విప్లవోద్యమం ద్వారా ఎందుకు కూలదోయాలనుకున్నారో, ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం సరైనదేనని తమ స్టేట్మెంట్ల ద్వారా గట్టిగా బలపరుచుకున్నారు. పాలకులు దోపిడీ విధానాలను అనుసరిస్తున్నప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వాలను కూలుస్తారన్న సందేశాన్ని ఇచ్చారు. ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో వాటిని రాజకీయంగా సమర్ధించుకుంటూ కోర్టులో బాహాటంగా ప్రకటించటం విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచింది.
ఈ కుట్ర కేసులో పెట్టబడిన ముద్దాయిలు డీవి, టీఎన్లతో సహా ముఖ్య నాయకులు చండ్ర పుల్లారెడ్డి, పీ రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, మాదల నారాయణస్వామి, వసంతాడ రామలింగాచారి, మండ్ల సుబ్బారెడ్డి, ఎన్వీ కృష్ణయ్య, చల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పుల మోహన్ రెడ్డి తదితరులు వివిధ కారణాలతో చనిపోయారు.
ఈ కేసులో శిక్షపడి మిగిలి ఉన్నది విప్లవోద్యమ నాయకుడిగా ఉన్న సింహాద్రి సుబ్బారెడ్డి ఒక్కరే. అయితే జూలై నెలకున్న ప్రాధాన్యత ఏమిటంటే ఈ కుట్ర కేసులోని ప్రముఖ నాయకులు డీవీ 1984 జూలై 12న చనిపోగా, టీఎన్ ఎమర్జెన్సీ కాలంలో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్లో 1976 జూలై 28న చనిపోయారు. నాగిరెడ్డి కుట్ర కేసుగా పేరుగాంచిన ఈ కేసులో, తాము ఈ దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్ర పన్నిన మాట వాస్తవమేనని కోర్టులో ప్రకటించి చరిత్ర సృష్టించారు.
(కామ్రేడ్స్ డీవీ జూలై 12, జూలై 28న టీఎన్ వర్ధంతి సందర్భంగా ప్రచురితం.)
ముప్పాళ్ళ భార్గవశ్రీ,
సీపీఐ ఎంఎల్(క్లాస్ స్ట్రగుల్) నాయకులు,
9848120105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.