
జీవావరణ్యంలోని తమస్సును తరిమేందుకు
వెలుగు రజను మళ్లీమళ్లీ రగిలించుకుంటాను
నిత్య రక్త ప్రవాహ ఝరిలో పీడిత జన
జయ పతాక రెపరెపలు నాకంటి పాపలతో
నిరంతరం పోటిపడుతున్నాయి
త్యాగాల పరిమళ సుగంధం క్షతగాత్ర
దేహాలకు నిత్య సాంత్వన సాగిస్తోంది
యుగయుగాలుగా బాధించే బానిస సంకెళ్ల కుప్పను
పోరుతల్లి తెంపింది ఈ గడ్డపైనే
వీరుల రక్త ప్రవాహం తడిసి మొలిచిన
వరికంకుల్లో విప్లవ స్ఫూర్తి బువ్వైంది
నోటికందే ప్రతి ముద్దా
స్వేచ్ఛా సమరాన్ని జీర్ణించుకుంది
శ్రమజీవుల స్వేదంలోంచే వీరులు జనిస్తారు
పెత్తందారుని, పెట్టుబడిదారుని
వాడి గుత్తేదారుని, వాడి దళారీని
మ్యూజియంలోనే చూసే స్థితి కార్మిక వర్గం కల్పిస్తుంది
ఇది రేపటి సూర్యోదయమంత నిజం
ఎదురుచూపు, బెదురు చూపు తెలియని
ఈ విప్లవాంశ దేహ దాహార్తిని తీర్చేది విప్లవకాసారమే..
తంగిరాల చక్రవర్తి
(కవి, రచయిత)