
భారతీయ సమాజం ఎంతో వైవిధ్యం కలిగింది. అనేక కులాలు, మతాలు, జాతులు, ఆచార వ్యవహారాలతో కూడుకున్నది. ఇటువంటి సమాజంలో కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు సున్నితమైనవిగా మారతాయి. ఇందులో భాష అనేది కీలకమైనదిగా చెప్పవచ్చు. అయితే, చాలా సున్నితమైన ప్రభావితం చేసే అంశమైన భాషపై జరిగే వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరిగాయి.
ఉదాహరణకు బంగ్లాదేశ్ ఏర్పడక ముందు ఆ దేశం పాకిస్తాన్లో భాగంగా ఉండేది. ఆనాడు తూర్పు పాకిస్తాన్‌గా పిలవబడుతున్న నేటి బంగ్లాదేశ్‌లో ఎక్కువ మంది ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. ఉమ్మడి పాకిస్తాన్లో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించేసరికి బంగ్లాదేశీ బెంగాలీ ప్రజలు ఈ చర్యను తిరస్కరించారు. దీంతో తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది, భాషా పెత్తనం ఈ రెండు ప్రాంతాలను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పడేలా కారణం అయ్యింది. ఇదే తరహా భాషా పెత్తనాన్ని సహించని తెలుగు ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడి మొదటి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని సాధించారు. మన దేశంలో కూడా స్వాతంత్రానికి పూర్వం నుంచి నేటి వరకు భాషా అస్తిత్వ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
ఒక భాష ఇంకొక భాషపైన పెత్తనం చేయటాన్ని, ఆధిపత్యం చెలాయిచడాన్ని, బలవంతంగా ఓ భాషను వేరే భాష మాట్లాడేవారిపై రుద్దడాన్ని ఎవరు సహించరు. భాషాపరమైన వివక్ష చూపడం, ప్రజల ఐక్యతను దెబ్బతీయటమే అవుతుంది. భాషా వివక్ష, బలవంతపు అమలు తీవ్రమైతే విభజనకు దారి తీసే ప్రమాదం ఉంది.
అయితే అధికారిక భాషల శాఖకు చెందిన సిబ్బంది తెలుగులో వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 భాషలను అధికారికంగా గుర్తించారు. ఈ అధికారిక భాషలలో ఫిర్యాదులు, విన్నపాలు చేసేందుకు అవకాశం ఉంది. 22 అధికారిక భాషలకు సంబంధించిన అనువాదకులు తప్పనిసరిగా భారత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి తీరాలి. అటువంటిది అధికారిక భాషల శాఖ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం 2005 కింద తెలుగులో దరఖాస్తు చేసుకుంటే, ఆ దరఖాస్తును హిందీ లేదా ఇంగ్లీషులో దరఖాస్తు చేసుకోవాలని సూచించి తిరస్కరించారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా చేయడం భాషా అహంకారం అనిపించుకోదా? తెలుగు భాష భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలతో పాటు ప్రాచీన హోదా కలిగింది. అటువంటి తెలుగు భాషను అధికారిక భాషల శాఖల వారు సరిగ్గా అమలు చేయకుండా తెలుగును అవమానించడమే కాక రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుంది.
వి గంగా సురేష్
దండు పల్లె, కడప జిల్లా
9849181961
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.